Breaking News

1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం


1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని 1857 సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తారు. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని 'ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకీ బ్రిటీష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీసాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్లగల నిర్లక్ష్య వైఖరి మరియూ ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్దాంతం, మొగలాయిలని వారి వారసత్వ స్థలం నుంచి కుత్బ్ కు తరలిపొమ్మనటం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆయితే తిరుగుబాటుకి ముఖ్య కారణం పి/53 లీ ఏన్ఫిల్ద్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. సిపాయిలు ఈ తూటాలను నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావటంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడటానికి నిరాకరించారు. ఆయితే బ్రిటీష్ వారు ఆ తూటాలను మార్చామనీ, కొవ్వులను తేనె పట్టునుండి లేదా నూనెగింజలనుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.

1857 మార్చినెలలో 34వ దేశీయ పదాతిదళానికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి, మంగళ్ పాండేని బంధించమని జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించటంతో తిరుగుబాటు మొదలయిందని చెప్పవచ్చు. బ్రిటీష్ వారు మంగళ్ పాండేని,జమేదార్నుఏప్రిల్ 7న ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.

ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. మీరట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ యుద్దంలో పాల్గొన్న పటాలాలనీ, చైనా వెళ్ళేందుకు బయలుదేరిన ఐరోపా పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిష్ వారికీ ఢిల్లీకి దగ్గరలోని బద్ల్-కీ-సరై లో యుద్దం జరిగింది. ఈ యుద్దంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటీష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న గ్వాలియర్‌లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది. ఆయితే చెదురుమదురు పోరాటాలు 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ జరిగాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానా సాహెబ్ మరియూ రావ్ సాహిబ్ పరివారము, తాంతియా తోపే, అజ్ముల్లాఖాన్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్సింగ్, బీహారులోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, బహదూర్షా 2, ప్రాణ్ సుఖ్ యాదవ్ మరియూ రెవారి బ్రిటీష్ వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.

తిరుగుబాటు తదనంతర పరిణామాలు

1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు. బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దుచేసి విక్టోరియా రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనావ్యవహారాలను చూసుకోవటానికి వైస్రాయిని నియమించారు. ఈవిధంగా భారతదేశం నేరుగా బ్రిటీష్ పాలనలోకి వచ్చింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తానని బ్రిటీష్ రాణి ప్రమాణం చేసింది, అయినప్పటికీ బ్రిటిష్ వారిపట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు. ఈ అనుమానాలు 1857 తిరుగుబాటు అనంతరం విస్తృతమయ్యాయి.

బ్రిటిష్ వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని, జమీందారులను పరిపాలనలో భాగస్వాములను చేసారు. భూఆక్రమణలకు స్వస్తి పలికారు, మతవిషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేసారు. భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు, అయితే ఆచరణలో క్రిందితరగతి ఉద్యోగాలకే పరిమితం చేసారు. సైన్యంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని పెంచటం, ఫిరంగులు మొదలయిన భారీ అయుధాలను బ్రిటిష్ సైనికులకే పరిమితం చేసారు. బహదూర్‌షాను దేశ బహిష్కృతుని గావించి బర్మాకి తరలించారు. 1862 లో అతను బర్మాలో మరణించటంతో భారతరాజకీయాలలో మొగలాయిల వంశం అంతమైందని చెప్పవచ్చు. 1877 లో బ్రిటన్ రాణి, తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది.

1 comment:

  1. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం

    ReplyDelete