రఘుపతి వెంకటరత్నంనాయుడు
1862–1939
విద్యావేత్త, సంఘసంస్కర్త ఆచార్య రఘుపతి వెంకటరత్నంనాయుడు 1862 అక్టోబర్ 1న మచిలీపట్నంలో జన్మించాడు. తండ్రి అప్పయ్య నాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండటంతో నాయుడు విద్యాభ్యాసం చంద్రపూర్ నగరంలో మొదలయ్యింది. ఆ తర్వాత తండ్రికి హైదరాబాద్ బదిలీ కావడంతో నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించారు. తర్వాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, ఆ తరువాత ఎం.ఏ లిటరేచర్ పూర్తి చేశారు. చదువు పూర్తి కాగానే ఇంగ్లిష్ ఆచార్యునిగా ఉద్యోగంలో చేరారు. 1904లో కాకినాడలో పిఠాపురం రాజా కళాశాల (పిఆర్ కళాశాల) ప్రిన్స్‌పాల్‌గా సుదీర్ఘకాలం కొనసాగారు.
నాయుడు మహిళా విద్యావ్యాప్తికి కృషి చేశారు. పిఆర్ కళాశాలలో స్ర్తీలకు ప్రవేశం కల్పించటమే కాక, వెనుకబడిన వర్గాల పేద విద్యార్థులకు భోజనవసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మసమాజంలో చేరి కాకినాడలో బ్రహ్మసమాజ ఉపవాస కేంద్రాన్ని నిర్మించారు. కులవ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. మద్య నిషేధం కోసం శ్రమించారు. 1923లో మద్రాసు (ప్రస్తుత చెన్నై) శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చారు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషి చేశారు.
శుభకార్యాల్లో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించారు. ‘పీపుల్స్ ఫ్రెండ్ ఫెలో వర్కర్స్’ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. వెంకటరత్నం నాయుడు వివిధ రంగాల్లో చేసిన కృషికిగాను ఆయనకు అనేక పురస్కారాలు లభించాయి. అందులో బ్రహ్మర్షి, శ్వేతాంబర ఋషి, అపర సోక్రటీస్, దివాన్ బహదూర్... వంటివి.
No comments