Breaking News

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య

జననం: మే 1, 1913
మరణం: మే 19, 1985


పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. కమ్యూనిస్టు నాయకుడు. ఈయ న్ని కమ్యూనిస్టు గాంధీ అని పిలిచేవారు. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరు.

సుందరయ్యది నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామం. ఆయన 1913 మే 1 తేదీన భూస్యామ్య కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. సుందరయ్య ఆరేళ్ల వయస్సులో ఉన్నప్పుడే తండ్రి వెంకటరామిరెడ్డి మరణించారు. సుందరయ్య తన ప్రాథమిక విద్యను వీధిబడిలో పూర్తి చేశారు. ఈ తర్వాత వారి అక్కయ్య వద్ద ఉంటూ ఏలూరు, రాజమండ్రి, మద్రాసులలో చదివారు. ఆయనకు తల్లిదండ్రులు సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. కానీ కులానికి చిహ్నంగా పేరు చివర ఉన్న రెడ్డి అనే పదాన్ని ఆయన స్వచ్ఛందంగా తొలగించుకుని తన పేరును సుందరయ్యగా మార్చుకున్నారు.

జీవితాంతం నిరాడంబరంగా జీవించారు. ఆయన ఎంతటి నిరాడంబర జీవితాన్ని గడిపారో తెలియడానికి చిన్న ఉదాహరణను చెప్పుకోవచ్చు. పార్లమెంటు మెంబరుగా ఎన్నికైన తర్వాత ఆయన సమావేశాలకు సైకిల్ మీద వెళ్లేవారు. తనకు పిల్లలు కలిగితే సంబంధాలు, బాంధవ్యాలు ప్రజాసేవకు అడ్డుతగులుతాయని పిల్లలను వద్దనుకున్నాడు. తండ్రి నుంచి తనకు వారసత్వంగా లభించిన ఆస్తిని నిరుపేదలకు పంచిన ఉదారస్వభావం ఆయనది.

గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడైన సుందరయ్య 17వ యేటనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలోను, ఉప్పు సత్యాగ్రహంలోను, సహాయ నిరాకరణోద్యమంలోనూ పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. ఆ తర్వాత కమ్యూనిస్టులతో పరిచయమై వామపక్ష భావాలకు ప్రభావితమయ్యారు. ఆయన చివరి వరకు ఆ భావాలతోనే ఉన్నారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవించిన గొప్పనేత సుందరయ్య. 1985 మే 19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి సుందరయ్య కన్నుమూసారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి.

No comments