ఉరికొయ్యపై ఉయ్యాలలూగిన 'ఉయ్యాలవాడ' నరసింహారెడ్డి
18వ శతాబ్దపు తొలి రోజుల్లో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్లుండేవారు. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలకు బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్లు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహా రెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొసం జమీందారు అయిన చెంచు మల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరఫున నెలకు 11 రూపాయల, 10 ఆభరణాల, 8పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దు చేసింది బ్రిటిషు ప్రభుత్వం. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వల్ల తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు అనంతరపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నర్మించిన కోటలు నగరులు ఈనాటికీ ఉన్నాయి. నరసింహారెడ్డి తల్లి ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఆమె చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసిహంహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్ధమ్మ. ఆమె ద్వారా సుబ్బయ్య దొర జన్మించాడు. రెండవ భార్య వలన ఒక కూతురు. మూడవ భార్య వలన ఇద్దరు కుమారులు జన్మించారు.
1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం ఇప్పించమని తన అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపితే తాసీల్దారు తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తా పొమ్మనడంతో రెడ్డిలో తిరుగు బాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదాబాదుకు చెందిన సలాంఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు. 1846 జులై 10 తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు. ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టు కోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వేయిరూపాల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది. తరువాత జులై 23వ తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్థరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి.
1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించాడు. నరసింహారెడ్డిని, అతని అనుచరులను విచారించిన బ్రిటిషు ప్రభుత్వం అతనికి ఉరిశిక్షను, అనుచరు లకు వివిధ ఇతర శిక్షలను విధించింది. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీసింది. బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.
No comments