Breaking News

ప్రఫుల్ల చంద్ర రాయ్

జననం: ఆగష్టు  2, 1861.
మరణం: జూన్ 16, 1944


భారతదేశపు వైద్య విధానం ఆయుర్వేదం. బ్రిటిషర్లు మనదేశాన్ని ఆక్రమించి వారి వైద్యవిధానమైన అల్లోపతి ని ప్రవేశపెట్టకముందు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంలో ఉండేది. కాని బ్రిటిషర్ల పాలనవలనో మనలో అలవాటైన బానిస భావన వలనో మెల్లిమెల్లిగా ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. చాలామంది ఆయుర్వేదం పనికిరాదని తోసివేశారు. అట్టి కాలంలో బెంగాలుకు చెందిన ఓ ప్రముఖ విద్యావేత్త ఆయుర్వేదాన్ని కాపాడుకోవటానికి నడుంకట్టాడు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారుచేసే ఒక సంస్థను స్థాపించాడు.

అలా ఎంతో కష్టపడి ప్రతికూలమైన పరిస్థితులలో సంస్థని నడుపుతుండగా ఒకనాడు ఆ విద్యావేత్తకు ఒక భీషణమైన సమస్య ఎదురయ్యింది. ఆ సంస్థ తయారు చేసిన ఎన్నో మందులు ఏదో కారణముగా పాడైపోయాయి. ఆ విద్యావేత్త ఎంతో దుఃఖించాడు. అతని విచారం చూసి అక్కడే ఉన్న ఓ ఉద్యోగి ఇలా పలికాడు "అయ్యా! మీరు విచారించకండి. ఇంకా ఈ మందులు పూర్తిగా పాడు అవ్వలేదు. ఇంకొన్నాళ్ళు సునాయాసంగా మనం వీటిని అమ్మవచ్చు. అట్లు చేయకున్న మనకు చాలా నష్టం వస్తుంది. ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలన్న మీ ఆశయం కూడా అప్పుడు నెరవేరక పోవచ్చు".

ఇటువంటి అవినీతి భరితమైన మాటలు విని ఆ విద్యావేత్త మండిపడుతూ ఇలా జవాబిచ్చాడు "నష్టమొస్తుందని పాడైపోతున్న మందుల్ని అమ్ముతామా? అట్టి నీచమైన కార్యాన్ని నేనెన్నడూ చేయలేను. ఆయుర్వేదం ధర్మం ఉన్నచోటే ఔషధాలు పనిచేస్తాయని చెప్పింది. కనుక నా ఆశయం ధర్మస్థాపనే". అలా హితబోధ చేసి ఆ మందులన్నిటిని బయటపడ వేయించి తన ఆదర్శాన్ని కాపాడుకొన్నాడు. తరువాత ఆ విద్యావేత్త లోని నిజాయితీని అందరూ కొనియాడారు.

ఆ ప్రసిద్ధ విద్యావేత్త ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్. భారతీయుల యొక్క విజ్ఞానము గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఈయన ఎన్నో వ్యాసాలు వ్రాసినారు. "Chemical Knowledge of the Hindus of Old" (Isis, Vol.2, No.2, pg. 322-325, The University of Chicago press) అనే వ్యాసం మనమందరం చూడదగినది. ఈ వ్యాసంలో ప్రఫుల్ల చంద్ర గారు మన భారతదేశం ఆధ్యాత్మికత బోధించడంలోనే కాదు విజ్ఞాన పరంగా కూడా ఎంతో ముందున్నదని చెబుతారు.

No comments