భారత దేశ రెండవ రాష్ట్రపతి- సర్వేపల్లి రాధాక్రిష్ణన్
జననం: సెప్టెంబర్ 5, 1888-తిరుత్తణి
మరణం: ఏప్రిల్ 17, 1975-చెన్నై
భారత దేశ రెండవ రాష్ట్రపతిగా, ఉప రాష్ట్రపతిగా, ఆచార్యుడిగా, బనారస్ హిందూ విశ్వవియాలయ కులపతిగా, కోల్కటా విశ్వవిద్యాలయ రూపకర్తగా, ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా, ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్డింగ్ ఆచార్యుడిగా పనిచేశారు ‘భారత రత్న’ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
ఈయన తాత్వికుడు, రాజనీతిజ్ఞుడు; తత్వం లో మహా పండితుడు. 1931 లో సర్వేపల్లి గారికి " నైట్ హూడ్" ఇచ్చి గౌరవించారు. సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అయ్యారు.
సెప్టంబర్ 5, 1888 లో, నేటి తమిల్ నాడు లోని తిరుత్తణిలో సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. సర్వేపల్లి వారిది అతి సాధారణ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి జమిందారు వద్ధ చిన్న ఉద్యోగం చేశేవారు. తిరుత్తణి లో జన్మించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాతృ భాష తెలుగు. తన చిన్నతనం తిరుత్తణి, తిరువల్లూర్, తిరుపతి లో గడచింది. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ ఆర్ట్స్ పట్టా అందుకున్నారు. సర్వేపల్లి గారికి, శివకామమ్మ గారితో 1904 లో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి.
చిన్నతనంలోనే భారతీయ తత్త్వం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలలో మంచి అవగాహన సాధించారు. ఇవి వారి భవితవ్యానికి చక్కటి పునాదివేశాయి. భారతీయ తత్వ వాణిని, మర్మాన్ని లోకాని పరిచయం చేశిన మహత్తర వ్యక్తి.
1918 లో మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్వ ఆచార్యుడిగా తన సుదీర్ఘ యాత్ర ప్రారంభించారు. అప్పటికే చాలా రచనలు చేశారు. అవి ది క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషల్ జర్నల్ ఆఫ్ ఎతిక్స్ వంటి ప్రముఖ పత్రికలలో ప్రకటించారు.
" ది ఫిలాసఫీ ఆఫ్ రబీంద్రనాథ్ ఠాగూర్ " వీరి తొలి రచన. " ది రీన్ ఆఫ్ రిలిజన్ ఇన్ కాంటెమోరరీ ఫిలాసఫీ " వీరి రెండవ రచన. ఇది 1920 లో వెలువడింది. సర్వేపల్లి గారు రాసిన వ్యాసాలు, పుస్తకాలు, కోల్కటా విశ్వవిద్యాలయం కులపతి, ఆషుతోష్ ముఖర్జీ దృష్టి చూరగొన్నాయి. అక్కడ ఆచార్యపదవి చేపట్టి, చాలా కాలం పనిచేశారు. ఈ తరుణంలో కోల్కటా విశ్వవిద్యాలయం అభ్యున్నతికీ, విశిష్ఠతకి, జన బాహుల్యం మన్ననలు అందుకునే విశ్వవిద్యాలయం గా మార్చడానికి కీలక పాత్ర వహించారు.
1931 లో సర్వేపల్లి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కులపతిగా చేరారు. 1938 లో బ్రిటీష్ అకాడమి ఫెల్లో గా ఎంపికైయారు. 1939 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, కులపతిగా పనిచేశారు. సుప్రసిద్ధ పండిత్ మదన్మోహన్ మాలవ్యా స్థానంలో వచ్చి క్రియాశీలక పాత్ర పోషించారు.
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన దరిమిళా, విశ్వవిద్యాలయాల సంఘం (యూనివెర్సిటి ఎడ్యుకేషన్ కమీషన్) అధ్యక్షుడిగా ఉన్నారు. 1949 లో సోవియట్ యూనియన్ (రష్యా) కి భారత రాయబారిగా వ్యవహరించారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కొల్కటా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ చైర్ అలంకరించి, చిత్త, నైతిక శాస్త్ర (మెంటల్ అండ్ మోరల్ సైన్సెస్) విభాగ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరికొంత కాలం (1936 - 1952) ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్డింగ్ ఆచార్యుడిగా పనిచేశారు.
శ్రీ రాధా కృష్ణ అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. ప్రాధమిక విద్యాభాసం తిరుత్తణిలో జరిగినప్పుడు పాఠశాలలో అతని పేరును రాధాకృష్ణకు బదులుగా రాధాకృష్ణన్ గా రాయడం వల్ల అదే పేరును చివరి వరకు ఉంచుకోవటం జరిగింది. చదువుకునేటప్పుడు అతడు తన ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ, టీచర్లను అల్లరి పట్టించే విద్యార్ధులను మందలిస్తూ "మనకు చదువునేర్పి, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులను వెక్కిరించటం, వారి వెనుక చెడుగా మాట్లాడటం మహపాపం. వారు మనకు దైవం లాంటివారు" అని చేప్పేవారు.
రాధాకృష్ణన్ విద్యాభ్యాసం తిరుత్తణిలోనూ తిరుపతిలోనూ జరిగింది. చిన్నతనం నుంచి చదువుపైన శ్రద్ద, ఉపాధ్యాయులపట్ల గౌరవం, భక్తిభావాలు బాగా పెంచుకోవటం వల్ల, అతనికి ఇతర వ్యాపకాల మీద అంతగా ఆసక్తి ఉండేదికాదు. మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో బి.ఏ. పూర్తి చేసిన అనంతరం, అతనికి ఆ శాస్త్రంపై ప్రత్యేక ఆసక్తి కలిగి సంపూర్ణంగా అధ్యయనం చేయాలని నిర్ణయంచుకున్నాడు. ఆ క్షణం నుంచి అనేక పుస్తకాలు చదివి, యోగులు, సాధువులు, మహాత్ములను కలిసి వారి నుండి ఎన్నో విషయాలను సేకరించి ఒక పుస్తకంలో రాసుకునేవాడు. ప్రతిరోజూ రాత్రి డైరీ రాస్తూ, ఆ రోజు జరిగిన అనుభవాలను, తెలుసుకున్న విషయాలను విశ్లేషించి రాసుకునేవాడు. అనంతరం అతను ఎంతగానో అభిమానించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకుని, అతను చదివిన కాలేజీలోనే ఫిలాసఫీ లెక్చరర్‌గా చేరాడు.
1908లో ఉద్యోగంలో చేరిన తరువాత తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, పిల్లలను బిడ్డల్లా చూసుకుంటూ, వారికి కేవలం చదువే కాకుండా, మంచి అలవాట్లను, బుద్దులను నేర్పిస్తూ విరామ సమయంలో తత్వానికి సంబంధించిన గ్రంధాలను లైబ్రరీలో కూర్చొని కూలంకుషంగా చదివి వాటిపైన వ్యాఖ్యానాలను తన డైరీలో రాసుకునేవాడు. రాధాకృష్ణన్ ఏ అవకాశాన్ని విడువకుండా అనేక వ్యాసాలను రాశాడు. 1911లో ఆయన రాసిన "ఎధిక్స్ ఆఫ్ వేదాంతం" అనే విశ్లేషణాత్మక వ్యాసానికి ఎం.ఏ. డిగ్రీ లభించింది. రాధాకృష్ణన్ ప్రతిభను గుర్తించిన పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ఆయనను రష్యా రాయబారిగా నియమించారు. 1952లో ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మానవతావాదిగా, విద్యావేత్తగా, దేశాధ్యక్షుడిగా అందరి హృదయాల్లోనూ పదిలమైన స్థానం సంపాదించుకున్న రాధాకృష్ణన్ కు భారత ప్రభుత్వం "భారతరత్న" బిరుదునిచ్చి, ఆ బిరుదు విలువను పెంచింది. శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన స్వర్గస్థుడయ్యాడు.
సర్వేపల్లి గారి జీవిత చరిత్రను ప్రతీ ఉపాధ్యాయుడు చదివేటట్లు ఒక నిబంధన పెట్టాలి. అది ఎలా అంటే TET పరీక్షలో సర్వేపల్లి జీవితాన్ని ఒక తప్పనిసరిగా చదవాలి అనే నిబంధన పెడితే. నేడు జరుగుతున్న ఘోరాలకు అడ్డు కట్ట వేయవచ్చును. ఉపాద్యాయులకే విలువలు లేని నేటి రోజులలో విద్యార్ధులు వారిని చూసి ఏం నేర్చుకుంటారు.
ReplyDelete