Breaking News

కన్నెగంటి హనుమంతు


పలనాడు అంటేనే అలనాటి బాలచంద్రుడు గుర్తుకొస్తాడు. కుర్రాడే... అయితేనేం... భయం లేదు, బెరుకు లేదు - శత్రువుపైకి లంఘించడానికి! ఆ పసివాడే మళ్లీ పుట్టాడా అనిపిస్తుంది - కన్నెగంటి హనుమంతుగా! బ్రిటిష్‌వారిని గడగడలాడించిన ధీరుడు - కన్నెగంటి. ఆంగ్లేయుల వల్ల అన్నీ కోల్పోతున్న రైతుల్ని చూశాడు. వారి కన్నీటి చారికల్ని చదివాడు. ప్రాణాలకు తెగించి పోరాడాడు. తెల్లవాడికి భారతీయుడి వాడి ఏమిటో చూపిన తెలుగింటి సార్జెంటు - కన్నెగంటి హనుమంతు...

అవి గాంధీజీ వెంటే జాతి నడుస్తున్న రోజులు. మహాత్ముడు 1920ల్లో సంధించిన అస్త్రం - సహాయ నిరాకరణోద్యమం. దేశమంతా పరాయి పాలకులకు సహకరించకుండా మొత్తం వ్యవస్థనే స్తంభింపజేసే ఉద్రేకమది. ఎక్కడికక్కడ ప్రజాందోళనలు ఊపందుకున్నాయి. గుంటూరు జిల్లా పలనాటిలో మించాలపాడు హనుమంతు స్వస్థలం. మాంఛి పొడగరి. ఆకట్టుకునే రూపం. కోల మొహం. మెలి తిరిగిన మీసాలు. తలపాగా. తెలుగింటి పంచెకట్టు. భుజంపై సన్నపాటి కండువా. పైకి తన్నుకొచ్చే కండలు. చేతిలో త్రిశూలంలా కర్ర. కాళ్లకు కిర్రు చెప్పులు. హనుమంతు కోలగట్ల గ్రామపెద్దే అయినా చుట్టుపక్కల పది ఊళ్లల్లో కన్నెగంటిని కననివాళ్లు, ఆ పేరు విననివాళ్లు లేరు. పల్నాటిసీమ పల్లెటూళ్లు దారిద్రానికి నిలయాలు. నేల ఉంటుంది కానీ సారం ఉండదు. నాగులేరు ఉంటుంది కానీ నీళ్లుండవు. పంటలుంటాయి కానీ కోతలుండవు. కంచాలుంటాయి కానీ తిండి ఉండదు. అడవులు, గుట్టల మధ్యనే గ్రామాలు. చిన్న చిన్న రాళ్లు చిల్లర దేవుళ్లతో గడిపే ప్రజలు.

అంతా కాయకష్టం చేసి బతికే పేదలే. చేతిపనులు చేసుకోవడం, పశువుల్ని మేపుకోవడం, ఎంత పండితే అంత పంటా మహాప్రసాదం అనుకోవడం - ఇదీ స్థితి. వారి బతుకులన్నీ చుట్టుపక్కల అడవుల మీదనే ఆధారపడేవి. ఆవుల్ని, గేదెల్ని అక్కడకు తోలుకెళ్లడం, చేతికందిన పుల్లల్ని ఏరుకు రావడం, దాన్నే గ్రాసం చేసుకోవడం - అంతే!

గాంధీజీ అహింసాతత్త్వం కన్నెగంటి హనుమంతుపై చాలా ప్రభావాన్ని చూపింది. ముప్పై ఏళ్ల వయసులో మరణించినా... బుర్రకథల్లో, జంగమదేవర గాథల్లో హనుమంతు నేటికీ నిలిచి ఉన్నాడు. కన్నెగంటి హనుమంతు అడుగుజాడలో సాహసం ఎంత ఉందో సంయమనం అంత ఉంది.

దరిద్రం తాండవించే చోట కూడా దోపిడీ చేయగల దిట్టలు - పాలకులు. అదే చేశారు బ్రిటిష్‌వారు ఆనాడు. దేశంలోని అడవులన్నింటినీ ప్రభుత్వ పరం చేశారు. అంటే ప్రజలు అటవీసంపదను యధేచ్ఛగా అనుభవించడానికి వీల్లేదు. ఆ మాటకొస్తే - అడవుల్లో పూచిక పుల్లను ముట్టుకున్నా నేరమే. సహజ వనరుల పరిరక్షణ కోసమే ఇదంతా అని సర్కారు ఫోజు కొట్టొచ్చు కానీ సామాన్యుల్ని నిర్వీర్యం చేయడమే తెల్లవారి అసలు ఎత్తుగడ.

పలనాటి ప్రజలకిది పిడుగుపాటయ్యింది. అసలే వెనకబడిన ప్రాంతం. ఆపై 1920-21లో తీవ్ర కరువు. పశుగ్రాసం కోసం కటకట. వాటిపై ఆధారపడిన సామాన్యులు విలవిల. కళ్లల్లోంచి ప్రాణాలు పోయే పరిస్థితి. ఒక పశువును అడవిలో మేపుకోవాలంటే ఫీజు చెల్లించాలి. ఆ శిస్తు తీసుకుని అధికారులు అనుమతి ఇస్తారు. ఎంతవరకు అనుమతి ఉందో ఆ ప్రదేశంలోనే పశువులు ఉండాలి. ఒక్క అడుగు పక్కకు పశువు వేసిందా... అంతే! ఆ రైతు వీపు విమానం మోత మోగిపోయేది. మళ్లీ జరిమానా.

ప్రజలు భరించలేకపోయారు. మొదట అధికార్ల కాళ్లావేళ్లా పడ్డారు. తమ బాధల్ని అర్థం చేసుకొమ్మని మొత్తుకున్నారు. పుల్లరి పన్ను 75 పైసలే. కానీ ఆనాడది వందలతో సమానం. బక్కచచ్చిన పల్నాడు రైతుకది వేలతో సమానం. అందుకే శిస్తునైనా తగ్గించమని వేడుకున్నారు.

కానీ పాలకులు కసాయిలు. అటు తెల్లవారు, ఇటు వారి కింద పనిచేసే మన దేశపు అధికారులు ప్రజల్ని మరింత పీల్చి పిప్పి చేసేవారు. చిన్నా చితకా లంచాలిస్తే సరే. లేకుంటే... పెనం మీంచి పొయ్యిలో పడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కన్నెగంటి హనుమంతు కులాసాగా ఇంట్లో ఉండలేకపోయాడు. మంచె కాడ దిలాసాగా కునుకుతీయలేకపోయాడు.

కన్నెగంటి సంపన్నుడే. ఆస్తికి కొదవలేదు. పుల్లరితో సమస్య లేదు. అయినా తన జాతి ప్రజలు కడగండ్లతో, కన్నీళ్లతో కాగిపోతుంటే కుదురుగా ఉండలేకపోయాడు. వెల్దుర్తి, మాచర్ల, బట్టిపాలెం, శ్రీగిరిపాడు, జంగమహేశ్వరపురం, మించాలపాడు, కోలగట్ల, రామాపురం... ఇలా ఊరూరా తిరిగాడు. బిక్కు బిక్కుమంటున్న రైతుల్ని అక్కున చేర్చుకున్నాడు.

వీళ్లకోసం ఏం చేయాలి? ఆలోచించలేదు కన్నెగంటి. ఏదో ఒకటి చేయాలి? నిశ్చయించుకున్నాడు గట్టిగా. సహాయ నిరాకరణోద్యమానికి గాంధీజీ పిలుపునివ్వడం గుర్తొచ్చింది హనుమంతుకి. అంతే! ప్రజల్ని ఏకం చేశాడు. ప్రభుత్వోద్యోగుల్ని బాహాటంగా ధిక్కరించమన్నాడు. పశువుల్ని నిర్భయంగా అడవుల్లో మేపుకోమన్నాడు. ‘ఈ నేల మనది, ఈ గ్రాసం మనది’... అంటూ ఎలుగెత్తమన్నాడు. జనం అదే చేశారు. ‘‘నీరు పెట్టావా, నాటు వేశావా, కోత కోశావా, కుప్ప నూర్చావా, ఎందుకు కట్టాలిరా శిస్తు’’ అంటూ ఆంగ్లేయుల్ని ప్రశ్నించాడు కన్నెగంటి.

కన్నెగంటి హనుమంతు ఆధ్వర్యంలో పుల్లరి సత్యాగ్రహం ఉధృతమైంది. బ్రిటిష్ అధికారులకు దినదిన గండమైంది. పుల్లరి లేదు, గిల్లరి లేదు - దోపిడి, దౌర్జన్యం ఇంకానా. ఇకపై చెల్లదంటూ ప్రజలు ఎలుగెత్తారు. వీర రౌద్ర మూర్తులయ్యారు. ప్రభుత్వం భయపడింది. జిల్లా కలెక్టర్ వెర్నన్, అదనపు కలెక్టర్ రూథర్‌ఫర్డ్ దిగివచ్చారు. సమస్యను పరిష్కరించడానికి కాదు... కన్నెగంటి పనిపట్టడానికి!

మాచర్లకు 20 మైళ్ల దూరంలోని మించాలపాడుకు చేరుకున్నారు అధికారులు. పోలీసు బలగాలను పెద్ద ఎత్తున దింపారు. దొరికినవాడిని దొరికినట్లు చితకబాదడం మొదలెట్టారు. పశువుల కాపర్లను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం మొదలెట్టారు. రూథర్‌ఫర్డ్ సహజంగా కర్కశుడు. మొండిఘటం. అతడి ఆదేశాలతో బలగాలు మరింత రెచ్చిపోయాయి. హనుమంతు నాయకత్వంలో ప్రజలు కూడా ప్రతిఘటించారు. రక్షకభటులపై తిరగబడ్డారు. అంతటి కల్లోలంలోను, ఎవ్వరినీ భౌతికంగా గాయపరచవద్దని, కేవలం అహింసామార్గంలో తమ తమ నిరసనలు తెలపాలని కన్నెగంటి ఆదేశించాడు. ప్రజలు తు.చ. తప్పక అదే చేశారు.

1922 ఫిబ్రవరి 26. అమావాస్య. ప్రజలందరినీ ఓ చోట సమావేశపరిచారు అధికారులు. ఓ పక్కన హనుమంతు, ఆ పక్కన భార్య గంగమ్మ, ఆమె చంకన చంటిబిడ్డ. ఆ వెనకే ఊళ్ల జనం వందలాది. ‘‘మమ్మల్నే ఎదిరిస్తార్రా? పుల్లరి కట్టరా? మీ పశువుల్ని బందెలకు తోలుతాం. మీ ఆస్తుల్ని జప్తు చేస్తాం’’ అని బెదిరించారు పోలీసులు. ‘‘ఆ పని చేయొద్దు. శిస్తు అంతా నేనే కడతాను’’ అన్నాడు హనుమంతు.

నిజానికి దాంతో సమస్య తీరిపోతుంది. కానీ అహం దెబ్బతిన్న అధికార్లకు అది రుచించలేదు. 120 గేదెల్ని, 50 మేకల్ని బంధించాడు. దుర్గి బందెల దొడ్డికి తరలించడం మొదలెట్టారు. గ్రామస్తులంతా వారి చేతులు పట్టుకుని పాకులాడారు. పసుపులేటి చెన్నయ్య అనే కుర్రాడు పోలీసుల కాళ్లు పట్టుకున్నాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆ పసివాణ్ని తుపాకీ మడిమెతో రెండు పోట్లు పొడిచాడు. ఇంకో ఇద్దర్ని కూడా పోలీసులు అలాగే సత్కరించారు.

ఆ చెన్నయ్య ఎవరో కాదు - కన్నెగంటికి అల్లుడి వరుస. పోలీసులను అడ్డుకున్నాడు హనుమంతు. ఎవరినీ కొట్టవద్దంటూ రెండు చేతులూ ఎత్తి ప్రాధేయపడ్డాడు. నిజానికి ‘ఎదురు తిరగండి’ అని ఒక్క మాట కన్నెగంటి అంటే చాలు... వేలాది పలనాటి ప్రజల కన్నెర్రకు బ్రిటిష్ అధికారులు మసైపోయేవారు. కాని హింస కూడదనుకున్నాడు హనుమంతు.

ఆ విచక్షణ తెల్లవారికి లేదు. అందుకే ఇరవై ముప్ఫై తుపాకులు ఒక్కసారిగా పేలాయి. తూటాలన్నీ హనుమంతు దేహంలోకి దిగాయి. ఓ గుండు బారు కుడిచేతికి తగిలింది. చెయ్యి దండ విరిగింది. ఎడమ చేతితోనే అడ్డుపడ్డాడు హనుమంతు. ఓ రవ్వల బారుతో ఎడమ డొక్కలో పొడిచాడో పోలీసు. నేలకొరిగాడు కన్నెగంటి. దాహం దాహం అంటూ అరిచాడు కన్నెగంటి. గంగమ్మ ఏడ్చేసింది. చంటి బిడ్డతోనే పరిగెత్తుకుంటూ ముందుకురికింది. చెంబుడు నీళ్లు ఇవ్వబోయింది. చంటిబిడ్డనూ చంపేస్తాం అన్నారు భక్షక భటులు. రొప్పుతూ మొత్తుకుంటూ నేలపైనే సొమ్మసిల్లిపోయింది గంగమ్మ.

అప్పుడు సమయం సాయంత్రం ఆరైంది. అంతటి బాధలోనూ హనుమంతు అధికారులతో వాదిస్తూనే ఉన్నాడు. ‘పుల్లరి ఎందుకు కట్టాలి’ అని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. శరీరంలో 26 బుల్లెట్లు... ఒళ్లంతా తూట్లు... రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూనే ఉన్నాడు. చుట్టూ పోలీసుల పహరా. ఆసరా ఇవ్వలేని, కనీసం గుక్కెడు నీళ్లివ్వలేని నిస్సహాయ జనం.

అర్ధరాత్రి 12 గంటలకు ప్రాణం విడిచాడు కన్నెగంటి హనుమంతు.

శవ పరీక్ష అయ్యింది. హనుమంతు శవాన్ని పోలీసులే పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాత కుటుంబీకులు దాన్ని తవ్వితీశారు. ఉత్తర క్రియలు జరిపారు కన్నీటి సంద్రమై! దొంతలవాగు ఒడ్డున ఖననం చేశారు. సమాధి వద్ద స్మారక శిలాశాసనం వేయించారు. అందులో కన్నెగంటి హనుమంతు వీరత్వాన్ని, ధీరత్వాన్ని, శాంతియుత దృక్పథాన్ని రాయించారు.

అది ఆ చుట్టుపక్కల ప్రజలకు చెప్పలేనంత ఉద్రేకాన్నిచ్చింది. అది మళ్లీ వందలాది హనుమంతుల్ని తయారుచేస్తుందేమోనని భయపడి, బ్రిటిష్‌వారు 1923 జనవరి 22న ఆ శాసనాన్ని ముక్కలు ముక్కలు చేయించారు. తుప్పల్లో పడేశారు.

తెల్లవారు పోయినా మనవారింకా ఆ శాసనం వేయించలేదు. ఆ ఆదర్శం మరిచిన ఈ జాతిని హనుమంతు శపిస్తాడేమో అనిపిస్తుంది. కానీ అది ఆయన స్వభావం కాదు కదా!

No comments