Breaking News

పి.వి.నరసింహారావు-భారతదేశపు 10వ ప్రధానమంత్రి

జననం: జూన్ 28, 1921-కరీంనగర్
మరణం: డిసెంబర్ 23, 2004


అపర చాణక్యుడు...తొలి తెలుగు ప్రధాని, దక్షిణ భారతదేశం నుంచి తోలి ప్రధానమంత్రి.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలల చాటిన వాడు... బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా వేత్త, అపరచాణక్యుడు ఇలా చెప్పుకుంటూ పోతే బిరుదులే కరువైపోతాయి. అంత గొప్ప వ్యక్తీ తెలుగు గడ్డ మీద పుట్టడం నిజంగా మన అదృష్టం. ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు. భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఒకేఒక్క తెలుగువాడు ఈయన. నరసింహరావు ఆంధ్ర ప్రదేశ్ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించారు.

కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆయనను కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ లు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండీ ఆయన పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. తాను విద్యాభ్యాసం వరంగల్, కరీంనగర్ లో కొనసాగించారు. విద్యార్తి దశలోనే రాజకీయాలపై ఆసక్తితో 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడి అందరి మన్ననలు పొందినప్పటికీ.. ఆయనను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించారు.

అనంతరం ఓ మిత్రుడి సహాయంతో నాగపూర్ లో లా పూర్తీ చేసాడు. ఈ క్రమంలోనే పలు ఉద్యమాల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు మెండుగా సంపాదించుకున్నారు. ఆ తర్వాత 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందారు. అదే ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపు అయ్యింది. ఆయన మొదటిసారిగా 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇదే విజయపరంపరను వరుసగా నాలుగు సార్లు కొనసాగించారు. ఆ తర్వాత 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. పలు కీలక పదవులు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఆయన అపార జ్ఞాన సంపదను సమకూర్చుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18 బాషలను ఆయన అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడు. ఇన్ని భాషల్లో ప్రావీణ్యం పొందడం ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. ఆయన సంపాదించుకున్న అపార జ్ఞానమే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఊహించని విధంగా వచ్చింది. 1969లో తెలంగాణా ఉద్యమం చల్లబడిన తర్వాత తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేయవలసి రావడంతో ఆ అవకాశం పివికి దక్కింది. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. రాష్ట్రపతి పాలనా విధించాల్సి రావడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలి పెట్టిన తర్వాత పివి.. హస్తిన రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ఆయన మొదటి సారిగా హన్మకొండ నియోజక వర్గం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1980 - 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ తో సహా వివిధ కీలక మంత్రి పదవులు చేపట్టారు. ఆయన పదవులతో పాటు ప్రజాభిమానాన్ని చూరగొంటూ ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రజలకు దగ్గరవుతూ.. అధిష్టానం అభిమానాన్ని చూరగొన్నారు.

1991 లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పివిని ప్రధాన మంత్రి పదవి వరించింది. అప్పటికే ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధం అయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయని ఆయనను వినూత్నంగా తెరపైకి వచ్చి ప్రధాని అయ్యారు. దీంతో దక్షిణ భారత దేశం నుండే ఆయన మొదటి ప్రధాని కావడం విశేషమైతే.. అందులో తెలుగు వాడు కావడం మరో విశేషం.

పివి సుదీర్ఘ రాజకీయ జీవితంలో మన్ననలతో పాటు ఎన్నో విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. బాబ్రి మసీదు కూల్చి వేత, అవిశ్వాస తీర్మానంలో ఎంచుకున్న మార్గాలు ఆయనను అప్రతిష్టపాలు చేసాయి. అంతే కాదు పలు అవినీతి ఆరోపణలు కుడా ఆయన ఎదుర్కున్నారు. ఇదిలా ఉంటే ఆయన అధిరోహించిన పదవులు, వచ్చిన అవార్డులు, చేసిన మంచి కార్యక్రమాలు వివరించడానికి ఒక పుస్తకం కుడా సరిపోదనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు అనడానికి ఆయన జీవితమే నిదర్శనం. కష్ట పడితే ఫలితం గురించి ఆలోచించాల్సిన పని లేదని ఆయన నిరూపించారు. ఇటు ముఖ్య మంత్రిగా, అటు ప్రధానిగా అనూహ్యంగా ఎన్నుకోవడానికి కారణం ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కావడమే. ఇలాంటివారి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం అనడంలో సందేహం లేదు.

తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన అపర చాణక్యుడిని ''మన మహనీయులు " మనస్పూర్తిగా స్మరించుకుంటుంది.

No comments