విష్ణురూపంలో రక్షిస్తాడు



గురుబ్రహ్మ–గురువు బ్రహ్మ ఎలా అయ్యాడో తెలుసుకున్నాం. గురుర్విష్ణుః – గురువు సాక్షాత్‌ విష్ణువు. ఎలా అంటే – విష్ణువు స్థితికారుడు, రక్షకుడు. ఆయనలో ఒక ప్రత్యేకమైన లక్షణముంటుంది... ఆయనను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలవక్కర్లేదు. ఆయన రక్షణ బాధ్యత స్వీకరిస్తాడు. జాగృతిలో ఇంద్రియాలు మేల్కొంటాయి. అప్పుడు వివిధ ఆలోచనలు, వివిధ కర్మలు జరుగుతాయి. ఆ సమయంలో ప్రారబ్ధం అనుభవంలోకి వచ్చి ప్రమాదాలతో శరీరం గ్రహింపబడకుండా రక్షించబడడానికి తెలివి రాగానే శ్రీహరీ, శ్రీహరీ, శ్రీహరీ అంటూ లేస్తారు.

భగవన్నామం ఎప్పుడు చెప్పాలో అజామినోపాఖ్యానంలో విష్ణుదూతలు ఇలా చెప్పారు ... ‘‘కూలినచోట, కొట్టబడి కుంగినచోట, మహాజ్వరాదులన్‌ పేలినచోట, సర్పముఖపీడలు పొందిన చోట, ఆపదల్‌ కల్గినచోట, విష్ణు భగవదూరిని పేర్కొనరేరి అక్కాలుని యాతనాతతిని పొందరు, ఆపైన పూనరు దుఃఖభావముల్ఢ్ఢ్‌’’ అని అంటారు. భగవన్నామం చెప్పడానికి ఇది సమయం, ఇది ప్రాంతం అని ఉండదు. అందుకే కూలినచోట... దభాల్న పడిపోయాడు– ‘రామరామ’ అని అప్రయత్నంగా అనగలగాలి. ఇది సాధనచేత వస్తుంది. కొట్టబడి కుంగినచోట... ఎవడో తలమీద కొట్టాడు, దబ్బున కింద పడ్డాడు. మరు క్షణం ‘రామరామ’అంటూ పడిపోగలగాలి. మహా జ్వరాదులన్‌ పేలినచోట... 104 జ్వరం వచ్చేసింది. సంధికలిగి పైత్యం పుట్టి ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా భగవన్నామం రావాలి నోట్లోంచి. సర్పముఖపీడలు పొందినచోట... పాము చటుక్కున పడగవిప్పింది. యాదృచ్ఛికంగా భగవన్నామం నోటివెంట రావాలి.

భగవన్నామం పలకడానికి శౌచంతో సంబంధం లేదు. మంత్రమయితే శౌచం ఉండాలి. ఎప్పుడూ భగవన్నామం ఆవశ్యకమే. భగవంతుడిని పేరుపెట్టి పిలిచినా పిలవకపోయినా, గుణగణాదులతో కీర్తించకపోయినా, ఆర్తితో రక్షణ కలగాలన్న భావన పరబ్రహ్మాన్ని ఉద్దేశించి చేస్తే రక్షించడానికి వచ్చేది విష్ణుస్వరూపమే.అందుకే ఈ పెద్ద రహస్యాన్ని పోతనగారు భాగవతంలో వెల్లడిస్తారు. గజేంద్రుడు ఆపదలో చిక్కుకున్నప్పుడు ఎవర్నీ పేరుపెట్టి పిలవలేదు, ఫలానావారొచ్చి రక్షించాలని అడగలేదు. ఏ గుణం కానీ, ఏ రూపంకానీ చెప్పలేదు. నాకు రక్షణ కావాలని పిలిచాడు.‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాదిమధ్యలయుడెవ్వడు సర్వముతానెయైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్‌’’ అన్నాడు. 33 కోట్లమంది దేవతలు లేచి నిలబడ్డారు, ఎవరు వెళ్ళాలో బోధపడక..’ ఇది నాకు వర్తించదు’ అంటే ’నాకు వర్తించదు’ అని కూర్చున్నారు. కానీ రక్షణ అంటే విష్ణువే రావాలి. అక్కడ గజేంద్రుడి కాలు మొసలినోట్లో ఉన్నది. వెంటనే బయల్దేరాడు. నిన్ను నీవు మరిచిపోయి రావాలని కూడా కోరాడు గజేంద్రుడు. ఎవరికీ చెప్పకుండా, ఒంటిమీద బట్ట సరిగా ఉందో లేదో కూడా చూసుకోకుండా తనను తాను మరిచిపోయి బయల్దేరి వచ్చాడు.

జ్ఞానం రక్షణ హేతువు. దానికి ఉత్థానపతనాలుంటాయి. ఇంద్రియాల ప్రకోపం వల్ల, మనసుకు రజోగుణ, తమోగుణ స్పర్శలచేత, ఉద్వేగం చేత భక్తిని విడిచిపెట్టేస్తుంటాం. సాత్వికబుద్ధిని విడిచిపెట్టేస్తాం. చెయ్యకూడని పనులలో, రాగద్వేషాలలో చిక్కుకుపోతాం. తీసే ఊపిరికి విడిచే ఊపిరికి మధ్య మృత్యువుంటుంది. మృత్యువు కదిలినప్పుడు మనసు రాగద్వేషాలతో ఎవర్ని పట్టుకుందో వారిని స్మరిస్తుంది. అలా పునర్జన్మలో తిర్యక్కు (వెన్నెముక అడ్డంగా ఉండే ప్రాణి)గా పుడతాడు.మనసు రాగద్వేషాలలో చిక్కుకోకుండా గురువు ఎప్పుడూ తన వాక్కులతో, తన నడవడితో భగవంతుడిని పట్టుకునేటట్లు చేస్తాడు. సుఖదుఃఖాలు శాశ్వతం కాదు. వైరాగ్యమొచ్చి భగవంతుడిని పట్టుకునే అనుగ్రహం గురువు కారణంగా వస్తుంది. అలా రక్షణకు హేతువవుతాడు.
- చాగంటి కోటేశ్వరరావు.

1 comment:

  1. భగవన్నామం చెప్పడానికి ఇది సమయం, ఇది ప్రాంతం అని ఉండదు.

    ReplyDelete