Monday, June 4, 2018కార్యకర్త
' సంఘటనకు మూలమైన సంఘశాఖ మనదిరా
గంగానదిలా సాగే కార్యశక్తి మనదిరా lసంఘటనl
అణువు చిన్నదే దానికి అమితశక్తి ఉందిరా
విత్తు చిన్నదే కాని దానికి సత్తువెంతో ఉందిరా
శాఖ చిన్నదే శాఖా కార్యక్రమం చిన్నదే
శాఖలోనె సంఘటనాశక్తి ఇమిడి ఉందిరా lసంఘl '

ఇలా సాగే ఒక గీత్ సంఘంలో పాడుకుంటుంటాం. సంఘటనాశక్తిని పెంపొందించే శాఖ ఒక శక్తిపీఠం. అలాంటి శక్తిపీఠాన్ని కాంతులు వెదజల్లేలా చేసేవాడు ముఖ్యశిక్షక్. ఒక నిర్ణీత స్థలంలో, రోజూ నిర్ణీత సమయంలో గంటసేపు జరిగేదే శాఖ. ఉదయం జరిగే శాఖను ప్రభాత్ శాఖ అని, సాయంత్రం జరిగే శాఖను సాయంశాఖ అని, రాత్రి వేళల్లో జరిగే శాఖను రాత్రి శాఖ అని పిలవడం పరిపాటి. (ముంబై మహానగరంలో రాత్రి 12.30 నుండి 1.30 గంటల వరకూ శాఖలు జరుగుతాయట. ఆ శాఖలకు హోటళ్ళలో, బార్లలో , ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు వస్తారని , ఆ శాఖల పని చూడటానికి ప్రత్యేకంగా ప్రచారకులు ఉంటారని ఒకప్పటి సహ సర్ కార్యవాహ శ్రీ సురేష్ రావు కేతకర్ చెప్పగా విన్నాను) అయితే ఒకే నిర్ణీత స్థలంలో సాయంత్రం వేళ రెండు వేర్వేరు సమయాల్లో శాఖ జరిగితే నిర్దిష్టంగా ఏమనాలో దానికి సంఘంలో ప్రత్యేక పదబంధం ఏదీ లేదు.
అలా ఒక నిర్ణీత స్థలంలో సాయంత్రం వేళ రెండు నిర్ణీత సమయాల్లో జరిగిన రెండు శాఖల ముచ్చట మీకొరకు :
అనంతపురం నగరంలో అలాంటి శాఖలు ఓ ముప్పయ్యేళ్ళ క్రితం జరిగాయి. రైల్వేస్టేషన్ కు దగ్గరలో బహుశా రెండవరోడ్డులో ఒక పాఠశాల మైదానం. సాయంత్రం 4.30నుండి 5.30 గంటల వరకూ శాఖ జరిగేది. శాఖలో అందరూ బాల స్వయంసేవకులే. దాదాపు 20 - 30 సంఖ్య ఉంటుండేది. ప్రార్థన అనంతరం ఆ బాల స్వయంసేవకులు వెళ్ళిపోయేవారు. మామూలుగానైతే వాళ్ళతోబాటు శాఖా ముఖ్యశిక్షక్ కూడా వెళ్ళిపోవాలి. కానీ అక్కడే ఉంది ట్విస్ట్. ఆ శాఖా ముఖ్యశిక్షక్ అక్కడే ఉండిపోయేవాడు. 5.45 గంటల సమయమయ్యేటప్పటికి మళ్ళీ 20 -30 మంది దాకా బాల స్వయంసేవకులుసంఘస్థాన్ కు చేరుకునేవారు. 6.45 గంటల వరకూ శాఖ నడిచేది. శారీరక్, బౌద్ధిక్ కార్యక్రమాలన్నీ తు.చ.తప్పక జరిగేవి. కార్యక్రమాలన్నీ ఎంతో ఆకర్షణీయంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగేవి. రెండు శాఖలకు వేర్వేరుగా వచ్చే బాల స్వయంసేవకులు తమకు వీలైన శాఖలో పాల్గొనడానికి వీలుండేది కాదు. ఏ శాఖ స్వయంసేవకులు ఆ శాఖకే ఫిక్స్.రెండు శాఖల శారీరక, బౌద్ధిక కార్యక్రమాల యోజన కూడా విడిగా ఉండేదేమో! ఒకే సంఘస్థాన్ లో రోజూ రెండు సాయంశాఖలు జరగడం చాలా విశేషం. చాలాసార్లు పర్యటనకు వచ్చిన అధికారులు రెండు శాఖలలో పాల్గొని మార్గదర్శనం చేయాల్సి రావడం జరిగేది. 
ఆ రెండు శాఖలకు ముఖ్యశిక్షక్ గా శ్రీ పి.సతీష్ వ్యవహరించేవాడు. అలా రెండు శాఖలూ ఏళ్ళ తరబడి అవిచ్ఛిన్నంగా నడవడంలో శ్రీ సతీష్ పాత్ర అవిస్మరణీయమైనది. అనంతపురం విభాగ్ కేంద్రం( ఆ రోజుల్లో కడప, అనంతపురం, కర్నూలు రాజకీయ జిల్లాలతో కూడినది )లో అలా జరిగే శాఖలు కార్యకర్తలకు, ప్రచారకులకు, సంఘ అధికారులకు ప్రేరణగా నిలిచేవి.
ఈ రోజు శ్రీ భోజనపల్లి నరసింహమూర్తి ఒక వీడియోను షేర్ చేశారు. అందులో మూడు లేదా నాలుగేళ్ళ వయసున్న శిశు స్వయంసేవక్ శాఖను నడపడం ఉంది. ఈ వీడియో చూడగానే నేను ప్రత్యక్షంగా చూసిన ఒక ముఖ్యశిక్షక్ గురించి వ్రాయాలనిపించింది.
1991_ 92 నాటి కాలం. భాగ్యనగర్ బర్కత్ పురా లోని ప్రాంత కార్యాలయం కేశవ నిలయంలోని సాయం శాఖ. ఆనాటి దక్షిణ మధ్య క్షేత్రపు మాననీయ క్షేత్ర సంఘచాలకులు శ్రీ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆనాటి పశ్చిమ ఆంధ్రప్రదేశ్ మాననీయ ప్రాంత కార్యవాహ శ్రీ ముదుగంటి మల్లారెడ్డి పర్యటన నుండి తిరిగివచ్చారు. ఉదయం శాఖకు వెళ్ళడం కుదరలేదు కాబట్టి ప్రార్థన చేయడానికి ఈ శాఖకు వచ్చారు. కార్యాలయ వ్యవస్థలో ఉన్నందున , నేను కూడా వారి వెంట శాఖకు వెళ్ళాను. ఆ సమయానికి గీత్ ప్రారంభమైంది. తర్వాత అమృత వచనం, ఆ తర్వాత ముఖ్యశిక్షక్ చిన్నకథ చెప్పడం జరిగింది. ఉత్తిష్ఠ చెప్పడానికి ముందు, ఎవరెవరు అగ్రేసర్ గా రావాలో చెప్పడం ఆ శాఖలో ఆనవాయితీ గా ఉండేది. దాంతో ఆ రోజుముఖ్యశిక్షక్ గా వ్యవహరించిన బాల స్వయంసేవక్, శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వైపు చూసి , ' నువ్వు తరుణ గణకు అగ్రేసర్ గా రావాలి ' అన్నాడు. వెంటనే , శ్రీ మల్లారెడ్డి గారు తనదైన శైలిలో ' ఆయన క్షేత్ర సంఘచాలక్. కాబట్టి అధికారి స్థానంలో నిలబడాలిగదా! ' అన్నారు. అపుడా ముఖ్యశిక్షక్ , అవునుగదూ, సరేలే అంటూ శ్రీ మల్లారెడ్డి గారి వైపుచూస్తూ, ' అయితే నువ్వు అగ్రేసర్ గా రా! ' అన్నాడు. వెంటనే శ్రీ మల్లారెడ్డి గారు సరేనంటూ తలూపారు. తర్వాత మిగిలిన గణలకు ఎవరెవరు అగ్రేసర్ గా రావాలో చెప్పేశాడు ముఖ్యశిక్షక్. తర్వాత యథావిధిగా శాఖ ముగిసింది. 
ఆ తర్వాత శ్రీ శాస్త్రి గారు తమాషాగా , 'ముఖ్యశిక్షక్ అంటే ఇలాగే ఉండాలి . తన శాఖలోని స్వయంసేవకులకు ఏ బాధ్యతనైనా అప్పగించడానికి వెనుకాముందు చూడకూడదు.' అన్నారు. 
ఎలాంటి భయం లేకుండా వ్యవహరించిన ఆ బాల ముఖ్యశిక్షక్ పేరు చెప్పనేలేదు కదూ! అతడి పేరు సీతారామ్ కులకర్ణి. శ్రీ పాండురంగారావు కులకర్ణి గారబ్బాయి. ప్రస్తుతం లాయర్ గా పనిచేస్తున్నాడు.

" ముఖ్యశిక్షకులు జాతిని ముందుకు నడిపిస్తారు " అని ఓ పాతగీత్ లో ఓ పాదం ఉంది.
"ముఖ్యశిక్షక్ సంఘాన్ని మోసే ఆదిశేషుడు " అనేవారు శ్రీ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.

శిక్షణా తరగతులు

యువ నిర్మాణ్

యువ నిర్మాణ్
రేపటితరం నాయకులు

భారతీయ విజ్ఞానవేత్తలు

స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు రత్నాలు

Followers

Trending this Week

Follow us on Facebook