ప్రకృతే ప్రాణమై భూమే తల్లియై - Prakrute Pranamai Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
ప్రకృతే ప్రాణమై… భూమే తల్లియై
పంటలే సంపదై… పశువే బంధువై
సంతానం సౌభాగ్యం … సమైక్య స్ఫూర్తితో
బంజారా పండుగలు జీవన వేదాలే
వేడుకలో తత్వమై… ఆచారంలొ ఆత్మయై
పాటలో పరంపరై… నాట్యంలో సంస్కృతై
సమాజహితం ధర్మమై… సేవే మార్గమై
సేవాలాల్ బోధనలు నడిపించే వెలుగులై
1
మంత్రాలి… కెంకాళి… హింగ్లా తుల్జా దేవి
ద్వాలంగర్… మేరమ్మ… సీత్లా దుర్గమ్మ
ఏడు రూపాలైనా… ఆదిశక్తి ఒకటే
ఏడు కిరణాలైనా… ఆత్మజ్యోతొకటే
అడవికి ఆత్మవై… అడుగులకండవై
గోమాతల రక్షించే ప్రాణదాతవై
పంటల పరిమళమై… తండాల తేజమై
బంజారా గుండెల్లో భక్తి జ్యోతివై
2
తండా తండాలలో తాళాల్ మోగంగ
గజ్జెల సవ్వడిలో గుండెలే పొంగగ
పాటలోన శృతియై.. ఐక్యతతొ అడుగేయ్
నాట్యంలో కనిపించే జీవన సంస్కృతై
డప్పుల దరువుల్లో ధైర్యం పలుకంగా
కలిసి వేసే అడుగుల్లో బంధం బలపడగా
ఆసేతు హిమాచలం సంస్కృతి సౌరభమై
గోర్ బంజారాల కళావైభవం వెలిగె
3
వెదురు బుట్టలోన విత్తనం మొదలై
తొమ్మిది రోజులలో మొలకై ఎదిగే
కన్యల చేతుల్లో తీజ్ పండుగై
శ్రావణ మాసాన సంబరమై విరిసే
మొలకలో కనిపించె సస్య శ్యామలం
వేడుకలో దాగే కుటుంబ సౌభాగ్యం
ప్రకృతితో మనిషికున్న అనుబంధం
తీజ్ పలికించే జీవన సందేశం
4
ఆషాఢ వర్షాలు ఆరోగ్యాన్నిచ్చేలా
వ్యాధుల నీడలే తండాల చేరకుండ
చెట్టు నీడలో ఏడు రాళ్లను నిలిపి
సీత్లా భవానిని భక్తితో కొలిచే
పశువుల క్షేమం… పంటల పచ్చదనం
ఇంటింటా శాంతి… తండాల సమైక్యత
జీవిని కాపాడే మాతృవేదనం
సీత్లా భవాని మనకు దైవభావనం
పండుగ అంటే వేడుక కాదది
పూర్వీకుల జ్ఞాన బోధ అది
సంస్కృతి అంటే జ్ఞాపకం కాదది
నేటి తరానికి వెలుగు బాట ఇది
భూమాత గౌరవం … జీవకారుణ్యం
సమాజాన్ని కలిపే … సమరస సద్భావం
సేవాలాల్ స్ఫూర్తితో సత్యమై సాగుదాం
గోర్ బంజారా గీతమై నిత్యం పాడుదాం !
No comments