Breaking News

జాతీయత గురించి చర్చ జరగాలి - RSS Bhagaiah Garu

 


1‌వ భాగం

జాగృతితో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహసర్‌  ‌కార్యవాహ వి. భాగయ్య

జాతీయతా భావన ఆధారంగా ఇవాళ భారతదేశమంతటా ఒక కొత్త వాతావరణం నెలకొంటున్నదని, మన మహా పురుష పరంపర అందించిన చింతన ఆధారంగా చేపట్టిన కొన్ని చరిత్రాత్మక నిర్ణయాలకు లభిస్తున్న విజయం ఇందులో భాగమేనని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహసర్‌ ‌కార్యవాహ వి. భాగయ్య చెప్పారు. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే జాతీయత అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశయానికి ఇప్పుడు సర్వత్రా సమర్ధన ఉన్నదని అన్నారు. ఇక్కడున్న ముస్లింలను, క్రైస్తవులను  భారతీయ ముస్లింలు, క్రైస్తవులుగానే హిందూ సంస్కృతి చూస్తుందనీ, ఎవరినీ వెళ్లగొట్టాలని చెప్పడం లేదనీ స్పష్టం చేశారు. అన్ని మతాలకు సమగౌరవం, గిరిజనులు, ఎస్‌.‌సి.లు సహా అన్ని వర్గాల సమ వికాసం, అన్ని భాషల పట్ల, జీవన విధానాల పట్ల మన్నన సంఘం ఆశయమని వెల్లడించారు. మతాంతరీకరణలను సంఘం సహించబోదని హెచ్చరించారు. అయోధ్య, విశ్వవిద్యాలయాలలో విధ్వంసకర ధోరణులు, గ్రామం కేంద్రంగా జరుగుతున్న పునర్‌ ‌నిర్మాణ వంటి పలు అంశాలపై శ్రీ భాగయ్య అంతరంగ ఆవిష్కరణమిది.


వర్తమాన ప్రపంచంలో అసమానమైనది రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌. అం‌తటి స్థానం లభించడం వెనుక 95 సంవత్సరాల అకుంఠిత దీక్ష ఉంది. ఇప్పుడు జాతీయత మీద, భారతీయుల మీద, ఇటీవలి చరిత్ర మీద సంఘానిది చెరగని ముద్ర. ఈ నేపథ్యంతోనే ఒక ప్రశ్న. ఒక సంక్షుభిత చరిత్రకు సాక్షి సంఘం. 1925లో డాక్టర్‌ ‌హెడ్గెవార్‌ ‌ప్రారంభించిన నాటి నుంచి, స్వాతంత్య్రోద్యమ సమయంలో పరాయి పాలనలో ఈ దేశం ఎదుర్కొన్న క్షోభను చూసింది, తనూ ఎదుర్కొన్నది. స్వతంత్ర భారతంలో సంక్షోభాలు అసంఖ్యాకం. హిందూముస్లిం ఘర్షణలు చూసింది. ఇరుగు పొరుగుతో నాలుగు యుద్ధాలు చూడవలసి వచ్చింది. ఒక అసాధారణ ప్రతికూల ప్రయాణంలోను సంఘం దేశానికి ఇద్దరు ప్రధానులను ఇచ్చింది. ఈ తొమ్మిదిన్నర దశాబ్దాల భారత చరిత్ర మీద సంఘం ప్రభావాన్ని ఎలా అంచనా వేస్తారు?

జాతీయతా భావనలో, భారతీయ చింతన గురించి ప్రజానీకంలో మెల్లమెల్లగా స్పష్టత ఏర్పడు తున్నది. ఇక్కడ జాతీయత అంటే సాంస్కృతికమైనది (నేషనల్‌ ‌కల్చరల్‌ ‌కాన్సెప్ట్). ‌జాతీయతో ముడిపడి ఉన్న అంశాలకు విజయం లభించడం వెనుక ఉన్నది ప్రజానీకంలో వస్తున్న ఆ స్పష్టతే (నేషనలిస్ట్ ‌కాన్సెప్ట్). అం‌టే, జాతి హితానికి తోడ్పడే అంశాలు విజయం సాధించాలని తపించే తత్వం బలపడుతున్నది. ఉదాహరణకి చూడండి! జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెడుతున్నది 370 అధికరణం. అది విధ్వంసకరం. ఆ అధికరణాన్ని తొలగించడం జాతికి సంక్షేమకరమైనది. జాతీయ సమైక్యతకు ఆ చర్య ఉపయోగపడుతుంది. ముమ్మారు తలాక్‌ ‌రద్దు కూడా అంతే. ఇక్కడ మహిళలందరికీ గౌరవం లభించాలి. ముస్లిం మహిళలకూ అలాంటి గౌరవమే దక్కాలి. ముస్లిం మహిళలంటే వివక్ష ఎందుకు? మతం వేరు. కానీ సామాజిక పరిధిలో వారు అన్యాయానికి గురికాకూడదు. ఇది జనం గుర్తించారు కాబట్టే, ముమ్మారు తలాక్‌ ‌రద్దులోను ఇప్పుడు విజయం చేకూరింది.

పౌరసత్వ సవరణ చట్టం! పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌లో ఉండిపోయిన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు, పార్శీలకు మొదటిసారిగా వారి మాతృదేశంలో ఆ చట్టంతో న్యాయం జరుగుతున్నది. అక్కడ వివక్షకు గురి అవుతున్న ఈ వర్గాలకు మనదేశంలో నీడనివ్వాలి. అది మన బాధ్యత. స్వతంత్రం కోసం మనం ఎంత పోరాడామో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువుల పూర్వులూ అంతే పోరాడారు. కానీ అనేక చారిత్రక కారణాలతో వారికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం విషయంలో ఇంతకాలం ప్రధాన రాజకీయ పార్టీలూ, ప్రభుత్వాలూ మౌన ప్రేక్షకపాత్రకు పరిమితమైనాయి. వారిపై ఎన్ని అత్యాచారాలు జరిగాయి అక్కడ? ఎంత రక్తపాతం? ఎంత వివక్ష? ఇదంతా తెలిసి కూడా ఈ దేశంలో కొందరు ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాన్ని హిందు-ముస్లిం ఘర్షణకు కొనసాగింపుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి ముస్లింలను వెళ్లగొట్టే ప్రయత్న మన్నట్టు భాష్యం చెబుతున్నారు. ఇది హిందు-ముస్లిం సమస్య కాదు. మనం మాట్లాడుతున్నది బంగ్లాదేశ్‌, ‌పాకిస్తాన్‌, అప్గనిస్తాన్‌లలో వివక్షకు గురవుతున్న హిందువుల గురించి. అక్కడి ముస్లింల గురించి మాట్లాడటం లేదు. ఈ నాయకులు అక్కడి ముస్లింలకు వత్తాసు పలుకుతున్నారు. జాతీయత మీద దుమారం లేపుతున్నదీ వాళ్లే.జాతీయతను వక్రీకరించడానికి దొరికిన ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ ధోరణి ఇప్పటిది కాదు. అయితే, జాతీయత విషయంలో ఇంకా సమస్యలు ఉన్నమాట నిజం. ఆంగ్లేయుల బుద్ధి కారణంగా, వామపక్షాల కుట్రల వల్ల జాతీయత విషయంలో ఇప్పటికీ కొందరిలో భ్రమలు మిగిలిపోయాయి. ఈ ధోరణిని నిరోధించా లన్న నిర్ణయానికి సమాజం వచ్చింది. అందుకే, ఈ సమీపగతం ప్రవచించిన జాతీయతా భావనకు పరిపూర్ణతని ఇస్తూ, జాతీయతను ప్రతిబింబిస్తున్న ఇటీవలి చర్యలన్నింటికీ విజయం లభించింది. ఇంకోమాటలో చెప్పాలంటే, హిందుత్వం సంకుచితం కాదు. విశాలమైనది. ఆ భావన జాతీయపరమైనది. సాంస్కృతిక పరమైనదన్న సత్యం ఇప్పుడు ఆవిష్కృత మవుతున్నది. ఇదే సంఘం చూపిన తోవ. సాగుతున్న బాట. ఆ దిశలో ముందుకెళ్తున్నాం. దీని ప్రభావమే చరిత్ర మీద ప్రతిఫలిస్తున్నది.

ఇది శుభసూచకం. ప్రపంచం ఈనాడు భారత్‌ ‌వైపు చూస్తున్నదంటే అర్థం.. ఇక్కడి మూలాలనూ, వాటి సందేశాలనూ అర్థం చేసుకుంటున్నదనే. ప్రపంచమంతటా విఫలమైన సిద్ధాంతాలను, వాదాలను ఇక్కడ పునఃప్రతిష్టించాలన్న అసంబద్ధ ధోరణి ఇప్పటికే మట్టికరిచింది. హిందుత్వం ప్రపంచ సౌభాత్రాన్ని ఆకాంక్షిస్తుంది. యోగా, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం..ఈ జాతి గౌరవించే వాటికన్నింటికీ వర్తమాన ప్రపంచంలో సానుకూలత ఏర్పడుతున్నది. ఉగ్రవాదాన్ని పెళ్లగించడంలో, ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారతదేశం నిర్మాణాత్మక ధ్యేయం పెట్టుకుని విజయాన్ని సాధించింది. ఎందుకు? ఉగ్రవాదానికి హిందుత్వం వ్యతిరేకం కాబట్టి. అది హింసకు తావులేని జీవనవిధానాన్ని చెబుతుంది. ఇవాళ్టి ప్రపంచం గాఢంగా నమ్ముతున్నది ఇదే. అందుకే కొన్ని మౌలిక సమస్యల పరిష్కారానికి అవసరమైన భూమిక విషయంలో భారత నేతృత్వాన్ని కోరుకుంటున్నది.

రాజకీయంగా, సామాజికంగా; లేదా ఆలోచనా పరంగా కావచ్చు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలాన్నీ, భారతీయ వ్యవస్థమీద దాని ప్రభావాన్నీ వేరు చేసి చూడడం ఇప్పుడు సాధ్యం కాదు. అంతటి మమేకత్వం కనిపిస్తుంది.  దీనిని బట్టి ఇకపై సంఘ ప్రయాణం ఎలా ఉంటుందనుకోవాలి?

సంఘం ఆది నుంచి చెప్తున్నది ఇదే. భారత్‌ ఒకే దేశం. ఇక్కడ ఉన్నది ఒకే రాష్ట్రీయత, ఇది ఒకే సమాజం, మనది ఒకే సంస్కృతి. ఒకే మతం మాత్రం కాదు. మతమనేది భిన్నమైనది. ధర్మం దగ్గర, మతం దగ్గర తికమక పడకూడదు. ఆ రెండూ ఒకటి కాదు. మతస్వేచ్ఛ అంటే దేశంలోని అన్ని మతాలకు గౌరవం ఉండాలనే. భారతదేశ ముస్లింలు భారతీయ ముస్లింలు. భారతదేశ క్రైస్తవులు భారతీయ క్రైస్తవులు. గిరిజనులు సహా, భిన్న భిన్న సమూహాలు అందరూ ఈ దేశస్థులే. వీళ్లంతా ఒకే సంస్కృతికి వారసులు. వాళ్లందరి వికాసం జరగాలి. కానీ, వికాసంలో వివక్ష పేరుతో, మూలనివాసులమన్న నినాదంతో, మా మతస్థులకు వేరే రాజ్యం కావాలన్న పిలుపుతో రాజకీయాలు సరికాదు. మీరు రాముణ్ణి పూజిస్తారు, మేం రావణుని పూజిస్తాం అనడమూ అలాంటిదే. ఇవన్నీ విఘటనకారి శక్తులు. సమాజాన్నీ, జాతినీ చీల్చేవి. వీటికి చరమగీతం పాడాలి. అసలివి ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? కారణం, కొందరు వ్యక్తుల నీచ స్వార్థం. ముఠాల స్వార్థం. విదేశీ స్వార్థం కూడా. ఈ స్వార్థం ఆధారంగానే కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి. నీచ రాజకీయాల కారణంగా జాతీయ ఏకాత్మత, జాతీయ సమగ్రత గాయపడకుండా ప్రతి సమూహానికి, భాషకు ప్రాధాన్యం, జీవనశైలికి గౌరవం దక్కాలి. వాటన్నిటి వికాసం కూడా జరగాలి. ఇది సంఘ దృష్టికోణం.

జరిగినదేమిటంటే, కొన్ని జాతీయతకు సంబంధించి సత్యాలను, అసత్యాలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు, ఏది సత్యం, ఏది అసత్యం అనేవి ప్రజలకు తెలుస్తున్నది. అదికూడా రాజ్యాంగబద్ధంగా తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌, ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌భారత అంతర్భాగమని హోంమంత్రి పార్లమెంటులో చెప్పారు. కాబట్టి రాజ్యాంగబద్ధం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కానీ, సంఘ అనుబంధ సంస్థలు కానీ ఈ విషయాన్ని ప్రారంభం నుంచి చెబుతున్నాయి. ఇవాళ జమ్ముకశ్మీర్‌ ‌భారతదేశంలో అన్ని రాష్ట్రాల మాదిరిగా ఒక రాష్ట్రం. ఇది జాతీయత విజయం.

ఈ దిశలో సంఘం రాబోయే రోజుల్లో కూడా భారతీయత, హిందుత్వం జాతీయ ఏకాత్మత, అన్ని రకాల మతాలకు సమాన గౌరవం, ప్రజలందరి వికాసం, చిన్నచిన్న భాషల వికాసం, చిన్న చిన్న ప్రాంతాల వికాసం, మొత్తంగా అన్నిటి సమగ్ర వికాసాన్ని ఆశిస్తుంది. అలా అని బుజ్జగింపు ధోరణిని ఉపేక్షించదు. భాష, ప్రాంతం, సమూహం, కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, జాతీయ సమగ్రతకి భిన్నంగా ఎవరూ ప్రవర్తించకూడదు. వీటినే అడ్డం పెట్టుకుని స్వార్థపరులు పబ్బం గడుపుకొనే ప్రయత్నం యథేచ్ఛగా చేశారు. నాగాలాండ్‌లో ప్రత్యేకమైన జెండా అంటూ ఎవరో ప్రతిపాదిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించ కూడదు. నాగాలాండ్‌ ‌ప్రజలే అలాంటివి కోరుకో కూడదు. మాకు ప్రత్యేక దేశం, ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం వంటి అధికారాలను కోరడమనేది విదేశీ ప్రేరిత కుట్ర. దీనికి చరమగీతం పాడాలి.

 స్వయంసేవకులు ఎక్కడ ఉన్నప్పటికి – సామాజిక, సాంస్కృతిక, ధార్మిక, రాజకీయ రంగాలలో ఆ లక్ష్యం కోసమే పనిచేస్తారు. అయితే ఈ కృషంతా కేవలం స్వయంసేవకులదేనని సంఘం అనుకోదు. ఈ దేశంలో భావసారూప్యత కలిగిన వారు ఎందరో ఉన్నారు. అనేక సంస్థల వాళ్లు ఉన్నారు. వాళ్లందరితో కలసి స్వయంసేవకులు పనిచేస్తారు. ఈ విజయాలు అందరివి. కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌వి కాదు. జాతిని ఒకే జాతిగా చూసే వ్యక్తులు, భారత్‌ను ఒకే దేశంగా చూసేవారు, నిస్వార్థంగా పనిచేసే మహానుభావులందరి విజయం కూడా. వివేకానంద, యోగి అరవింద•, వీర సావర్కర్‌, ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌వంటి వారందరి పరంపర లన్నింటి విజయమిది.

ఏ రకంగా చూసినా భారతీయ సంస్కృతి అనగానే కొన్ని రేఖలు కనిపిస్తాయి. మనది వైవిధ్యమైన సంస్కృతే అయినప్పటికి అందులో భారతీయ సంస్కృతి అనేదీ ఒకటి. ఇది మెజార్టీ ప్రజలది కూడా. భారత జాతీయవాదానికీ, భారతీయ సంస్కృతికీ మధ్య సంబంధాన్ని ఎలా చూడాలి మనం?

భారత జాతీయత, భారతీయ సంస్కృతి… రెంటికీ ఏమీ తేడా లేదు. భారత జాతీయత భారతదేశానికి పరిమితం. భారతీయ సంస్కృతి విశ్వజనీనమైనది. ఈ సంస్కృతి విశ్వజనీనమైనదని అనడం ఎందుకంటే- మనం ‘హిందు’ అని చెప్పినప్పుడు – భారతదేశంలో ఉండే హిందువులే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరిని సంభోదిస్తూనే చెబుతాం. ఇంకా చెప్పాలంటే హిందువులనే కాదు; ప్రపంచంలో అమెరికా, ఇంగ్లండు, రష్యా, చైనా వంటి దేశాల ప్రజలందరినీ గౌరవిస్తుందీ సంస్కృతి. మతం భిన్నమైనదైనప్పటికీ, దేవుడిని ఏ పేరుతో పిలిచినప్పటికీ, అసలు ఏ దేవుడిని పూజించకపోయినప్పటికీ ఎవరినైనా మొదట మనిషిగా గౌరవించేది భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి. అందుకే సంస్కృతి విశ్వజనీనమైనది. సంఘం హిందు అని చెప్పడంలో ఉన్నది విశ్వజనీనతే. కాబట్టి భారతదేశంలో ఉండే హిందువులను సంఘం సంఘటితపరుస్తోంది. ఇంకా, ప్రపంచ దేశాలని సంఘటిత పరిచేది కూడా. ఇది అర్థం కావటానికి సమయం పడుతుంది. ఉదా।। ఇప్పుడు అమెరికాలో హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌పనిచేస్తుంది. ఆ ప్రభుత్వం దానిని రిజిస్టర్‌ ‌చేసింది. అక్కడి విశ్వవిద్యాలయాలలో ‘హిందు యువ’ అనే అధ్యాయం ఉంది. ఇవాళ భారతదేశంలో ఏదైనా విశ్వ విద్యాలయంలో ‘హిందు యువ’ అనే అధ్యాయాన్ని పాఠ్యాంశంగా చేయగలుగుతారా? అసంభవం. ఏమిటిది? ‘హిందు యువ’ అధ్యాయం, హిందు స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అమెరికాలో సెక్యులర్‌. ‌భారతదేశంలో ఎందుకు కమ్యూనల్‌? ఇం‌గ్లండ్‌లోను సెక్యులర్‌ అయింది. భారతదేశంలో ఎందుకు కమ్యూనల్‌ అయింది? ఆ సంగతి ఎలా ఉన్నా, హిందూ అనేది విశ్వజనీనం. భారతదేశం విశ్వజనీనం. వేదం, ఉపనిషత్‌ ‌కూడా భారతదేశమని మాత్రమే చెప్పలేదు. అధర్వణ వేదంలో పుత్రోహం పృథ్వీః అని చెప్పినప్పుడు- ప్రపంచంలోని భూమి అంతటికి నేను పుత్రుడని అనే భావంతోనే. కేవలం భారతదేశానికి కాదు. అమెరికా, చైనా, రష్యా, ఇంగ్లండు, యూరప్‌, ‌పాకిస్తాన్‌ అన్నిటికి నేను పుత్రుడను అని, పుత్రికను అని. మాతృభూమిగా నా జన్మస్థానం హైదరాబాదే. కాని పుత్రోహం పృథ్వీః అంటే ప్రపంచం మొత్తాన్ని ప్రేమించే సంస్కారాన్ని ఈ దేశంలో హిందుత్వం, భారతీయత, వేదాలు, ఉపనిషత్‌లు ఇచ్చాయి. కొంతమంది దీన్ని సంకుచితం చేశారు. కాబట్టి భారత జాతీయత, సంస్కృతి పరస్పర విరుద్ధం కాదు. పరస్పర పూరకాలు. అయితే భారతదేశానిది ఏనాడూ సామ్రాజ్యవాదం కాదు.

భారతీయ జాతీయత అనేది సాంస్కృతిక పరమైనది, రాజకీయ పరమైనది కాదు. భారత దేశంలో పూర్వం అనేక రాజ్యాలు ఉన్నాయి. కాని ఒకే దేశం, ఒకే జాతీయత. ఇంగ్లండు, అమెరికాలలో నేషనల్‌ ‌కాన్సెప్ట్ అనేది పొలిటికల్‌ ‌కాన్సెప్ట్‌లోనిదే. వేదం, ఉపనిషత్‌లు, యోగి అరవింద్‌, ‌వివేకానందలు చెప్పినది, ఇప్పుడు సంఘం చెబుతున్న భారత జాతీయత సాంస్కృతిక పరమైనది. కల్చరల్‌ ‌కాన్సెప్ట్. ‌పొలిటికల్‌ ‌కాన్సెప్ట్ ‌కాదు. హిట్లర్‌ ‌జాతీయవాదం పొలిటికల్‌ ‌కాన్సెప్ట్. ‌సామ్రాజ్యవాదం.ముసోలినిది సామ్రాజ్యవాదం. మన పరంపర వరకు సంస్కృతి అంటే ప్రపంచం మొత్తాన్ని ఒకే దృష్టితో చూడాలి. ప్రపంచంలో వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యంలో ఏకాత్మతనూ చూడాలి. ఇదీ భారతీయ సంస్కృతి. ఇలాంటి ఉదాత్త సంస్కృతిని కలిగిన భారతీయ సమాజం నేడు అసంఘటితంగా ఉంది. బలహీనంగా ఉంది. దీనికి అనేక కారణాలు. భాష, కులం, మతం, ప్రాంతం, రాజకీయ స్వార్థం వంటివాటితో శిథిలమై పోయింది. వీటినుంచి భారత జాతీయత బయటపడి శక్తిమంతమై, విజృంభించినట్లైతే ప్రపంచం మొత్తానికి సేవ చేయగలుగుతామని చెప్పారు యోగి అరవింద్‌. ‌నిజమైన భారతీయతలో ముస్లింలు ఉన్నారు. వీరు భారతీయ ముస్లింలు. బంగ్లాదేశ్‌ ‌ముస్లింలు కాదు. పాకిస్తాన్‌ ‌ముస్లింలు కాదు. భారత జాతీయతలో క్రైస్తవులున్నారు. ఇంగ్లండు, అమెరికా క్రైస్తవులు కాదు. మత మార్పిడి చేసే చర్చి క్రైస్తవులు కాదు. అది క్రైస్తవమే కాదు, సామ్రాజ్యవాదం. కాబట్టి, క్రైస్తవ, యాహూది, పార్శి ఇంకా ఎవరెవరో ఈ దేశంలో ఉన్న వాళ్లంతా ఈ భూమి సంతానం. వాళ్ల మతం, పూజా విధానం వేరు కావచ్చు. వాళ్ల జాతీయత వేరు కాదు. అందు• హిందుత్వం బాబా సాహెబ్‌ అం‌బేడ్కర్‌నీ, మహమ్మద్‌ ‌కరీం చాగ్లానీ జాతీయ పురుషులుగా గుర్తిస్తుంది. జిన్నాను గుర్తించదు. జిన్నా దేశాన్ని విభజించారు. కాబట్టి వాల్మీకి, వ్యాస, సంత్‌ ‌రవిదాస్‌, ‌సావర్కర్‌, అం‌బేడ్కర్‌, ‌జగజ్జీవన్‌రామ్‌ ఈ ‌దేశ మహాపురుష పరంపర. ఈ ఆలోచనాధార ఆధారంగా ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేయ బోతున్నాం. అందుకని దేశంలో జాతీయత విషయంలో ఒక డిబేట్‌ (‌చర్చ) జరగాలి. జాతీయత అంటే ఏమిటి? వివేకానంద చెప్పినటువంటి జాతీయత ఏమిటి? మతం అనే పదానికి ఇంగ్లిష్‌లో రెలిజియన్‌ అనే అర్థం ఉంది. ధర్మం అనే మాటకి ఇంగ్లిష్‌లో ప్రత్యేకమైన పదం లేదు. ఆ కాన్సెప్టే లేదు వాళ్లకి. అందుకే మతం, ధర్మం ఒకే పదాలన్నట్టు రుద్దుతున్నారు. ఎక్కడెక్కడికైతే ఇస్లాం, క్రైస్తవం వెళ్లినాయో అక్కడల్లా రుద్దారు. ఆ సమాజాలని విధ్వంసం చేశారు. హిందువు అలా చేయలేదు. తూర్పు ఆసియా దేశాలకు వెళ్లినట్లయితే గణపతి దేవాలయాలు కనపడుతాయి. ఇండోనేషియాలో గరుడ పేరుతో విమాన••న సంస్థ కనబడుతుంది. అంటే అక్కడకి మనవాళ్లు వెళ్లారు కదా! వెళ్లి స్థానీయతను విధ్వంసం చేయలేదు. హిందుత్వమనేది ఎక్కడికి వెళ్లినప్పటికి సేవ చేస్తుంది. ప్రేమను పంచుతుంది. అందుకని సంఘర్షణకు తావు లేదు. కాబట్టి భారత జాతీయత, భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి సమానార్థకాలే.

అయోధ్య విజయం ఈ వాస్తవాన్ని మొట్టమొదటిగా గుర్తించిన ఫలితమే అనిపిస్తుంది. భారత జాతీయత, భారత సంస్కృతి రెండు దృక్పథాలను సమన్వయం చేయడం వల్ల లభించిన విజయం అనుకోవచ్చునా!

జాతీయత, సంస్కృతి భావధారలు కలవడం, అదొక ప్రజా ఉద్యమంగా వెల్లువెత్తడం వల్ల అనుకోవచ్చు. శ్రీరామ మందిర నిర్మాణమనేది కేవల మందిర నిర్మాణం కాదు. మన జాతీయపురుషుడు శ్రీరామచంద్రుడి భవ్య మందిరమది. జాతీయ మహా పురుషుడికి, ఆయన వ్యక్తిత్వం కేంద్రంగా నిర్మితమైన ఇక్కడివారి మనోభావాలకు న్యాయం జరగాలి. బాబర్‌పై వ్యతిరేకతకి కారణం, అతడు విదేశీయుడు, దురాక్రమణదారుడు. ముస్లిం కాబట్టి కాదు.

ఇలాంటి సమన్వయ చింతన కొనసాగే అవకాశం దేశంలో ఉందనీ, ఉంటుందనీ నమ్మగలమా?

లేదని ఎందుకు అనుకోవడం? ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది?

అయోధ్యకు సంబంధించే వస్తున్నది. ఈ వివాదంలో సుప్రీం తీర్పు తరువాత సున్ని వక్ఫ్‌బోర్డ్ ‌రివ్యూ పిటిషన్‌ ‌వేయడం ద్వారా హిందువుల మనోభావాల విషయంలో తమకు పనిలేదన్న రీతిలో సంకేతాలు పంపినట్టయింది. కాబట్టి కాశీ, మధురల మీద తమ పాత డిమాండ్లను రంగం మీదకు తెస్తామని హిందువులు చెప్పే అవకాశం ఉందా?

ఈ విషయంలో సంఘమేమి ఆలోచించడం లేదు. ఆలోచించదు. అది సాధుసంతుల బాధ్యత. అది ఆలోచించే స్వతంత్రం వాళ్లకుంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్ల ముస్లింల వైఖరి మీద మీ అంచనా ఏమిటి?

సామాన్య ముస్లింలు సంఘం పట్ల ద్వేషంతో ఉండరు. రాజకీయ దుర్దేశంతో ఉన్న వ్యక్తులు, ముల్లాలు, మౌల్వీలు వ్యతిరేకతతో ఉంటారు. వీళ్లని మించినవాళ్లు రెచ్చగొట్టే రాజకీయ నాయకులు. ఈ దేశాన్ని పాలించినవాళ్లం మేం, హిందువులు మాకు బానిసలు అనే భావన వారికి ఉన్నంతకాలం ఏకాత్మత కుదరదు. నిజానికి దేశంలో ముస్లింలందరు ఒకనాటి హిందువులే. మతాంతరీకణ జరిగింది. వీరు విదేశీయులు కాదు. ఇది సంఘ దృష్టికోణం. కానీ ఈ 70 సంవత్సరాలలో రాజకీయ నాయకులు, అధికారంలో ఉండే వ్యక్తులందరు వాళ్లని రెచ్చగొడుతూ వచ్చారు. వీళ్లు (అధిక సంఖ్యాకులు) మీకు బానిసలు, మీది పాలకవర్గం అంటూ రెచ్చగొడుతూ వచ్చారు. కాలానికి తగ్గట్లే మానసికంగా మార్పు రావాలి. ముస్లింలను భారతదేశం నుండి వెళ్లగొట్టాలి అనేది సంఘ దృష్టికోణం కానేకాదు. ఎవరికీ మత దురహంకారం ఉండకూడదు.ఎవరినీ బుజ్జగించకూడదు. సమాన గౌరవమే కానీ, మైనారిటీల పేరుతో ఎక్కువ అధికారాలు కావాలని అనుకోరాదు. ఇది సంఘం భావన.

1 comment:

  1. జాతీయతా భావన ఆధారంగా ఇవాళ భారతదేశమంతటా ఒక కొత్త వాతావరణం నెలకొంటున్నదని, మన మహా పురుష పరంపర అందించిన చింతన ఆధారంగా చేపట్టిన కొన్ని చరిత్రాత్మక నిర్ణయాలకు లభిస్తున్న విజయం ఇందులో భాగమేనని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహసర్‌ ‌కార్యవాహ వి. భాగయ్య చెప్పారు.

    ReplyDelete