Breaking News

వాస్తవాలతో దేశ చరిత్ర రాసుకోవాలి! - RSS Bhagaiah Garu Interview in Telugu

 


2‌వ భాగం

నిజమైన చరిత్రకారులు వాస్తవాల ఆధారంగా చరిత్ర రచనకు  పూనుకోవాలనీ, వాదాల చట్రాలలో ఇరికించే ప్రయత్నం చేయకుండా రాసుకోవాలనీ అన్నారు భాగయ్య. పాశ్చాత్య పడికట్టు పదాలతో మన చరిత్రను తూకం వేయడం సరికాదనీ, ఏది రాసినా కాషాయీకరణ అనడం స్వార్థమేననీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారు దేశ విభజన పరిణామాలు చెప్పే సమీపగతాన్ని పరిశీలించాలని కోరారు. దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలలో విధ్వంసక ధోరణులు, ఆలోచనలు రావడం విదేశీ శక్తుల ప్రభావంతోనే అని, వివేకానందుని వంటి చరిత్ర పురుషుని ప్రతిమకు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అపచారం జరగడం ఘోరమని చెప్పారు. జాతీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా వాటికి ఉండవలసినది జాతీయ దృష్టి కోణమేనని అన్నారు.


అయోధ్య తీర్పును పురావస్తు ఆధారాలతోనే వెలువరించామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పారు. కానీ ఒక వర్గం చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఈ జాతిని అయోధ్య ఆనవాళ్ల విషయంలో దగా చేశారు. ఈ క్రమంలో చూస్తే చరిత్ర రచనను అలాంటి వారి నుంచి విముక్తం చేయవలసిన అవసరం కనిపిస్తుంది. చరిత్ర ఏ రకంగా రాసుకోవాలి?

చరిత్రని ఉన్నది ఉన్నదట్టుగా రాసుకోవాలి. చరిత్రను మార్చుకోలేం. అలా చేస్తే చరిత్ర రచనకే ద్రోహం. వాస్తవ చరిత్ర రచన కోసం నిజమైన చరిత్రకారులు ప్రయత్నం చేయాలి. ఈ దేశ చరిత్రని అనేకమంది రాసారు ఇప్పటిదాకా. వాదాల చట్రాలలో ఇరికించారు. ఇక వాస్తవాలతో రాయాలి.

ఏది రాసినా కాషాయీకరణ ఆరోపణ వస్తున్నది కదా!

అది మూర్ఖత్వం, కాకపోతే పచ్చి స్వార్థం. సంకుచిత తత్వం. ఈ దేశ చరిత్రని ఇక్కడి విధానంతో రాయాలి. అక్కడి పడికట్టు పదాలతో తూకం వేయడం కాదు.

కొంతకాలంగా ఆర్యుల దండయాత్రను వక్రీరిస్తూనే ఉన్నారు. ఆర్యుల రాకతో ఈ దేశంలో విధ్వంసం జరిగిందని వాదిస్తున్నారు. వీళ్లే ముస్లిం దండయాత్రలతో సంభవించిన విధ్వంసాన్ని దాచిపెడుతున్నారు.

ఆర్యుల దండయాత్ర మన తాతల  ముత్తాతల కాలం నాటిది. నిన్నటిదే వక్రీకరిస్తున్నారు కదా! సమీపగతాన్నే సరిగా తెలియనివ్వడం లేదు! ఉదాహరణకి- పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌నుంచి అనేకమంది హిందువులను తరిమివేశారు. దేశ విభజన తరువాత జరిగిన హింసాకాండ నేపథ్యంలో సర్దార్‌ ‌పటేల్‌ ఇచ్చిన ఉపన్యాసం వినండి. ఆయన ఏమన్నారంటే, ఈ నరమేధం ఆగిపోవాలి. తక్షణం ఆగిపోవాలి. ఒకవేళ కొనసాగినట్లయితే ఎన్నివేల మంది అక్కడి నుంచి వస్తారో ఆ మేరకు భూభాగం పాకిస్తాన్‌ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మాట కాదు. ఈ దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ ‌పటేల్‌ ‌చెప్పింది.

నెహ్రూ – లియాకత్‌ ఒప్పందం ఉంది. దాని ప్రకారం మైనార్టీలు ఎవరైతే పాకిస్తాన్‌లో ఉంటారో వాళ్లకు అన్యాయం జరగకూడదు. భారతదేశంలోని మైనార్టీలకు కూడా న్యాయం జరగాలి. ఏ మైనార్టీ వర్గీయుడైనా అత్యాచారం జరిగి తరిమివేయగా, అక్కడి నుంచి వచ్చినట్లయితే ఆశ్రయం ఇవ్వాలని ఆ నెహ్రూ-లియాఖత్‌ అలీ ఒప్పందం చెబుతోంది. ఇది తెలిసి కూడా ఇప్పుడు పౌరచట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకని ఇస్లాం, హిందువుల మధ్య శత్రుత్వం కాపాడుతున్నారు? ఇదంతా చరిత్రను మరుగు పరచడం లేదా వక్రీకరించడం కాదని అనగలరా? ఎవరు చేస్తున్నారు ఈ పని? ఆలోచించాలి మనం. ఈ సమాజం ఆలోచిస్తున్నది కూడా. అందుకనే చరిత్రకారులు సరైనా చరిత్రను రాసి, సమాజానికి అందించాలి. దానికి సమయం పడుతుంది.

దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలు.. జవహర్‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ, జాదవ్‌పూర్‌ ‌విశ్వవిద్యాలయం లేదా నల్సర్‌ – ‌తమది వేరే ప్రపంచం అనుకుంటూ ప్రపంచ పరిణామాలను గమనించకుండా ఎందుకు ఉండిపోతున్నాయి? ఒక పిడివాదంలో ఎందుకు కూరుకుపోయాయి? అందరూ ఆరాధించే వివేకానందుడు వంటి వారి విగ్రహానికి అపచారం తలపెట్టడం ఇంకా ఎందుకు జరుగుతోంది? పెద్ద చదువులు చదువుతున్నామనుకునే అక్కడి విద్యార్థులు దేశాన్ని చీలుస్తామంటూ నినాదాలు ఇవ్వడం ఏమిటి? రేపు సమాజంలోకి వచ్చే నేటి విద్యార్థులలో ఇలాంటి పోకడలు జాతీయ సమైక్యతకు విఘాతంగానే చూడవచ్చా?

దశాబ్దాలుగా విదేశీశక్తుల భ్రమలో పడి, ఎక్కడా విజయం సాధించలేని కాలం చెల్లిన సిద్ధాంతాలను వదలకుండా, ఈ దేశ ప్రజల చేత ఛీకొట్టించుకున్నవి వామపక్ష సంస్థలు. ఇవి రెచ్చగొట్టడం వల్లనే విద్యార్థులు అలా ప్రవర్తిస్తున్నారు. అయితే వాళ్ల• మన విద్యార్థులే. ఈ దేశం బిడ్డలే. ఒక విదేశీతత్వంలోని విధ్వంసం గురించి సరిగా అంచనా వేయకుండా, దాన్నే స్వీకరించి గుడ్డిగా ముందుకెళ్తున్నారు. ఒకటి నిజం. ఇవాళ వాళ్లు అర్థం చేసుకునే పరిస్థితిలో అయితే లేరు. ట్యూషన్‌ ‌ఫీజు, హాస్టల్‌, ‌మెస్‌ ‌చార్జీలు పెంచినప్పుడు సమ్మెలు చేయడం వంటివి వేరు. దాన్ని అర్థం చేసుకోవచ్చు. వాళ్లు కూడా ఒక దశ తరువాత వాస్తవాన్ని గుర్తించాలి. వివేకానందస్వామి విగ్రహానికి అపచారం తలపెట్టడం మూర్ఖత్వం కాకమరేమిటి? మేము రావణుని పూజిస్తాం, దుశ్శాసనుణ్ణి పూజిస్తాం అనడం కూడా అంతే. ప్రగతి, పురోగతి అంటూ నినాదాలిచ్చే ఈ తరహా విద్యార్థులే దేశంలో మతం, కులం ఆధారంగా కల్లోలాలు రేపుతున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాటలు చెబుతూ, మరొక వాదం వినిపించేవారిని భౌతికంగా అంతం చేయాలన్న నేర మనస్తత్వం వీళ్లది. పార్లమెంటు మీద దాడి చేసినవాడు, ముంబైలో మారణహోమం సాగించినవాడు, కశ్మీర్‌లో రక్తపాతానికి ఒడిగట్టిన కర్కోటకుడు వీళ్లకి ఆరాధనీయులంటే జాతి ఆలోచనలో పడదా మరి? వీళ్ల జ్ఞానం మీద ప్రశ్నలు రావా? ఆ ధోరణి ఎక్కువకాలం నిలబడదు. ఈ దేశంలో జాతీయత, జాతీయ ఏకాత్మత భావనకు కొదవలేదు. అది స్వేచ్ఛగా వ్యక్తం కావడానికి సమయం పడుతుంది. దీనిని సమాజం అర్థం చేసుకోవాలి.

ఈ మధ్య మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు వింటుంటే ఇంత సాంస్కృతిక నేపథ్యం ఏమైందన్న బాధ కలుగుతుంది. ఇంతటి విలువలున్న సమాజంలో ఈ క్లాష్‌ ఎం‌టి? ఏదో లంకె తెంచుకున్నామని అనిపిస్తున్నది.

ఇవన్ని చాలా దుర్మార్గమైనవి. నీచమైనవి. దానికి ప్రధాన కారణమేమిటి? వేపమొక్కను పాతి, మామిడిపండు కోసం చూస్తే ఎలా? దినపత్రికలలో, వారపత్రికలలో, టీవీ చానెళ్ల సీరియల్స్‌లో ఇదే దుర్మార్గం కనిపిస్తున్నది. డబ్బు కోసం ఎన్నో శాశ్వత విలువలను నాశనం చేస్తున్నారు. వీటిని ఏ రకంగా కట్టడి చేయాలో కుటుంబం, సమాజం, ప్రభుత్వం, మేధావులు ఆలోచించాలి.

ప్రజాస్వామ్యం విషయంలో, ఫెడరల్‌ ‌వ్యవస్థను బలంగా ఉంచడంలో, దేశ సమైక్యతను కాపాడటంలో ప్రాంతీయ పార్టీలు సరైన పంథాలో వ్యవహరించగలుగుతున్నాయా?

ప్రాంతీయ పార్టీలు సరిగ్గా వ్యవహరిస్తున్నాయా? లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. దృష్టి ఎలా ఉండాలనేది మాత్రం సంఘం చెబుతుంది. సంఘం ఏం చెబుతుందంటే – ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా జాతీయ దృష్టికోణమే ప్రధానమంటుంది. కొన్ని పరిస్థితులలో, అవసరాలను బట్టి ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి ఉండవచ్చు. అయినా వాటికి జాతీయ దృష్టి ఉండాలి. తమిళనాడులో ఒక పార్టీ కేవలం తమిళనాడుకు చెందిన పార్టీ కావచ్చు, ప్రాంతీయంగా. కానీ దేశం మొత్తం గురించి ఆలోచించే దృష్టీ ఉండాలి. ఇది ఉన్నప్పుడు సమస్యలు తక్కువగా ఉంటాయి. చర్చిస్తారు, మాట్లాడుకుంటారు. ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిందే. కానీ ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమమనేది మొత్తం జాతి సంక్షేమానికి వ్యతిరేకమైనది కారాదు. కాని ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే వాళ్ల వాళ్ల రాజకీయ స్వార్థం ముందుకొస్తున్నది. దీని నుంచి బయట పడాలి.

హిందూ సంఘటన- ఇదొక మహామంత్రం. పలువురు మహాపురుషులు ఇందుకు తమ వంతు ప్రయత్నం చేయడం చరిత్ర పొడువునా చూస్తాం. కానీ హిందూ సంఘటనను ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక మహా యజ్ఞరూపంలా భావించి, అవిశ్రాంతంగా, ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. గత ప్రయత్నాలకీ, సంఘం అనుసరిస్తున్న విధానానికీ తేడా ఏమిటి? ఒక్కమాటలో చెప్పాలంటే సంఘం విజయ రహస్యం ఏమిటి?

సంఘకార్యాన్ని విస్తరించడానికి స్వయం సేవకులు దేశ మొత్తం మీద మండల స్థాయి నుంచి, గ్రామాల వారిగా ప్రయత్నం చేస్తున్నారు. సంఘానికీ, సంఘ భావనలకీ అనుకూలమైన వాతావరణం ఉంది ఈ సమాజంలో. సంఘ కార్యం విస్తరించాలి. జాతీయ సమైక్యతను కాపాడడానికి అవసరమైన ఒక విస్తృతశక్తిని నిర్మాణం చేయడం కోసం సంఘం ప్రయత్నం చేస్తున్నది. ఇది సామాజికోద్యమంగానే సాగాలి. సంఘమంటేనే సమాజం. సంఘం విడిగా లేదు. రాబోయే రోజుల్లో మెల్లమెల్లగా సంఘం సమాజంలో కలసిపోవాలి.

1 comment:

  1. నిజమైన చరిత్రకారులు వాస్తవాల ఆధారంగా చరిత్ర రచనకు పూనుకోవాలనీ, వాదాల చట్రాలలో ఇరికించే ప్రయత్నం చేయకుండా రాసుకోవాలనీ అన్నారు.

    ReplyDelete