మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - Madhunapantula Satyanarayana Sastry
ఆధునిక సంప్రదాయ పద్యకవుల్లో ప్రతిభ, వ్యుత్పన్నత, అభ్యాసం సమపాళ్లలో సముపార్జించుకున్న మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి. ‘‘ఒక్కటి యున్న నింకొకటి యుండదు. నేటి కవీంద్రులందు నీ / దృక్ కవులందుసర్వమమరించెను దైవము పాండితీపరిసృక్కమనీయ ధారయు పరిపుష్టిగా లలితత్వమున్ గడున్ / పెక్కువగా నుండిన కవి ప్రభు వీయనయంచు చెప్పెదన్’’ – అంటూ విశ్వనాథవారు చెప్పినట్లు పాండిత్య స్ఫోరకమైన కవితాధార, లలితమాధుర్యమైన కవితాశైలి రెండూ దైవానుగ్రహం వల్ల మధునాపంతులవారికి సిద్ధించాయనటం వాస్తవం. విశ్వనాథ వారి కవితాధార, కరుణశ్రీ వంటి కవుల శైలీలాలిత్యం మధునాపంతులవారి ఆంధ్రపురాణంలో ఉన్నాయి.
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి (మార్చి 5,
1920 – నవంబర్ 7, 1992) యానాం దగ్గర ఐలెండ్ పోలవరంలో మాతామహుల ఇంట
జన్మించారు. స్వగ్రామం యానాం దగ్గర పల్లెపాలెం. తల్లి లచ్చమాంబ, తండ్రి
సత్యనారాయణమూర్తి. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తండ్రి దగ్గర సాగింది.
ఆంధ్రపురాణం అవతారికలో తండ్రిని గూర్చి చెపుతూ అనుక్షణం బిడ్డను
తీర్చిదిద్దాలన్న కోరికతో తానొక పసివాడై అక్షరాభ్యాం చేయించాడు.
శబ్దమంజరిని బోధిస్తూ గొంతు కలిపాడట. సాహిత్యంతోపాటు ధార్మిక సాహిత్యాన్ని
బోధించాడు. పిదప ఆయన విద్యాభ్యాసం ప్రసిద్ధ గురువైన ఓలేటి వెంకటరామశాస్త్రి
దగ్గర సాగింది. ఆబాల్య ప్రతిభావంతుడైన మధునాపంతులవారిని ఓలేటివారు 1933లో
ఆయన పాండిత్యానికి ముగ్ధుడై ఆశీర్వదిస్తూ ‘‘అసమానంబగు
పాండితీవిభవమీవార్జించి మాకెల్ల సం / తసము గూర్చుచు సత్కకవీశ్వరత
నౌన్నత్యంబునుంగీర్తియున్ / వసుధం పెంపు వహింప వర్ధిల్లగదె వత్సా !
చిరంజీవివై / పసివానిన్ నినుగూర్చి పెక్కు పలుకన్ భావ్యంబె
మాబోంట్లకున్’’ అన్నారు.
గురువు శిష్యుని ప్రశంసించడం సమంజసం
కాదన్నదని పండితాభిప్రాయం. శిష్యుడి పాండిత్య ప్రతిభకు ముగ్ధుడైన గురువు
సత్కవియై కీర్తి పెంపువహించగలవని, ఆశీర్వదించారు. భవభూతి ఉత్తర రామచరిత్రలో
చెప్పినట్లు ‘‘లౌకికానాంహి సాధూనాం అర్ధం వాగనువర్తతే / ఋషీణామ్
పునరాద్యానామ్ వాగనువర్తతే అర్ధమ్’’ అన్నారు. ఋషితుల్యులైన వారి వాక్కు
వెంట అర్ధం పరిగెత్తుతుందట. ఋషితుల్యులైన ఓలేటివారి ఆశీస్సు అక్షర
సత్యమైంది. ఆయన ఆశీర్వదించినట్లు ఆంధ్రపురాణ మహాకవిగా మధునాపంతుల వారు
లబ్ధప్రతిష్ఠులయ్యారు.
ఆంధ్రపురాణ రచనా విశేషాలు
ఆంధ్రపురాణ రచనా విశేషాలు
20వ శతాబ్దిలో హేతువాద భావజాలం
విస్తరిస్తున్న స్థితిలో బృహత్ పద్యకావ్యాలకు ఆదరణ ఉండదనే అభిప్రాయం
పాఠకులలో ఉంది. గడియారం వారి శివభారతం, రాజశేఖర శతావధానిగారి రాణా ప్రతాప
చరిత్ర వంటివి ఆదరణ పొందాయి. మధునాపంతులవారు ఆంధ్రజాతి చరిత్రను
ఆమూలాగ్రంగా బృహత్ కావ్యంగా రచించాలన్న సంకల్పంతో ఆంధ్రజాతి మహేతిహాసంగా
1954లో ఆంధ్రపురాణం రచించారు. పేరులో ఆంధ్రపురాణం అని ఉన్నా, పురాణ
లక్షణాలేవీ లేవని శాస్త్రిగారే చెప్పారు. ఇదొక చారిత్రక కావ్యం.
ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలవారి పేర్లతో ఈ కావ్యాన్ని 9 పర్వాలుగా
విభజించారు. ఇందులో 1. ఉదయ 2. శాతవాహన 3. చాళుక్య 4. కాకతీయ 5.
పునఃప్రతిష్ఠా 6. విద్యానగర 7. శ్రీకృష్ణదేవరాయ 8. విజయ 9. నాయకరాజ
పర్వాలుగా వర్గీకరించారు. ఇందులో నన్నయ భారతావతారికను అనుసరించి అవతారికను
ప్రవేశపెట్టారు.
మొదటిదైన ఉదయపర్వంలో ఆంధ్రుల ఉదయాన్ని
తెలిపే కథాంశం ఉంది. ఇందులో చారిత్రక పూర్వయుగం నాటి హరిశ్చంద్ర కథను ఐతరేయ
బాహ్మణం, భాగవతం వంటి గ్రంథాలలో కనిపించే గాధ ఆధారంగా రచించాడు.
రెండోదైన శాతవాహనపర్వంలో శాతవాహన
నామోత్పత్తి కారకుడైన దీపకర్ణి మహారాజు చరిత్రను సవివరంగా వర్ణించాడు. ఆయన
ఒకవైపు సుశాల సామ్రాజ్య భారాన్ని, మరోవైపు వలపులరాణి శక్తిమతి విలాసాల
భోగాన్ని నేర్పుతో నిర్వహించగల ప్రజ్ఞాశాలిగా వర్ణించాడు. రాణి పాముకాటుతో
నిస్సంతుగా మరణించటంతో రాజుగారి విషాదం ద్విగుణీకృతమైంది. ఆకాశవాణి
వాక్కుతో ఆయన మనసులో ఆశాలతలు పుష్పించాయి. వేటకు వెళ్లిన దీపకర్ణికి
పసిడిబుగ్గల నిగ్గులు మెరిసే సింహ వాహనుడైన బాలుడు కనిపించాడు. రాజుగారి
బాణ ప్రయోగంతో సింహం అదృశ్యమై శాపగ్రస్తుడైన యక్షుడు సాక్షాత్కరించాడు. తన
పేరు శాతుడని, తనకు శాపవిమోచనం కలిగించినందుకు కృతజ్ఞతా పూర్వకంగా నా
బిడ్డను తీసుకొని పెంచుకొమ్మని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ శిశువు
శాతవాహనుడుగా ప్రసిద్ధికెక్కాడు. శాతవాహన మహారాజు హాలుడిగా, శాతవాహనుడిగా,
శక పురుషుడిగా చరిత్రలో ప్రసిద్ధుడయ్యాడు. హాలుడి రసికతను కవి అద్భుతంగా
వర్ణించాడు. హాలుడి రాజధాని ధాన్యకటకం ఎందరో కవులు, కళాకారుల కవితా గానాలతో
పునీతమైంది. హాలుడు ప్రాకృతాన్ని రాజభాషగా చేశాడు. రాణీ లీలావతి సంస్కృత
భాషా కోవిదురాలు. సరసమైన సాహిత్య చర్చలు దంపతు లిద్దరూ వాదోపవాదాలతో
సాగించేవారు. వాద వివాదాలు ముదిరిన సందర్భాలలో సరస సుందరంగా ముగించేవారని
కవి చమత్కారంగా వర్ణించాడు.
రాజుగారి ఆస్థానంలో, గుణాఢ్యుడు, శర్వవర్మ
అనే ఇద్దరు పండితులుండేవారు. రాజుగారికి సంస్కృత భాష రానందున రాణి సరసంగా
‘మోదకైస్తాడయ’ (నీటితో కొట్టద్దు) అన్న విషయం అర్ధం కానందున రాణి ముందు
తలవంచుకోవలసి వచ్చింది. తన కొలువులో పండితులతో తనను అతి తక్కువ కాలంలో
సంస్కృత భాషావేత్తను చేయమని కోరాడు. గుణాఢ్యుడు తాను ఆరు సంవత్సరాలలో
నిష్ణాతుడిగా చేయగలనన్నాడు. శర్వవర్మ తాను ఆరు నెలల్లో చేయగలనన్నాడు.
గుణాఢ్యుడు కోపంతో నీవు ఆరు నెలల్లో చేయగలిగితే ‘‘నేను దేశభాషను సంస్కృత,
ప్రాకృత భాషలను వదిలి అరణ్యవాసానికి వెళతానని’’ ప్రతిజ్ఞ చేశాడు. శర్వుడు
మనోకేశంతో తన మాటను నెగ్గించుకునేందుకు కుమారస్వామిని ఉద్దేశించి తపస్సు
చేసి స్వామి అనుగ్రహంతో ఆరు నెలల్లో రాజుని సంస్కృత భాషా ప్రవీణునిగా
తీర్చిదిద్దాడు. గుణాఢ్యుడు తన మాటకు కట్టుబడి కొలువు వీడి తపోదీక్షకు
వనవాసానికి వెళ్లాడు. దీక్షాదక్షుడై గాధాసప్తశతిని రచించి తన శిష్యులతో
రాజు వద్దకు పంపాడు. రాజు వెటకారంగా ఆ తాళపత్రాలను చెదపురుగులకు తిండికి
ఇమ్మని పలికాడు. గుణాఢ్యుడు అవమానంతో శిష్యులతో కలిసి కావ్యహోమాన్ని
నిర్వహించి తాళపత్రాలను దగ్ధం చేశాడు. ఈ సన్నివేశాన్ని కవి కరుణార్ధంగా
వర్ణించాడు. హాలుడు ఈ విషయం తెలుసుకొని, గుణాఢ్యుని ఆత్మీయంగా
కౌగిలించుకొని పాదాలను స్పృశించి, క్షమించమని వేడుకున్నాడు. కాలుతున్న
భూర్జపత్రాలను తీయించి గాధాసప్తశతిగా నిలిచి ఉండేట్లు కూర్పు చేశాడు.
గుణాఢ్యుడు శాంతించక రాజుని నిందించి, అవమాన భారంతో పరమపదాన్ని చేరాడు.
శాతవాహన వంశరాజులు ముప్పది రెండు మంది
నాలుగు దశాబ్దాల పాటు సుపరిపాలన సాగించారు. వీరిలో శ్రీ శాతకర్ణి,
గౌతమిపుత్ర శాతకర్ణి, కుంతల శాతకర్ణి మొదలైన రాజుల పేరు చివర కర్ణి శబ్దం
ఉన్నందున వారిని కర్ణి రాజులని కూడా పిలిచేవారు. వారి ఏలుబడిలో ఉన్న నేల
కర్ణినాడుగా క్రమేపి కర్ణాటకంగా ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల పాలనాకాలంలో
బౌద్ధమతారాధన పెచ్చు పెరిగింది. ధాన్యకటకంలో బౌద్ధ విశ్వవిద్యా లయం
స్థాపించారు. శ్రీపర్వతంలో ఇక్ష్వాకు వంశ రాజుల కీర్తిసౌధం విలసిల్లుతుంది.
వారి తర్వాత శాలంకాయనులు, వేంగిపల్లవులు కృష్ణా నదీతీరంలో రాజ్యపాలన
సాగించారు.
మూడోదైన చాళుక్యపర్వంలో రాజరాజ నరేంద్రుడు
కవిపండితులు గాయకులతో కొలువు తీరాడు. రాజరాజుకి రాజ్యం కాదు, సాహిత్యమే
ప్రధానం. వ్యాసుని భారతం వల్లనే పురాభారతం నిలించిందని, ఆయన కృషి లేకుంటే
మన సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయేదన్నాడు. కొలువులో ఉన్న నన్నయ నారాయణ
భట్టులను ఉద్దేశించి వ్యాసకృతమైన భారతాన్ని ఆంధ్రీకరిస్తే సనాతనధర్మం
విలసిల్లుతుందని రాజరాజు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు. వైదికమత
పునరుద్ధరణకు మీ ఆశీస్సులు కావాలని, వారిని భారతాంధ్రీకరణకు ప్రేరేపించాడు.
భారతాంధ్రీకరణ ఏ విధంగా సాగాలో చెపుతూ ‘‘అక్షర రమణీయమై ప్రసన్న కథా
మధురంబై’’ ఉండాలని సూచించాడు. విమర్శకులు నన్నయ కవితా గుణాలుగా పేర్కొనే
అక్షర రమ్యత, ప్రసన్నకథా కలితార్థ యుక్తి వంటి గుణాలను రాజరాజే
నిర్దేశించాడని మధునాపంతులవారు పేర్కొవడం రాజరాజు కవితా దృష్టికి ఉత్కర్ష
కలిగించే విధంగా ఉంది. ధర్మనిష్టా మేదురంగా ఆంధ్రావళి మోదంబందునట్లుగా
ఉండాలని అర్థించాడు. తన పూర్వజన్మ సుకృతం వల్ల నన్నయ తన ఆస్థానకవిగా
లభించాడని ప్రశంసించాడు. తనను చరితార్దుని చేయమని, ఆత్మీయంగా పలికిన
పలుకుల్లో సుధలు చిందాయి. వెన్నెలలు వెల్లి విరిశాయి. నన్నయభట్టు రాజరాజు
ప్రశంసల జల్లులో పరవశించాడు. రాజరాజు ప్రజాహిత వాఙ్మయ దృష్టి, కావ్యగౌరవ
సృష్టి నన్నయకెంతో ఆశ్చర్యం కలిగించాయి. భారతాంధీకరణకు పూనుకొమ్మని విలువైన
స్మర్ణతాంబూలాన్ని అందించాడు. నన్నయ తన సహాధ్యాయి నారాయణభట్టును వినమ్రతతో
కావ్యభారాన్ని వహించాలని సూచించాడు. భారతాంధ్రీకరణ ప్రారంభమైంది.
ఆంధ్రపురాణంలో మధునాపంతులవారు నారాయణభట్టును కేవలం లేఖకుకుడిగా కాక,
నన్నయభట్టు వ్రాసిన ప్రతి అక్షరాన్ని ముందుగా పరిశీలించే విమర్శదృష్టి ఉన్న
పండితునిగా వర్ణించాడు. నన్నయ ఆదిసభాపర్వాలను ఆంధ్రీకరించాడు. పిదప
అరణ్యపర్వంలో కొంత భాగం సాగిన పిదప అర్ధాంతరంగా మరణించాడు. రాజరాజు నన్నయ
మరణంతో పట్టరాని శోకంతో కుమిలిపోయాడు. చంద్రవంశ కీర్తిపతాకలు
కళంకితాలయ్యాయని ఆవేదనా భరితుడయ్యాడు. మధునాపంతులవారు నన్నయతో రాజరాజుకున్న
ఆత్మీయ గాఢ స్నేహానుబంధాన్ని నిర్వేదాన్ని తెలుగు పదాల పోహళింపుతో
ఔచిత్యంగా వర్ణించాడు. నన్నయ మరణానంతరం శోకతప్త హృదయుడైన రాజరాజు
రాజ్యపాలనా వ్యవహారాలను యువరాజైన రాజేంద్రచోళునకు అప్పగించాడు. అనంతరం
పశ్చిమచాళుక్యుల ప్రాభవంతో తెలుగుభాషపై ఆసక్తి తరిగి కన్నడ భాషాపరిమళాలు
గుబాళించాయి. చాళుక్యపర్వంలో రాజరాజు వైదికమతాభిమానం నన్నయను ఆస్థానకవిగా
భారతాంధీకరణకు ప్రేరేపించడం నన్నయ రాజరాజుల ఆత్మీయగాఢాను బంధం
భారతాంధీకరణలో నారాయణభట్టు ప్రాధా న్యాన్ని ఇతోధికంగా వర్ణించాడు. రాజరాజు
ఉదాత్త తను వాఙ్మయ దృష్టిని సముచితంగా వర్ణించాడు.
నాలుగో పర్వమైన కాకతీయపర్వంలో ఓరుగల్లు
రాజధానిగా కాకతీయ చక్రవర్తులు కాకలు తీరిన యోధులుగా శత్రుసంహారంతో మూడు
శతాబ్దాల పాటు ముచ్చటగా రాజ్యపాలన చేసిన విధానాన్ని కవి గొప్పగా
వర్ణించాడు. కాకతీయ గణపతిదేవ చక్రవర్తి పాలనలో సువిశాల రాజ్యవిస్తరణ జరిగిన
తీరును మనోజ్ఞంగా వర్ణించాడు. ఆయన పాలనలో మోటుపల్లి రేవుతో సముద్రయానం
ద్వారా పునుగు, జవ్వాజి, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలను, ముత్యాలను ఎగుమతి
చేసి పేరుప్రతిష్టలు పొందాడు. ఆయన వారసురాలు తెలుగురాణి రుద్రమదేవి
శస్త్రాస్త్ర విద్యల్లో , రాజ్యాంగ తంత్రాల్లో రాటుదేలింది. తండ్రి అనంతరం
కాకతీయ సామ్రాజ్యాన్ని అధిష్టించి శత్రుదుర్భేద్యమైన కోటలు నిర్మించి
దేవగిరి ప్రభువు మహాదేవుని నాయకత్వంలో సామంతరాజులంతా కలిసి ఓరుగల్లును
ముట్టడించేందుకు సిద్ధమై ఒక బ్రాహ్మణుని రాయభారిగా పంపించారు. రాణి
ఆత్మస్థైర్యంతో బదులిచ్చి పంపింది. తన దండ నాయకులతో ఏకాంతంగా సమావేశం
నిర్వహించి ప్రేరణాత్మకంగా ‘‘మీ అసమాన విక్రమ బలసంపదలు ప్రదర్శించేందుకు
ఇంతకంటే మంచి అవకాశం లభించదు. వీరవరేణ్యులైన మీరు మీ నాయకురాలి వెంట
యుద్ధానికి సిద్ధమై కాకతీయ జయపతాకంపై వీచే వడగాడ్పులను ఆర్పాలని,
చెప్పింది’’. దండనాయకులంతా తామే యుద్ధానికి వెళ్లి విజయం సాధించగలమని
రాణికి చెప్పారు. ఆమె వారిని ఆశీర్వదించి కాకతీయుల ఇష్టదైవాలైన ఏకవీరాంబ,
పద్మాక్షిదేవీల అనుగ్రహంతో మీరు విజయం సాధించగలరని, ఆశీర్వదించి
పంపించింది. ఆమె సేనానులు గొప్పగా పోరాడారు. రుద్రమ నాగమనాయకులు
నరనారాయణుల్లా విజృంభించి పోరాడారు. దేవగిరి ప్రభువు ఆగడాలు శ్రుతి
మించాయన్న వార్త వేగుల ద్వారా విన్న రాణి యుద్ధానికి సిద్ధమై వెళ్లింది.
దేవరాజు వెటకారంగా అబలల పాదాలంటి సేవించనని, గతంలో ప్రగల్భాలు పలికాడు.
అతడితో రాణి ‘‘ప్రణయదాసుండవో కాక ప్రళయదాసదుసుడివో తేల్చుదాన సొంతముగ
నేను’’ అని అధిక్షేపిస్తూ హోరాహోరీగా పోరాడి విజయాన్ని సాధించింది. చివరకు
దేవరాజు నైరాశ్యంతో సంధికి సిద్ధమయ్యాడు. రాణి యుద్ధం చాలించి,
విజయశంఖాన్ని పూరించి నలుదిక్కులకు విజయవార్తను చాటించింది. దేవరాజు
సిగ్గుతో రాణిని శరణు వేడి సంధి చేసుకున్నాడు. కవి ఈ పర్వంలో రుద్రమదేవి
ధీశక్తిని, రాజకీయ వ్యూహాలను గొప్పగా వర్ణించాడు. రాణి ముద్దుల మనుమడు
ప్రతాపరుద్ర రాణి పెంపకంలో వీరోచితమైన బాల్యక్రీడలలో ఆటలలో, చదువులలో
పౌరుషంలో కార్యశూరుడిగా రూపొందాడు. రాజనీతిజ్ఞుడిగా, యువరాజుగా రాణీ
శ్రద్ధతో తీర్చిదిద్దింది. ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాధినేతగా
సాధించిన విజయాలు, పాలనా వైభవాన్ని, కళాప్రాభవాన్ని మధునాపంతులవారు ఎంతో
ప్రజ్ఞతో వర్ణించాడు.
పర్వాలన్నింటిలో ఐదో పర్వంలో రాజవంశాల
ప్రస్థావన లేకుండా కవి పున:ప్రతిష్ఠాపర్వంగా పేర్కొన్నాడు. కాకతీయులు
అనంతరం సనాతన ధర్మ పున:ప్రతిష్ఠకు కృషిచేసిన రాజులను గూర్చి ఇందులో
ప్రస్థావించాడు. ప్రత్యేకించి ముసునూరి ప్రోలయామాత్యుడు, కాపయనాయకుడు వంటి
వెలమ వీరులు తమ వీరవిక్రమాన్ని ప్రదర్శించారు. ప్రోలయ వేమారెడ్డి
గురూపదేశాన్ని పొంది పాకనాటి రాజ్య సంస్థానపకు అద్దంకి చేరుకున్నాడు.
అద్దంకి రాజధానిగా రెడ్డిరాజ్యాన్ని స్థాపించి, తన సోదరుల, బంధువుల
సహకారంతో సుస్థిరమైన స్వతంత్య్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. తన ఆస్థానకవి
ఎర్రన హరివంశంలో కృతిపతి వేమారెడ్డిని గూర్చి రెడ్డిరాజుల ప్రాభవాన్ని
గూర్చి గొప్పగా కీర్తించాడు. ప్రోలయ వేమారెడ్డి దత్తపుత్రుడు అనపోతారెడ్డి
కొండవీటి రాజ్యస్థాపకుడయ్యాడు. రెడ్డిరాజులు అద్దంకిని వీడి
శత్రుదుర్భేద్యమైన కొండవీడు రాజధానిగా రాజ్యపాలన సాగించారు. అతని అనంతరం
కర్పూర వసంతరాయలు బిరుదున్న కుమారగిరిరెడ్డి లలితకళాప్రియుడై భోగలాలసుడై
రాజ్యపాలనను ఉపేక్షించాడు. అతని బావమరిది కాటయవేముని రాజ్యతంత్ర ప్రజ్ఞతో
రాజ్యపాలన సాగింది. అతని పిదప పెదకోమటి వేమారెడ్డి కొండవీటి పాలకుడయ్యాడు.
శ్రీనాథుడు ఆయన ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు.
(ఇంకా ఉంది..)
డా।। పి.వి. సుబ్బారావు : రిటైర్డ్ ప్రొఫెసర్ & తెలుగు శాఖాధిపతి,
జాగృతి వారపత్రిక సౌజన్యంతో...
మధునాపంతులవారి మహేతిహాసం ‘ఆంధ్రపురాణం’..
ReplyDelete