Breaking News

శ్రీ‌ రాముడి కృతజ్ఞతాభావం - Lord Ramas Gratitude


మేలు చేసిన వారికి కృతజ్ఞలమై ఉండడం కనీస ధర్మం. ఉపకారులు ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా వారి ఉదారతను గుర్తించడం లబ్ధి పొందినవారికి ఉండవలసిన లక్షణం.  అది నాగరక సంస్కారం. మనసుకు సంతోషాన్ని కలిగించే అనుభూతి. అది మనిషిని ఉన్నతుడిగా నిలుపుతుంది. కృతజ్ఞతాభావానికి సంబంధించి పురాణాలలో అనేక గాథలు ఉన్నా, ఆ గుణం శ్రీరాముడిలో రాశి పోసుకుందని రమణీయమైన రామాయాణంలోని అనేక ఘట్టాలు చెబుతున్నాయి.  రామచంద్రుడు సాక్షాత్తు పరమాత్ముడే అయినా ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు తనను ఒక మానవమాత్రునిగానే భావించుకున్నాడు. అందరిలో తాను ఒకడిగా, అందరికోసం తాను అన్నట్లుగా మెలిగాడు. మానవతా విలువలకు, కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ధర్మగుణం, కృతజ్ఞతాభావం ఆభరణాలుగా కలిగినవాడు.వాల్మీకి ఆయనను వర్ణిస్తూ ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ’ , ‘రామో విగ్రహవాన్‌ ‌ధర్మః’ అన్నారు.

అవతార పురుషుడు శ్రీరాముడు అడుగడుగునా కృతజ్ఞతను ప్రదర్శించాడు. ఇతరుల నుంచి వంద అపకారాలు ఎదురైనా పట్టించుకోని ఆయన ఎవరి వల్ల ఏ చిన్న ఉపకారం పొందినా ఎంతో సంతుష్టి చెంది, కృతజ్ఞత చాటేవాడట. మంచిపాలన అందించడాన్ని క•ర్తవ్యంగా కాకుండా తనను ఆదరించిన ప్రజానీకానికి కృతజ్ఞతగానే తలపోశాడు.

సీతావియోగంతో దారితెన్నూ తెలియక క్షోభ పడుతున్న రామలక్ష్మణులకు శబరి ఆతిథ్యం ఇచ్చి, హనుమ, సుగ్రీవుల గురించి చెబుతుంది. ఆ మాటసాయానికే పొంగిపోయాడు దయాసముద్రుడు రాముడు. ‘దిక్కుతోచక పరితపిస్త్ను మాకు దిశానిర్దేశం చేసిన నీవు చల్లని నదీమతల్లివై మానవళిని తరింపచేస్తావు’ అని వరమిచ్చాడు. అది ఆయనకు గల కృతజ్ఞతా భావానికి ఒక నిదర్శనం. సీతాపహరణ సమయంలో రావణుడిని ఎదిరించి నేలకూలిన జటాయువును చూసి దుఃఖంతో చలించిపోయాడు రాఘవుడు. ‘సీతాపహరణం కంటే టాయువు నా కోసం మరణించడమే ఎంతో బాధ కలిగిస్తోంది లక్ష్మణా!’ అని విలపించాడు. రెక్కలు తెగి నేల కూలిన జటాయువు అంతిమ శ్వాసకు ముందు ‘నాయనా నేను మీ తండ్రికి స్నేహితుడను’ అని పరిచయం చేసుకుంది (‘వత్స మా విద్ధి వమస్యం పితురాత్మనః). వనవాసం కారణంగా అయోధ్యలో తండ్రి దశరథుడికి అగ్ని సంస్కారానికి నోచుకోని శ్రీరాముడు, అడవిలో జటాయువుకు భక్తిశ్రద్ధలతో ఆ కార్యం నిర్వహించాడు. తండ్రి స్నేహితుడిలో తండ్రిని చూసుకు న్నాడు. పక్షి పట్ల కృతజ్ఞతాభావంతో పాటు పితృభావంతో తన కర్తవ్యం నిర్వహించాడు.


సీతామాత క్షేమ సమాచారాన్ని తెలిపిన హనుమతో ‘నీవు నాకు గొప్ప మేలు చేశావు. నీవు చేసిన సహాయానికి నేను ఏ విధంగా ప్రత్యుపకారం చేయగలను? అయినా నా సర్వస్వం అనదగిన గాఢాలింగనాన్ని అందిస్తున్నాను, స్వీకరించు’ (‘ఏష సర్వస్వభూతో మే పరిష్వంగో హనూమతః…) అంటూ హనుమను ఆలింగనం చేసుకున్నాడు. సీతమ్మ జాడను తెలియజెప్పడం స్వామికార్యంలో భాగంగానే భావించాడు ఆంజనేయుడు. కానీ దానిని మహోపకారంగా పరిగణించాడు శ్రీరాముడు. తనకు పెద్దదిక్కుగా పరిగణించుకునే సుగ్రీవుడు యుద్ధంలో రావణుడితో తలపడి తీవ్రగాయాల పాలైనప్పుడు కలత చెందాడు. ‘నా ప్రాణం కంటే సీతే ముఖ్యం’ అనుకునే సీతావల్లభుడు ఈ సందర్బంలో ‘సీత కంటే ఆమె జాడ గురించి ప్రయత్నించిన సుగ్రీవుడే ముఖ్యం’ అంటాడు. వాలిసుగ్రీవుల ఘర్షణలో సుగ్రీవుడికి సహకరించిన నాడు తనకు ఎలాంటి శారీరక ఇబ్బంది కలగలేదని, కాని తన కారణంగా ఇప్పుడు మిత్రుడు గాయపడ్డాడనే ఆవేదన ఆయన మాటలలో వ్యక్తమవుతుంది. స్నేహధర్మానికి, కృతజ్ఞతకు ఆయన ఇచ్చిన విలువ అది.

బాల్యం నుంచి… ప్రత్యేకించి వనవాసకాలంలో తనను అంటిపెట్టుకొని, సర్వసుఖాలు త్యాగం చేసిన తమ్ముడు లక్ష్మణుడంటే ప్రీతి. అనుజుడికి ఆశీస్సులే కాని అభివాదం కూడదన్న సంప్రదాయాన్ని అనుసరించి వాత్సల్యాన్ని చూపాడు. ‘వచ్చే జన్మలో నీకు తమ్ముడిగా పుట్టి సేవ చేసుకుంటాను’ ని కృతజ్ఞతను ప్రదర్శించాడు. వనవాసం పేరిట తండ్రిమాట నిలబెట్టేందుకు, రాక్షస సంహారానికి అవకాశం కలిగించిన పినతల్లి కైకమ్మకు కృతజ్ఞతలు తెలిపాడు. దుష్టసంహారం తన ఘనతగా భావించలేదు. అందుకు ప్రేరణ ప్రాణాధికంగా పెంచిన పినతల్లి అని మరువలేదు.

రావణ సంహారం తర్వాత, ‘రామా! నీ దర్శనం మాకు ఆనందం కలిగించింది. నీకు ప్రీతి కలిగించేందుకు ఏం చేయమంటావు’ అని దేవేంద్రుడు అడిగినప్పుడు ‘నా కోసం యుద్ధంలో చనిపోయిన వానరవీరులను తిరిగి బతికించు. క్షతగాత్రులకు స్వస్థత చేకూర్చు. వానరులు ఉండే చోట్ల సర్వకాలాల్లో మధురఫలాలు, కందమూలాలు అందుబాటులో ఉండేలా, అక్కడి నదులు స్వచ్ఛజలాలతో నిర్మలంగా ప్రవహించేలా వరం ఇవ్వు’ అని కోరాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియసీ’ అని దేశభక్తిని ఎలుగెత్తి చాటింది రామాయణం. లంకానగరం సౌందర్యాన్ని చూసి మురిసిన లక్ష్మణుడు కొంతకాలం అక్కడ ఉండిపోదామన్నప్పుడు, శ్రీరాముడు చెప్పిన ఈ హితవాక్యం తరతరాలకు దేశభక్తిని, మాతృభక్తిని ప్రేరేపించే తారక మంత్రమైంది.పుట్టినగడ్డ పట్ల మాతృభక్తితో కూడిన కృతజ్ఞతాభావం ఇమిడిఉంది.

 ‘యథా రాజా తథా ప్రజాః’ అన్నట్లు పాలకుడిని బట్టే పాలితులు ఉంటారు. గుణవంతులు, జ్ఞానవంతులు, శీలవంతులు ఆచరించిన శ్రేష్ఠమైన పనులనే సామాన్యులూ అనుసరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు రామాయణ కాలంలోనే ఆచరణలో ఉన్నట్టు కనిపిస్తుంది. నాటి పాలకులు కష్టాలు, మనస్తాపాలు అనుభవించారే కానీ ప్రజానీకానికి ఏ లోటూ రాలేదు. ఆనందమయ జీవితం గడిపారు. తమను నమ్మిన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నదే ఆ పాలకుల ప్రథమ ప్రాధాన్యం.మానవత్వ విలువలు, నైతికత, సమాజం పట్ల బాధ్యత గల వారు ఆదర్శజీవనులు, ఉత్తమ పాలకులు అనిపించుకుంటారు. అవి లోపించిన వారు ‘ఉత్త’ పాలకులుగానే మిగిలిపోతారు. మొదటి కోవకు చెందిన వారు భావితరాలకు దైవం అవుతాడు. రెండవ రకం వారు అసుర సమానులుగా మిగిలిపోతారు.

గంగాతీరంలోని శృంగిబేరపురాధిపతి గుహుడు మునిరూపంలో ఉన్న రాముని చూసి చింతించి, తన రాజ్యాన్ని ఇవ్వజూపాడు. అతని ప్రేమాభిమానాలకు కరిగిపోయిన దాశరథి, ‘మిత్రమా! నీ సుహృద్భావానికి కృత్ఞతలు. పితృవాక్య పరిపాలకుడిగా వనవాస దీక్ష స్వీకరించాను. నువ్వు సమకూర్చ గలిగే భోగభాగ్యాలు వద్దు. కానీ గుర్రాలకు మేత మాత్రం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను’ అంటాడు. గుహుడి రాజ్య వితరణ యోచనను మృదువుగా తిరస్కరించి జీవకారుణ్యాన్ని చాటాడు. పశుగ్రాసం కోసం నిర్దేశించిన నిధులను కూడా ఆరగించే కలియుగ పాలకులకు ఆయన జంతుప్రేమ గురించి తెలియదనుకోవాలా?

రామచంద్రుడి వనవాసానికి ముందు… రాజ్యభారాన్ని రామునికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకున్న దశరథుడు ప్రజాభిప్రాయం కోసం ప్రత్యేకంగా సభను ఏర్పాటు చేసినప్పుడు సదస్యులంతా ఆయన నిర్ణయాన్ని ఏకగ్రీవంగా బలపరిచారు. ‘వినయశీలి, మృదుస్వభావి, రుజువర్తనుడు, స్థిరమనస్కుడు, సకల విద్యాపారంగతుడు, మహావీరుడైన రాముడు పట్టాభిషిక్తుడై భద్రగజంపై అయోధ్యపురవీధులలో విహరించే దృశ్యాన్ని వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్నాం’ అనీ చెప్పారు. వాస్తవానికి రాజరికవ్యవస్థలో పెద్ద కుమారుడికి వంశానుగతంగా లభించే అధికారమే. కానీ ప్రజాభి ప్రాయాన్ని మన్నించిన పాలన అది. ప్రజాభిమానానికి రాముని మనసు కదిలిపోయింది. వనవాసదీక్షా నంతరం పట్టాభిషిక్తుడైన రాముడు కృతజ్ఞతాపూర్వక పాలన సాగించాడు. తనను ఆదరించిన ప్రజకు పాలకుడు సర్వకాలసర్వావస్థలలో అండగా ఉండాలని నిరూపించాడు. అందుకే నేటికీ ‘రామరాజ్యం’ అనే నానుడి స్థిరపడి పోయింది.

– ఎ.ఎస్‌.‌రామచంద్ర కౌశిక్‌

జాగృతి వారపత్రికకు చందాదారులుగా చేరండి... 


 

1 comment:

  1. అందరిలో తాను ఒకడిగా, అందరికోసం తాను అన్నట్లుగా మెలిగాడు. మానవతా విలువలకు, కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ధర్మగుణం, కృతజ్ఞతాభావం ఆభరణాలుగా కలిగినవాడు.వాల్మీకి ఆయనను వర్ణిస్తూ ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ’ , ‘రామో విగ్రహవాన్‌ ‌ధర్మః’ అన్నారు.

    ReplyDelete