మొదటి ప్రపంచ యుద్ధం – భారతీయ ముస్లింల తీరు - Khilaft Movement History in Telugu
ప్రపంచ ఇస్లాం టర్కీ రాజ్యం పట్ల భారతీయ
ముస్లింల నిష్ట మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల వల్ల బ్రిటిష్ వారికి
వ్యతిరేకంగా పరిణమించింది. అలాగే భారత్ లో కూడా జరిగిన కొన్ని సంఘటనల
తరువాత భారతీయ ముస్లింల స్నేహపూర్వక ధోరణి(1911-1922) క్రమంగా సాయుధ
తిరుగుబాటు(1911-1922)గా మారి చివరికి ప్రత్యక్ష పోరాటం (1922 తరువాత)గా
రూపాంతరం చెందింది. బ్రిటిష్ వాళ్ళ పట్ల భారతీయ ముస్లింల ధోరణిలో వచ్చిన ఈ
మార్పుకు ప్రధాన కారణమైన మొదటి ప్రపంచయుద్ధాన్ని గురించి కొంత చెప్పాలి.
మొదటి ప్రపంచ యుద్ధం చివరలో ఒట్టమాన్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడానికంటే
ముందే, అంటే యుద్ధంలో టర్కీ ఖలీఫా అదృష్టం తలక్రిందులైన నాడే, బ్రిటిష్
వ్యతిరేకత, ఖిలాఫత్ ఉద్యమానికి బీజాలు పడ్డాయి.
ప్రపంచ యుద్ధంలో ఒట్టమాన్ టర్కీ
మొదటి ప్రపంచ యుద్ధం 1914 జులై 28 నుంచి
1918 నవంబర్, 11 వరకు జరిగింది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ,
రొమేనియా, జపాన్, అమెరికాలతో కూడిన సంకీర్ణ సేనలు, జర్మనీ, ఆస్ట్రియ,
బల్గేరియా, ఒట్టమాన్ టర్కీ సామ్రాజ్యంతో కూడిన కేంద్ర సేనల మధ్య జరిగింది.
యుద్ధం ముగిసే సమయానికి సంకీర్ణ సేనలు విజయం సాధించాయి. ఈ యుద్ధంలో కోటి
60లక్షల మంది సైనికులు, సాధారణ పౌరులు చనిపోయారు. యుద్ధపు వివిధ దశల్లో
వివిధ దేశాలు ఇందులో ప్రవేశించాయి.
1299లో ఏర్పడిన ఒట్టమాన్ సామ్రాజ్యం ఉచ్ఛదశలో (1520-1566) ఉన్నప్పుడు మధ్య ప్రాచ్యం(అరేబియాలో కొంతభాగం, సిరియా, లెబనాన్, పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్ట్), తూర్పు యూరప్(టర్కీ, గ్రీస్, బల్గేరియా, హంగరీ, మెసడోనియా, రొమేనియా), ఉత్తర ఆఫ్రికా(తీరప్రాంతం)లలో విస్తరించి ఉండేది. 1600 సంవత్సరం తరువాత క్రైస్తవ యూరోప్ లో పారిశ్రామిక విప్లవం, జాగృతి వచ్చినప్పటి నుంచి ఒట్టమాన్ సామ్రాజ్య ప్రభ తగ్గుతూ వచ్చింది. ఆ తరువాత 100 ఏళ్లలో గ్రీస్(1830), రొమేనియా, సెర్బియా, బల్గేరియా(1870), ట్రిపోలి(1911-12)తో కూడిన ఒట్టమాన్ ట్రిపోలిటానియా ప్రాంతాన్ని (ఇటలీ ఆక్రమించింది), దక్షిణ – తూర్పు యూరప్ లోని మిగిలిన ప్రాంతాలను కోల్పోయింది.
మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యే నాటికి అనేక భూభాగాలను కోల్పోయి, అంతర్గత కలతలతో, దిగజారిన ఆర్ధిక పరిస్థితితో ఒట్టమాన్ సామ్రాజ్యం బలహీనమైన దశలో ఉంది. కానీ సుల్తాన్ పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసిన స్థానిక పత్రికలు, రాజకీయ వర్గాలు జాతీయ జాగృతికి(హరేకెటి ఇంతిబాహియే) నాయకత్వం వహించాలని ఆయన్ని కోరాయి. అది సాధించాలంటే యుద్ధంలో పాల్గొనాల్సిందే. దానితో ఒట్టమాన్ సైన్యాన్ని, నౌకాదళాన్ని గుర్తించవలసిందిగా అప్పటి ఒట్టమాన్ రక్షణ మంత్రి అన్వర్ పాషా అటు బ్రిటన్ ను, ఇటు జర్మనీని కోరారు. రెండు దేశాల్లో ఎవరితోనైనా జట్టు కట్టడానికి టర్కీ మొదట సంసిద్ధత తెలిపింది. అయితే ఆ తరువాత బ్రిటన్ తో సుదీర్ఘకాలం స్నేహం కొనసాగించడం సాధ్యంకాదని భావించింది. ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి జర్మనీ ఎప్పుడు ప్రయత్నించలేదు. ఈ కారణంతోనూ, అలాగే అంతకుముందు జర్మనితో చేసుకున్న రక్షణ ఒప్పందాల దృష్ట్యా ఒట్టమాన్ సామ్రాజ్యం జర్మనీతో కలిసి వెళ్లడానికి నిర్ణయించుకుంది. జర్మనీ బ్యాంకుల నుంచి 50 లక్షల టర్కీ పౌండ్ ల విలువైన బంగారాన్ని ఋణంగా మంజూరు చేయాలని జర్మనీని 1914 సెప్టెంబర్ 30న టర్కీ కోరింది. అయితే తమవైపు యుద్ధంలో పాల్గొంటే ఋణం ఇస్తామని జర్మనీ చెప్పడంతో ఒట్టమాన్ సామ్రాజ్యం యుద్ధంలో అడుగుపెట్టింది. 1914 అక్టోబర్ 29న రష్యా నౌకకేంద్రాలపై బాంబులు వేయడంతో యుద్ధం ప్రారంభించింది.
అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్ లలో నిషేధాన్ని విధించడంతో 1915 నాటికి ఒట్టమాన్ సామ్రాజ్యం ఎక్కడా అప్పు కూడా పుట్టక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. గల్లీపోల్(1915), కుత్(1916)లలో బ్రిటన్ మీద విజయం సాధించినప్పటికీ 1916నాటికి టర్కీ సేనలు పూర్తిగా నీరసించిపోయాయి. శీతాకాలంలో రష్యా దాడి(1916), సిరియా, పాలస్తినియా, జెరూసెలం(1916-17)లలో బ్రిటిష్ సైన్యపు దాడులతో ఒట్టమాన్ సైన్యం పూర్తిగా నీరుగారిపోయింది.(Turkey`s Entry into world War I: An Assessment of Responsibilities, Ulrich Trumpener, The Journal of Modern History, Vol. 34, No. 4, 1962, P. 374; The Ottoman Empire, Kenneth W. Hari, The Great Courses, 2017, pp. 228-250).
1900 సంవత్సరంలో టర్కీ సుల్తాన్ డమాస్కస్ నుంచి అరేబియా ప్రాంతానికి సుదీర్ఘమైన రైలు లైన్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. జర్మనీ ఇంజనీర్ల ద్వారా నిర్మించిన ఈ హెద్జాజ్ రైల్వే లైన్ ఒక `పవిత్ర మోసం’. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు విరాళాలు పంపారు. ఈ ప్రాజెక్ట్ 1918నాటికిగానీ పూర్తికాలేదు. అప్పటికి బ్రిటన్ పూర్తి విజయాన్ని సాధించింది. (`T. E. Lawrence’ in Arabia and After, Liddell Hart, Jonathan Cape, 1934, pp. 51-53).
ఖిలాఫత్ ప్రపంచ ఇస్లాం బూటకం
యుద్ధం ప్రారంభం కావడానికి ముందు టర్కీ
సామ్రాజ్యం పట్ల అరబ్ ప్రజానీకంలో కొత్త ఉత్సాహం కలిగించేందుకు ప్రయత్నాలు
జరిగాయి. అబ్బాసిద్ ఖిలాఫత్ సాధించినట్లే తమ కుటుంబం నేతృత్వంలో విశాలమైన
అరబ్ సంకీర్ణాన్ని ఏర్పాటు చేయవచ్చని మక్కా షరీఫ్ అయిన హుస్సైన్
(1853-1931), అతని కుమారులు కలలు కన్నారు. ప్రవక్త మహమ్మద్ తరువాత 37వ వాడు
హుస్సైన్. కానీ మక్కాలో అడుగుపెట్టిన వెంటనే అరబ్ వ్యతిరేక టర్కీ గవర్నర్
వహిబ్ బే అంగరక్షకుల దగ్గర ఉన్న తుపాకులను వెంటనే స్వాధీనం చేయాలని షరీఫ్
హుస్సైన్ ను ఆదేశించడంతో గొడవ మొదలైంది. అరేబియా, సిరియాల్లో స్వతంత్ర
సామ్రాజ్యాలను చూడాలనుకుంటున్న బ్రిటన్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని షరీఫ్
హుస్సైన్ కు మద్దతు ప్రకటించింది. టర్కీ జిహాద్ ప్రకటిస్తే అరబ్ షరీఫ్
తమవైపు ఉండడం మంచిదని బ్రిటన్ భావించింది. ప్రవక్త వారసుడైనా ఖిలాఫత్ పై
అధికారాన్ని పొందగలిగే పరపతి, సామర్ధ్యం హుస్సైన్ కు లేవు. 1915లో జిహాద్
ను ప్రకటించాలంటూ టర్కీ ఒత్తిడి తెచ్చినప్పుడు బ్రిటన్, అలాగే అరేబియాను
ఇప్పటికీ పాలిస్తున్న రాజవంశాన్ని స్థాపించిన ఇబ్న్ సౌద్ సలహా మేరకు షరీఫ్
హుస్సైన్ తిరస్కరించాడు. (Liddell Hart,`T. E. Lawrence’ in Arabia and
After, pp. 61-64).
1916లో సిరియాపై విరుచుకుపడ్డ టర్కీ సైన్యం అరబ్ ఉద్యమాన్ని అణచివేసింది. తిరుగుబాటుదారులకు సామూహికంగా మరణదండన విధించారు. ఖైరి బే నాయకత్వంలో ప్రత్యేక టర్కీ సేనలు, జర్మనీ సేనలతో కలిసి మక్కాకు వచ్చాయి. తిరుగుబాటుదారులను పట్టుకున్నాయి. చివరికి 1916 జూన్ 5న అరబ్ తిరుగుబాటు ప్రారంభమైంది. తిరుగుబాటుకు స్వయంగా షరీఫ్ నాయకత్వం వహించాడు. కానీ 50వేల అరబ్ సైనికుల దగ్గర కేవలం 10వేల తుపాకులు మాత్రమే ఉన్నాయి. తిరుగుబాటుదారులు మక్కా, జెడ్డా, తైఫ్ లను ఆక్రమించారు. హెద్జాజ్ రాజుగా తననుతాను ప్రకటించుకున్న షరీఫ్ హుస్సైన్ 1919 నుంచి 1924 వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1924 మార్చ్ 3న టర్కీ ఖిలాఫత్ రద్దు అయిన తరువాత రెండు రోజులకు ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. కానీ చివరికి అతనిని ప్రత్యర్ధి సౌదీ తెగ అరేబియా నుంచి తరిమివేసింది. (Liddell Hart,`T. E. Lawrence’ in Arabia and After, pp. 65-73).
ఖలీఫాగా ముస్లిం రాజ్యం ఎలాలనుకున్న ప్రవక్త మహమ్మద్ వంశీకుడే చివరికి ఆ ఖలీఫాపై తిరుగుబాటు చేయడం చూస్తే అసలు ప్రపంచ ఇస్లాం సిద్ధాంతం, ఖిలాఫత్ ఎంత బూటకమో అర్ధమవుతుంది.
ఏదైనా టర్కీ కోసమే
1911లో మహమ్మద్ అలీ యుద్ధ బాధితుల కోసం
ట్రిపోలి లో, ఆ తరువాత బాల్కన్ యుద్ధాల బాధితులకు సహాయ నిధి ఏర్పాటుచేశాడు.
డా. ఎం. ఏ అన్సారీ నేతృత్వంలో వైద్య బృందం 1912 డిసెంబర్ లో వెళ్ళి 1913
జులైలో తిరిగివచ్చింది. (The Khilafat Movement in India 1919-1924, A.C.
Niemeijer, MartinusNijhoff, 1972, p. 56). 1898-1918 మధ్యకాలంలో భారత్ లో
కోటిమందికిపైగా ప్లేగు వ్యాధి వల్ల చనిపోయారు. 1911లో ముంబైలో ప్రతి
లక్షమందికి 408.1 రేటు చొప్పున మొత్తం 3997 మంది ఈ వ్యాధితో చనిపోయారు.
అలాగే కలకత్తాలో 166.2 రేటు చొప్పున 1736 మంది ప్లేగుకు బలయ్యారు. (The
Indian Medical Gazette, March 1948, p. 138).ఇంతగా వ్యాధి ప్రబలి జనం
చనిపోతున్నా రెడ్ క్రెసెంట్ మిషన్ కానీ, డా. అన్సారీ బృందంగాని ఎలాంటి
వైద్య సహాయం అందించలేదు. వారి హృదయాలు కేవలం యుద్ధంవల్ల రక్తమోడుతున్న
టర్కీ పట్ల మాత్రమే తల్లడిల్లాయి.
టర్కీ కోసం విరాళాలు సేకరించడం, వైద్య
బృందాలను పంపడంవంటి కార్యకలాపాలలో బ్రిటిష్ వారి సహాయాన్ని కూడా పొందేందుకు
మహమ్మద్ ఆలీ ప్రయత్నించాడు. వైస్రాయ్ ని డిల్లీ రెడ్ క్రెసెంట్ సొసైటీ
సంరక్షకుడిగా ప్రకటించడమేకాక సహాయ కార్యక్రమాలను బ్రిటిష్ రాయబార కార్యాలయ
అధికారుల ద్వారా చేయించడానికి ప్రయత్నించాడు. మొదటి ప్రపంచ యుద్ధం
ప్రారంభమైనప్పుడు తన కామ్రేడ్ పత్రిక ద్వారా సేకరించిన సహాయ నిధితో
నిర్మించిన ఆసుపత్రిని బ్రిటిష్ వాళ్ళు వాడుకునేందుకు అంగీకరించాడు కూడా.
(Niemeijer, The Khilafat Movement in India 1919-1924, p. 56).
1914లో సెర్బియా, ఆస్ట్రియాల మధ్య యుద్ధం
చెలరేగినప్పుడు భారతీయ ముస్లింలు సెర్బియాను సమర్ధించారు. దానికి కారణం
బాల్కన్ ఘర్షణల్లో సెర్బియా టర్కికి మద్దతుగా నిలవడమే. ఆ తరువాత జర్మనీ,
రష్యాలు కూడా యుద్ధంలోకి అడుగుపెట్టినప్పుడు రష్యా- టర్కీ యుద్ధాలను
దృష్టిలో పెట్టుకుని భారతీయ ముస్లింలు జర్మనీకి మద్దతు పలికారు. క్రైస్తవ
దేశాలు యుద్ధమంటూ కొట్టుకోవడం నిజానికి భారతీయ ముస్లింలకు చాలా సంతోషంగా
ఉంది. ఎందుకంటే టర్కీపై ఆ దేశాల దుర్వ్యవహారానికి అల్లా ఆ దేశాలకు విధించిన
శిక్ష ఇది అని వాళ్ళు భావించారు. ఈ యుద్ధంతో యూరప్ లో క్రైస్తవ రాజ్యాలు
పూర్తిగా అంతమై ఇస్లాం రాజ్యం అవతరిస్తుందని చాలామంది ఆశించారు. (The
Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi,
dissertation submitted to University of London, 1973, pp. 29,30).
కానీ 1914 ఆగస్ట్ లో బ్రిటన్ కూడా
సెర్బియా, రష్యా కూటమిలో కలవడంతో జర్మనిపట్ల తమ సానుభూతి, ఇష్టాన్ని పక్కన
పెట్టి ముస్లింలు బ్రిటన్ వైపు చేరిపోయారు. టర్కీ తటస్థంగా ఉండడమో, లేదా
బ్రిటన్ వైపు చేరడమో చేయాలని భారతీయ ముస్లిం నాయకులు కోరుకున్నారు. ఈ
బ్రిటన్ అనుకూల ధోరణే టర్కీ తటస్థవైఖరికి కారణం కావచ్చును. (Qureshi, The
Khilafat Movement in India, 1919-1924, dissertation submitted to
University of London, 1973, pp. 30,31).
తటస్థంగా ఉండడమో, లేదా బ్రిటన్ కు మద్దతు
తెలపడమో చేయాలంటూ మౌలానా అబ్దుల్ బారి (ఫిరంగి మహల్ లో చదువుకుని టర్కీకి
మద్దతుగా రెడ్ క్రెసెంట్ సంస్థను ప్రారంభించినవాడు, హిందువులతో కలిసుండడం
ముస్లింల ప్రయోజనాలకు భంగకరమని భావించినవాడు) టర్కీ సుల్తాన్ కు పంపిన
టెలిగ్రామ్ ద్వారా అభ్యర్ధించాడు. అలాగే టర్కీ తటస్థంగా ఉండడానికి
వీలుకల్పించే ధోరణిని బ్రిటన్ కలిగి అవలంబించాలంటూ అప్పటి వైస్రాయ్
హార్దింఙ్ ను కూడా కోరాడు. (Qureshi, The Khilafat Movement in India,
1919-1924, dissertation submitted to University of London, 1973, pp.
31,33). 1914నాటికి అబ్దుల్ బారి, ఆలీ సోదరులు, జాఫర్ అలీ ఖాన్, హస్రత్
మోహాని, ఆజాద్ లు ఖిలాఫత్ ఉద్యమపు ప్రధాన సూత్రధారులుగా, ప్రపంచ ఇస్లాం
సిద్ధాంతపు పూర్తి మద్దతుదారులుగా మారిపోయారు. అయితే అప్పటికి ఇంకా వారిలో
బ్రిటిష్ వ్యతిరేకత పొడచూపలేదు. బ్రిటన్ పట్ల వ్యతిరేకత కలగనంతవరకు, భారత్
లో ప్రపంచ ఇస్లాం సిద్ధాంతం కోసం బ్రిటన్ తో తలపడాల్సిందేనని నిర్ధారణ
కానంతవరకు మహమ్మద్ ఆలీ ఈ ధోరణినే అవలంబించాడు. తటస్థంగా ఉండడం, లేకపోతే
బ్రిటిష్ సంకీర్ణ శక్తులతో చేతులు కలపడం చేయాలంటూ టర్కీకి విన్నపాలు చేయడం,
ఉత్తర్ ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్ మెస్టన్ తో, వైస్రాయ్ తో
ఉత్తరప్రత్యుత్తరాలు, సంప్రదింపులు నడపడం వంటివి ఆలీ ధోరణికి నిదర్శనం.
టర్కీ అధికారాలను, భూభాగాన్ని తగ్గిస్తున్నారని, ఖలీఫా అధికారాన్ని
మింగేయాలని చూస్తున్నారని అనుమానం వచ్చేవరకు బ్రిటిష్ అనుకూల ధోరణినే
అవలంబించిన వారు యుద్ధం తరువాత పూర్తిగా బ్రిటిష్ వ్యతిరేక అవతారం ఎత్తారు.
1922 మార్చ్ లో ఒట్టమాన్ సామ్రాజ్య రద్దుకు సంబంధించిన ఒప్పందాన్ని
పునస్సమీక్షించాలని అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి మాంటెగు నిర్ణయం
తీసుకున్న తరువాతనే సహాయ నిరాకరణ ఉపసంహరించుకోవాలని మౌలానా బారి, హస్రత్
మోహాని తదితరులు భావించారు. దీనినిబట్టి ప్రపంచ ఇస్లాం, టర్కీ, ఖిలాఫత్ ల
భవిష్యత్తులే ఖిలాఫత్ ఉద్యమానికి ప్రధాన అంశాలని స్పష్టమవుతోంది. (Review:
The Khilafat Movement: Religious Symbolism and Political Mobilization in
India by Gail Minault; Review by Sharif al – Mujahid; Pakistan Horizon,
vol. 39, No. 2, 1986, P. 87,88).
ధోరణి మారిపోయింది
1917లో రష్యా విప్లవం, జర్మనీతో శాంతి
ఒప్పందం తరువాత ఒట్టమాన్ ను తొలగించాలనే సంకీర్ణ దేశాల రహస్య ఒప్పందం
క్రమంగా బయటపడింది. దానితో ఒకవేళ సంకీర్ణ దేశాలు టర్కీని జయించినా ఆ దేశపు
సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లదని బ్రిటన్ హామీ ఇవ్వాలంటూ మహమ్మద్ అలీ
తన కామ్రేడ్ పత్రికలోను, మౌలానా ఆజాద్ తన అల్- హిలాల్ పత్రికలోను వ్రాయడం
మొదలుపెట్టారు. మరోవైపు బ్రిటిష్ వాళ్ళు తమకనుకూలంగా కొన్ని ఫత్వాలు జారీ
అయ్యేట్లుగా కొందరు మౌల్వీలను ప్రభావితం చేశారు. బరేలికి చెందిన అహ్మద్ రజా
(బరేల్వి ఉద్యమం ప్రారంభించినవాడు)తో పాటు కొంతమంది ఉలామాలు టర్కీతో
బ్రిటన్ యుద్ధం రాజకీయమైనది మాత్రమేనని, మతపరమైనది కాదని, బ్రిటన్ కు
వ్యతిరేకంగా జిహాద్ మతపరంగా చెల్లదని ఫత్వాలు జారీ చేశారు. (Qureshi, The
Khilafat Movement in India, 1919-1924, dissertation submitted to
University of London, 1973, pp. 30,31).
బ్రిటన్ వైపు రష్యా వచ్చి చేరడంతో భారతీయ ముస్లింలలో బ్రిటన్ పట్ల వ్యతిరేకత మరింత పెరిగింది. వాళ్ళు రష్యాను ఎప్పుడు టర్కీ సంప్రదాయ శత్రువుగానే పరిగణిస్తూ వచ్చారు. లక్నోలో మౌలానా అబ్దుల్ బారి, కలకత్తాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేవబంద్ లో మహమ్మద్ – ఉల్ – హాసన్, ఢిల్లీలో హకీం అజ్మల్ ఖాన్, డా. అన్సారీ, ఆలీ సోదరులు ఖిలాఫత్ కు దోహదం చేసే కార్యకలాపాలను వేరువేరుగా చేపట్టారు. నిజానికి బ్రిటన్ కు వ్యతిరేకంగా టర్కీ యుద్ధంలోకి అడుగుపెట్టిన 1914 నవంబర్ ఖిలాఫత్ ఉద్యమ ప్రారంభం అని అనుకోవచ్చును. (Niemeijer, The Khilafat Movement in India 1919-1924, p. 63).
టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ సహకారంతో గిరిజనుల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని దేవబంద్ కు చెందిన మహమ్మద్ అల్- హాసన్, ఒబైదుల్లా సింధి వంటివారు ప్రణాళికలు రచించారు. దానినే `సిల్క్ లెటర్స్ కుట్ర’ అంటారు. రహస్య భాషలో వ్రాసిన లేఖల ద్వారా ఈ కుట్ర ప్రణాళిక మధ్య ఆసియా, హెద్జాజ్, మెసపటేమియాలకు పాకింది. హెద్జాజ్ లో టర్క్ లతో సంప్రదింపులు జరిపిన మహమ్మద్ అల్ – హాసన్ బ్రిటిష్ వారిపై జిహాద్ చేయాలని తెలిపే ప్రకటనను ఒట్టమాన్ గవర్నర్ అయిన గాలిబ్ పాషా నుంచి పొందగలిగాడు. దానిని భారత్ లో పంచాలని నిర్ణయించారు. `గాలిబ్ నామా’ అని పిలిచే ఆ జిహాద్ ప్రకటనను మహమ్మద్ అల్ – హాసన్ అనుచరుడు ఒకరు రహస్యంగా భారత్ కు చేరవేశాడు. ఇక్కడ ముస్లిములందరికి పంచారు. ఈ జిహాద్ ప్రచారం భారతీయ సైన్యానికి కూడా పాకింది. బాంబే, రావల్పిండి, ఫ్రాన్స్, సింగపూర్ లలో తిరుగుబాట్లు జరిగాయి. (Qureshi, The Khilafat Movement in India, 1919-1924, dissertation submitted to University of London, 1973, pp. 39 – 41).
మహమ్మద్ అల్ – హాసన్ ను బ్రిటిష్ పోలీసులు మాల్టా వద్ద అరెస్ట్ చేశారు. మౌలానా ఆజాద్ ను ఉత్తర్ ప్రదేశ్ నుంచి బహిష్కరించారు. అలాగే మౌలానా హస్రత్ మొహానిని కూడా బహిష్కరించారు. ఆ తరువాత జైలులో పెట్టారు. (Qureshi, The Khilafat Movement in India, 1919-1924, dissertation submitted to University of London, 1973, pp. 41, 42).
ఒట్టమాన్ సామ్రాజ్యంలో 1916లో వచ్చిన అరబ్ తిరుగుబాటు భారతీయ ముస్లింలను నిర్ఘాంతపరచింది. అది ప్రపంచ ఇస్లాం కలను కల్లచేసింది. కానీ నిజాన్ని చూడడం, అంగీకరించడం ఏమాత్రం అలవాటులేని వాళ్ళు అరబ్ తిరుగుబాటును బ్రిటిష్ కుట్ర అంటూ కొట్టిపారేశారు. అంతేకాని తిరుగుబాటుకు కారణాలు ఏమిటన్నది నిజాయితీగా పరిశీలించలేదు. `హుస్సైన్ ధోరణి మూలంగా పవిత్ర స్థలాలకు ముప్పు ఏర్పడిందంటూ’ 1916 జూన్, 26న ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లక్నోలో ఒక తీర్మానం ఆమోదించింది. హుస్సైన్, అతని అనుచరులు `ఇస్లాం శత్రువులు’ అంటూ అబ్దుల్ బారి ప్రకటించాడు. హుస్సైన్ కు సహకరించే బ్రిటిష్ ధోరణి ఏమాత్రం మంచిది కాదని ఈ విషయాన్ని పునరాలోచించుకోవాలని అజ్మల్ ఖాన్ వైస్రాయ్ ని కోరాడు. (Qureshi, The Khilafat Movement in India, 1919-1924, dissertation submitted to University of London, 1973, pp. 43).
తాము టర్కీ రాజధానిని, టర్కీ భూభాగాలను ఆక్రమించుకునేందుకు యుద్ధం చేయలేదని 1918 జనవరి 5న బ్రిటిష్ ప్రధాని లాయిడ్ జార్జ్ తన ఉపన్యాసంలో స్పష్టం చేశాడు. బ్రిటిష్ వాళ్ళు మాట ఇచ్చారంటూ భారతీయ ముస్లింలు ప్రచారం ప్రారంభించారు. (Qureshi, The Khilafat Movement in India, 1919-1924, dissertation submitted to University of London, 1973, pp. 46).
యుద్ధం ముగిసింది
ముద్రోస్ (ప్రస్తుతం గ్రీస్ లో ఒక
పట్టణం)లో 1918 అక్టోబర్ 30న సంకీర్ణ సేనలు, టర్కీ మధ్య యుద్ధ ఒప్పందం
కుదిరింది. బేషరతుగా లొంగిపోతున్నట్లు టర్కీ ప్రకటించడం, జర్మనీ సంపూర్ణ
పరాజయంతో మొదటి ప్రపంచయుద్ధం ముగిసింది. సంకీర్ణ దేశాల మధ్య కుదిరిన రహస్య
ఒప్పందాల ప్రకారం `టర్క్ ల నిరంకుశ పాలన నుంచి ప్రజానీకాన్ని విముక్తులను
చేయడం, పాశ్చాత్య నాగరకతకు చెందని, విదేశీయమైన ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని
యూరోప్ నుంచి తొలగించడం’ వంటి లక్ష్యాలు నెరవేరాయి. (Qureshi, The Khilafat
Movement in India, 1919-1924, dissertation submitted to University of
London, 1973, pp. 49).
ఈ ఒప్పందాల ప్రకారం టర్కీకి చెందిన కాన్ స్టాంటిన్ నోపుల్ వంటి యూరోప్ భూభాగాలను విముక్తం చేయడమేకాక, మెసపటోమియా, పాలస్తీన్, అరేబియా, సిరియా వంటివాటిని కూడా టర్కీ అధికారం నుంచి తొలగించాలని సంకీర్ణ దేశాలు నిర్ణయించుకున్నాయి. అలా జరిగితే టర్కీకి ఏమి మిగలదు. అంతేకాదు సార్వభౌమాధికారాన్ని కోల్పోతుంది. అలా 1923లో ఒట్టమాన్ సామ్రాజ్యపు శిధిలాల నుంచి సెక్యులర్ టర్కీ రిపబ్లిక్ అవతరించింది. టర్కీ రిపబ్లిక్ కు నాయకుడైన ముస్తఫా అతాతుర్క్ ఖలీఫాను పూర్తిగా సాగనంపడంతో అభూత కల్పన అయిన ప్రపంచ ఇస్లాం పూర్తిగా చెదిరిపోయింది.
భారతీయ ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళు యుద్ధ సమయంలో టర్కీ, బ్రిటన్ సంబంధాలు ఎలా మార్పు చెందితే వాటికి తగినట్లుగా తమ ప్రతిస్పందన మార్చుకుంటూ వచ్చారు. మొదట్లో బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్న భారతీయ ముస్లిం నేతలు ఆ తరువాత టర్కీ పట్ల తటస్థ వైఖరి అవలంబించవలసిందిగా బ్రిటన్ ను అభ్యర్ధించారు. కానీ ఎప్పుడైతే బ్రిటన్ ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని, ఖలీఫా అధికారాలను పరిసమాప్తం చేయాలనుకుంటోందని తెలిసిందో అప్పటి నుంచి బ్రిటన్ కు వ్యతిరేకులుగా మారిపోయారు. తాము కోరుకున్నది ఇచ్చేస్తే బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని మధ్యలోనే వదిలిపెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు ఎప్పుడూ భారతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించలేదు. టర్కీ ప్రయోజనాలకు భంగకరంగా ఉందనిపించినప్పుడే వాళ్ళు బ్రిటన్ వ్యతిరేక వైఖరిని అవలంబించారు. భారతీయ ముస్లిం నాయకులు పుట్టుక దృష్ట్యా పొరపాటున భారతీయులయ్యారుగానీ మనస్సులు, ఆత్మలలో వాళ్ళు నూటికి నూరుపాళ్లు టర్క్ లే !
(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)
- డా. శ్రీరంగ గోడ్బోలే
ప్రపంచ ఇస్లాం టర్కీ రాజ్యం పట్ల భారతీయ ముస్లింల నిష్ట మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల వల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పరిణమించింది.
ReplyDelete