విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ – 1920 జులై) - History of Khilafat Movement in Telugu
ఖిలాఫత్ ఉద్యమం రెండు అంకాలుగా సాగి, సమసి పోయిందని చెప్పవచ్చు. మొదటి అంకం
విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ నుండి 1920 జూలై వరకు). ఈ సమయంలో
సభలు, సమావేశాలు జరపటం, ప్రభుత్వాన్ని అభ్యర్దించటం మాత్రమే జరిగింది.
రెండవ అంకంలో(1920 ఆగష్టు నుండి 1922 మార్చ్ వరకు) దుందుడుకుతనం –
దారుణాలు. చరిత్ర మొత్తంలో ముస్లిం మత వర్గాలు ఇదే వ్యూహాన్ని అనుసరించేవి.
“ఉమ్మా“ (మూక)బలం కూడుకునే దాకా వినయంగా, శాంతి దూతల్లా వ్యవహరించి
ఎప్పుడైతే తగిన శక్తి వస్తుందో అప్పుడు విరుచుకుపడి దారుణమైన హింసాకాండకు
పాల్పడటం.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ముస్లింల అసంతృప్తి
టర్కీ లోని ఇస్లాం మత పవిత్ర స్థలాల
సంరక్షణ ఎవరి ఆధీనంలో ఉంటుంది అన్న ప్రశ్నతో, ఒట్టమన్ టర్కీ రాజ్యానికి
సంబంధించి ఎన్నో రహస్య ఒప్పందాలు, యుద్ద విరమణ సంధులు 1915 నుండి 1918వరకు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశంలోని ముస్లింలు ఈ దేశం కంటే టర్కీ సమస్య పై ఎక్కువ శ్రద్ధా,
ఆసక్తి చూపారు. టర్కీలో ఆధిపత్యం కోల్పోతే , ఒట్టమన్ టర్కిష్ రాజ్యం
ఓడిపోతే, భారతదేశంలో తమ పలుకుబడి, అధికారం, ప్రాముఖ్యత సమసి పోతుందని
ముస్లింలు భావించారు. బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించినందువల్ల తమకు
ఒరిగిందని ఏమీ లేదని అసహనం చెందారు.
1918 సంవత్సరం వైస్రాయ్ చెమ్స్ ఫోర్డ్, భారతీయ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎడ్విన్ మోంటేగ్ ల సంయుక్త ఆధ్వర్యంలో ‘మోంట్ ఫోర్డ్ నివేదిక‘ గా ప్రసిద్ది చెందిన నివేదికలో ఇలా పేర్కొన్నారు – “ముస్లింవర్గాలు 1909లో ప్రత్యేక ప్రతినిధిత్వం కావాలని కోరుకున్నారు. అప్పుడు ఇచ్చిన ప్రత్యేక హక్కులను ఇప్పుడు సమీక్షించడానికి చిన్న ప్రయత్నం చేసినా వారు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. ఆ హక్కులు నిర్ణయించేశారు, ఇక ఆ విషయంలో చర్చ అనవసరం అంటూ తేల్చిచెపుతున్నారు. మతపరమైన ప్రత్యేక ప్రాతినిద్యమే తమకు బలమన్నది వారి వాదన. అందుకని ప్రస్తుత విధానాన్నే మనం కొనసాగించటం జరుగుతోంది. అయితే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ హక్కులు కొనసాగించడం సరైన పద్దతి కాదు కదా అని మనం చర్చ మొదలు పెడితే చాలు ఇక వారి ఆవేశకావేశాలకు అంతు ఉండదు.’’ (The Report on Indian Constitutional Reforms, London, 1918, p. 188).
ప్రచురణచట్టం(The Press Act (1910)), భద్రతాచట్టం (the Defence of India Act (1915)) మొదలైనవి ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళు తరచుగా కామ్రేడ్, హమ్దర్ద్, అల్- హిలాల్, అల్- బలాగ్, జమిందార్ వంటి ముస్లిం వర్గాల పత్రికలను అడ్డుకునేవారు. ప్రముఖ ముస్లిం నాయకులైన మహమూద్ అల్- హసన్, అలీ సోదరులు , అబుల్ కలాం ఆజాద్ , హస్రత్ మోహాని వంటి వారిని నిర్భధంలో ఉంచారు. మౌలానా అబుల్ బారి , డా. అన్సారి, హకీమ్ అజ్మల్ ఖాన్ , ముషిర్ హోసైన్ కిద్వాయ్ మొదలైన నాయకులు నిర్బంధాన్ని తప్పించుకున్నారు. వీరు నిర్భంధం లో ఉన్న నాయకులను విడిపించేందుకు 1917 మొదట్లో ఉద్యమించారు (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, pp.51, 52).
హిందూ ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ మొండి పట్టుదల
దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యమాలను
సమర్దవంతంగా నిర్వహించిన అనుభవంతో 1915 కల్లా గాంధీజీ భారతదేశానికి
వచ్చేసారు. 1917 శీతాకాలంలోనే నిర్భందించబడ్డ ముస్లిం నాయకులను విడుదల
చేయటానికి ఉద్యమించాలని గాంధీజీని ఆహ్వానించారు ముస్లింలు. గాంధీగారి
ముస్లిం స్నేహితుల సంఖ్య పెరగడం ఇక్కడే మొదలైంది. ఆలీ సోదరులు , హకీమ్
అజ్మల్ ఖాన్ , మౌలానా అబ్దుల్ బారి మొదలైనవాళ్ళు ఆయన స్నేహితులయ్యారు.
ఏప్రిల్ 1918 లో ఢిల్లీ ఇంపీరియల్ వార్ సమావేశంలో గాంధీజీ పట్టుబట్టి
టర్కీ గురించి ముస్లిం వర్గాల ఆలోచనను చర్చించడం వల్ల ఆయనపట్ల ముస్లిం
నాయకులకు కృతజ్ఞత ఏర్పడింది. (Qureshi, The Khilafat Movement in India, 1919-1924, p. 53).
ఫిబ్రవరి 1919లో రౌలత్ చట్టం అమలులోకి
వచ్చింది. ఈ చట్టం ప్రకారం కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకులను ఎటువంటి
విచారణ చెయ్యకుండా నిర్భందించే అవకాశం ఉంది. ఈ చట్టం ఎంతో అశాంతిని
కలిగించింది. 1919 ఏప్రిల్ 13న అమృత్ సర్ లోని జలియన్ వాలాబాగ్ లో ఈ
చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న శాంతియుత సమావేశం పైనే జనరల్ డయ్యర్
కాల్పుల దారుణానికి ఒడిగట్టాడు.
తన రాజకీయ జీవితారంభం నుంచీ కూడా గాంధీజీ
హిందూ ముస్లిం ఐక్యత గురించి తెగ ఉత్సాహపడుతూ ఉండేవారు. అంబేద్కర్ గారు
గాంధీజీకి ఉన్న ఈ విచిత్ర కోరికను గమనించారు. ఆ విషయాన్ని గురించి
అంబేద్కర్ ఇలా వ్రాసారు – “ గాంధీగారు తన రాజకీయ ప్రయాణం
ప్రారంభించేటప్పుడు ఆరు నెలలలోనే స్వరాజ్యం సాధించగలను అనే ధీమా చూపించి
ప్రజలను ఆశ్చర్యపరచారు, కానీ ఆ అద్భుతం సాధించాలి అంటే కొన్ని షరతులు
ఉన్నాయి అనేవారు. అలాంటి షరతులలో ఒకటి హిందూ ముస్లిం ఐక్యత. గాంధీజీ హిందూ
ముస్లిం ఐక్యత లేకుండా స్వరాజ్యం సాధించలేము అని పదే చెబుతుండేవారు. అస్సలు
అలసి పోయే వారు కాదు. పాపం అయన మనసా వాచా ఈ ఐక్యత సాధించటానికి
కష్టపడ్డారు కూడా. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మార్చ్ 1919 లో సత్యాగ్రహం
ప్రారంభించినప్పుడు, కార్యకర్తలు తీసుకోవాల్సిన ప్రతిజ్ఞలో హిందూ ముస్లిం
ఐక్యత గురించి కూడా ఉండాలి అని పట్టుబట్టారు. రౌలత్ చట్టం వల్ల హిందూ
ముస్లిం స్నేహానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేదుకదా అని అన్నా,
మొండిగా ప్రతిజ్ఞ చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. ఇలా ఈ అంశం పై
విచిత్రమైన మొండి పట్టుదల చూపారు.’’ (Pakistan or the Partition of India, B.R. Ambedkar, Thacker and Company Limited, 1945, pp. 135,136).
1917 శీతాకాలం లో ముస్లిం నాయకత్వంతో గాంధీగారి పరిచయం హిందూ ముస్లిం ఐక్యత గురించి ఆయన జీవితకాలం కన్న పగటి కలకు కారణమయింది.
గాంధీ, బారీల మధ్య పరస్పర ఒప్పందం
టర్కీలోని కల్లోలం గురించి మొదటి ప్రజాందోళన 1918 డిసెంబర్ 30,31
ఢిల్లీలో జరిగిన అఖిల భారత ముస్లిం లీగ్ సమావేశంలో జరిగింది. ఈ ఉద్యమం
ఎక్కువగా ఉత్తరప్రదేశ్ , బెంగాల్ , పంజాబ్ లలోని కొన్ని పట్టణాలలో,
బొంబాయి, సింద్ వంటి ప్రాంతాలలో మాత్రమే జరిగాయి. అయితే ఈ ప్రపంచ ఇస్లాం
ప్రచారానికి అవసరమైన జనసమీకరణ కోసం హిందువుల సహాయసహకారాలు తీసుకోవలసి
వచ్చింది.
స్వతంత్ర సంగ్రామపు చారిత్రక వివరాలు
తెలిపే దస్తావేజులు పరిశీలిస్తే (Vol. 3, Government of Maharashtra,
p.139) 3 మార్చ్ 1919 నివేదిక లో ఇలా ఉంది – ”మార్చ్ 1919 లో గాంధీజీ
మౌల్వి అబ్దుల్ బారీకి అతిధిగా లక్నోలో ఉన్నారని మన గూడచారి చెప్పారు.
గాంధీజీకి మౌల్వి అబ్దుల్ బారీకి ఇంతకుముందే పరిచయం ఉందని,
సత్యాగ్రహం(రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా) గురించి చర్చించారని, సత్యాగ్రహం
విజయవంతమవుతుందని ఆశిస్తున్నారని, ప్రతీ పట్టణంలో తమ కార్యకర్తలు ఉన్నారని,
ఈ ఉద్యమాన్ని మెల్లిగా ప్రభుత్వ ఉద్యోగులు , సైన్యంలోనూ తీసుకువెళ్ళగలిగే
అవకాశం ఉందనీ అభిప్రాయపడ్డారు. హిందూ ముస్లిం ఐక్యత కూడా సాధిస్తే ఇక
ప్రభుత్వ నిర్వహణ కుంటుపడుతుందని గట్టిగా నొక్కి చెప్పారు. ఎప్పుడైతే
ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందో అదే సమయంలో ఉలేమాలు, మౌల్వీలు, మహమ్మదీయుల
సభలు జరిపి అబ్దుల్ బారీని షేక్-ఉల్- ఇస్లాంగా ఎన్నుకునేట్టు చూడడం,
ఆతర్వాత ఖిలాఫత్ , ముస్లిం పవిత్ర స్థలాల గురించిన ముస్లిం వర్గాల ఆందోళనను
హిందువులు సమర్దిస్తారని, ఒక విజ్ఞాపన పత్రం వైస్రాయ్ కి అందజేద్దామని, ఈ
విజ్ఞాపనకు సరైన హామీ అందని పక్షంలో పవిత్ర యుద్ధం చేద్దామని, హిందువులు
ఇచ్చిన మద్దతుకు ప్రతిగా అబ్దుల్ బారీ, తన షేక్-ఉల్- ఇస్లాం అధికారంతో “
ఖురాను ప్రకారం ఇబ్రహిమ్ బలి ఇచ్చింది గొర్రెని మాత్రమేనని, ఆవుని కాదని,
ఆవుని బలి ఇవ్వటం నిషిద్ధమని“ అని ఫత్వా ఇవ్వాల్సిందిగా గాంధీగారు కోరారు.
దురదృష్టవశాత్తు సత్యాగ్రహ ప్రదర్శనలలో హింస జరగటం వల్ల ఈ పధకం అమలుకాలేదు “
(p. 139).
గాంధీజీ, అబ్దుల్ బారీలు వారి వారి
లెక్కల్లో వారు ఉన్నారు. ముస్లిం వర్గాలను కలుపుకురావటం, తద్వారా అఖండ భారత
నాయకత్వం పొందడం కోసం గాంధీగారు ఖిలాఫత్ ఉద్యమాన్ని ఒక అవకాశంగా చూసారు.
‘ఈ టర్కీ కోసం మనం ఆలోచించవలిసిన అవసరం ఏమి కనపడటం లేదుకాని ముస్లిం
వర్గాలకి ఇది ముఖ్యమైన సమస్య కనుక మద్దతు ఇవ్వటం వల్ల మనకు ఏమి నష్టం “ అని
తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా. ఇక అబ్దుల్ బారీకి ఖిలాఫత్
ఉద్యమాన్ని ఉదృతం చెయ్యటానికి ఇది మంచి అవకాశం. పైగా తనకు వ్యక్తిగతంగా
కూడా ముఖ్య పదవి లభిస్తుంది. దీని కోసం గోవులను చంపొద్దు అని చిన్న ప్రకటన
చెయ్యాలి అంతే. (Qureshi, The Khilafat Movement in India, 1919-1924,
pp. 59-60). వారి దురదృష్టం ఏమిటి అంటే ఈ రౌలత్ సత్యాగ్రహం ఎక్కువ రోజులు
కొనసాగలేదు. దానితో 1919 నాడు గాంధీగారు ఈ సత్యాగ్రహాన్ని
విరమించుకున్నారు.
ఇస్లాంవాదులు బలపడ్డారు
1919 మార్చ్ 19న బొంబాయిలోని కొందరు
సంపన్న ముస్లిం వ్యాపారులు ‘ బొంబాయి ఖిలాఫత్ సంఘం ‘ అనే సంఘాన్ని
స్థాపించడానికి కావలసిన వనరులను సమకూర్చారు. 1919 వ సంవత్సరం లో
ఆఫ్ఘనిస్తాన్ రాజు అమానుల్లా బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించాడు.
వెనువెంటనే ఈ ఖిలాఫత్ సంఘం ఆఫ్ఘన్ రాజు ప్రతినిధులను సంప్రదించడానికి
ప్రయత్నాలు ప్రారంభించింది . అబ్దుల్ బారీ రెచ్చగొట్టే కరపత్రాల పంపిణీ
చేపట్టాడు. పవిత్ర యుద్ధం గురించిన కరపత్రం ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలల్లో
విస్తృతంగా పంచారు. అందులో మత యుద్ధపు ప్రాముఖ్యతను వివరించారు. (The Khilafat Movement in India 1919-1924, A.C. Niemeijer, MartinusNijhoff, 1972, p. 75; see also Qureshi, The Khilafat Movement in India, 1919-1924, p.67).
లండన్ కి రాయబారాలు పంపినా, భారతదేశంలో
ఎన్ని ఆందోళనలు చేసినా ఈ ముస్లిం మతవాదులకి ఎటువంటి విజయం కనపడటం లేదు. తమ
పోరాటాన్ని తీవ్రం చేసే ఉద్దేశ్యంతో లక్నోలో 1919 సెప్టెంబర్ అఖిల భారత
ముస్లిం సభ ఏర్పాటు చేసారు . ఈ సభకు వివిధ రంగాలకు చెందిన 1000 మంది
ముఖ్యులైన ముస్లిం నాయకులు హాజర య్యారు. రెండు ముఖ్యమైన నిర్ణయాలు
తీసుకున్నారు . మొదటిది కేంద్రీయ కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకోవటం ,
రెండు, 1919 అక్టోబర్ 17ని ‘ ఖిలాఫత్ దినం ‘ గా ప్రకటించడం.
ముస్లింలీగ్ వారికి ప్రభుత్వానికి
వ్యతిరేకంగా పనిచేసే ధైర్యం లేదు. అందుకని తాత్కాలికంగా ఈ ఖిలాఫత్ కోసం ఒక
సంస్థను వెతుకుతూ ఉన్నారు. ఈ సమయంలో “ బొంబాయి ఖిలాఫత్ సంఘం “
కనిపించింది. ఈ సంఘానికి దేశవ్యాప్తం గా శాఖలు ఏర్పాటుచేయాలని నిర్ణయించి
1919 నవంబర్ 11 న బొంబాయి ఖిలాఫత్ సంఘపు పేరును `భారతీయ కేంద్రీయ ఖిలాఫత్
కమిటీ, బొంబాయి ‘ గా మార్చారు (Qureshi, The Khilafat Movement in India, 1919-1924, p. 71).
కేంద్ర ఖిలాఫత్ సంఘం
ఈ కేంద్ర ఖిలాఫత్ సంఘం లేదా ‘ జమియత్ – ఇ-
ఖిలాఫత్ -ఇ – హింద్ ‘ అనే మారు పేరుగల సంఘం డిసెంబర్ 1919 లో అమృత్ సర్
లోను , ఫిబ్రవరి 1920 లో బొంబాయిలోను సమావేశమైంది. ఈ సంఘం లక్ష్యాలు ‘
టర్కీ దేశ శాంతి భద్రతల పరిరక్షణ ‘, ’ ఖలీఫా అధికారాన్ని పునఃస్థాపించడం ‘,
‘ అరబ్ దేశాలలో ఉన్న ముస్లిం పవిత్ర స్థలాలను కాపాడటం ‘, ‘ షరియత్ చట్ట
పునరుద్దరణ ‘ , ‘ రైట్ ఆనరబుల్ లాయడ్ జార్జ్ 1919 జనవరి 5న ఇచ్చిన హామీల
అమలు ‘, ‘ లార్డ్ హార్డింగ్ టర్కిష్ రాజ్య రక్షణకు ఇచ్చిన హామీని సాధించడం
‘ మొదలైనవి. ఈ లక్ష్యాలను సాధించడానికి బ్రిటిష్ మంత్రులను , వైస్రాయ్ ని ,
బ్రిటిష్ వారిని కలవడం, దేశం యావత్తు తగిన ప్రచారం చేయడం.
ఈ కేంద్ర కార్యనిర్వాహక సంఘం బొంబాయి
ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. మొదట 200 సభ్యులతో ఏర్పడిన సంఘం 1923 లో
250 సభ్యులకి పెరిగింది. బొంబాయికి 54 స్థానాలు , సింద్ కి 20, మద్రాస్ కి
15 ఇతర ప్రావిన్స్ లకు మిగిలిన స్థానాలు కేటాయించబడ్డాయి. అన్ని కమిటీలు
కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో పని చెయ్యాలి . ప్రతీ కమిటీ నిధులు సమకూర్చాలి.
కొత్త సభ్యులను చేర్చాలి. 1920 లో ముస్లింలీగ్ ను పునరుద్దరించే వరకు ఈ
సంఘం అత్యంత ప్రభావవంతమయిన ముస్లిం సంస్థగా పని చేసింది (Qureshi, The Khilafat Movement in India, 1919-1924,
p. 72). ఇంతేకాక ‘ ఖిలాఫత్ సేవకులు ‘ ‘ ఖిలాఫత్ కార్యకర్తలు’ లు కూడా
వుండే వారు. ఖిలాఫత్ సభ్యులుగా ఉండే ప్రతీ వ్యక్తి దగ్గరా నాలుగు అణాల
రుసుం వసూలుచేసేవారు (Niemeijer, The Khilafat Movement in India 1919-1924, p. 85).
ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగేటప్పుడు
కాంగ్రెస్ కి ఖిలాఫత్ వాదులకు తేడా లేకుండా ఉండేది. కొన్ని కొన్ని
ప్రాంతాలతో కాంగ్రెస్ కార్యాలయలలోనే ఖిలఫత్ వాదుల కార్యక్రమాలు జరిగేవి.
కాంగ్రెస్ వారు ముస్లిం లీగ్ వారిని ఎలా ఆదరించారో అలాగే ఖిలాఫత్ వారినీ
ఆదరించారు. ఎందుకంటె 1920 వేసవిలో కాంగ్రెస్ వారు ఖిలాఫత్ ఉద్యమానికి
సంపూర్ణ మద్దతు పలికారు కాబట్టి. పెద్ద పెద్ద సభలు జరిగాయి. పంజాబ్ లో ,
సింద్, బొంబాయి, ఉత్తర ప్రదేశ్, బీహార్, బెంగాల్ , మద్రాసులలో అతివాద
ముస్లింలతోబాటు మితవాద ముస్లింలు కూడా వీధుల్లోకి వచ్చారు. వీరందరికీ
భిన్నం గా జిన్నా వంటి వారు ‘ ఈ మత మౌడ్యం ‘ వల్ల తమకి ఏమీ లాభం ఉందని
అనేవారు. చివరికి ఈ ఉద్యమం వల్ల ఇటు భారతదేశానికిగాని, ప్రత్యేకంగా
భారతీయముస్లింలకుగాని ఎవరికీ ఉపయోగం లేకుండా పోయింది. (Niemeijer, The Khilafat Movement in India 1919-1924, pp. 86-90).
గమనించాల్సిన అంశం ఏమిటీ అంటే , ఈ ఖిలాఫత్
ఉద్యమం మొదటి రోజుల్లోముస్లింవర్గాల ద్వారా హిందువులతో ఐక్యత గురించిగానీ,
స్వరాజ్యం గురించిగాని ఎటువంటి సహకారం అందలేదు. పైగా అందుకు పూర్తి
విరుద్ధంగా సింద్ ప్రాంత ఖిలాఫత్ సంఘం అధ్యక్షుడు, 1911 – 1913 లో సింద్
రెడ్ క్రేసెంట్ సంఘంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి అయిన సెత్ హాజీ
అబ్దుల్లా హరున్ ‘ఈ తీవ్రవాదులతో, ఈ స్వరాజ్యవాదులతో మనం అనవసరం గా కలిసి
పనిచేసాము’ అని ఈసడించుకున్నాడు.(Niemeijer, The Khilafat Movement in India 1919-1924, p. 91).
హిందువుల అపోహలు
ఈ ఖిలాఫత్ ఉద్యమ మద్దతుదారులకు మొదటి
నుంచీ ఈ హిందూ ముస్లిం ఐక్యత అన్న ఆలోచనే ఖిలాఫత్ ఉద్యమాన్ని నీరుగార్చింది
అన్న అనుమానం లేకపోలేదు. 1913 లోనే మొహమ్మద్ అలీ హిందూ నాయకత్వాన్ని ,
ముస్లిం నాయకత్వాన్ని ‘ అవసరార్ధపు ఐకమత్యాన్ని శాశ్వతమని నమ్మొద్దు,
తీవ్ర మైన ఈ సమస్యని మాటలతో తెల్చేయ్యద్దు ‘ అని హెచ్చరించాడు. ముస్లిం
లీగ్ కు చెందిన చౌదరి ఖలికుజ్జమన్, ‘ శ్రద్దానందను డిల్లి మసీదులోనికి
తీసుకువెళ్ళడం , ఒక చిన్నపిల్లల ఆటలాగా ఉంది ‘అంటూ ముప్పై ఏళ్ళ తరువాత తన
జ్ఞాపకాలలో వివరించాడు . జవహర్ లాల్ నెహ్రు కూడా ‘ వైరుధ్య భావాలను గాంధీజీ
గారు కృత్రిమంగా కలిపారేమో ‘ అని సందేహం వ్యక్తం చేశారు.(Niemeijer, The Khilafat Movement in India 1919-1924, p. 93).
హిందూ జన బాహుళ్యం లో ఈ ఖిలాఫత్ ఉద్యమపు
రాజకీయ కోణాలు లేదా మత కోణాలు విషయంలో ఎటువంటి ఉద్దేశ్యం లేదు. హిందూ
నాయకత్వంపట్ల పండిట్ మదన్ మోహన్ మాలవ్యా (1861-1946) మాత్రం పూర్తి సందేహం
వ్యక్తపరుస్తూనేఉన్నారు. 1918 డిసెంబర్ లో కాంగ్రెస్ అధ్యక్షునిగా
ఉన్నప్పుడు ఆయన ఖిలాఫత్ ను సమర్ధించాలన్న చిత్తరంజన్ దాస్ (1870-1925)
అభ్యర్ధనను కొట్టివేశారు.1897 లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శంకరన్
నాయర్ (1857-1934) కూడా ఖిలాఫత్ ఉద్యమకారుల లక్ష్యాల విషయంలో తన సందేహం
వ్యక్తపరుస్తూనే ఉన్నారు. లోకమాన్య తిలక్ (1856-1920), వల్లభ భాయి
పటేల్(1875-1950), ఖేడా సత్యాగ్రహంలో(1918) పాల్గొన్న ఇందులాల్ యజ్నిక్
(1892-1972) ఖిలాఫత్ ఉద్యమాన్ని గురించి అనేక హాస్యోక్తులు చెప్పేవారు.
బిపిన్ చంద్ర పాల్ (1858-1932), ముస్లిం మత మౌఢ్యానికి ఎప్పుడు
వ్యతిరేకమే. “ ఇంటిలో ఇన్ని సమస్యలని వదిలేసి ఈ పరాయి దేశ సమస్య గురించి పోరాడటం ఏమాత్రం బాగా లేదు’ అని మోతిలాల్ నెహ్రు (1861-1931) అభిప్రాయపడేవారు . గోపాల కృష్ణ గోఖలే శిష్యుడు, గాంధీగారు `పెద్దన్న’ అంటూ గౌరవించిన వి యస్ శ్రీనివాస శాస్త్రి (1869-1946)
ఖిలాఫత్ ఉద్యమానికి దూరంగా ఉండమనీ, భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె
పనులు చేయడం మంచిది కాదని గాంధీజీకి ఎన్నోసార్లు చెప్పారు. కొందరు
హిందూనేతలు ఖిలాఫత్ ఉద్యమానికి మాటసాయం మాత్రం చేశారు. మరికొందరు గోరక్షణ
చేస్తామని ముస్లింలు ఒప్పుకుంటే ఉద్యమాన్ని సమర్ధిస్తామని షరతు విధించారు.
(Qureshi, The Khilafat Movement in India 1919-1924, pp. 74, 75).
ఇరవై ఒక్క కోట్ల హిందువులు, 50 మిలియన్
ముస్లిం వర్గాలు ప్రభుత్వాన్ని ఎటువంటి కోరికలు కోరినా పూర్తిగా
సహకరిస్తారు అని గాంధీజీ గారు నొక్కి చెప్పినా . ‘ ఖిలాఫత్ దినం ( 17
అక్టోబర్ 1919 ) రోజు హిందూ – ముస్లిం ఉత్సాహం ఏమి కనిపించలేదు. ఢాకా,
బొంబాయి , లక్నో, హైదరాబాద్ ( సింద్ ) , సుక్కుర్ మొదలైన కొన్ని ప్రాంతాలలో
మాత్రం కొంతమంది హిందువులు ముస్లింలతో కలిసి ప్రదర్శనలలో పాల్గొన్నారు.
(Qureshi, The Khilafat Movement in India 1919-1924, p. 76).
1920 లో జరిగిన సమావేశంలో ‘ కొందరు
అతివాద ముస్లిం నాయకులు ఆఫ్ఘన్ సైన్యంతో కలిసి భారతదేశాన్ని
ఆక్రమించుకోవాలని ప్రతిపాదిస్తే, ‘ ఇట్లాంటి విపరీతమైన ఆలోచనలు చేస్తే
తక్షణం హిందూ నాయకత్వం మద్దతు ఉపహరిస్తుందని కరాఖండిగా తేల్చి చెప్పేశారు
(Niemeijer, The Khilafat Movement in India 1919-192, p. 95).
అభ్యర్ధన నుంచి అరాచకం వైపు
అన్నిరకాల ప్రయత్నాలు చేసిన తరువాత కూడా
ప్రధాన మంత్రి లాయడ్ జార్జి గారి ప్రసంగాలు ముస్లిమ్ వర్గాల మనస్సులో ఒకింత
సందేహాన్నే కలిగించాయి. డిసెంబర్ 1919 బ్రిటిష్ వారి విజయోత్సవాలను
భారతదేశంలో కూడా జరపాలి అని ఆదేశాలు వచ్చాయి. 23 నవంబర్ 1919 న అఖిల భారత
ఖిలాఫత్ సభ డిల్లిలో మొదలైనప్పుడు విజయోత్సవాలను బహిష్కరించడం ప్రతీ
ముస్లిం మతధర్మమని ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే ఇంగ్లాండ్ కి ఒక
ప్రతినిధి బృందాన్ని పంపాలని , బ్రిటిష్ మంత్రుల్ని కలవాలని , ఒకవేళ అలా
చేసినా సరైన ఫలితం రాకపోతే బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం
మొదలుపెట్టాలని, మెల్లిమెల్లిగా సహాయనిరాకరణ మొదలుపెట్టాలని తీర్మానించారు .
గాంధీగారి సలహాతోనే సహాయ నిరాకరణ తీర్మానించారు. హింసాయుత పద్ధతులకు
వెళ్ళకుండా గాంధీగారు ఈ సలహా ఇవ్వడం జరిగింది.
అతి ముఖ్యమైన హిందూ మద్దతు కోసం 24 నవంబర్
1919 న హిందూ ముస్లిం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసారు. గాంధీగారితో
అవసరం కనుక ఆ సమావేశానికి ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు. బ్రిటిష్
వస్తువుల బహిష్కరణ గాంధీగారికి నచ్చలేదు గనక ఆ తీర్మానాన్ని తొలగించారు.
హిందువుల మద్దతును ఆశించి ఫజలుల్ హక్, జలియన్ వాలాబాగ్ దారుణాన్ని ఖండించే
తీర్మానాన్ని , మార్షల్ చట్ట వ్యతిరేక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టినా
గాంధీజీ ఒప్పుకోలేదు ‘ సహాయ నిరాకరణ ‘ ఖిలాఫత్ విషయం ‘ కోసమే చేస్తున్నట్టు
తీర్మానం చేయించారు. ఖిలఫత్ వాదులు ‘విజయోత్సవాలను’ విజయవంతంగా
బహిష్కరించారు. మితవాద ముస్లిం నాయకులను పక్కకు పెట్టి ఆలీ సోదరులు ఖిలాఫత్
ఉద్యమాన్ని నడిపించారు.
1920 ఏప్రిల్ మే నెలలో బొంబాయిలోని
కేంద్రీయ ఖిలాఫత్ సంఘం సహాయ నిరాకరణ విధానంపై చర్చించి కార్యక్రమాన్ని
నిర్ణయించింది . జూన్ 1920లో అలహాబాద్ లో జరిగిన సమావేశంలో అఖిల భారత
ఖిలాఫత్ సంస్థ వైస్రాయ్ కి నెలరోజుల గడువు ఇచ్చి, ఆలశ్యం లేకుండా
సహాయనిరాకరణ ప్రారంభించాలని నిర్ణయించేసారు.
సహాయ నిరాకరణ ఉద్యమం విషయం లో ఖిలఫత్
వాదులు చాలా తక్కువ సమయంలోనే పూర్తి సంసిద్దులైనారు. వారి ప్రణాళిక ఏమిటీ
అంటే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల ( పోలీసు, సైన్యం లాంటి ముఖ్య పదవుల)
నుంచి వైదొలగడం , పన్నులు కట్టకుండా ఉండటం మొదలైనవి. కాని కాంగ్రెస్ లో ఈ
ఉద్యమం గురించి అంత దీర్ఘంగా ఆలోచించలేదు. ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగాలలో
చేరద్దని ప్రజలకు సలహా ఇవ్వాలి అన్నంత మేర మాత్రమే వారి ఆలోచన సాగింది.
రెండు సంస్థలలోని ఈ సన్నద్దతలోని తేడాకు ముఖ్య కారణం కాంగ్రెస్ లోని హిందూ
నాయకుల సందిగ్ధత .
సరే గాంధీజీగారు కాంగ్రెస్ లో ఖిలాఫత్
వ్యతిరేక స్వరాలని ఎలా అడ్డుకున్నారు. ఖిలఫత్ వాదులు కార్యక్రమానికి
వారిని ఎలా ఒప్పించారో అదో పెద్ద కధ. అది తర్వాత చెప్పుకొందాం. గాంధీజివంటి
బలమైన మద్దతు కూడగట్టిన తరువాత అభ్యర్ధనలు ఆక్రోశం అనే అంకాన్ని దాటి
ఖిలాఫత్ వాదులు దుడుకుతనం – దారుణాల అంకం మొదలుపెట్టె సమయం ఆసన్నమైంది.
(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)
– డా. శ్రీరంగ గోడ్బోలే
NOTE: “ఖిలాఫత్ ఉద్యమ అసలు చరిత్ర” గత భాగాల కోసం క్లిక్ చేయండి:
సౌజన్యం - విశ్వ సంవాద కేంద్రం, తెలంగాణ.
దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యమాలను సమర్దవంతంగా నిర్వహించిన అనుభవంతో 1915 కల్లా గాంధీజీ భారతదేశానికి వచ్చేసారు.
ReplyDelete