ఆపరేషన్ విజయ్-Operation Vijay Story in telugu
స్వతంత్ర భారత చరిత్రలో కార్గిల్ కొండలు
అనేక కీలకమైన సంఘటనలకు కారణమయ్యాయి. ఆ సంఘటనలు అనేక విచారకరమైన స్మృతులను
మిగిల్చాయి. సైనికపరంగా చూస్తే `ఆపరేషన్ విజయ్’ అన్నది రెండు, మూడు
డివిజన్లు పాల్గొన్న చిన్న వ్యూహాత్మక యుద్ధం. 21ఏళ్ల క్రితం జరిగిన ఈ
యుద్ధాన్ని గురించి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే అప్పుడు కార్గిల్
లో మనకు ఎదురైన పరిస్థితులే ఇప్పటికీ వాయువ్య ప్రాంతంలో కనిపిస్తున్నాయి.
ఇవి దేశ భద్రతకు పెను సవాలు అని ఎవరికైనా తెలుస్తుంది. అందుకనే ఆనాటి
పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకోవడం చాలా అవసరం.
కొండకోనలు, ముఖ్యంగా హిమాలయాలు,
ప్రశాంతతకు, ఆధ్యాత్మిక వాతావరణానికి పెట్టింది పేరు. కానీ 1999లో ఈ
కొండకోనల్లోనే తుపాకులు పేలాయి, ఫిరంగులు గర్జించాయి. పాకిస్తాన్, భారత్
మధ్య యుద్ధం చెలరేగింది. మన వీర సైనికులు తమ శౌర్యపరాక్రమాలతో విజయాన్ని
తెచ్చిపెట్టారు. బాలీవుడ్ హీరోలు, క్రికెట్ ఆటగాళ్ళను ఆదర్శమూర్తులుగా
కొలిచే జనానికి నిజమైన వీరులు, సాహసవంతులు ఎలా ఉంటారో తెలిసింది.
1999 మే లో సరిహద్దు ప్రాంతంలో పాకిస్తానీ
సైనికుల కదలికల గురించి, వాళ్ళు మన వైపు ఏర్పరచుకున్న బంకర్ల గురించి ఒక
గొర్రెల కాపరి మన సైన్యానికి సమాచారం అందించాడు. పరిస్థితిని అంచనా
వేయడానికి కెప్టెన్ సౌరభ్ కాలియా నేతృత్వంలో ఒక సైనిక గస్తీ బృందం ఎల్ ఓ సి
వైపుకు వెళ్లింది. అలా వెళ్ళిన ఆ బృందంపై మే 5న దాడి జరిగింది. బృందంలోని
వారందరినీ బందించి, క్రూరంగా హింసించి చంపేశారు. జానీవా ఒప్పందం ప్రకారం
అలా చిత్రహింసలకు గురిచేయడం అనైతికం. మన సైనికుల ఛిద్రమైన శవాలను
అప్పగించారు. మన సైనికులపై పాకిస్తానీయులు దాడికి పాల్పడ్డారన్న వార్త
దావానలంలా వ్యాపించింది. చిన్న చిన్న ఘర్షణలు సరిహద్దుల్లో సర్వసాధారణమైనా ఈ
సంఘటన రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. పాకిస్తాన్ మోసం,
క్రూరత్వంపట్ల సర్వత్ర నిరసన వ్యక్తమైంది. శాంతిని కోరుకునే భారత్ ఎప్పుడు
కయ్యనికి కాలుదువ్వే పాకిస్తాన్ ఆగడాలకు సమాధానం చెప్పక తప్పలేదు. పాక్
ధోరణి 1999లో రెండు దేశాల మధ్య నాలుగవసారి యుద్దానికి దారితీసింది. పాక్
ధోరణి ఎంత మోసపూరితమైనదంటే, రెండు దేశాల మధ్య శాంతిని స్థాపించే
సదుద్దేశ్యంతో లాహోర్ కు బస్సులో వెళ్ళిన అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ
వాజ్ పాయ్ `లాహోర్ ఒప్పందం’ పై సంతకాలు చేశారు. ఆవిధంగా పాక్ కు స్నేహ
హస్తాన్ని అందించారు. కానీ కార్గిల్ ఆక్రమణల ద్వారా పాకిస్తాన్ నమ్మక
ద్రోహానికి పాల్పడింది. 1947, 1965 లలో మాదిరిగానే ఈసారి కూడా పాకిస్తాన్
తన సైనికులను భారత భూభాగంలోకి రహస్యంగా ప్రవేశపెట్టింది. సాధారణంగా భారత
సైన్యం కొండల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పరచుకున్న బంకర్లను శీతాకాలంలో ఖాళీ
చేసే క్రిందికి వచ్చేస్తుంది. ఆ ప్రదేశాలన్నింటిని పాక్ సైన్యం
ఆక్రమించింది. ఇలా దురాక్రమణకు పాల్పడిన పాక్ సైన్యాన్ని తిప్పికొట్టడానికి
భారత సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టవలసి వచ్చింది.
శ్రీనగర్ కు 205 కి.మీ దూరంలో ఉన్న జిల్లా
కేంద్రం కార్గిల్. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీలవరకు
పడిపోతుంది. ఎన్ హెచ్ 1డి జాతీయ రహదారి శ్రీనగర్ ను లేహ్ తో కలుపుతుంది.
ఇది కార్గిల్ గుండా వెళుతుంది. ద్రాస్ నుండి బాల్టిక్ వరకు 180 కి.మీ జాతీయ
రహదారిని పాకిస్తాన్ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. 16000 అడుగుల నుంచి
18000 అడుగుల ఎత్తులో ఉండే సైనిక పోస్ట్ లు శీతాకాలంలో ఖాళీ చేస్తారు.
కార్గిల్ ప్రాంతంలో ఈ ఆక్రమణలు సులభం. అందుకనే ఈ ప్రాంతాన్ని పాక్ సైన్యం
ఎంచుకుంది. పాక్ ఎస్ ఎస్ జి, సెవెన్ నార్త్ లైట్ ఇన్ఫాంట్రీ బటాలియన్ లు
కాశ్మీర్ చొరబాటుదారులు, ఆఫ్ఘన్ కిరాయి మూకల సహాయంతో ఈ ఎత్తైన పోస్ట్ లను
ఆక్రమించుకున్నాయి. లేహ్ ను శ్రీనగర్ నుంచి వేరుచేయడం ద్వారా ఎల్ ఓ సి
రూపురేఖలను మార్చాలన్నది వారి లక్ష్యం. కానీ భారత సైన్యానికి చెందిన రెండు
డివిజన్ లు, 10వేల మంది పారామిలటరీ సైన్యం, 250 ఫిరంగులతో పాక్
కుతంత్రాన్ని వమ్ము చేశాయి.
ఎత్తులో ఉన్న బంకర్లను ఆక్రమించుకున్న
పాక్ సైన్యానికి అనేక వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి లక్ష్యాలపై
దాడి చేయాలంటే సైనిక బలగాల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కొండల్లో యుద్ధానికి
ప్రత్యేక నైపుణ్యం, సంఖ్య బలం అవసరం. ఆయుధాలు, నిత్యావసర వస్తువులు
చేరవేయడానికి, స్వాధీనం చేసుకున్నా పోస్ట్ లను సురక్షితం చేసుకునేందుకు
బలగాలు అవసరం. ఈ పనులన్నీ ఇంతకు ముందు `పయనీర్ కాయ్స్’ నిర్వహించేవారు.
కానీ 1971 యుద్ధం తరువాత ఈ విభాగాన్ని రద్దుచేశారు. దీనితో 600మంది చొప్పున
ఉండే 6 `పోర్టర్ కాయ్స్’ ఈ బాధ్యతలు నిర్వహించవలసి వచ్చింది. కె.పి. సింగ్
అనే సామాజిక కార్యకర్త చొరవ తీసుకుని ఈ పనులు నిర్వహించడానికి ముందుకు
వచ్చే స్వచ్ఛంద కార్యకర్తల పేర్లను నమోదు చేసుకున్నారు. అలా 3వేల మంది
ముందుకు వచ్చారు. ఈ యువ బ్రిగేడ్ కు `టండా టైగర్ ఫోర్స్’ అని పేరు
పెట్టారు.
ఎన్ హెచ్ 1 డి జాతీయ రహదారికి దగ్గర ఉన్న
పోస్ట్ లను తిరిగి స్వాధీనం చేసుకోవాలని భారత సైనికాధికారులు భావించారు.
అందుకనే టోలోలింగ్, టైగర్ హిల్స్ శిఖరాలను ముందుగా స్వాధీనం చేసుకున్నారు.
దీనితో భారత సైన్యం యుద్ధంలో పైచేయి సాధించగలిగింది. 18000 అడుగుల ఎత్తున
ఉన్న పోస్ట్ ల పై భారత సైన్యం నేరుగా దాడులు జరిపింది. సాధారణంగా ఇలా
ఎత్తైన ప్రదేశాలపై నేరుగా దాడి చేయరు. వెనుక వైపు నుంచి శత్రువుల ఆయుధ,
ఆహార, ప్రచార సరఫరాలపై దాడి చేసి, వాటిని నిలిపివేస్తారు. కానీ అలా
చేయాలంటే ఎల్ ఓ సి (సరిహద్దు) దాటాల్సిఉంటుంది. అలా సరిహద్దు దాటితే యుద్ధ
తీవ్రత పెరగడమే కాక, అంతర్జాతీయంగా అనేక ప్రశ్నలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
ద్రాస్ సెక్టార్ నుంచి పాక్ సైన్యాన్ని
పూర్తిగా తరిమివేసిన తరువాత జులై ఆఖరులో భారత సైన్యం అంతిమ పోరుకు
సిద్ధమైంది. భారత విజయంతో జూలై 26న యుద్ధం ముగిసింది. అందుకనే ఆ రోజున
ప్రతి సంవత్సరం `కార్గిల్ విజయ దివస్’ గా జరుపుకుంటున్నాము. ఈ విజయ సాధనలో
527మంది సైనికులు బలిదానం చేశారు. 1,363 మంది గాయపడ్డారు. సైన్యానికి
అవసరమైన ఆయుధ, ఆహార సరఫరా అందించిన `టండా టైగర్’ దళంలో 8 మంది ప్రాణాలు
కోల్పోయారు. 150మంది గాయపడ్డారు. టోలోలింగ్ దగ్గర కార్గిల్ యుద్ధ స్మారకం
నిర్మించారు. ప్రతి ఏడాది ఇక్కడ జూలై 25,26 ల్లో కార్గిల్ విజయ దివస్
కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ 700 మందిని
కోల్పోయింది. పట్టుబడ్డ 8మంది సైనికులను 1999 ఆగస్ట్ 13న తిరిగి పాక్ కు
అప్పగించారు. సరిహద్దు దాటి భారత్ లో ప్రవేశించి సైనిక స్థావరాలను
ఆక్రమించినందుకు పాకిస్తాన్ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. భారత్
తో శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా పోగా, అంతర్జాతీయంగా కూడా తీవ్ర
నిరసనలు, ఖండనలను ఎదుర్కోవలసి వచ్చింది. యుద్ధ తీవ్రత పెరిగిపోకుండా
జాగ్రత్తగా వ్యవహరించినందుకు అమెరికా భారత్ ను ప్రశంసించింది.
కార్గిల్ కదనంలో అపూర్వమైన విజయాన్ని
సాధించిపెట్టడంలో భారత సైనికులు చూపిన పరాక్రమం, ధైర్యసాహసాలు ఎంత చెప్పినా
తక్కువే. ఈ యుద్ధంలో మన సైనికుల పరాక్రమాన్ని గురించి అనేక బాలీవుడ్
సినిమాలు వచ్చాయి.
– కల్నల్ జె.పి. సింగ్
Source - VSK Telangana
మరిన్ని విశ్లేషణలు, కధనాల కోసం సమాచార భారతి ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి |
పాక్ దురాక్రమణను తిప్పికొట్టిన భారత సైన్యం `ఆపరేషన్ విజయ్’
ReplyDelete