Breaking News

డ్రోన్ ప్రతాప్-Inspiring Story of Drone Pratap in telugu


పేదరికం కారణంగా నెల ఫీజు కట్టలేనందుకు ఉంటున్న హాస్టల్ నుండి గెంటివేయబడ్డ ఇప్పుడు అనేక దేశాల నుండి ఆహ్వానాలు అందుకుంటున్నాడు.
గ్రామీణ నేపధ్యం నుండి వచ్చి తన ప్రతిభాపాటవాలతో 21 ఏళ్లకే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఓ మధ్యతరగతి రైతుబిడ్డ విజయగాథ ఇది.
ప్రతాప్.. కర్ణాటక రాష్ట్రం మాండ్య  జిల్లా మలవల్లి తాలూకాలోని నెట్కల్ అనే మారుమూల గ్రామానికి చెందిన యువకుడు. ప్రతాప్ తండ్రి ఒక బీద వ్యవసాయదారుడు. తండ్రి నెలవారీ ఆదాయం సుమారు రూ.2000 మాత్రమే!
చిన్నతనం నుండే  డ్రోన్ వంటి ఎగిరే పరికరాల పనితీరుపై విపరీతమైన మక్కువ పెంచుకున్న ప్రతాప్, ఎలక్ట్రానిక్స్ విభాగంపై ఆసక్తి కనబరిచేవాడు. ఈ క్రమంలో పాఠశాల స్థాయి నుండే ఈ అంశంపై చిన్నచిన్న పరిశోధనలు మొదలుపెట్టాడు. పాత సామాను ఉపయోగించి చిన్నచిన్న రోబోట్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తయారుచేస్తూ పాఠశాల స్థాయి సైన్స్ ప్రాజెక్టుల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుపొందాడు.
ప్రీ యూనివర్సిటీ విద్యనభ్యసిస్తున్న సమయంలో ప్రతాప్ తన ఇంటికి సమీపంలోని ఇంటర్నెట్ సెంటరుకి వెళ్లి, అంతరిక్ష, వైమానిక, యాంత్రిక రంగాలకు సంబంధించిన వివిధ కంపెనీల వెబ్సైట్లు పరిశీలిస్తూ, వాటి ద్వారా తనకు కావాల్సిన సమాచారం గ్రహించేవాడు. ఇంజనీరింగ్ విద్యనభ్యసించాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ, పేదరికం కారణంగా మైసూరులోని జేఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్రం ప్రదానాంశంగా బీఎస్సీలో జాయిన్ అయ్యాడు.
డిగ్రీలో జాయిన్ అయ్యాక ఒకానొక దశలో హాస్టల్ ఫీజు కట్టలేని కారణంగా ఉంటున్న హాస్టల్ నుండి ఉన్నపళంగా బయటకు గెంటివేయబడిన ప్రతాప్, మైసూర్ బస్టాండ్ ఆవరణలో నిద్రిస్తూ, రోజువారీ ఖర్చుల కోసం స్థానిక పబ్లిక్ టాయిలెట్లలో బట్టలు ఉతికే పని చేసేవాడు. అయినప్పటికీ ఈ కష్టాలేవీ ప్రతాప్ ఆశయాలను ఆపలేకపోయాయి. ఎంతో పట్టుదలగా కంప్యూటర్ ప్రొగ్రమింగ్ బాషాలైనా సి, సి++, జావా, పైథాన్ మొదలైనవి నేర్చుకుని, ప్రొగ్రమింగ్ మీద పట్టుసాధించాడు.
విజయానికి మార్గం సుగమం..:
తన మొట్టమొదటి డ్రోన్ పరికరం రూపొందించే ప్రయత్నంలో ప్రతాప్ 80 సార్లు విఫలమయ్యాడు. ఈ 80 సార్లు కూడా ప్రతి అపజయం నుండి ఓ కొత్త పాఠం నేర్చుకున్న ప్రతాప్ చివరికి విజయవంతంగా డ్రోన్ పరికరం రూపొందించాడు. దీంతో అతడు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.
ఐఐటీ ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు  సాధారణ వస్త్రధారణతో, ఓ రైలులో తాను తయారుచేసిన డ్రోన్ పరికరాన్ని తీసుకెళ్లిన ప్రతాప్, ఆ పోటీల్లో రెండవ విజేతగా నిలిచి అందరి దృష్టి ఆకర్శించాడు. దీంతో ఆ పోటీ నిర్వాహకులు అతడిని 2017 నవంబర్ 27 నుండి డిసెంబర్ 2  వరకు జపానులో జరుగనున్న ప్రసిద్ధమైన అంతర్జాతీయ డ్రోన్ పరికరాల పోటీలలో పాల్గొనమని ప్రోత్సహించారు.
జపాన్లో జరిగే అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడం అంత సులభమైన వ్యవహారం కాదు. అందులో పోటీ చేస్తున్న అభ్యర్థుల పరిశోధనా పత్రాన్ని చెన్నైలోని ఓ ప్రొఫెస్సర్ ఆమోదించాల్సి ఉంది. అందుకోసం ప్రయాణానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేసుకున్న ప్రతాప్, మొదటిసారి చెన్నై చేరాడు. ఎంతో కష్టం మీద తన పరిశోధనా పత్రం ఆమోదించుకోగలిగాడు. ఇప్పుడు అతడి ముందున్న మరో సవాల్, జపాన్ ప్రయాణానికి కావాల్సిన డబ్బు సర్దుబాటు చేసుకోవడం.
అదృష్టవశాత్తు, మైసూరుకు చెందిన ఒక ఉదారవాది, ప్రతాప్ ప్రయాణానికి అయ్యే టికెట్ల కోసం కావాల్సిన అరవై వేల రూపాయలు ఏర్పాటు చేశాడు. ఇవి టికెట్లకు సరిగ్గా సరిపోతాయి. మరి అక్కడి ఖర్చుల సంగతేమిటి? దీని కోసం అతడి తల్లి తన మంగళసూత్రం అమ్మి, కొడుకుకి ఆర్ధిక సహాయం చేసింది.
ఎట్టకేలకు ప్రతాప్ ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఒంటరిగా జపాన్ చేరుకున్నాడు. జపాన్ రాజధాని టోక్యోలో విమానం దిగేసరికి ప్రతాప్ చేతిలో ఉన్నవి కేవలం 1400 రూపాయలు మాత్రమే. ఖరీదైన బులెట్ ట్రైన్ లో ప్రయాణం చేసి గమ్యస్థానం చేరుకోలేని పరిస్థితి. దీంతో ఒక తన 360 కేజీల బరువున్న సామగ్రితో, తన డ్రోన్ పరికరాన్ని ఓ చేతిలో పెట్టుకుని, సాధారణ రైల్లో కొంతదూరం, నడిచి కొంత దూరం ప్రయాణించి చివరికి చేరాల్సిన గమ్యస్థానం (పోటీలు జరిగే వేదిక) చేరుకున్నాడు.
127 దేశాల నుండి అభ్యర్థులు హాజరై ఆ అంతర్జాతీయ పోటీలో ప్రతాప్ తాను తయారుచేసిన డ్రోన్ (పేరు ఈగల్ – అంటే గ్రద్ద) విజయవంతంగా ఎగురవేసి ప్రదర్శన ఇచ్చాడు. అక్కడి ప్రేక్షకులంతా ఈ ప్రదర్శనకు సమ్మోహితులయ్యారు.
ప్రదర్శన చివరిలో నిర్వాహకులు పోటీ విజేతల పేర్లు ఒక్కొక్కటిగా చదువుతున్నారు. చివరిదాకా ఎక్కడా కూడా ప్రతాప్ పేరు వినిపించలేదు. ఇక చేసేదేమీ లేక ప్రతాప్ నిరాశగా వెనుతిరిగి, ఒక్కో అడుగూ వేస్తూ వస్తున్న సమయం.. అప్పుడే అక్కడి న్యాయనిర్ణేతలు పోటీల్లో అగ్రశేణిలో ఉన్న ముగ్గురు విజేతలను ప్రకటించడం మొదలైంది. మొదట మూడవ విజేత పేరు, తర్వాత రెండవ విజేత పేరు చదివిన నయాయనిర్ణేతలు, చివరిగా.. “భారత్ నుండి వచ్చిన ప్రతాప్ వచ్చి బంగారు పతాకాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం” అని మైకులో ప్రకటించారు.
ప్రతాప్ తయారుచేసిన డ్రోన్.. భారత కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై ఎగురవేసింది. జపాన్, అమెరికా అభ్యర్థులను కూడా ఓడించి, ప్రతాప్ అంతర్జాతీయ పోటీలలో విజేతగా నిలిచాడు. ఈ పోటీల్లో బంగారు పతకంతో పాటు పదివేల డాలర్ల బహుమతి కూడా గెలుచుకున్నాడు ప్రతాప్.
ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే.. ప్రతాప్ పడిన కష్టాలు, వాటిని అధిగమించిన తీరు తెలుసుకున్న జపాన్ నోబెల్ బహుమతి విజేత హిడెకి శిరకావా ప్రతాప్ ని తన ఇంటికి ఆహ్వానించాడు. అనంతర కాలంలో ప్రతాప్ ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచాడు. 2018లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా ప్రతాప్ ను ‘ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇన్నోవేషన్’ పతకం ఇచ్చి గౌరవించారు. ఒకసారి ఫ్రాన్స్ పర్యటన సమయంలో తిరుగుప్రయాణానికి తగిన డబ్బు లేకపోవడంతో, ఆ విషయం ఆనోటా ఈనోటా తిరిగి, చివరికి స్థానిక పత్రికల్లో వార్తగా ప్రచురితమైంది. దీంతో అక్కడి విమానాశ్రయ అధికారులు అతని ప్రతిభను తెలుసుకుని, అతనెవరో వ్యక్తిగతంగా తెలియకపోయినా, ఉచితంగా అతని కోసం బిజినెస్ క్లాస్ విమానంలో సౌకర్యవంతమైన ప్రయాణం ఏర్పాట్లు కల్పించారు.
భరతమాత సేవలో..
ప్రతాప్ విజయాల పరంపర జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు గుర్తించాయి. అంతేకాకుండా  ప్రతి దేశానికి చెందిన ప్రభుత్వ సంస్థల నుండి కూడా తన సేవలు అందించాల్సిందిగా, అందుకు ఫలితంగా అనేక విలాసవంతమైన వసతి, ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తామంటూ  అనేక ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఇవేవీ కూడా ప్రతాప్ ని ఆకర్శించలేకపోయాయి. తాను మాతృదేశం కోసమే తన సేవలు వినియోగిస్తానని నిక్కచ్చిగా తెలియజేశాడు.

Source: www.organiser.org & VSK telangana

1 comment:

  1. పేదరికపు పాతాళం నుంచి ఆవిష్కరణ అంచుదాకా.. డ్రోన్ ప్రతాప్ విజయగాధ

    ReplyDelete