Breaking News

ఏకత్వానికి స్ఫూర్తిదాత.. హెడ్గేవార్-Dr.Hedgewar Life Story in telugu


‘ఒకవేళ బ్రిటీష్ వారు వెళ్లిపోయినా- హిందువులంతా శక్తివంతమైన దేశంగా అవతరిస్తే తప్ప.. మన స్వేచ్ఛను మనం పరిరక్షించుకోలేం..’
యువతరం అంటే ‘సుగంధం వెదజల్లే సుమాలు’.. తాజాగా ఉన్నపుడే ఈ సుమాలు భరతమాత పాదాల చెంతకు చేరాలి.. ఏ వాసన లేని, వాడిపోయిన పూలు అర్చనకు నిరుపయోగం.
– జాతి ఐక్యత, యువత బాధ్యత గురించి కొన్ని దశాబ్దాల క్రితం డాక్టర్ హెడ్గేవార్ చెప్పిన ఈ మాటలు ఎప్పటికీ అక్షర సత్యాలు.
వైవిధ్యంలోనే ఏకత ఉందని, భిన్నత్వాన్ని కాపాడుకుంటూ భరతమాత సేవలో అందరూ పునీతం కావాలని, ఈ లక్ష్యసాధన కోసం ‘డాక్టర్‌జీ’ తన జీవితాన్ని అంకితం చేశారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆర్‌ఎస్‌ఎస్)ను స్థాపించిన జాతీయవాదిగా ఆయన పేరు భారత దేశ చరిత్రలో చిరస్మరణీయం.
మన దేశంలో స్వాతంత్య్ర సమరం సాగుతున్న కాలంలో ప్రజానీకాన్ని గాంధీజీ, డాక్టర్ అంబేద్కర్, వీర సావర్కర్, డాక్టర్ హెడ్గేవార్ ఎంతగానో ప్రభావితం చేశారు. స్వాతంత్య్రం కోసం గాంధీజీ, అస్పృశ్యత నివారణకు అంబేద్కర్, విప్లవమే శరణ్యమన్న వీరసావర్కర్ విభిన్న మార్గాల్లో కృషి చేస్తుండగా- హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని హెడ్గేవార్ దృఢదీక్ష వహించారు.
‘డాక్టర్‌జీ’గా ప్రసిద్ధి చెందిన కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ 1889 ఏప్రిల్ ఒకటవ తేదీన- ఉగాది పర్వదినం రోజున మహారాష్ట్ర లోని నాగపూర్‌లో జన్మించారు. ఉగాది పండుగ హిందువులకు ఎంత శుభకరమైనదో, ఆ పర్వదినం నాడు పుట్టిన హెడ్గేవార్ హిందూ మతం పరిరక్షణకు పరితపించి తన జీవితాన్ని ధారపోశారు. పుట్టుకతోనే ఆయన దేశభక్తుడు. చిన్నతనం నుంచే ఆయన బ్రిటీష్ పాలకుల పద్ధతులపై ధైర్యంగా నిరసన వ్యక్తం చేసేవారు. ఆయన నాగపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో చదువుతుండగా విక్టోరియా రాణి పాలన 60వ వార్షికోత్సవం సందర్భంగా పిల్లలకు పంచిపెట్టిన మిఠాయిలను ముట్టుకోనని శపథం చేశారు. హైస్కూల్‌లో చదువుతుండగా బ్రిటిష్ పాలకుల ఆదేశాలకు విరుద్ధంగా ‘వందేమాతరం’ గీతాన్ని ధైర్యంగా ఆలపించారు.
మాతృభూమికి సదా వందనం చేయాలని, ‘భారత్ మాతా కి జై’ అనే నినాదం మార్మోగాలని.. ఇందుకు జాతీయ భావనే దోహదం చేస్తుందని హెడ్గేవార్ విశ్వసించారు. హిందువుల్లో జాతీయతను, ఐక్యతను పెంపొందించాలన్న లక్ష్యంతో ఆయన నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925లో స్థాపించారు. క్రమశిక్షణ, జాతీయత, దేశభక్తి ఈ సంస్థ ఆయుధాలు. భారత్‌లోనే కాదు, విశ్వవ్యాప్తంగా హిందువులందరినీ సంఘటితం చేయాలన్నదే ‘సంఘ్’ ధ్యేయం. హెడ్గేవార్ స్థాపించిన అనతికాలంలోనే ఆర్‌ఎస్‌ఎస్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంది. ప్రస్తుతం 36 దేశాల్లోని హిందువుల వద్దకు చేరిన ‘సంఘ్’ తన కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా హిందువులను ఐక్యపరుస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌పై చాలాకాలంగా కొందరు రాజకీయంగా, మరికొందరు సిద్ధాంతాల ముసుగులో దాడి చేస్తూనే ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన వారు ‘సంఘ్’లో పనిచేస్తూ ‘డాక్టర్‌జీ’ ఆశయ సాధన కోసం అహరహం కృషి చేస్తూనే ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి పూర్తి వివరాలు తెలియక కొందరు అపవాదులు వేస్తుంటారు. ‘సంఘ్’ స్వరూపంపై, లక్ష్యాలపై అవగాహన కలగాలంటే హెడ్గేవార్ వ్యక్తిత్వం, ఆయన జీవిత విశేషాలను తెలుసుకోవడం అవసరం.
కుటుంబ నేపథ్యం..
తెలంగాణలోని ఇందూరు (నిజామాబాద్) జిల్లా కందకుర్తి హెడ్గేవార్ పూర్వీకుల నివాస స్థలం. నైజాం కాలంలో ఆ కుటుంబానికి చెందిన నరహరి శాస్ర్తీ బతుకుతెరువు కోసం నాగపూర్‌కు వలసపోయారు. ఆ వంశంలో జన్మించిన కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా హెడ్గేవార్‌కు శైశవ ప్రాయం నుంచే దేశం అంటే ఎనలేని భక్తి. ప్రారంభంలో విప్లవ భావాల పట్ల ఆకర్షితుడై కలకత్తా చేరుకున్నారు. కలకత్తాలో వైద్యవిద్యను అభ్యసిస్తూనే విప్లవకారుల సమన్వయ సంస్థ అయిన ‘అనుశీలన సమితి’లో పనిచేశారు. దేశం కోసం పనిచేయాలంటే అందరినీ కలుపుకొని పోవడం ఒక్కటే ఏకైక మార్గం అని ఆయన నమ్మేవారు. వైద్యవిద్య పూర్తయ్యాక తిరిగి నాగపూర్ చేరుకుని స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా కాంగ్రెస్‌లో చేరారు. దేశ చరిత్ర, సమకాలీన పరిస్థితులు, భవిష్యత్ పరిణామాలను ఆయన అంచనా వేసుకున్నారు. ఈ విషయాలపై పలువురితో తరచూ చర్చించేవారు. స్వేచ్ఛ కోసం గళం విప్పిన ఆయన రెండుసార్లు జైలుశిక్ష అనుభవించారు. హిందూ సమాజంలో బలహీనతలు, అప్పటి పరిస్థితులు ఆయనను ఎంతో వేదనకు గురిచేశాయి. హిందువులను సంఘటితం చేస్తేనే జాతీయత సాధ్యమని భావించి తన 36వ ఏట ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ను స్థాపించారు. 1925-40 వరకూ ‘సంఘ్’ కార్యకలాపాలను విస్తరింపజేస్తూనే స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్నారు.
దేశంలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైన తొలినాళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. 1885లో కాంగ్రెస్ సంస్థ ప్రారంభం కాగా, 1906లో ముస్లిం లీగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత హిందూ మహాసభ, సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ వంటివి ప్రారంభమయ్యాయి. ఈ సంస్థల మధ్య సైద్ధాంతిక ఘర్షణ కూడా మొదలైంది. వివాదాలు, అభిప్రాయ భేదాలు ఇలాగే కొనసాగితే దేశానికి నష్టం జరుగుతుందని, దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉందని హెడ్గేవార్ భావించారు. దేశభక్తి, జాతీయత, సామాజిక బాధ్యత లోపిస్తే హిందువుల్లో ఐక్యత ఉండదని ఆయన గ్రహించారు. కులాలను, అస్పృశ్యతను మనఃపూర్వకంగా వదిలివేస్తూ సామాజిక పరివర్తనకు కృషి జరగాలని, ఆ దిశగా ఆయన తన ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ఆర్‌ఎస్‌ఎస్ శాఖల ద్వారా ఆయన కృషిచేయడం ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. 1938లో పూణెలో జరిగిన సంఘ్ శిబిరానికి డాక్టర్ అంబేద్కర్ వచ్చి, అక్కడ నిమ్న కులానికి చెందినవారు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అస్పశ్యత నివారణకు ఇలా కృషి జరగడం తాను గతంలో చూడలేదని ఆయన ప్రశంసించారు. 1934లో గాంధీజీ కూడా ఆర్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని సందర్శించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివిధ కులాలకు చెందినవారు సంఘ్ శిబిరంలో ఎలా కలుసుకున్నారని హెడ్గేవార్‌ను గాంధీజీ ప్రశ్నించారు. అందరిలో రాష్ట్రీయ భావాన్ని, హిందువులం అనే చైతన్యాన్ని తాము కలిగిస్తున్నట్లు డాక్టర్‌జీ బదులిచ్చారు. తాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ అస్పృశ్యత, కులభేదం వంటి అవలక్షణాలను అంతం చేయడంలో హెడ్గేవార్ ఎన్నడూ రాజీ పడలేదు. కులాన్ని ఆధారంగా చేసుకుని సామాజిక, రాజకీయ కార్యకలాపాలను నడిపేవారిని ఆయన బహిరంగంగా నిరసించారు. 1933లో గాంధీజీ హరిజనోద్ధరణ పేరిట ప్రారంభించిన సామాజిక యాత్రకు సైతం ఆర్‌ఎస్‌ఎస్ సంఘీభావం ప్రకటించింది. అదే స్ఫూర్తితో ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభించిన ‘సేవాభారతి’ ఇప్పటికీ దేశవ్యాప్తంగా విస్తృతంగా తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
కాంగ్రెస్ అసహనం..
అన్ని వర్గాల మద్దతుతో ఆర్‌ఎస్‌ఎస్ బలోపేతం కావడాన్ని అలనాడు కొందరు కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోయారు. సంఘ్ కార్యకలాపాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేతలు రాసిన లేఖలకు హెడ్గేవార్ దీటుగా సమాధానాలిచ్చారు. తాము కాంగ్రెస్ సహా ఎవరికీ వ్యతిరేకం కాదని, దేశభక్తిని పెంచుతూ జాతిని ఐక్యంగా ఉంచడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడం సరికాదని హితవు పలికారు. అప్పటి నుంచీ ‘సంఘ్’ అంటేనే కాంగ్రెస్‌లో అసహనం కొనసాగుతోంది. కాంగ్రెస్ వలే కొందరు సోషలిస్టులు కూడా ‘సంఘ్’ను వ్యతిరేకించారు. 1937లో హెడ్గేవార్ కాశీ వెళ్లగా కొందరు సోషలిస్టులు కరపత్రాలు పంచిపెడుతూ ‘డాక్టర్‌జీ’ని ‘మినీ ఫాసిస్ట్ నేత’ అంటూ దూషించారు. అయినా హెడ్గేవార్ ఏ మాత్రం చలించలేదు. ఎవరిది న్యాయమైన మార్గమో కాలమే నిర్ణయిస్తుందని ధైర్యంగా బదులిచ్చారు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఆర్‌ఎస్‌ఎస్‌పై దుష్ప్రచారాలు, అపోహలు, విపరీత వ్యాఖ్యలను విస్తరింపజేశారు. అయినప్పటికీ ఆగని గంగా ప్రవాహంలా ‘సంఘ్’ సాగిపోతోంది. ప్రపంచంలోనే శక్తివంతమైన సంస్థగా రూపుదిద్దుకుంది. ఇందుకు హెడ్గేవార్ వేసిన బలమైన పునాదులే కారణం.

స్వాతంత్య్ర సమరం కాలంలో ప్రారంభమైన సైద్ధాంతిక సంఘర్షణలు ఇప్పటికీ దేశంలో కొనసాగుతున్నాయి. హిందువుల్లో ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు మత మార్పిడులను కొన్ని సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ‘సంఘ్’పై విద్వేషం వెళ్లగక్కుతున్నాయి. ‘ఇది హిందూ దేశం.. ఇది వాదనలకు అతీతమైన సత్యం’ అని అలనాడు ‘డాక్టర్‌జీ’ చెప్పిన మాటలు హిందువులకు స్ఫూర్తిదాయకం. ‘ఇది అఖండ భారత జాతి.. ఏకశిలా సదృశమైన భరతజాతి.. అఖండ హిందూ జాతి’ అని నినదించే జాతీయవాదులు ఇప్పటికీ ఉన్నారంటే అది హెడ్గేవార్ రగిలించిన చైతన్యమే. వేల సంవత్సరాల ఘన చరిత్ర ఈ దేశం సొంతం. ప్రపంచం యావత్తూ గౌరవించే గొప్ప సంస్కృతి మనది. వైవిధ్యం మన ప్రత్యేకత. ‘ఒకే దేశం- ఒకే ప్రజ- ఒకే సంస్కృతి’ అనే సత్యాన్ని దేశ ప్రజలంతా గుర్తించాలన్న తపనతో ‘సంఘ్’ కార్యకర్తలంతా ముందుకు సాగుతున్నారు. ఆర్య ద్రావిడ, బహుళ జాతుల వాదనలు క్రమంగా వీగిపోవడం, ఇండియన్స్ అంటే హిందువులు అనే సత్యాన్ని గుర్తించడం ‘సంఘ్’ సాధించిన విజయాలు. హెడ్గేవార్ బాటలో ఈ స్ఫూర్తిని కొనసాగించడమే ‘సంఘ్’ ఏకైక లక్ష్యం.
రాంపల్లి మల్లికార్జునరావు 9502230095
(ఆంధ్రభూమి సౌజన్యం తో)
(ఈ వ్యాసం మొదట 19 మర్చి, 2018 నాడు ప్రచురితమైంది)
Source - VSK telangana

1 comment:

  1. ఏకత్వానికి స్ఫూర్తిదాత.. హెడ్గేవార్

    ReplyDelete