డా. కేశవ బలిరాం హెడ్గేవార్ జీవిత చరిత్ర-Dr. Keshava Baliram Hedgewar Life Story in telugu
కొంతమంది మహాపురుషులు భవిష్యత్తును
గురించిన సత్యాన్ని అనుభవించి, తమ ధృడమైన ఆత్మ బలంతోను, ధృడ విశ్వాసంతోను
ముందు తరాలకు మార్గదర్శనం చేస్తారు. ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి
చూపుతూ జీవిస్తారు. వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం
అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటివారినే ‘యుగ ప్రవక్త’ లేక ‘యుగ
ద్రష్ట’ అంటారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డా||హెడ్గేవార్
అటువంటి యుగ ప్రవక్తలలో ఒకరు.
ఆర్.ఎస్.ఎస్. పేరు కోట్లమంది ప్రజలకు
తెలుసు. కాని ఆర్.ఎస్.ఎస్. స్థాపకులు డా||కేశవ రావ్ బలీరామ్
హెడ్గేవార్ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఇది వింతగా కనిపించినా నిజం.
ఆయన గురించి కొంత తెలిసిన వారికి కూడ వారి గొప్పదనం, వారి దూరదృష్టి
గురించి తెలియక పోవచ్చు. డా||హెడ్గేవార్ మన జాతికే కాదు యావత్ మానవాళికీ
తోడ్పడ్డారు. మానవాళికే కాదు సృష్టి అంతటికీ తోడ్పడ్డారు.
యుగ ద్రష్ట
కొంతమంది మహాపురుషులు భవిష్యత్తును
గురించిన సత్యాన్ని అనుభవించి, తమ ధృడమైన ఆత్మ బలంతోను, ధృడ విశ్వాసంతోను
ముందు తరాలకు మార్గదర్శనం చేస్తారు. ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి
చూపుతూ జీవిస్తారు. వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం
అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటి వారు భౌతికంగా ప్రజలకు దూరమైనా,
వారిని అనుసరించే వారు పెరుగుతూనే ఉంటారు. అటువంటి మహా పురుషులు తమకు
ప్రజలలో పేరు ప్రఖ్యాతులు రావాలనీ, విస్తృత ప్రజానీకానికి తాము పరిచయం
కావాలని కోరుకోరు. అటువంటివారినే ‘యుగ ప్రవక్త’ లేక ‘యుగ ద్రష్ట’ అంటారు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డా||హెడ్గేవార్ అటువంటి యుగ ప్రవక్తలలో ఒకరు.
ఆనాడే చెప్పారు
1920లో డా||హెడ్గేవార్ కాంగ్రెసు
మధ్యప్రాంత కార్యదర్శిగా దేశ స్వాతంత్య్రం కోసం పని చేస్తూండేవారు. అప్పుడు
నాగపూర్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభల ఏర్పాట్లన్నీ వారి నాయకత్వం
లోనే జరిగాయి. ఆ సభలో ఒక తీర్మానాన్ని ఆమోదించాలని వారు తీర్మానాల కమిటినీ
కోరారు.
ఆ తీర్మానం ఈ విధంగా ఉన్నది : ‘ప్రతి
వ్యక్తిని, అన్ని సమాజాలను, దేశాలను అంతర్జాతీయ సామ్రాజ్యవాద, రాజకీయ,
ఆర్థిక ఆధిపత్యం నుండి విముక్తి చేసి వారికి స్వేచ్ఛ, ఆత్మ గౌరవం
కల్పించాలి’.
ఆనాటి వారి దూరదృష్టిని గమనించండి. ఈ
రోజున సామ్రాజ్యవాద శక్తుల ఆధిపత్యాన్నీ; వారు పెంచి పోషిస్తున్న హింస,
ద్వేషాలను యావత్ప్రపంచం చూస్తూనే ఉన్నది.
వారు కోరిన రెండవ తీర్మానం : ‘భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం’. ప్రపంచ శాంతికి భారతదేశ బలమైన రాజకీయ స్వాతంత్య్రమూ తప్పనిసరి.
అయితే ఈ రెండు తీర్మానాలనూ కాంగ్రెసు అంగీకరించలేదు.
డా.హెడ్గేవార్ సానుకూల దృక్పథం గలవారు.
మన సమాజ బానిసత్వానికీ, అనేక ఇతర పీడలకు కారణాలను వారు ఆనాడే
విశ్లేషించారు. మన సమాజం స్వార్థం, కులం, తెగ వంటి భేదాలతో విభజనకు గురై
ఉన్నది. ప్రజలు దేశభక్తి, నిజాయితీ, అందరిపట్ల ప్రేమ వంటి మానవీయ విలువలను
కోల్పోయారు. తమ స్వంత సమాజం పట్ల ప్రేమను సైతం కోల్పోయి ఉన్నారు.
స్వార్థం, దురాశ, ఈర్ష్య, సోమరితనం,
సంకుచిత మనస్తత్వం వంటి దుర్గుణాలు మన సమాజం నరనరాల్లో నిండిపోయాయి. అందుకే
శాశ్వతమైన, పరీక్షింపబడిన మార్గాన్ని డా||హెడ్గేవార్ గ్రహించారు.
ఇది హిందూ రాష్ట్రం
‘భారతదేశం ప్రాచీన కాలం నుంచి ఉన్న జాతి’ అని వారు ధైర్య, విశ్వాసాలతో ప్రకటించారు.
ఈ దేశం హిందూ రాష్ట్రం (రాష్ట్రం అంటే
సంస్కృతంలో జాతి అని అర్థం). ఇది మన మాతృ భూమి. మనమందరం ఈ గొప్ప తల్లికి
కుమారులం, కుమార్తెలం. మతము, కులము, తెగ, భాషల ఆధారంగా కాక ఈ మహనీయ
మాతృమూర్తికి మనమంతా సంతానం అనే ఐక్య భావనతో ఉండాలి. హిందూ అంటే సర్వత్రా
దివ్యత్వాన్ని, ఏకత్వాన్ని దర్శించడం. హిందుత్వ మన సంస్కృతి. హిందుత్వ మన
జాతీయత, హిందుత్వ మన గుర్తింపు.
హిందువులను సంఘటితం చేయడం ఒక జాతీయ
కార్యం. హిందూ సమాజం దృఢంగా ఉన్నప్పుడు దేశం దృఢంగా ఉంది. స్వేచ్ఛా,
స్వాతంత్య్రాలతో మానవాళికి సేవలందించింది. ఎప్పుడైతే హిందువులు ఐకమత్యాన్ని
కోల్పోయారో అప్పుడే స్వాతంత్య్రాన్నీ కోల్పోయారు. విదేశీయులు మనపై
దండెత్తి మనలను కొల్లగొట్టారు. దోపిడీ చేశారు. గత 1000 సంవత్సరాలుగా
ప్రపంచంలో మన ఉనికికై పోరాడుతున్నాము. అంటే, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం
మన స్వాతంత్య్రానికే కాక మానవులందరి ఆనందం కోసం అవసరం.
అయితే తరాల నుండి జాతీయ భావనలు వీడని భారత జాతి ఇలా నిర్వీర్యం అవడానికి కారణా లేమిటి? అది తెలుసుకోవాలంటే చరిత్రను తెలుసుకోవాలి.
ఓడిన ఆంగ్ల ప్రభుత్వం
రాష్ట్రీయ భావన (జాతీయ భావన) జాతి
అమరత్వానికి ఆధారమైనది. జాతీయ భావన లోపిస్తే ఆ జాతి కాలప్రవాహంలో
కొట్టుకుపోతుంది. స్వామి వివేకానంద మన దేశంలో జాతీయ భావనను మేల్కొలిపారు.
అయితే జాతీయత ఆధారంగా, జాతి యావత్తునూ సంఘటిత పరచే (ఐక్యపరచే) సమయం వారికి
లభించలేదు. 39వ ఏటనే వివేకానంద గతించారు. 1902లో పరిపాలనా సౌలభ్యం పేరుతో
1905లో ఆంగ్లేయులు బెంగాల్‌ను హిందూ బెంగాల్, ముస్లిం బెంగాల్‌గా
విభజించారు, కొంతకాలం తరువాత దేశాన్ని విభజించే దురుద్దేశ్యంతోనే
ఆంగ్లేయులు ఈ పని చేశారు. అయితే లాల్, బాల్, పాల్ త్రయం నేతృత్వంలో
వందేమాతరం ఉద్యమం ఊపందుకొని, జాతి యావత్తునూ కదిలించింది. జాతి
మేల్కొన్నది. ‘త్వంహి దుర్గా దశప్రహరణ ధారిణీ’ అని భారత మాతను స్తుతించి
గర్జించింది. జాతీయశక్తి ముందు విదేశీ ఆంగ్లేయ ప్రభుత్వ శక్తి ఓడిపోయింది.
1911లో వంగ (బెంగాల్) విభజనను ఆంగ్ల ప్రభుత్వం రద్దు చేసింది. ఇది భారత
సమాజానికి లభించిన గెలుపు. హిందువుల సంఘటిత శక్తి ముందు ఆంగ్లేయ ప్రభుత్వం
నిలవలేకపోయింది.
తరువాత ఏం జరిగింది ?
కాని, 36 సంవత్సరాల తర్వాత 1947లో
ఆంగ్లేయులు ఈ దేశం నుండి వెళ్లిపోయారు. వెళ్ళిపోతూ ఈ దేశాన్ని విజయవంతంగా
ముక్కలు చేశారు. 1911లో అత్యంత ఐక్యంగా ఉన్న భారతీయ సమాజం 1947లో ఎలా
ఓడిపోయింది? దేశ విభజనను ఎందుకు అంగీకరించింది ? ఈ 36 సంవత్సరాలలో దేశంలో
ఏం జరిగింది ?
ఒక్కసారి చరిత్రలోకి వెళితే.. వందల సంవత్స
రాలుగా, అనేకసార్లు విదేశీయులు భారతదేశంపై దండెత్తినప్పటికి, కొన్నిసార్లు
పరిపాలించినప్పటికి భరతజాతి నిర్వీర్యం కాకుండా, ఎప్పటికప్పుడు ఉత్సాహం
తెచ్చుకొని, నూతన శక్తితో పోరాడుతూనే వచ్చింది. ఏ ఒక్క నిమిషం కూడా ఈ జాతి
బానిసత్వాన్ని అంగీకరించలేదు.
కాని మొదటిసారిగా భారతీయ సమాజం మాతృదేశ
విభజనను అంగీకరించింది. అంటే ‘అఖండ మాతృభూమి, జాతీయ భావన’ సమాజ
హృదయాంతరాలలో చెదిరిపోయింది. రాజకీయ స్వాతంత్య్రం అత్యంత ఆవశ్యకమే. కాని
దానితోపాటు, జాతీయభావన కూడా ముఖ్యం. ఇదే జాతికి ప్రాణం, ఊపిరి. జాతీయ భావనే
శాశ్వతం.
ఈ జాతీయ భావన జాతీయత, జాతీయ సఖ్యత, జాతీయ ఆత్మ, జాతి పరంపర వంటి జాతీయ విలువలు భారతీయ సమాజంలో లుప్తమైపోయాయి.
ఎలా జరిగింది ?
1920 తర్వాత మన జాతీయ నాయకులు స్వాతంత్య్ర
పోరాటంలో సత్యం, అహింసలను ఆదర్శంగా స్వీకరించారు. వాటిని ప్రజలు తప్పకుండా
పాటించి తీరాలన్నారు. మాతృభావన, జాతీయత వంటి విలువల కన్న ఈ సత్యం-అహింసల
గందర గోళం ఎక్కువయింది. అప్పటి నుండి ప్రజలలో మాతృభూమి భావన లుప్తమైపోతూ
వచ్చింది.
సత్యం-అహింస అనేవి వ్యక్తిగత గుణాలు,
వ్యక్తిగత జీవన విలువలు. వాటిని ప్రజలందరు సమాన స్థాయిలో ఆదరించలేరు.
ఆచరణలో హెచ్చుతగ్గులుండే అవకాశముంది. కాని మాతృ భూమి కొఱకు జీవించి,
మరణించడం, బలిదానము కావడం అనే విషయం అందరికి సమానమైన ప్రేరణ కలిగిస్తుంది.
వ్యక్తిగత గుణాలను సమాజానికి ఆపాదించడంతో
కాలాంతరంలో సమాజంలో అఖండ మాతృభూమి భావన, జాతీయ భావన కనుమరుగయ్యింది.
‘జాతీయత’ విషయంలో గందరగోళం ఏర్పడింది. జాతి వారసులు, జాతీయ చరిత్ర, జాతీయ
పరంపరలు చెదిరిపోయాయి. కేవలం రాజకీయ స్వాతంత్య్రంతోనే తృప్తిపొందే
పరిస్థితి ఏర్పడింది.
స్వాతంత్య్ర పోరాటపు తారక మంత్రం
‘వందేమాతరం’. సంతుష్టీకరణ పేరుతో దానిని మతంతో ముడిపెట్టి ముక్కలు చేశారు.
ఇప్పటికీ ఖండించిన ముక్కనే పాడుతున్నారు.
అదే సంతుష్టీకరణ కొరకు భాష విషయంలోనూ
రాజీపడ్డారు. సంకరమైన భాషను, భావనను ప్రవేశపెట్టారు. ‘రాజారామ్’ బదులు
‘బాదుషారామ్’, ‘రాణి సీతమ్మ’ బదులు ‘బేగమ్ సీత’, ‘మహర్షి వాల్మీకి’ బదులు
‘మౌల్వీ వాల్మీకి’ అంటూ భాషా సంకరానికి దిగజారారు.
చరిత్రనూ వదలలేదు. ఛత్రపతి శివాజీ కొండ ఎలుక అని, రాణాప్రతాప్ మతిభ్రమించిన దేశభక్తుడని చెపుతూ చరిత్ర గతిని మార్చారు.
అలా దాదాపుగా అన్ని రంగాలలో జాతీయ భావనను
యోజనాబద్ధ రీతిలో నష్టపరచి మన జాతిని యావత్తూ సమూలంగా విధ్వంసం చేసే
ప్రయత్నం చేశారు. దీనికి ఆంగ్లేయులు పూర్తి మద్దతు ఇచ్చారు. దేశభక్తి గల మన
నాయకులు ఈ కుట్రను గమనించలేకపోయే స్థితిలో ఉన్నారు.
డాక్టర్ హెడ్గేవార్‌జి ఈ పరిస్థితిని
గమనించారు. సరిగ్గా ఆ సమయంలో వారు ‘జాతీయత’ (జాతీయతనే సంస్కృతంలో
‘రాష్ట్రీయత’ అంటారు) ఆధారంగా సంపూర్ణ సమాజాన్ని మేల్కొలిపి, జాతిని సంఘటిత
పరచే శాశ్వత కార్యాన్ని చేపట్టారు. నాడు వారు చేపట్టిన జాతి మేల్కొలుపు
కార్యం నేడు విస్తరించి, నిజమౌతోంది. ప్రవాహంతో కలసిపోవడం లేక ప్రవాహానికి
ఎదురీదడం మాత్రమే కాక, ప్రవాహాన్ని యోగ్యమైన దిశలో మార్చి – విజయం సాధించిన
ధీరోదాత్తుడు డాక్టర్ హెడ్గేవార్‌జి.
విజయానికి మూల కారణం
ఈ విజయానికి మూలకారణం ఒకటి సత్య
సిద్ధాంతం, రెండవది రాష్ట్రీయ స్వయంసేవ సంఘ కార్యపద్ధతి, మూడవది డాక్టర్‌జి
సర్వసమర్పిత విలక్షణమైన జీవనశైలి.
ఆర్యసమాజం లాంటి సంస్థలు నిస్వార్థభావనతో,
ధార్మిక లోపాలను సరిదిద్ది, ధార్మిక చైతన్యం ద్వారా సమాజ జాగృతి
(మేల్కొలుపు) కై పనిచేసేవారు. హిందూ మహాసభ వారు రాజకీయ చైతన్యం ద్వారానే
జాతి జాగృతి సాధ్యమని భావించేవారు, కాని డాక్టర్ హెడ్గేవార్ సమగ్రమైన
ఆలోచన చేశారు. ఆయన 1925లో ‘రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్.ఎస్.ఎస్.)’
స్థాపించి హిందూ సంఘటనా (హిందువులలో ఐక్యత నింపటం) కార్యమే ప్రారంభించారు.
అయితే హిందూ చైతన్యమునకు ‘సమూహాన్ని’ ఆధారంగా స్వీకరించకుండా ‘వ్యక్తి’ ని
కేంద్రంగా స్వీకరించారు.
ప్రతి హిందువులోనూ నూతన సంస్కారాలను
నింపటం; అలా సంస్కారాలను పొందిన వ్యక్తి తన ఆచరణ ద్వారా సామాజిక,
సాంస్కృతిక, రాజనైతిక చైతన్యంతో సంపూర్ణ సమాజం కొఱకు పనిచేసే వ్యక్తిత్వం
కలిగి ఉండడం; అటువంటి వ్యక్తుల పని ఆధారంగా పరిపూర్ణ సమాజం సంఘటితమూ,
చైతన్యవంతమూ కాగలదని డా||హెడ్గేవార్ భావించారు.
బాహ్యరూపంలో సంఘం మిగిలిన సంస్థల లాగే
కనపడుతున్నప్పటికి, సమాజ జీవితములోని ప్రతి క్షేత్రంలోను స్వయంసేవకుల
ప్రభావం నేడు కనపడుతోంది. ఆనాడు డా||హెడ్గేవార్‌జి చేసిన నిర్మాణాత్మక
కార్యం వలనే ఈ మార్పు సాధ్యమైంది.
1940 సంవత్సరంలో పుణెలో జరిగిన
ఆర్.ఎస్.ఎస్. శిబిరంలో డా||హెడ్గేవార్‌జి ప్రసంగిస్తూ ‘హిందూస్థానం ఒక
జాతి, హిందూ సమాజం జాతీయ సమాజం, మనందరం ఈ సమాజ అవయవాలు వంటివారం. సమాజం
యొక్క ప్రతి అవయవం జాతి కొఱకే ఉపయోగపడాలి. జాతి రూపంలో ఉండే విరాట్
స్వరూపానికి మనలను మనం సమర్పించుకొని పనిచేయడమే మన కర్తవ్యం’ అన్నారు.
కార్యపద్ధతి
జాతీయ భావనలు లుప్తమైపోయిన నాటి మన జాతిలో 3 రకాలైన దోషాలను డా||హెడ్గేవార్ లోతుగా అధ్యయనం చేసి తెలుసుకున్నారు.
- ఆత్మవిస్తృతి – మనం ఎవరం, మన జాతి ఏది, మన సంస్కృతి ఏది, మన పరంపర, మన చరిత్ర వంటివి అన్నిటినీ మన జాతి మరచి పోయింది. అందుకే ‘ఆత్మబోధ’ లేక ‘ఆత్మజ్ఞానం’ కలగాలన్నారు. అంటే మనం హిందువులం, మనది హిందూ జాతీయత, హిందూ సంస్కృతి, హిందూ పరంపర అనే విషయాలు తెలియచేయాలన్నారు. ప్రతి భారతీయునిలోనూ మన మాతృభూమి పట్ల భక్తి శ్రద్ధ జాగృతం కావాలన్నారు.
- మన సమాజం అసంఘటిమై (అనైక్యత) బలహీనమైంది. అసంఘటితమైన సమాజం కలియుగంలో జీవించే హక్కును కోల్పోతుంది. బానిసలుగా బ్రతకవలసి వస్తుంది. అందుకు సంఘటనే (ఐక్యత) శరణమన్నారు. ‘హిందూ సంఘటన’ కార్యం ప్రారంభించారు.
- వ్యక్తి ఆత్మ కేంద్రితమయయ్యాడు. అంటే ‘నేను-నా స్వార్థం’ అనే భావంలో వ్యక్తి మునిగి పోయాడు. ‘నేను – నా స్వార్థం’ నుండి బయటపడి, ‘మనం – మన సమాజం’ అనే భావన పెంచుకోవడం వల్ల మాత్రమే వ్యక్తి సుఖంగా జీవించగలడు. తద్వారా సమాజము చిరంజీవి కాగలదు అన్నారు.
వ్యక్తిలో నిస్వార్ధం, ఆత్మజ్ఞానం,
ఆత్మబోధ కలిగి; సమాజం సంఘటితం కావడం కోసం హిందువు లందరూ ప్రతిరోజు, ప్రతి
బస్తీలో, గ్రామంలో ఒక నిర్దిష్టమైన సమయంలో, స్థలంలో ఒక గంటసేపు కలసి
మాతృభూమి ఉన్నతి కోసం సాధన చేయాలి. దానినే ‘శాఖ’ అన్నారు డాక్టర్
హెడ్గేవార్. హిందూ సంఘటన కార్యం చేయటానికి ‘శాఖ’ అనే మంత్రాన్ని
జాతికందించారు.
అందుకే పరమ పూజనీయ డాక్టర్‌జీ సంఘ మంత్ర ‘ద్రష్ట’, సంఘ తంత్ర ‘స్రష్ట’ అయ్యారు.
1925లో డాక్టర్జి సంఘాన్ని ప్రారంభించారు,
1940లో పరమపదించారు. ఆ 15 సంవత్సరాల లోనే వారు సంఘ కార్యాన్ని దేశం
నలుమూలలా వ్యాపింపచేశారు. హిందూ సంఘటన కార్యం సాధించారు. ఈ కార్యం
విజయవంతమై, వచ్చిన ఫలితాలను చూస్తూ యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోతోంది.
డా|| హెడ్గేవార్ హిందూ సమాజ సంఘటన
కార్యాన్ని ప్రారంభించేముందు కొంతమంది వారిని పరిహసించారు. ‘హిందూ సమాజం
జీర్ణావస్థలో ఉన్నది. ఇది మరణించబోతున్నది. ఈ సమాజాన్ని సంఘటితం చేయడం ఎవరి
వల్లా కాదు. ఇది అసంభవం’ అంటూ గొప్ప దేశభక్తులు కూడా వారిని నిరుత్సాహ
పరచారు. అయితే, డా||హెడ్గేవార్ నిరుత్సాహ పడక ధైర్యంగా, విశ్వాసంతో
ఉన్నారు. వారు ఎవరితోను వాదనకు దిగలేదు. బదులుగా అందరి దీవెనలు కోరారు.
తనను తాను దేశం కోసం పూర్తిగా అర్పించుకున్నారు. ప్రపంచ చరిత్రలో ఇటువంటి
ఉన్నతమైన ఉదాహరణ మరొకటి లేదు.
- వడ్ల భాగయ్య
ఆర్.ఎస్.ఎస్. సహ సర్ కార్యవాహ
(జాగృతి సౌజన్యం తో)
(ఈ వ్యాసం మొదట 27 మర్చి, 2017 నాడు ప్రచురితమైంది)
Source - VSK telangana
కొంతమంది మహాపురుషులు భవిష్యత్తును గురించిన సత్యాన్ని అనుభవించి, తమ ధృడమైన ఆత్మ బలంతోను, ధృడ విశ్వాసంతోను ముందు తరాలకు మార్గదర్శనం చేస్తారు. ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి చూపుతూ జీవిస్తారు. వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటివారినే ‘యుగ ప్రవక్త’ లేక ‘యుగ ద్రష్ట’ అంటారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డా||హెడ్గేవార్ అటువంటి యుగ ప్రవక్తలలో ఒకరు.
ReplyDelete