Breaking News

చైనా దూకుడుకు భారత్‌ ‌కళ్ళెం

‘యుద్ధం చేయకుండానే శత్రువును జయించు’ అన్న సున్‌ ‌జో సూత్రాన్ని తుచ తప్పకుండా అనుసరించాలని చైనా చాలా ప్రయత్నం చేస్తుంటుంది. నేరుగా యుద్ధానికి దిగకుండా సరిహద్దు వివాదాలను సృష్టించి పొరుగుదేశాల భూభాగాలను కబళించడం ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తుంటుంది. అలాగే నాసిరకమైన వస్తువుల్ని పెద్దసంఖ్యలో తయారుచేసి ఇతర దేశాల మార్కెట్‌లను ముంచెత్తి ఆర్థిక విస్తరణకు పాల్పడుతోంది. చైనా ఇటీవల లఢఖ్‌ ‌ప్రాంతంలో పాల్పడిన చొరబాట్ల వల్ల భారత, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
 

 పరిస్థితిని సమీక్షించి సైనికులకు ధైర్యం చెప్పడానికి ప్రధాని మోదీ స్వయంగా సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. చివరికి అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవడంలో భారత్‌ ‌దౌత్యపరమైన విజయం సాధించడం, ప్రపంచం ముందు దోషిగా, ఏకాకిగా నిలబడడంతో చైనా వెనుకకు తగ్గకతప్పలేదు. గాల్వన్‌ ‌ప్రాంతంలో చైనా దళాలు రెండు కిలోమీటర్లకు పైగా వెనక్కు వెళ్ళాయి.
జూన్‌ 15 ‌సోమవారం రాత్రి తూర్పు లఢఖ్‌ ‌ప్రాంతంలో గాల్వన్‌ ‌లోయవద్ద భారత, చైనా దళాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.  సరిహద్దులో గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై చైనా దళాలు విరుచుకుపడ్డాయి. రాళ్ళు, ఇనుప కడ్డీలు, కర్రలతో రెండు పక్షాల మధ్య ముష్టి ఘాతాలతో యుద్ధం జరిగింది. హిమప్రాంతం నెత్తురోడింది. ఈ ఘర్షణలో 16వ రెజిమెంట్‌కు కమాండింగ్‌ అధికారిగా ఉన్న కల్నర్‌ ‌సంతోష్‌ ‌బాబుతోసహా 20 మంది భారత జవానులు వీరమరణం పొందారు. చైనా సైన్యంలో కూడా 43-55మంది వరకూ చనిపోయారని ఎఎన్‌ఐ ‌తదితర వార్తా సంస్థలు తెలిపాయి. చైనా పత్రికల సమాచారం ప్రకారం 55మంది చైనా సైనికులు చనిపోయారు. బీహార్‌ ‌రెజిమెంట్‌కు చెందిన భారతీయ సైనికులు వీరోచితంగా పోరాడారు. 1996లో జరిగిన ఒప్పందం మేరకు చేత ఆయుధాలు ఉన్నా వాటిని రెండు పక్షాలూ ఉపయోగించలేదు. ‘భారత్‌తో యుద్ధంలో మేము ఓడిపోయాము’ అంటూ చైనా బీజింగ్‌ ‌పత్రిక వార్తలు ప్రచురించింది.
కనీసం 35,40మంది చైనా సైనికుల తలలు తెగాయని, ముఖాలు ఛిద్రం అయ్యాయని, చైనీయుల చేతుల్లోని రాళ్ళు, ఇనుపచువ్వలు, కర్రలు లాక్కునిమరీ భారతీయ సైనికులు నాలుగు గంటలపాటు పోరు జరిపారని పత్రికలు వ్రాశాయి. చైనా సైనికులు పర్వతాల్లో దాక్కునేందుకు పారిపోయారని, వారిని భారత సైనికులు వెంబడించారని వార్తలొచ్చాయి. అది అంతా పర్వతప్రాంతం. గాల్వన్‌ ‌నది పారుతున్నది. చల్లని వాతావరణం. పోరాటంలో తోపులాటలు జరిగాయి. అందులో ఆ పర్వతాల నుంచి సైనికులు లోయలో పడిపోయారు. అలా రెండుచేతులతో నలుగురేసి చైనా సైనికుల్ని ఇరికించుకుని లోయలోకి విసిరేసిన భారత సైనికులు చాలామందే  ఉన్నారు. పంజాబ్‌ ‌ఘాతక్‌ ‌రెజిమెంట్‌కు చెందిన గురుతేజ్‌ ‌సింగ్‌ అయితే ఏకంగా 12మంది చైనీయుల్ని అలా పరలోకానికి పంపాడు. అలా పోరాడుతూ చివరికి తాను కూడా లోయలోకి పడిపోయాడు 23 ఏళ్ళ గురుతేజ్‌సింగ్‌.
‌చైనా సైనికులు గాల్వన్‌ ‌ప్రాంతంలో చొరబాట్లకు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. 55రోజులపాటు చైనా సైనికులు ప్రయత్నాలను భారత దళాలు శాంతియుతంగానే ఎదుర్కొన్నారు. మొదట సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో అంగీకరించిన ప్రకారం గస్తీ పోస్ట్ 14 ‌నుంచి ఖాళీ చేసిన చైనా దళాలు అంతలోనే మళ్ళీ ఆ ప్రాంతంలోకి చొచ్చుకురావడమేకాక తమ సంఖ్యను పెంచుకున్నాయి. ఇదే విషయాన్ని గురించి చర్చించడానికి వెళ్ళిన కల్నల్‌ ‌సంతోష్‌బాబుపై పాశవికంగా దాడిచేశాయి. పథకం ప్రకారం చైనా చేసిన దాడిని ఎదుర్కొనడంలో, ఎండగట్టంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది. చైనా కుతంత్రాన్ని ప్రపంచానికి తెలియజెప్పింది. దానితో ప్రపంచం వ్యాప్తంగా, ముఖ్యంగా చైనా సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలలో, భారత్‌పట్ల మద్దతు పెరిగింది. తైవాన్‌ ‌వార్తా పత్రిక శ్రీరాముడు తన ధనుస్సును చైనా డ్రాగన్‌ ‌పై ఎక్కుపెట్టిన ఫోటో ప్రచురించింది. ‘మేము జయించాం, మేము చంపాం’ అంటూ ఆ ఫోటోకు శీర్షిక కూడా పెట్టింది.
చైనా దూకుడు వెనుక అనేక కారణాలు ఉన్నాయి. 2050నాటికి ప్రపంచస్థాయి సైన్యాన్ని నిర్మాణం చేసుకోవాలని చైనా సంకల్పించింది. అందుకనే 2019 బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఏకంగా 261 బిలియన్‌ ‌డాలర్లు కేటాయించింది. అలాగే కరోనా వైరస్‌ ‌వ్యాప్తి కూడా చైనాకు ప్రపంచ వ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చింది. మహమ్మారిని అంటించిందంటూ ప్రపంచ దేశాలు చైనాను దుమ్మెత్తి పోస్తున్నాయి. దానితో అనేక విదేశీ కంపెనీలు చైనా నుంచి తట్టబుట్ట సర్దుకుని తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. ఆ కంపెనీలు భారత్‌వైపు దృష్టి సారించడంతో చైనాకు మరింత కంటగింపుగా ఉంది. ప్రపంచం దృష్టి మళ్ళించ డానికి, భారత్‌ను ఇరుకున పెట్టడానికే చైనా ఈ సరిహద్దు వివాదపు నాటకానికి తెరతీసిందని రక్షణ నిపుణులు అంటున్నారు.
అలాగే చైనాలో కూడా జీ పింగ్‌ ‌కమ్యూనిస్టు ప్రభుత్వంపట్ల కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. కమ్యూనిస్టుపార్టీలో కూడా లుకలుకలు బయలు దేరాయి. 2019లో చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది ర్యాలీలు జరిగాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. హాంకాంగ్‌లో ఏడాదిగా చైనా వ్యతిరేక, ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలు జరుగుతున్నాయి. తైవాన్‌కు చైనాతో ప్రాదేశిక సమగ్రత విషయంలో సమస్యలున్నాయి. అనేక దేశాలను అప్పుల ఊబిలో దింపిన చైనా వాటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటోంది.
భారత్‌కు చెందిన వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఇప్పటికే ఆక్రమించుకుంది. 1962లో అక్సాయ్‌చిన్‌, 1963‌లో కారకోరమ్‌, 2008‌లో చబ్జిలోయ, టియాపంగ్నకలోయ, 2012లో డెండోన్‌, 2013‌లో రాకి సులాలను ఆక్రమించుకుంది.  చైనా ఇలా మన భూభాగాలను ఆక్రమిస్తుంటే కళ్ళప్పగించి చూసిన మన ప్రభుత్వాలు తమ నిర్వాకానికి అనేక కుంటిసాకులు చెపుతూ వచ్చాయి. ‘మనకు మౌలిక సదుపాయాలు లేకపోవడమే చైనాను ఎదుర్కొనలేకపోవడానికి కారణం’ అంటూ 2013 సాక్షాత్తు అప్పటి రక్షణ మంత్రి ఆంటోనీ పార్లమెంట్‌లో చెప్పారు. కానీ 2014 తరువాత మోదీ ప్రభుత్వం సరిహద్దు రక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చి రోడ్లు, బ్రిడ్జ్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. దీనివల్ల మన సైన్యం సులువుగా సరిహద్దులకు చేరడానికి వీలుకలిగింది. దీనితో 2017లో డోక్లాంవద్ద చైనా దురాక్రమణను అడ్డుకున్న బలగాలు ఇప్పుడు గాల్వన్‌లో కూడా నిలువరించాయి. ప్రపంచంలోనే, ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో, చక్రంతిప్పాలనుకున్న చైనాకు ఇలా భారత్‌ ‌బలపడటం ఏమాత్రం మింగుడు పడటం లేదు. అందుకే వివాదాలు సృష్టిస్తోంది.
- హనుమత్‌ ‌ప్రసాద్‌

1 comment:

  1. చైనా దూకుడుకు భారత్‌ ‌కళ్ళెం

    ReplyDelete