ఆదిశంకరాచార్య జీవిత చరిత్ర-Adi Shankaracharya Life Story in telugu
ఏప్రిల్ 28 ఆదిశంకరాచార్యులు జయంతి.
ద్వాపర యుగాంతంలో ధర్మ సంరక్షణకై జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌణీల సైన్యం ఆహుతి అయ్యింది. శ్రీకృష్ణుడు రక్షించిన ధర్మం నెమ్మదిగా తన గమ్యం నుండి కనుమరుగైంది. దేశమంతా జాతి విరుద్ధమైన ప్రవృత్తులు ప్రబలాయి. ధర్మం పతనంవైపు వేగంగా పరుగెడుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలను సరియైన దిశగా నడిపించటానికి తీవ్రమైన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వేదాలలోని అంతరార్థ సత్యాన్ని తిరిగి ప్రకటించటం కోసం మూడు కొత్త దర్శనాలు మొదలయ్యాయి. అవి పతంజలి యోగదర్శనం, జైమినిమీమాంస దర్శనం, బాదరాయణ వేదాంత దర్శనం.
వేదాలలోని కర్మకాండకు వ్యతిరేకంగా శ్రీకృష్ణుడు పూనుకొన్నాడు. కర్మకాండపై భాగవత ధర్మం పై చేయి సాధించింది. దేశం లోని సాంఘిక వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా ఇంద్రాది దేవతల పూజలు మాన్పించారు. వేదాల మీద, వైదిక వ్యవస్థపైన సంపూర్ణ ఆదారభావం ఏర్పడింది. ఈ విధంగా భాగవత ధర్మ ప్రభావం ఒకవైపు పెరుగుతోంది. దానిని కొత్త పుంతలు త్రొక్కించటానికి బాదరాయణుడు వేదాలలో విజ్ఞానకాండను ఆధారం చేసుకొని పరమ జ్ఞానోద్భవమైన అద్వైతాన్ని ప్రతిపా దించాడు. తరువాత కాలంలో అనేకమంది మహాపురుషులు లోక కల్యాణం కోసం వేదాంత దర్శనాన్ని మార్గదర్శిగా స్వీకరించి పనిచేశారు. కలియుగం ప్రారంభమైన 1200 సంవత్సరాల తరువాత ఈ దేశంలో బుద్ధుడు జన్మించాడు. ఆయన ప్రారంభించిన బౌద్ధం కర్మకాండపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది. అంతటితో ఆగకుండా ఈ కర్మకాండకు వేదాలు బ్రాహ్మణులు మూలమనే ప్రచారం మొదలైంది. వాటిని వదిలేసి క్రొత్త పంథాతో సమాజం పయనించింది. అనతి కాలంలోనే బౌద్ధం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దేశంలో కర్మకాండ కూడా ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజలు మానసిక మైన సత్ప్రవర్తన కంటే యజ్ఞయాగాదులే గొప్పవని భావించే స్థితి నెలకొంది. ధర్మశాస్త్రజ్ఞుల మనస్సులలో దయ, శాంతి, అక్రోధం, అహింసల స్థానంలో క్రౌర్యం, క్రోధం, హింస ఆక్రమించాయి. క్షమ అంటే పిరికితనంగా భావించే మానసిక స్థితి ఉత్పన్నం అయింది. దీనితో వివిధ సాంప్రదాయాల మధ్య సంఘర్షణలు చోటుచేసుకొన్నాయి. వీటిని చక్కదిద్ది దేశంలో ఒక జాతీయ భావ సమైక్యతను నిర్మాణం చేయవలసిన చారిత్రక అవసరం ఏర్పడింది. ఇది పూరించటానికే అన్నట్లు జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మించారు.
శంకరాచార్యులు 32 ఏళ్లకే ఆసేతు హిమాచలం పర్యటించారు. దేశంలో వివిధ సాంప్రదాయాలను సమన్వయపరుస్తూ షణ్మతాలను స్థాపించారు. షణ్మత స్థాపనాచార్య అనే బిరుదు పొందారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రజల ముందుంచారు.
శంకరాచార్యులకు పూర్వం బాదరాయణుని కుమారుడు శుకదేవుడు వేదాంత దర్శనాన్ని వ్యాఖ్యానించి బోధించారు. శుకదేవుని శిష్యుడైన గౌడపాదుడు దానిని కొనసాగించారు. ఆయన ప్రారంభంలో పతంజలి మహర్షి వద్ద విద్యను అభ్యసించారు. ఆ తదుపరి బదరికాశ్రమం చేరి వేదాంతం అధ్యయనం చేశారు. ఆ గౌడపాదుని శిష్యుడు గోవిందపాదులు. ఆయన నర్మదానది ఒడ్డున అమరకాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని వేదాంతం బోధిస్తున్నారు. శంకరుడు తన గురువు వద్ద విద్య పూర్తి చేసుకొని అమర కాంతం చేరి గోవిందపాదుల శిష్యులైనారు. శంకరుల ప్రతిభ పా•వాలను చూసి గోవింద పాదులు తన జ్ఞానమంతా ఆయనకు ఇచ్చి తన గురువు గౌడపాదుల దగ్గరకు తీసుకొని వెళ్లారు. గౌడపాదులు శంకరునిలో ధర్మరక్షకుడ్ని దర్శించారు. విధిపూర్వకంగా సన్యాస ధర్మం ఉపదేశించారు. శంకరాచార్యులు గౌడపాదుల వద్ద అధ్యయనం చేస్తూనే మరోప్రక్క అనేక భాష్యాలు రచించారు. శంకర భాష్యాలన్నీ జగత్ ప్రసిద్ధి పొందాయి. అందులో ప్రస్థాన త్రయంపై వ్రాసిన భాష్యాలు ప్రముఖమైనవి. శిక్షణ పొందిన తరువాత శంకరులు వేదాంత ప్రచారానికి దిగ్విజయ యాత్రను ప్రారంభించారు. దేశంలో వైదిక కర్మకాండ భాగవత ధర్మాన్ని సమన్వయ పరిచి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి చైతన్యం నింపారు.
అయితే ఈ మహత్కార్యం కోసం దేశవ్యాప్తంగా పనిచేసేందుకు యోగ్యులైన శిష్యులను ఎంపిక చేసుకోవటం పెద్ద పని. అందుకు మొదట కాశీ చేరారు. కాశీ సర్వ విద్యలకు నిలయం. ఆధ్యాత్మిక శ్రద్దా కేంద్రం. అక్కడ ప్రఖ్యాత పండితులు ఉన్నారు. వాళ్లతో శంకరుడు శాస్త్ర చర్చలు ప్రారంభించారు. క్రమంగా ఆయన ప్రతిభా సామర్ధ్యాలను గుర్తించి వారి అనుయాయులైనారు. మొట్టమొదట వైదిక కర్మకాండను శ్రద్ధగా అనుష్ఠానం చేస్తొన్న పండితులను తనతో కలుపుకొనే పని చేపట్టారు. ఆ కాలంలో ఉత్తరభారతంలో కుమారిలభట్టు మీమాంసలో ఉద్దండ పండితుడు. ఆయన శిష్యగణం కూడా చాలా పెద్దది. వారిలో అత్యంత జ్ఞానసంపన్నులు ఉన్నారు. ప్రతిష్ఠానపురంలో ప్రభాకరాచార్యులు ప్రసిద్ధులు. శంకరాచార్యులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి వారితో చర్చించారు. శంకరుడు ప్రతిపాదించిన విషయాలు ప్రభాకరాచార్యులు అంగీకరించి ఆయనకు శిష్యులైనారు. ప్రభాకరా చార్యుల పుత్రుడు పృథ్వీధరుడు సర్వజ్ఞాని. కాని ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పృథ్వీధరుడుతో శంకరాచార్యులు మాట కలిపి ఆయనలోని ప్రతిభా సామర్థ్యాలు గుర్తించి తన ప్రముఖ శిష్యులుగా చేసుకొని, హస్తామలకుడని పేరు పెట్టారు. ఆ తర్వాత కుమారిల భట్టు శిష్యులలో ప్రథముడైన మండన మిశ్రుని దగ్గరకు వెళ్లాడు. ఇరువురి మధ్య అనేక రోజుల పాటు శాస్త్ర చర్చలు వాదోపవాదాలు జరిగాయి. మండన మిశ్రుని సహధర్మచారిణి భారతీతో కూడా శాస్త్ర చర్చలు చేశారు. చివరకు మండన మిశ్రుడు వాదనలో పరాజయం పాలయ్యాడు. తనను తాను శంకరులకు సమర్పించుకొని సన్యాసం స్వీకరించారు. దీనితో శంకరాచార్యుల జైత్రయాత్రలో ఒక ప్రముఖ ఘట్టం పూర్తి అయింది. అక్కడ నుండి నేరుగా బౌద్ధుల కేంద్రమైన తక్షశిలకు చేరుకొన్నారు. బౌద్ధులతో హోరాహోరిగా చర్చలు జరిగాయి. బౌద్ధం ఒక రూఢివాదంగా మారి స్వ – పర బేధాలు మరిచిపోయింది. ఆ మతావలంభికుల కారణంగా విదేశీయులతో ముప్పు వచ్చింది. విదేశీ దురాక్రమణదారులు బౌద్ధం స్వీకరించి భారత్‌ను ఆక్రమించుకొనేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. భారత్‌లో ప్రాచీన సాంప్ర దాయాలతో బలమైన ధార్మికవ్యవస్థ ఉంది. అది విచ్ఛిన్నం చేస్తేనే భారతదేశ సాంఘిక వ్యవస్థ బలహీనమవుతుంది. తద్వారా ఇక్కడి ప్రజలలో స్వాతంత్య్రేచ్ఛ నశిస్తుంది. ఈ లక్ష్య సాధనగా జరుగుతున్న ప్రయత్నాలను వమ్ము చేయవలసిన ఒక జాతీయ అవసరం నాడు ఏర్పడింది. తమ పూర్వుల మీద గౌరవం నశించినప్పుడు, తమ జన్మభూమితో సంబంధం లేనిచోట వ్యతిరేకమైన జాతీయ భావాలు ఉత్పన్నం కావటం సహజం. దేశమంటే మమకారం లేకుండానే బౌద్ధం దేశాంతరాలకు వెళ్లింది. బౌద్ధులకు తమ దేశ బంధువులకంటే బౌద్ధధర్మ బంధువులే కావలసినవారైనారు. దానితో దేశంలో చాలా సమస్యలు తలెత్తాయి. బౌద్ధ అనుయాయులకు ఈ దేశం పట్ల మమకారం నిర్మాణం చేయటంలో శంకరులు ప్రయత్నించి సఫలమైనారు. అక్కడి నుండి కశ్మీరం చేరుకొని శారదామాతానుగ్రహం పొందారు. పండితులతో శాస్త్రచర్చలు జరిపి ఆధ్యాత్మిక జాతీయ జీవన స్రవంతిలోకి వారిని తీసుకొచ్చారు. తాంత్రిక విద్యలకు ప్రధాన కేంద్రమైన అస్సాంలోని పండితులను తన మార్గంలోకి తెచ్చుకొన్నారు. ఈ విధంగా శంకరాచార్యులు ఆసేతుహిమాచలం, మానస సరోవరం వరకు కాలినడకన ప్రయాణించారు. ఆయన ప్రయత్నాల వల్ల దేశం రూఢివాదంలో పడలేదు. నాస్తికవాద ప్రవాహంలో మునిగి పోలేదు. హిందూధర్మం మరింత సుసంపన్నం అయింది. సురక్షిత మార్గంలో పయనించింది. ఈ భావాలు నిరంతరం జాగృత పరిచేందుకు దేశంలో నాలుగు వైపులా పీఠాలు స్థాపించారు. దక్షిణాన- శృంగేరి ఉత్తరాన – బదరి, తూర్పున – పూరి, పడమర – ద్వారికా. ఆ పీఠాలకు తన శిష్యులను అధిపతులను చేశారు. నాటి నుండి ఆ ధర్మపీఠాలు అవిచ్ఛన్నంగా కొనసాగుతూ ఈ దేశ సంస్కృతి, ధర్మానికి మార్గనిర్ధేశనం చేస్తున్నాయి.
ఆ తర్వాత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవం, ఇస్లాం సెమిటెక్ మతాలు పుట్టుకొచ్చాయి. ఎనిమిదవ శతాబ్దంలో అరేబియా నుండి రేగెన పెను తుఫాను యూరోపు, ఈజిప్టు, స్పెయిన్, సిరియా వంటి పెద్ద దేశాలను సమూలంగా నాశనం చేసింది. భారతదేశానికి వచ్చి సముద్రపు ఒడ్డు దెబ్బ తిని తిరిగి వెళ్లిపోయింది. కానీ దాని తరువాత రాజకీయ ఆక్రమణలు చాలా పెరిగాయి. ఈ దేశాన్ని కాపాడుకొనేందుకు సుదీర్ఘ పోరాటం చేయవలసి వచ్చింది. ఇంకా చేస్తూనే ఉన్నాం. ఎడారి మతాల అల్లకల్లోలాలను ఎదుర్కొనే ఆధ్యాత్మిక శక్తి, ధీశక్తి దేశంలో నిర్మాణం చేయటానికి ప్రేరణ స్త్రోతస్సు జగద్గురు ఆది శంకరాచార్యులు. సింధూనది నుండి బ్రహ్మపుత్ర వరకు సేతువు నుండి శీతాచలం వరకు విస్తృతమైన పుణ్యధరణి మన మాతృభూమిలో గౌరవం, స్వాభిమానం, నిర్మాణం చేయాలి. ఈ దేశంపట్ల మమకారాన్ని కోల్పోయిన ఎడారి మతానుయాయులను పాశ్చాత్య సిద్ధాంతాల ప్రభావంలో కొట్టు మిట్టాడుతొన్న వారిలోనూ దేశభక్తి భావాలు పెంపొందించాలి. పవిత్రమైన ఈ భారతావనిని ఆరాధించే మానసికతను జాగృతం చేయాలి. ఇది సాధించేందుకు జగద్గురు శంకరాచార్యులు చూపిన మార్గం అందరికి ఆచరణీయం.అనుసరణీయం.
– రాంపల్లి మల్లికార్జున్, ప్రాంత కార్యకారిణి సభ్యులు.
మూలం: జాగృతి వారపత్రిక
ఆధ్యాత్మిక జాతీయ భావాలకు ఆద్యుడు
ReplyDelete