Breaking News

స్వదేశీ అంటే వస్తువులు మాత్రమే కాదు-Swadeshi Movement


స్వదేశీ పదం సంకుచిత శబ్దం కాదు. ఆత్మాభిమానానికి, స్వావలంబన కు ప్రతీక. ఆధునిక కాలంలో అన్ని దేశాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. గ్లోబలైజేషన్,లిబరలైజెషన్ విధానాలతో వ్యాపారాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కొనసాగటం సహజం. ఈ స్థితిలో 'స్వదేశీ' అంటూ మన దేశం తలుపులు బిగించుకుని కూర్చుంటే ప్రగతి ఎలా సాధ్యం?
అయితే దేశం అంటే కేవలం వ్యాపార లావాదేవీలు, లాభనష్టాలు మాత్రమే కాదు. తమ కాళ్ల మీద తాము నిలబడి పది మంది కి ఉద్యోగాలు ఇస్తూ ఆర్థికంగా అందరినీ స్వతంత్రులుగా రూపొందించటం, వేల సంవత్సరాల మన సంస్కృతీ సంప్రదాయాలతో మమేకమై,స్వాభిమానం తో జీవించటం కోసం ప్రయత్నం చేయటం స్వదేశీ...
* 'మాతా భూమి:పుత్రోహం పృథివ్యా:' ఈ భూమి నా తల్లి నేనామె పుత్రుడను..అని అధర్వణ వేదం చెప్పింది. నా దేశం తల్లి వంటిది. నా స్వార్థం కోసం తల్లిని అమ్మకానికి పెట్టే దేశ ద్రోహ వ్యాపారాలకు కేంద్రంగా నా భూమిని మార్చొద్దు.
** లంకను గెలిచి అయోధ్య తిరుగు ప్రయాణం లో లక్ష్మణుడికి బంగారు లంక పట్ల ఆసక్తి ని గమనించిన శ్రీ రాముడు 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ' అంటూ తల్లి మరియు కన్నభూమి - స్వర్గం కంటె మిన్న యని వ్యాఖ్యానించడం వెనక అర్థం విదేశీ అలవాట్లు మనకు సరిపడవని,కనుక మోజు వద్దని చెప్పటం స్వదేశీ కి మంచి ఉదాహరణ.
*** అలాగే భగవద్గీత లో 3 వ అధ్యాయం కర్మయోగం 35 వ శ్లోకంలో లో " శ్రేయాన్ స్వధర్మో విగుణ: పర ధర్మాత్ స్వనుష్టితాత్ ,స్వధర్మే నిధనం శ్రేయ:పరధర్మో భయావహ:" వేల సంవత్సరాల చరిత్ర గల మన సంస్కృతీ సంప్రదాయాలతో , మన పూర్వీకుల తో వున్న తరతరాల సంబంధ బాంధవ్యాలతో మమేకమైన మన మానసిక స్థితియే మన నిజమైన స్వధర్మం. ఇందులోనే నాకు ప్రగతి గలదు. పర ధర్మం కొత్తదే కాకుండా భయం గొల్పుతుంది. నా ధర్మం లొనే మరణించటం నాకు శ్రేయస్సునిస్తుంది. ఇది కూడా స్వదేశీ భావనయే.
స్వదేశీ అంటే వస్తువులు మాత్రమే కాదు. హృదయ పూర్వక భావన.నా దేశపు భౌతిక, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ది లోనే నా వికాసం కూడా మిళితమై వుంది.ఇదే స్వదేశీ...

- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. నా దేశపు భౌతిక, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ది లోనే నా వికాసం కూడా మిళితమై వుంది.ఇదే స్వదేశీ...

    ReplyDelete