Breaking News

ప్రజాస్వామ్య స్ఫూర్తికి గీటురాయి

గాంధీజీ జీవితాన్ని చూస్తే అలాంటి వ్యక్తి ఈ భూమ్మీద నడయాడాడా అనిపిస్తుంది అన్నారు అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌.
నరేంద్రమోదీ మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతాప్‌ చంద్ర సారంగిని చూసినా ఇదే అనిపిస్తుంది.
అలాంటి వ్యక్తి ఇప్పుడు అసలు ఎంపీ కాగలడా? ఎంపి అయినా కేంద్రంలో మంత్రికాగలరా? అని! కానీ ఇది నిజం!
సారంగికి ఒక పూరిల్లు మాత్రం ఉంది. ఆయన వాహనం సైకిల్‌. రెండు పర్యాయాలు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ నిరాడంబర జీవితం నుంచి ఆయన దూరంగా జరగలేదు. 2019 ఎన్నికలలో బాలాసోర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు.
రాన్రాను ఎన్నికలలో ధన ప్రభావం పెరిగిపోతోం దన్న మాట ఇప్పుడు సర్వసాధారణం. ఇందులో నిజం లేకపోలేదు. అలాగే మినహాయింపులు కూడా లేకపోలేదు. ఇందుకు గొప్ప ఉదాహరణ ఒడిశాలోని బాలాసోర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన ప్రతాప్‌చంద్ర సారంగి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు సారంగి. పేదింటి పిల్లల కోసం పాఠశాలలు నెలకొల్పడం, సంస్కృత భాషా వ్యాప్తికి పాటు పడడం – ఈ రెండే ఆయన కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు.
సారంగిని ఒడిశా నరేంద్ర మోదీ అని అంతా ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. 65 ఏళ్ల ఈ బ్రహ్మచారి మొదట ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌. ప్రస్తుతం ఆయన చేపట్టి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకి హద్దే లేదు. సాంకార కేంద్ర పాఠశాలలు పేరుతో ఆయన వందలాది గిరిజన గ్రామాలలో పాఠశాలలు ప్రారంభించారు. బాలాసోర్‌ కేంద్రంగా పనిచేసే జ్ఞాన శిక్షణామందిర్‌ యోజన ఆధ్వర్యంలో ఇవన్నీ నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలలను మయూర్‌ భంజ్‌ జిల్లాలో కూడా స్థాపించారు. మద్యపానానికి వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తెచ్చే కార్యక్రమం, అవినీతికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం, పోలీసు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఇవన్నీ కూడా సారంగి చిరకాలంగా నిర్వహిస్తున్నారు.

సారంగికి మొదట సన్యాసం స్వీకరించి, పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని కోరిక. అందుకే మొదట ఆయన రామకృష్ణ మఠం వారిని సంప్రదించారు. కానీ సారంగిని వారు ఇంటర్వ్యూ చేసిన తరువాత సన్యాసం ఆయనకి సరికాదనిపించి పంపేశారు. సారంగికి ఒక విధవరాలైన తల్లి ఉండేవారు. ఆమె పోషణ బాధ్యత తీసుకునే వారు లేరు. కాబట్టి రామకృష్ణ మఠం వారు చేర్చుకోలేదు. తల్లిని చూసు కోమని పంపేశారు. ఆమె నిరుడే కన్నుమూశారు.
సారంగి జనవరి 4, 1955న నీల్‌గిరి జిల్లా, బాలాసోర్‌ సమీపంలోని గోపీనాథపూర్‌లో జన్మించారు. అక్కడే ఫకీర్‌ మోహన్‌ కళాశాలలో పట్టభద్రులయ్యారు. ఆయనకు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతన పట్ల మమేకత్వం ఉండేది. అప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం ఏర్పడింది. తరువాత బీజేపీతో అనుబంధం ఏర్పడింది. ఆయన రెండు పర్యాయాలు (2004-2009, 2009-2014) నీల్‌గిరి నియోజక వర్గం నుంచి ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో బాలాసోర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2019 ఎన్నికలలో అధికార పార్టీ బీజేడీ అభ్యర్థి, కోట్లకు పడగలెత్తిన రవీంద్రకుమార్‌ జెనా మీద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 12,956 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో కనీసం కారు లేకుండా అభ్యర్థి తిరగడం సాధ్యం కాదు. హెలికాప్టర్లను వినియోగించిన అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువ కాదు. కానీ సారంగి ఆటో మీద ప్రచారం చేశారు. ఆయన నిరాడంబరత, సమాజ సేవ గురించి సామాజిక మాధ్యమాలలో వెలువడిన సమాచారమే ఆయనను పార్లమెంట్‌ భవనం దాకా తీసుకుపోయింది. నరేంద్ర మోదీ ఒడిశా వస్తే సారంగిని కలుసుకోకుండా వెళ్లరు. సారంగి అంటే మోదీకి అంత అభిమానం.
పదిహేడో లోక్‌సభకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సారంగి కారణంగా రెండు ప్రత్యేకతలు ఒనగూడాయి. ఒకటి ఇంత నిరాడంబర వ్యక్తి, ఇంత తక్కువ ఖర్చుతో లోక్‌సభలో ప్రవేశించిన వ్యక్తి మరొకరు కనిపించరు. అలాగే ఈ సభలో సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడే ఒకే ఒక వ్యక్తి బహుశా సారంగి అవుతారు.
Source: Jagruti Weekly

1 comment:

  1. అలాంటి వ్యక్తి ఇప్పుడు అసలు ఎంపీ కాగలడా? ఎంపి అయినా కేంద్రంలో మంత్రికాగలరా?

    ReplyDelete