Every parent must read this book - తల్లిదండ్రులు చదవవలసిన పుస్తకం
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్పింగ్ వచ్చింది. అందులో తండ్రి చాలా సీరియస్‌గా లాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ ఉంటాడు. కూతురు బిక్కుబిక్కుమంటూ వచ్చి ‘నాన్నా..’ అని పిలుస్తుంది. ‘ఏమిటి ? నేను పనిలో ఉన్నాను, డిస్ట్రబ్ చేయకు’ అన్నాడు నాన్న అంతే సీరియస్‌గా. ‘ప్లీజ్ నాన్నా!’ అని బ్రతిమిలాడింది కూతురు. ‘ఆ.. చెప్పు’ అన్నాడు మరింత అసహనంగా. పాప వెంటనే ‘మీ ఆదాయం ఒక గంటకి ఎంత ?’ అని అడిగింది. ‘2 వేలు!’ విసుగ్గా అన్నాడు. వెంటనే కూతురు గల్లా పెట్టెలో తను దాచుకున్న చిల్లర తెచ్చి తండ్రి ముందు పోసి ‘ఇవన్నీ 2 వేలు ఉంటాయి. ఇవి తీసుకుని నాతో ఒక గంట గడపండి ! ప్లీజ్..!’ అంది. తండ్రికి పరిస్థితి అర్థమయింది. పిల్లలకు కావాల్సింది తల్లిదండ్రుల ప్రేమ, సమయం, సాన్నిహిత్యం.
ఒకరోజు అమ్మకు జ్వరం వచ్చింది. బడినుండి రాగానే కొడుకు అమ్మకు కాళ్లు పడుతున్నాడు. జ్వరంతో మూలుగుతున్న అమ్మను చూస్తుంటే కొడుకుకు జాలివేసింది. అమ్మకు ఎప్పుడూ కష్టాలే, నేను పెద్దవాడిని అయ్యాక అమ్మను సుఖపెట్టాలి అనుకున్నాడు. వెంటనే ‘అమ్మా నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తాను, నీకు మంచి భోజనం పెడతాను, మంచి చీరలు కొంటాను, ఇంకా బోలెడు నగలు చేయిస్తాను’ అన్నాడు.
అమ్మ ఆనందానికి అంతే లేదు. ‘అవును నాయనా ! నువ్వు బాగా చదువుకుంటావు, నన్ను సుఖపెడతావు, ఆ నమ్మకం నాకుంది. కాని నగలు మాత్రం నేను కోరుకున్నవే చేయించాలి. అవి కూడా మూడంటే మూడే’ అంది.
వెంటనే అవేంటని అడిగితే తల్లి చెప్పింది ‘మన గ్రామంలో పెద్ద బడి, హైస్కూలు, అనాధ పిల్లలు తినడానికి ఉండడానికి చదువుకోడానికి అన్ని వసతులు ఉండే అనాథాశ్రమం’.
తల్లి కోరిన ఈ కోర్కెలు బాలుని మనస్సులో గాఢంగా నాటుకున్నాయి. సమాజం పట్ల తల్లికి ఉన్న ప్రేమను ఆ వయసులో ఆ బాలుడు గుర్తించలేక పోయినా ఇవి చాలా మంచివి అని అర్థం చేసుకున్నాడు. ‘ఈ మూడు నగలు నీకు తప్పక చేయిస్తాను’ అని మాటిచ్చాడు.
అదే లక్ష్యంగా పెట్టుకుని బాగా చదువుకున్నాడు. డబ్బు సంపాదించాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం ఆ మూడు నగలూ చేయించాడు. దాంతో ఆ గ్రామం ఆ తల్లీకొడుకుల్ని ఎన్నో తరాలపాటు గుర్తుంచు కుంది.
ఇదీ తల్లితండ్రులు పిల్లలకు ఇవ్వాల్సిన నిజమైన సంస్కారం, లక్ష్యం.
‘పిల్లల భవిష్యత్తు కోసం..’ అనే పుస్తకంలో ఇటు వంటి ఎన్నో అంశాలను రచయిత లింగం సుధాకర్ రెడ్డి ఎంతో చక్కగా, హృదయానికి హత్తుకునేలా వివరించారు. విద్యారంగంలో కృషిచేస్తున్న ‘విద్యా భారతి’ సంస్థలో ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వ హిస్తున్న ఆయన తన నిత్యజీవితంలో ఎదురయిన ఎన్నో సంఘటనలను ఆధారం చేసుకుని పిల్లలకు తల్లిదండ్రుల నుండి అందవలసిన సంస్కారాలు సరిగా అందటం లేదని భావించారు. అసలు పిల్లల పట్ల తల్లిదండ్రుల వాస్తవ బాధ్యత ఏమిటనేది కూడా నేటి తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన లేదనీ గుర్తించారు. అందుకే పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సిన నిజమైన సంస్కారాల గురించి తెలియ చేయాలనే సదుద్దేశంతో ఈ చిన్న పుస్తకాన్ని రచించారు.
పిల్లల్లో సంస్కారం, సమాజం పట్ల ప్రేమ, జీవితాన్ని సార్థకం చేసుకోగలిగే ఒక లక్ష్యం నింపితే చాలు. ఆ బాటలోనే రేపటి తరం నిర్మాణమవుతుంది. అటువంటి దిశానిర్దేశం చేయగలిగేలా తల్లిదండ్రులు ఉండాలి.
అలాకాక నేటి తల్లిదండ్రులు పిల్లలకు ఏవేవో సమకూరుస్తున్నారు. ఏది కోరితే అది ఇస్తున్నారు. కోరితే కొండమీద కోతినైనా తెచ్చేలా ఉంటున్నారు. అలా చేసి పిల్లలను అసమర్థులుగా చేస్తున్నారు. వాళ్లను వాళ్ల స్వయంశక్తిపై నిలబడేలా శిక్షణనివ్వలేకపోతున్నారు.
రచయిత ఒకసారి విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు 10వ తరగతి చదివే ఒక అమ్మాయి ఏడుస్తూ తన గురించి ఇలా చెప్పింది..’నేను కష్టపడి చదువుతాను. తరగతిలో ఎప్పుడూ మొదటిస్థానం నాకే వస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి తలనొప్పి లేక జ్వరం వచ్చి విశ్రాంతి తీసుకుందామంటే మా నాన్న కోప్పడతాడు. నువ్వు ఏంచేస్తావో నాకు తెలియదు, 570 తగ్గితే మాత్రం ఊరుకోను అంటాడు..’.
ఇలా కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలు బాగా మార్కులు తెచ్చుకుంటేనే రేపటి జీవితంలో నిలబడతారని భావించి, మార్కులే జీవితమన్నట్లుగా వ్యవహరిస్తారు. ఒక్కమార్కు తగ్గితే ఇక పిల్లల్ని నానా విధాలుగా శిక్షిస్తారు.
ఒక స్వామీజీ ఇలా అన్నారు.. ‘వాస్తవానికి భవనాలు, బ్యాంకు బాలెన్సులు వంటివేవీ మన ఆస్తులు కావు. మన పిల్లలే మన ఆస్తులు. మనమేం చేసినా పిల్లల కోసమే కదా ! అని మనకనిపిస్తుంది. పిల్లలకు సంస్కారాన్ని, ధైర్యాన్ని ఇస్తే పిల్లలు రేపు మనం లేకపోయినా చక్కగా జీవించగలుగుతారు. కేవలం ఆస్తిని ఇస్తే అది కరిగే వరకే నిలుస్తారు’.
పిల్లల గురించిన ఇటువంటి ఎన్నో మంచి విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. చిన్న కథలు, సంఘటనలు చెపుతూ వాటి ఆధారంగా సమస్య, పరిష్కారాలను చెపుతూ చక్కగా సాగుతుంది ఈ పుస్తకం. ప్రతి తల్లి, తండ్రి చదవవలసిన పుస్తకం ఇది.
పిల్లల భవిష్యత్తు కోసం…
రచన : లింగం సుధాకర్ రెడ్డి
పుటలు : 68 , వెల : రూ.20/-
ప్రతులకు : శ్రీ సరస్వతీ విద్యాపీఠము (రి)
ఇం.నెం.6-3-597/ఎ/7, వెంకటరమణ కాలనీ,
ఖైరతాబాద్, హైదరాబాద్ – 500 004
దూరవాణి : 040-23316160, 23316084
– కాంతారావు ఉల్లి
Every parent must read this book - తల్లిదండ్రులు చదవవలసిన పుస్తకం
ReplyDelete