Breaking News

Bathukamma-బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..


తెలంగాణలో బతుకమ్మ పండగకి ఎంతో ప్రాధాన్యం ఉంది. పితృ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పూల పర్వమిది. ప్రపంచ చరిత్రలో విభిన్నమైన పూలను కొలిచే ఆచారం బతుకమ్మ పండగలోనే ఉండటం విశేషం. ప్రకృతిలో సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పిం చడం బతుకమ్మ వైశిష్ట్యానికి నిదర్శనం.
సిరులొలికించే ప్రకృతి పండగ బతుకమ్మను మహిళలు అత్యంత భక్తి పారవశ్యంతో జరుపు కోవడం ఆనవాయితీ. ఎంగిలిపువ్వు బతుకమ్మ.. మొదలుకొని సద్దుల బతుకమ్మ దాకా ప్రతిరోజుకి ఓ ప్రాముఖ్యం ఉంది. తెలంగాణ సంస్కృతీ, సంప్ర దాయాలకు ఈ పండగ ప్రతీక అని కొందరు చెబుతారు. పేద, ధనిక తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఈ పండగను జరుపుకుంటారు. తమకు నిండు ముత్తయిదుతనాన్ని ప్రసాదించ మంటూ గౌరమ్మను కీర్తిస్తారు.
చరిత్ర
బతుకమ్మ పండగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. చోళరాజైన ధర్మాంగదునికి వందమంది కుమారులు పుట్టి యుద్ధంలో వీరమరణం పొందుతారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆడపిల్ల పుడుతుంది. ‘నిండు నూరేళ్లు బతుకమ్మ’ అంటూ అంతా ఆ శిశువును ఆశీర్వదిస్తారు. నాటి నుంచి బతుకమ్మను లక్ష్మీ స్వరూపంగా భావించి పూలతో అలంకరించి పండగ చేసుకోవడం ఆచారంగా మారింది. కాకతీయ రాణి రుద్రమదేవి తన మనవలకు అనారోగ్యం కలిగి నప్పుడు బతుకమ్మ పండుగ జరిపిందని చెబుతారు. అలా దాదాపు వెయ్యేళ్లుగా సజీవంగా కొనసాగుతున్న ప్రజాపండుగ బతుకమ్మ.
తెలంగాణకు చెందిన ఒక బాలిక భూస్వాముల అకృత్యాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం ‘బతుకమ్మా’ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండగగా ‘బతుకమ్మ’ ప్రాచుర్యం పొందిందనేది మరో కథ.
సరదా సరదాగా..
పండగకి పదిరోజుల ముందే ఇళ్లలో హడావుడి మొదలవుతుంది. ఆడపడుచులందరూ పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండగ సన్నాహాలు చేసుకుంటారు. ప్రధాన పండగకు వారం రోజుల ముందు నుంచే చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేసి ప్రతిరోజూ సాయంత్రం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ‘బతుకమ్మ బతుకమ్మ ఊయ్యలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..’ అంటూ ఉల్లాసంగా పాటలు పాడతారు. తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు.
రంగు రంగుల పూలతో..
చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు తంగేడు, గునుగ, కలువ పూలను ఒక రాగి పళ్లెంలో వలయా కారంగా పేర్చుకుంటూ వస్తారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్ష ణీయంగా తయారు చేస్తారు. ఆ తర్వాత తంగేడు పువ్వులను కట్టగా కట్టి వాటి మీద పేర్చుతారు. మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. పూలను పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ముందు ఇంట్లోని పూజ గదిలో పెట్టి పూజిస్తారు. ఆ తర్వాత బయటకి తీసుకువచ్చి పాటలు పాడుతూ గౌరీదేవిని కీర్తిస్తారు. తర్వాత చెరువుల్లోగానీ, వాగుల్లో గానీ నిమజ్జనం చేస్తారు. పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు ‘వాయినమమ్మా వాయినం’ అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చు కుంటారు. మొక్కజొన్నలు, వేరుశనగ, నువ్వులు మొదలైన రకరకాల పదార్థాలతో చేసిన సత్తుపిండిని అందరికీ పంచుతారు.
నైవేద్యాలు
బతుకమ్మ ఆడే తొమ్మిది రోజులు.. తొమ్మిది రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ ప్రసాదంగా ముద్దపప్పు, బెల్లం, పాలు సమర్పిస్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజున బతుకమ్మ అలిగిన రోజు కావడంతో అర్రెం అంటూ బతుకమ్మను ఆడరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా కొలుస్తారు.
పూలలో ఔషధ గుణాలు
బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలన్నీ విశిష్టమైన ఔషధగుణాలు కలిగి ఉంటాయి. తంగేడు పువ్వుకు సూక్ష్మజీవులను చంపే గుణం ఉంది. చెరువు నీరు శుద్ధి కావడానికి ఇది దోహదం చేస్తుంది. గునుగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. సీతజడ పువ్వు జలుబు, ఆస్తమాను దూరం చేస్తుంది. మందారపువ్వు చుండ్రు రాకుండా చేస్తే, కట్ల పువ్వు తొడిమలు అజీర్ణం కాకుండా అరికడతాయి. గుమ్మడి పువ్వులో విటమిన్‌-ఏ ఉంటుంది. అంటే బతుకమ్మల నిమజ్జనంతో చెరువులన్నీ శుద్ధి అవుతాయన్న మాట.
– నయన

1 comment:

  1. బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలన్నీ విశిష్టమైన ఔషధగుణాలు కలిగి ఉంటాయి. తంగేడు పువ్వుకు సూక్ష్మజీవులను చంపే గుణం ఉంది. చెరువు నీరు శుద్ధి కావడానికి ఇది దోహదం చేస్తుంది. గునుగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. సీతజడ పువ్వు జలుబు, ఆస్తమాను దూరం చేస్తుంది. మందారపువ్వు చుండ్రు రాకుండా చేస్తే, కట్ల పువ్వు తొడిమలు అజీర్ణం కాకుండా అరికడతాయి. గుమ్మడి పువ్వులో విటమిన్‌-ఏ ఉంటుంది. అంటే బతుకమ్మల నిమజ్జనంతో చెరువులన్నీ శుద్ధి అవుతాయన్న మాట.

    ReplyDelete