Breaking News

మా అమ్మ‌ కాంతమ్మ - 2

నేను మునుగోడు లో ప్రభుత్వ‌ పాఠశాలలో చదువుకున్నాను. చిన్న గ్రామం. బీద పిల్లలు‌ చాలామంది‌కలిసి చదువుకునేవాళ్ళం.  మా నాన్నగారు ఓ ప్రైవేటు కంపనీ లో పనిచేసేవారు. అద్దెఇల్లు. మా ఊర్లో స్వంత ఇల్లు లేక పోవడం, మా కుటుంబం వారూ లేక పోవడంతో ఆ వూరితో సంబంధమ లేదు. అయినా మా అమ్మ‌ ఉన్న ఆదా యం తో మమ్మల్ని బాగానే సాకింది.

మా స్నేహితుడు మదనాచారి అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకునే వాడు.  నాతో మా ఇంటికి వస్తే తన చిరిగిపోయిన నిక్కర్ చూసి నావి రెండు నిక్కరులు తనే ఇచ్చింది. అప్పుడు మేము రెండవ తరగతి. మా స్నేహం నేటికీ కొనసాగుతూనే ఉంది.
మల్లేశం, హనుమంతు కూడా మా అమ్మ ప్రేమకి పాత్రులయ్యారు.  మా వీధిలోని పిల్లలందరూ మా ఇంట్లోనే ఉండేవారు. మా అమ్మ అందరికీ అమ్మే. మేము పెద్దయ్యాక  ఆ వూరి శ్రీనివాసు వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చి నాతో మీ నాన్న గారు ఫీజు కి డబ్బులిస్తేనే నేను పదవ తరగతిపరీక్ష వ్రాసానని ఎంతో ఆదరంతో మా అమ్మకు చెబుతుంటే‌విన్నాను. ఆ ఊరి తో మాది అనే సంబంధం‌ఉండింది.

మడి ఆచారం విపరీతంగా ఉండిన కుటుంబం నుంచి వచ్చిన మా అమ్మ ఎవరినీ తక్కువ చూసేదికాదు.  నా స్నేహితుల్లో చాలామంది వెనుకపడ్డ కులాల వారే ఉండేవారు.  పరకాల లో మా ఇంటి ప్రక్కనే పాఠశాల. అందరూ ఇంటికి వచ్చేవారు. బాబూలాల్ అనే స్నేహితుడు మొదటిసారి బెరుకుగా వచ్చినా తరువాత మా అమ్మకు దగ్గరయ్యాడు.  వాళ్ళ కుటుంబం మేథరీ పని చేసే వారు.  అప్పటిలో బోర్హోల్ లెట్రిన్లు లేవు. బకెట్ తో తనూ వచ్చేవాడు. వృత్తి వృత్తినే, స్నేహం స్్నేహమే. మా అమ్మ‌ వైకుంఠ సమారాధనకు వచ్చాడు.  పరకాల లో రామదండే 15 -20 మంది మా ఇంట్లో కలిసేవారం.

స్థానిక శిశుమందిర్ టీచర్లు, సంఘ కార్కర్తలు నియమితంగా కలిసే ప్రదేశం మా ఇల్లే.  కారణం వారందరికీ మా అమ్మ మరో తల్లి. అందరి బాధలు‌ వినేది. పరిష్కారాలు చెప్పేది.  సాంబ శివుడు అనే నా దగ్గరి స్నేహితుడి ఇంట్లో చాలా అవసరం వచ్చింది.  వడ్డికి ఒక వేయి రూపాయిలు కావాలి అని బాధగా చెప్పాడు. మా నాన్నకు చెప్పి పోస్టాఫీస్ లో నెలకు  10 రూపాయిల చొప్పున వేసిన రికరింగ్ డిపాజిట్ నుండి తీసి ఇప్పించింది. అప్పుడు మా నాన్న గారి జీతం 500/-
9వ తరగతి పిల్లాడికి అంత డబ్బు దొరకడం అప్పటిలో అతనికి చాలా గర్వంగా ఉండేది. ఆమె ఆత్మీయతకు అందరూ ఎంతో దగ్గర అయ్యేవారు. 
                           సశేషం..
                                                                    - మీ నరసింహ మూర్తి.

1 comment: