Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 22 / 50



1959 నవంబర్ 24,25 తేదీలలో కాసరగోడు లో శిబిరం. అంతకు ముందు కాలంలో పథ సంచలనంలో ధ్వజధారి స్వయంసేవక్ అశ్వారోహి కావడం మామూలు విషయం. అయితే కాలక్రమేణా పథ సంచలన శోభను పెంచడానికి అలంకృత జీప్ లో ధ్వజం తీసుకెళ్ళడం అలవాటైంది. కాసరగోడు లో మరో అడుగు ముందుకేసి , పథ సంచలనంలో ధ్వజధారి ,ఏనుగు మీద కూర్చోవాలని యోజన జరిగింది. అందుకోసమే సుబ్రహ్మణ్య మఠం నుండి ఏనుగు ను తెప్పించారు. చాలా ఎత్తైన ,బలమైన ఏనుగు అది. దానిమీద ధ్వజధారిగా ఎంపిక చేయబడ్డ స్వయంసేవక్ మంగళూరు కు చెందిన శ్రీ సి.జి.కామత్. అతడుకూడా బలిష్ఠమైన శరీరం కలవాడు. బహుశా ఏనుగు మీద ధ్వజాన్ని తీసుకెళ్ళడం సంఘ చరిత్రలోనే మొట్టమొదటిసారి అయిఉండవచ్చు. ఆ పథ సంచలన భవ్యదృశ్యం శ్రీ గురూజీకి చాలా సంతోషం కల్గించింది. ఏదో చారిత్రక కాలంలో విజయ జైత్రయాత్రను జ్ఞాపకం చేసిన రీతిలో పథ సంచలనం నడవడం ఆయనకు ఆనందం కల్గించింది. సామాన్యంగా ఏ పథ సంచలనమైనా ఏదో ఒక స్థలంలో నిలబడి చూడటం ఆయనకు అలవాటు. కానీ ఆ రోజు ఆయన రెండుమూడు సార్లు వేర్వేరు స్థలాల్లో నిలబడి సంచలనం చూడటానికి ఇష్టపడ్డారు. దూరంగా ఏనుగు, ధ్వజం కనబడగానే చిన్నపిల్లాడిలా ' అదుగో చూడండి, ఏనుగు మీద ధ్వజం ' అని పక్కనున్న వారిని ఉత్సాహపరిచారు. 

ఆయన పొందిన ఆనందానికి క్రింది సంఘటన మరింత మెరుగులు దిద్దింది:
1960 మార్చిలో నాగ్పూర్ లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ బైఠక్ లో, ఆ పథ సంచలనం గురించి నివేదిక ఇచ్చేటపుడు కర్ణాటక ప్రాంత కార్యవాహ అయిన శ్రీ హొ.వె. శేషాద్రి గారు తమ కవితాత్మక శైలిలో ' సంచలన్ మే గజరాజ్ పర్ ధ్వజరాజ్ విరాజమాన్ థా' అన్నారు. వెంటనే వేదిక మీద ఉన్న శ్రీ గురూజీ , ఆయనను ఆపి ' ఐసా నహీ, గజరాజ్ కే ఊపర్ బైఠే హుయే ఔర్ ఏక్ గజరాజ్ కే హాథ్ మే ధ్వజరాజ్ విరాజమాన్ థా ' అన్నారు. కాసరగోడు లో తాము పొందిన సంతోషాన్ని ప్రతినిధి సభలో పాల్గొన్న వారందరితో ఆయన పంచుకున్న రీతి అది.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. కాసరగోడు లో తాము పొందిన సంతోషాన్ని ప్రతినిధి సభలో పాల్గొన్న వారందరితో ఆయన పంచుకున్న రీతి అది.

    ReplyDelete