Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 12 / 50


1971 లో మైసూరు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో ఎం.ఎ. పూర్తిచేసి ఒక కార్యకర్త ప్రచారక్ గా బయల్దేరబోతున్నాడు. అతడిని ప్రాంత అధికారి ఒకరు శ్రీ గురూజీకి పరిచయం చేసి విషయం చెప్పారు. అది వినగానే ఆయన ' ఏమిటి, మరొక పరాన్నజీవిని పెంచుకుంటున్నారా? ' అన్నారు‌. అలా వారనగానే వాతావరణం గంభీరంగా మారిపోయింది. ప్రచారక్ ను పరాన్నజీవి అని శ్రీ గురూజీ ఎందుకన్నారో అక్కడున్న చాలామందికి అర్థం కాలేదు. అయితే ఆ కార్యకర్తను పరిచయం చేసిన ప్రాంత అధికారికి దాని నేపధ్యం తెలిసినందున ఏమీ తొణకలేదు. ఆ నేపధ్యం ఇలా ఉంది:
ఈ సంఘటనకు కొన్ని నెలలముందు శ్రీ గురూజీకి ఒకరి వద్దనుండి ఉత్తరం వచ్చింది. ఆ వ్యక్తి సంఘం గురించి బాగా తెలిసినవారే. అతడి కొడుకు డిగ్రీ చదువయ్యాక ప్రచారక్ గా వెళ్ళాడు. అది ఆయనకు నచ్చలేదు. ఆయన వ్యతిరేకతను పరిగణించకుండా కొడుకు , ఇంటినుండి బయటకొచ్చాడు. దాంతో కోపగించుకున్న ఆ వ్యక్తి శ్రీ గురూజీకి ఉత్తరం వ్రాశాడు. అనేక సంవత్సరాలనుండి సంఘాన్ని బాగా తెలుసుకున్నవారైనా, కోపంలో ప్రచారకులను ' పరాన్నజీవి ' అంటూ తన కొడుకు అలా కావడం తనకిష్టం లేదని తీవ్రమైన భాషలో తెలియజేశాడు. ఆ ఉత్తరం శ్రీ గురూజీకి చాలా బాధ కల్గించింది. గోకాక్ కు వచ్చిన ఆయన ఆ ఉత్తరం గురించి ప్రాంత అధికారులతో చర్చించారు. అదే సందర్భంలో ఆయనకు కొత్త ప్రచారక్ గురించి తెలియజేయబడింది. దాంతో ఆయన ఆ ' పదాన్ని ' వాడారు. అందులో ఆయన మనసులోని బాధతో కూడిన వ్యంగ్యం దాగి ఉంది.
పై సంఘటనకు , నాణానికి మరోవైపులా ఇంకో సంఘటన దీనికి వ్యతిరేకమైనది ఇలా ఉంది. ఒకవైపు సంఘాన్ని బాగా తెలిసినవారు వ్యక్తిగతమైన ఏదో అసమాధానంతో తమ ఆలోచనా ధోరణిని వికృతం చేస్తుంటే, మరోవైపు సంఘానికి తీవ్ర విరోధులు ఎలా సంఘం పట్ల తమ ఆలోచనను దిద్దుకుంటున్నారనేది శ్రీ గురూజీయే అక్కడ ఉన్నవారికి తెలిపారు. సందర్భం సుమారుగా అలాంటిదే. బహుశా 1960-1962 మధ్యకాలంలో జరిగిన సంఘటన. ఏదో ఒక ప్రాంతంలో ఒక కార్యకర్త తన పెద్దల వ్యతిరేకతను లెక్కించకుండా ప్రచారక్ గా వెళ్ళాడు. దాంతో కోపగించుకున్న అతడి తండ్రి , సంఘంపట్ల వ్యతిరేకతతో ఒక ఉత్తరాన్ని నెహ్రూకు వ్రాశాడు. అందులో సంఘం మన యువకుల బుర్రలను చెడగొడుతోంది. కష్టపడి పోషించి పెంచిన పెద్దలకు వ్యతిరేకంగా ప్రవర్తించమని దుర్బోధ చేస్తోంది. ఇలాంటి సంఘాన్ని నిషేధించకపోతే దేశానికి మంచికాలం ఉండదు, రాదు అని తీవ్రమైన భాషలో ఆ ఉత్తరం ఉంది.
తనకు అందిన ఉత్తరాన్ని నెహ్రూ చదువుతుండగా, ఆయన పార్టీకే చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయనను కలవడానికి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాడే అయినా సంఘ అభిమాని కూడా. తన చేతిలోని ఉత్తరాన్ని నెహ్రూ అతడి చేతిలో పెట్టి , చదివి అభిప్రాయం చెప్పమన్నాడు. ఆ వ్యక్తికి ఉత్తరం నేపధ్యం తెలిసింది. అయితే తన అభిప్రాయం చెప్పడానికి వెనుకంజ వేశాడు. నెహ్రూ మనసులో ఏముందో తెలియకుండా నేనెందుకు అభిప్రాయం చెప్పాలని భావించాడాయన. కాంగ్రెస్ సభ్యుడినైన తాను సంఘ అభిమానిని అని నెహ్రూ ముందు చెప్పుకోవడానికి ఆయనకు ఇబ్బంది అన్పించింది. రాజకీయంగా అది ఆయనకు ఇబ్బందులు తెచ్చేదిగా అన్పించింది. మౌనంగా ఉండిపోయాడు.
అపుడు నెహ్రూ తన అభిప్రాయం ఇలా చెప్పారు: చూడు. స్వంత సుఖం, హితం వదిలేసి దేశం కోసం త్యాగం చేసే గుణం నేడు ఎక్కడ ఉంది? గతంలో స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్నపుడు మనకు కనబడుతుండిన ఈ గుణం ఇపుడు 10-15 ఏళ్ళలో కనబడటమే కష్టమవుతోందికదా! ఇపుడు అది కాసింత మిగిలిఉన్నది , దాన్ని పెంచడానికి ప్రయత్నం జరుగుతున్నది ఆరెస్సెస్ లో. దాన్ని నిషేధించడమెందుకు? నాకు మాత్రం మనసు అంగీకరించడం లేదు.
ఈ విషయాన్ని ఆ పార్లమెంట్ సభ్యుడు ఒకసారి తనతో ప్రస్తావించాడని శ్రీ గురూజీయే చెప్పారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. ఈ విషయాన్ని ఆ పార్లమెంట్ సభ్యుడు ఒకసారి తనతో ప్రస్తావించాడని శ్రీ గురూజీయే చెప్పారు.

    ReplyDelete