శిష్యుడి కోసం
శైవసంప్రదాయంలోని 63మంది నాయనార్‌లలో సోమసిమార్ నాయనార్ ఒకడు. ‘యజ్ఞం చేస్తూ... స్వాహా అన్నప్పుడు అగ్నిముఖంగా కాకుండా పరమేశ్వరుడు నేరుగా వచ్చి హవిస్సు పుచ్చుకోవాలి’ ఇది ఆయన కోరిక. ఇదెలా సాధ్యం? పరమశివుడిని తీసుకురాగలిగిన సుందరమూర్తి నాయనార్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎప్పుడూ శివభక్తులతో శివమహాసభల్లో మునిగి తేలుతూ ఉంటాడు. ఆయన దర్శనం దొరకడం దుర్లభం. అందుకు ఆయన ఒక మార్గం ఆలోచించాడు. నది ఒడ్డున దొరికే తోటకూరలాంటి ఒక రకం ఆకుకూరను క్రమం తప్పకుండా ప్రతి రోజూ తీసుకెళ్ళి సుందరమూర్తి నాయనార్ వాళ్ళ వంటవాడికిచ్చి వచ్చేవాడు. వంటవాడు వండిపెట్టేవాడు. సుందరమూర్తి నాయనార్ తింటూండేవాడు. నెలలు గడిచాయి. యజమాని అడగలేదు ఇదెక్కడిదని, వంటవాడూ చెప్పలేదు. ఆయన తెస్తూనే ఉన్నాడు, ఈయన తింటూనే ఉన్నాడు.
ఉన్నట్లుండి అక్కడి నదికి వరదలొచ్చాయి. పాపం సోమసిమార్ నాయనార్ ఆ ఆకుకూరను తీసుకురాలేకపోయాడు. ఓ వారం గడిచింది. ఆ ఆకుకూరను తినడానికి అలవాటుపడిన సుందరమూర్తి వంటవాడిని అడిగాడు, అదెందుకు చేయడం లేదని. ‘‘ఏమో ఎవరో రోజూ తీసుకొచ్చి ఇస్తున్నారు, మీకు వండి పెట్టమని. నాలుగు రోజులనుంచి తీసుకు రావట్లేదు’ అన్నాడు. ‘అది నెలల తరబడి తింటున్నానా, నా సప్తధాతువుల్లో కలిసిపోయిందా, ఎందుకు తెచ్చాడో తెలుసుకుంటాను, ఈసారి వచ్చినప్పుడు నా దగ్గరికి పంపు’ అని సుందరమూర్తి చెప్పాడు.
వారం తర్వాత వరదలు తగ్గగానే సోమసిమార్ నాయనార్ మళ్ళీ ఆకుకూర తీసుకుని వచ్చాడు. వంటవాడు వెంటనే ఆయనను యజమాని దగ్గరకు పంపాడు. ‘‘ఎందుకు తెస్తున్నావ్, నీకసలు ఏం కావాలి ?’’ అని అడిగాడు సుందరమూర్తి నాయనార్. ఎవరూ చుట్టూ లేకపోతే చెబుతానన్నాడు. ఆయన దర్బార్‌లోని వారిని బయటకు పంపి చెప్పమన్నాడు. ‘‘నేను యజ్ఞం చేస్తున్నాను. శివుడు నీవు పిలిస్తే వస్తాడు. పిలిచి తీసుకు రా. నేను స్వాహా అన్నప్పుడు ఆయన చెయ్యిపట్టాలి. హవిస్సు అగ్నిముఖంగా ఇవ్వను. ఆయన చేతిలోనే పెడతా. తినాలి. ఇది నా కోరిక.’’ అని వివరించాడు.
ఆకుకూర తిన్నందుకు సుందరమూర్తి నాయనార్ అన్నాడు కదా –‘‘అడుగుతా శివుణ్ణి, ఒకవేళ ఆయన రానంటే తప్పు నాదికాదు’’ అన్నాడు. వెళ్ళి అక్కడి త్యాగరాజస్వామిని (వాగ్గేయకారుడు కాదు, అక్కడ శివుడి పేరు త్యాగరాజస్వామి) అడిగాడు. ఆయన బదులిస్తూ–’’నువ్వడిగావు కాబట్టి వస్తా, కానీ శివుడిగా రాను. నా ఇష్టం వచ్చినట్లు వస్తా. నన్ను గుర్తుపట్టి పెడితే తింటా. లేదంటే వెళ్ళిపోతా.’’ అన్నాడు. ఆయన తిరిగొచ్చి సోమసిమార్‌నాయనార్‌కు అదే చెప్పగా ఆయన అందుకు అంగీకరించి వెళ్ళి యజ్ఞం చేస్తున్నాడు. 11వరోజు పండితులందరూ వేదమంత్రాలు చదువుతుండగా పరమశివుడు ఛండాల రూపంలో కుక్కలు పట్టుకుని, కల్లుకుండ పట్టుకుని లోపలికి వచ్చాడు. అక్కడున్న పండితులందరూ లేచి పరుగులు తీస్తుండగా, ‘పరమశివుడు వచ్చాడు. రండిరా’’అంటూ సోమసిమార్ నాయనార్ అందర్నీ వెనక్కి పిలిచాడు. వాళ్ళు అనుమానంగా వచ్చారు హవిస్సు చేతిలో పెట్టగా పరమానందభరితుడై శివుడు ఆయనను తనలో ఐక్యం చేసుకున్నాడు. అదీ ఆచార్య వైభవం అంటే. అటువంటి ఆచార్యుడు శిష్యుడికోసం ఏమైనా చేయగలడు.
ఇది తిరువారూర్ క్షేత్రంలో జరిగింది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
ఇది తిరువారూర్ క్షేత్రంలో జరిగింది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
శిష్యుడి కోసం
ReplyDeleteగురువు గారు ఇది ఏ సందర్భంలో చెప్పారో మీకు తెలిస్తే చెప్పండి. గురువైభవానికి మంచి ఉదాహరణ.
ReplyDeleteచాగంటి వారి గురు వైభవం లోనిది అనుకుంట.
Delete