Breaking News

అమ్మ పరబ్రహ్మమే!



బ్రహ్మ, విష్ణు అంశలతోపాటూ అమ్మలో శివాంశ కూడా ఉంటుందనీ, అమ్మ శివస్వరూపమై ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుందనీ, పరమ శివుడిలా నిత్య ప్రళయం చేస్తుందనీ తెలుసుకుంటున్నాం. అమ్మ పరమేశ్వరుడిలా ఆత్యంతిక ప్రళయం కూడా చేస్తుంది. అంటే జ్ఞానమివ్వడం. శిశువు పెరుగుతున్న దశలో అమ్మ వాడిని ఊయలలో పడుకోబెట్టి నిద్రపుచ్చడానికి జోలపాట పాడుతుంది. ఏవో నోటికొచ్చిన పాటలు పాడుతుంటే వాడవి వింటూ నిద్రలోకి జారుకుంటాడు. ఎంత పాటలు రాని తల్లయినా... ళొలబళొల... హాయీ అంటూ ఏవో శబ్దాలు చేస్తూ పాడుతుంది. ఏమిటా పాట? ‘‘ఓరి పిచ్చాడా, నేను నా నోటితో అమంగళం పలకకూడదు. నీకు ఈ తిరగడం (ఒక జన్మనుంచి మరొక జన్మకు) అలవాటయి పోయిందిరా. ప్రయోజనం లేని తిరుగుడు. పునరపి జననం, పునరపి... అక్కడ వదిలిపెట్టి ఇక్కడ పుట్టడం, ఇలా వెళ్ళడం... అలా రావడం.. ఇదే బాగుందని పడుకుని సుఖపడుతుండడం... ఇది కాదురా ళొలబళొలబ... హాయి...’’ అంటూ తొలి గురువై మొదటి వేదాంతం చెబుతుంది అమ్మ.

బిడ్డ ఇంకొంచెం పెద్దయ్యాక... గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెబుతుంది. అమ్మ అన్నం పెట్టినట్లుగా పెట్టగల వ్యక్తి ఈ సృష్టిలో మరొకరుండరు. ఒకసారి అమ్మ వెళ్ళిపోతే... ఇక అలా అన్న పెట్టడం కట్టుకున్న భార్యకు కూడా సాధ్యంకాదు. భార్యగా తనబిడ్డలకు పెట్టగలదేమో గానీ భర్తకు అలా పెట్టలేదు. అమ్మే పెట్టాలి అలా ఎందుచేతంటే... బిడ్డకు అన్నం పెడుతున్నప్పుడు ఎవరూ చూడక పోయినా చూశారేమోననే అనుమానంతో... ఎందుకైనా మంచిదని ఇంత ముద్ద తీసి గిరగిరతిప్పి అవతల పారేస్తుంది. ఎంత భయమంటే... ఈవేళ ఇంత అన్నం తిన్నాడని నేననుకున్నట్లే ఎవరైనా అనుకుంటారేమోనని భయం, తను కూడా అలా అనుకున్నందుకు భయం..ఈ లక్షణం కేవలం అమ్మలో మాత్రమే ఉంటుంది.

అమ్మచేతి అన్నం అమృతంతో సమానం. అమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు కూడా ఏవో కథలు చెబుతుంటుంది. పెద్ద పెద్ద కథలు చెప్పక్కర్లేదు. అవి రామాయణ, భారత, భాగవతాల కథలే కానక్కరలేదు.. ఏవో నోటికొచ్చిన మాటలను కథలుగా అల్లి... అనగనగనగా ఒక ఊళ్ళో ఒక ముసిలవ్వ ఉండేది రోయ్‌.. అని మొదలుపెడుతుంది... నిజంగా ఉండేదా ?... ఏమో.. వాడు మాత్రం అవి పరమ ఆసక్తిగా వింటూ ఊ..ఊ.. అంటూ ఊకొడుతూ.. తింటూంటాడు. ఇలా కథలు చెప్పే ఏ అమ్మ అయినా.. చివరన ఒక మాటంటుంది. ‘‘కథ కంచికి మనం ఇంటికి’’... అంటుంది. అంటే ???

అందులో అమంగళత్వాన్ని అమ్మ పలకదు. చెప్పదలచుకున్న విషయాన్ని ఎంత మంగళప్రదంగా చెబుతుందో! ‘‘ఎన్నోసార్లు పుట్టావు. ఎన్నోసార్లు పెరిగావు. ఎన్నోసార్లు శరీరం విడిచిపెట్టావు. లోపల జీవుడలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఈసారి నీ కథ కంచికి చేరిపోవాలి. అంటే నీవు ఈ జన్మలో కామాక్షిలో ఐక్యమయిపోవాలి. నీవు మళ్ళీ రాకూడదు’’ అని చెప్పాలి. కానీ ఈ మాట నోటివెంట ఎలా పలుకుతుంది? తల్లి కనుక... అలా చెప్పలేని కథను కంచికి పంపుతుంది. చివరకు అన్ని కథలూ కంచికే చేరిపోవాలి. అంటే అందరం కామాక్షిలోనే ప్రవేశించాలి. ‘‘కానీ ఇప్పుడు కాదురోయ్‌! నేనుండగా కాదు. నువ్వు పండిన తర్వాత... అప్పుడు కూడా నేనే ముందు, ఆ తర్వాతే నువ్వు. ఎందువల్ల? తన కళ్ళముందు బిడ్డ అలా పండడాన్ని అమ్మగా చూడలేదు కనుక. అందుకని ‘‘నేను ముందు వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి రా.. మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం..’’ అనుకుంటూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. 
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు.

2 comments:

  1. అమ్మ పరబ్రహ్మమే!

    ReplyDelete
  2. గర్భస్థ శిశువు తా కాళ్ళతో తన్నంగ
    నొప్పిని ప్రియముగా నోర్చుకొనును
    అలికిడి కులికి తా నమ్మ పొత్తిళ్లలో
    నొదుగంగ గుండెల కదుము కొనును
    ఆకటి కేడ్చుచు అమ్మపై కెగబ్రాక
    మురిపాన చన్నిచ్చి పరవశించు
    బుడి బుడి యడుగుల పడిలేచి నడయాడ
    బుడుతకు కేలిచ్చి నడత నేర్పు

    అలుపెరుంగక రాత్రింబవలు భరించి
    బిడ్డలే లోకముగ జీవించు" నమ్మ " _
    బిడ్డపై అమ్మ కెంతటి ప్రేమ గలదొ ,
    బిడ్డలకు గూడ అంతటి ప్రేమ గలద ?

    తనువిచ్చి కన్నట్టి తల్లిని కాదని
    రాతి బొమ్మకు మ్రొక్కు ఖ్యాతి మనది
    చన్నిచ్చి కడుపార చాకిన తల్లికి
    వెన్నిచ్చి వదిలించు విద్య మనది
    తొలి యొజ్జయి యెరుక దెలిపిన తల్లిని
    మోస పుచ్చెడు గొప్ప బుధ్ధి మనది
    సంతానమే తన సర్వస్వ మను తల్లి
    తమకు భారమ్మను తలపు మనది

    బిడ్డలకు వాండ్ల పెండ్లాలు బిడ్డలకును
    ఊడిగము చేసి యోపిక లూడి కూడ
    బ్రతికినన్నాళ్ళు చాకిరీ బ్రతుకు బ్రతుకు
    తల్లి కాదరణ కరువు ధరణి మీద .

    వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి
    పూని చాకిరి చేయలేని నాడు
    బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు
    చేరి సహాయము కోరు నాడు
    ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు
    వైద్యావసరము కావలయునాడు
    మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో
    కలగుండు పడు కష్ట మొలుకు నాడు

    అమ్మ " నొక బిడ్డ " గా జూడ సమ్మతించి
    కాచి కడతేర్చు బిడ్డలు గలర ? అంత
    గాక పోయిన బాధ్యతగా దలంచి
    జాలి చూపించ గలర ? కాస్తంత యైన

    " మాతృపిండం దదామ్యహ " మన్న మాత్ర
    ఋణము తీరదు _ ముదిమి పైకొనిన నాడు
    కాచి కడతేర్చ తీరు _ నీ ఘనత మరచి
    ఎన్ని పిండాలు పెట్టిన నేమి ఫలము ?









    ReplyDelete