Breaking News

సమస్య-సమాధానం


ఒక ఊరిలో రాము ఉండేవాడు. రాముకు లేని బాధ లేదు: చదువు బాగా రావటంలేదు; ఆర్థిక పరిస్థితి బాగాలేదు; తండ్రి లేడు; తల్లి ఆరోగ్యం బాగాలేదు; తనకు కూలి పనులు చేయబుద్ధి కావట్లేదు; అందరిచేతా తిట్లు తినక తప్పటం లేదు.. ఇట్లా ఏవేవో కష్టాలు.

అట్లా అని వాడి మనసులో ఆనందమే లేదా, అంటే అట్లా ఏమీ కాదు. వాడికి ఈత కొట్టటం వచ్చు, పొలానికి నీళ్ళు పెట్టటం అదీ వచ్చు, నాట్లు వేయటం, కలుపు తీయటం వచ్చు, ఇంకా చాలా పనులు వచ్చు.

అయితే ఊళ్ళో జనాల నోరు ఊరికే ఉండదు గదా, ఒకసారి వాడిని కూర్చోబెట్టుకొని ఎవరో పెద్దాయన సానుభూతి వర్షం కురిపించాడు- "పాపం, నీకెన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా బాబూ!" అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

దాంతో వాడికి చాలా దిగులు వేసింది. 'తనకి నిజంగానే ఎన్ని కష్టాలో' అనిపించింది. ఊరి బయట ఒక చెట్టుకింద కూర్చుని ఖాళీగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే ఊళ్లోవాళ్ళు కొందరు అడవికి వెళ్తున్నారు. వాళ్లు రాముని చూసి- "ఏమి నాయనా, ఇక్కడ కూర్చున్నావు?" అని పలకరించారు. రాము సమస్యల పట్టికను విప్పగానే వాళ్ళన్నారు- "చూడు రామూ, మేమందరం కూడా నీలాగానే సమస్యలతో దిక్కుతోచక, అడవిలో ఉన్న స్వామిని కలవడానికి వెళ్తున్నాము . నువ్వు కూడా వచ్చేయి" అని.

వెంటనే రాము బయలుదేరి వెళ్లాడు వాళ్లతోబాటు. స్వామి అతని సమస్యలన్నీ ఓపికగా విని, "చూడు రామూ! సమస్యలు లేకుండా జీవించడం చాలా చాలా సులువు: ఎవ్వరి మాటలూ పట్టించుకోకూడదు; మన పని మరవకూడదు. ఈ రోజునుంచి తెల్లవారుజామున 4.30కల్లా నిద్రలేచి, వార్తా పత్రికలను ఇంటింటికి చేరవెయ్యి.

దాంతో నీకు రోజూ వాకింగ్, రన్నింగ్, అన్నీ అయిపోతాయి; దాంతోబాటు నీకు నెలకొక 400రూపాయలు కూడా వస్తాయి!

ఇక మీ ఇంటి ప్రాంగణంలోనే కూరగాయల పాదులు, ఆకుకూరలు పెట్టు. బడినుంచి సాయంత్రం ఇంటికి రాగానే బిందెతో నీళ్లు తెచ్చి పొయ్యి, వాటికి. మధ్యాహ్నం సమయంలో మీ అమ్మ వాటిని సంరక్షిస్తుంది. ఒకసారి కాత మొదలవ్వగానే వాటిని ఇంటింటా తిరిగి అమ్ము.

మీ అమ్మ కష్టాలను ఇంకొన్నాళ్లలో‌ తీర్చాలి నువ్వు- కష్టపడి పనిచెయ్యి- అంతా మేలు జరుగుతుంది. ప్రతి పనినీ ఆనందంగా చేయి, అఖండ విజయం నీదే! వెళ్ళిరా, విజయంతో తిరిగిరా!" అన్నాడు. రాముకొక మార్గం దొరికినట్లయ్యింది. వాడు స్వామి చెప్పినదాన్ని వెంటనే అమలు పరచాడు. రకరకాల కూర కాయల మొక్కలు పెంచాడు. మురుగు నీరు పోయే దగ్గర బొప్పాయి చెట్లు పెట్టాడు. వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూనే, ఉదయంపూట వార్తా పత్రికలను ఇంటింటికి చేరవేసే పని మొదలు పెట్టుకున్నాడు.

రెండు నెలలు గడిచాయో, లేదో- కూరగాయలు, ఆకుకూరలు తమ ఇంటి అవసరాలకే కాక అమ్మేందుకు తగినన్ని వచ్చాయి. మూడవనెలలో ఆ డబ్బులతోటే వాళ్లమ్మచేత చిన్న వ్యాపారం‌ మొదలు పెట్టించాడు రాము: "ఈ రోజు నుంచి నువ్వు రాగి, జొన్న రొట్టెలు, చక్కిలాలు, అత్తిరసాలు(అరిసెలు) చెయ్యి. నేను ప్రతి ఆదివారం మన చుట్టు ప్రక్కల పల్లెలకు వెళ్లి వాటిని అమ్ముకొని వస్తాను" అని. ఇలా శ్రమపడి పదో తరగతి గట్టెక్కాడు. ప్రతినెలా 4వేల రూపాయలు సంపాదించు కోగలిగాడు. దాంతో వాడి జీవితం ఒక గాటన పడ్డట్లయింది.

అయితే ఈ దెబ్బతో వాడు స్వామీజీకి దాసుడు అయిపోయాడు. ప్రతి చిన్న సమస్యకూ వాడు స్వామీజీ దగ్గరికి పరుగెత్తటం మొదలైంది. వాడి వెనకనే ఊళ్ళోజనాలు! మొదట్లో కొంచెం ఉల్లాసపడ్డా, రాను రాను స్వామిజీ కూడా వాళ్లని చూడగానే పారిపోవటం మొదలు పెట్టాడు. చివరికి ఒక రోజున ఆయన మరో చోటికి ఎక్కడికో పయనమై పోయాడు!

ఇప్పుడు రాముకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. వాడిప్పుడు పెద్దవాడ-య్యాడు; పెళ్లి చేసుకున్నాడు. వాడి భార్యది పెద్ద గొంతు. 'గై..గై..గై' అని ఎప్పుడూ అరుస్తూ ఉండేది. ఊళ్ళో వాళ్లందరితోటీ గొడవలు పెట్టుకునేది. ఆ దెబ్బకు రాముకు మళ్ళీ స్వామీజీ గుర్తుకొచ్చాడు. "తను కూడా సన్యాసి అయిపోతే ఎలా ఉంటుంది!" అనిపించింది వాడికి. అయితే అడవిలో ఎంత వెతికినా స్వామీజీ కనబడనే లేదు. చివరికి వేరే ఏదో ఊళ్ళో టైలరు పని చేస్తూ కనిపించాడాయన!

"ఇదేమి స్వామీ, ఇట్లాగ?" అన్నాడు రాము ఆశ్చర్యపోతూ.

"నేను ఇప్పుడు టైలరును నాయనా! నీకేమైనా చొక్కాలు కావాలంటే చెప్పు-కుట్టి పెడతాను. అంతకంటే మరేమీ అడగకు" అన్నాడు స్వామి వాడితో. "ఇట్లా అయితే నేను ఊళ్ళో వాళ్ళందరినీ పిలుచుకొచ్చేస్తాను" అని బెదిరించిన మీదట, ఆయన చెప్పాడు- "చూడు రామూ! నేను నీకు చెప్పాను కదా, 'ఎవ్వరి మాటలూ పట్టించుకోకూడదు; మన పని మరువకూడదు' అని? అయితే నేను నా జీవితంలో ఆ పని చెయ్యలేదు. భార్యా పిల్లల్ని, వృత్తినీ వదిలేసి, సన్యాసి వేషంలో ఊరూరా తిరిగాను. తీరా తెలివి వచ్చి చూస్తే ఏమయింది? కుటుంబం అంతా గందరగోళమే అయ్యింది. పిల్లలు ఊరికొకరు- పుట్టకొకరుగా చెదిరిపోయారు. భార్య ఎన్నో కష్టాలనడుమ చనిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది. మన పనిని మనం మరువనే కూడదు; ఎన్ని కష్టాలు వచ్చినా బాధ్యతలనుంచి పారిపోకూడదు" అని. రాముకి కళ్ళు తెరుచుకున్నట్లయింది. "ఈ ప్రపంచంలో ఉన్న వాళ్లందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ 'సమస్య-సమస్య-' అని జపం చేసేవాళ్లకి అది తీరనే తీరదు. ఓపికగా, తెలివిగా వాటిని పరిష్కరించుకోవాలి అంతే. భార్య పెద్ద గొంతుతో అరవటం తనకు సమస్యగా ఉంది. మరి తన ఇంటి ప్రక్కనుంచే లారీలు, బస్సులు అంతకన్నా పెద్ద శబ్దాలు చేస్తూ పోతున్నాయి కదా, అవి తనకు సమస్య కాలేదు ఎందుకని? దేన్నైనా మనకు తగినట్లుగా మనమే మలచుకోవాలి. ఆలోచనల్లో స్వతంత్రత లేకపోతే ఎలాగ?"

ఇంటికి వచ్చాక రాములో పెద్ద మార్పే వచ్చింది. చాలా బాధ్యతతో మెలగటం మొదలు పెట్టాడు. పని చేసేటప్పుడు ఏవేవో పాటలు పాడుకుంటున్నాడు. తన తల్లిని తానే చూసుకుంటున్నాడు. ఇంటి పనులు కూడా చాలా చేస్తున్నాడు. భార్యను ఏమీ అనటం లేదు. హాయిగా, కులాసాగా ఉంటున్నాడు.

మొదట్లో భర్తలోని ఈ మార్పుకు అతని భార్య ఆశ్చర్యపోయింది. కానీ అతని సహచర్యంలో ఆమె గొంతూ తగ్గింది! మరికొంత కాలానికి ఊళ్ళో వాళ్ళకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు రామునూ, అతని భార్యనూ సలహాలు అడగటం సామాన్యమైంది!


1 comment:

  1. ఎవ్వరి మాటలూ పట్టించుకోకూడదు; మన పని మరవకూడదు

    ReplyDelete