Breaking News

సుపరిపాలనా నిర్దేశకుడు-Bharat Ratna Atal Bihari Vajpayee


‘మలి అడుగు వేయాలా? లేక
యుద్ధం నుంచి విరమించుకోవాలా?
ఏదారి నేను పయనించాలి?
ఒక కల జన్మించి మరణించింది.
వసంత కాలంలో తోట ఎండిపోయింది.
ఎండుటాకులను ఏరుతూ కూర్చోవాలా,
కొత్త విశ్వాన్ని సృజించాలా..
ఏ దారి నేను పయనించాలి?’


మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి రచించిన ‘రాహ్ కౌన్సీ జావూ మై’ అన్న కవితలో పంక్తులవి. ప్రజలహితం కోసం ఒక సంక్లిష్టమైన దారిని ఎంచుకున్నప్పుడు తుఫానులూ, తాకిడులూ తప్పవు. కానీ వెనక్కి వెళ్లాలా? ముందుకు పయనించాలా అన్న మీమాంస ప్రతి ఒక్కరికీ ఏదో సమయంలో ఎదురవుతుంది. పిరికి వాళ్లు తొలి సమస్య ఏర్పడగానే వెనక్కు వెళ్ళిపోతారు. కానీ మహానాయకులు ధైర్యంతో ప్రతి సమస్యనూ అవలీలగా ఎదుర్కొంటారు. అంతిమంగా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అటల్ బిహారీ వాజపేయి అలాంటి విజేత. అందుకే ఆయన ఇవాళ దేశ ప్రజలగుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు.

ప్రధానమంత్రిగా అటల్జీకి అవకాశం అంత సులభంగా రాలేదు. ఒక సామాన్య అధ్యాపకుడి కుమారుడైన వాజపేయి జర్నలిస్టుగా తన వృత్తి జీవితం ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. రాష్టీయస్వయం సేవక్ సంఘ్లో చేరి స్వదేశ్, వీరార్జున్, రాష్ట్ర ధర్మ, పాంచజన్య పత్రికలకు సంపాదకత్వం వహించారు. రాత్రిపూట ప్రెస్లో ఇటుకలే తలగడగా నిద్రించి పత్రిక వెలుగు చూసేలా చేశారు. ఎమర్జెన్సీలో ఆయనను ఇందిర ప్రభుత్వం జైలు పాలుచేసింది. ఎన్ని ఒడి దుడుకులు ఎదురైనా ఆయన నిబద్ధత కోల్పోలేదు. భారతీయ జనసంఘ్ అధ్యక్షుడుగా, తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా పార్టీని బలోపేతం చేశారు. 1957 నుంచి 2009 వరకు పది సార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఆయన భారతీయ విదేశాంగ విధానంపై తనదైన ముద్ర వేశారు. వాజపేయికి ప్రధాని పదవి ఎన్నో పోరాటాలు, ఎన్నో సంఘర్షణల అనంతరం లభించింది. పదవి లభించిన తర్వాత కూడా ఆయన అడుగడుక్కూ విఘాతాలు ఎదుర్కొన్నారు. మొదటి సారి 13 రోజులు, తర్వాత 13 నెలలు చివరకు దాదాపు అయిదు సంవత్సరాలు దేశాన్ని పాలించిన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా చరిత్రకెక్కారు. తన పాలనలో ఆయన సంకుచిత రాజకీయ ప్రయోజనాలకన్నా దేశ అభివృద్ధికి పెద్దపీట వేశారు. అతి తక్కువ సమయంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుని వాటి ఫలితాలు చిరకాలం ప్రజలు అనుభవించేందుకు దోహదం చేశారు. ఎన్నో ఏళ్ల దుష్పరిపాలన తర్వాత ఒక సమర్థుడైన సారథి దేశానికి లభిస్తే ఒక కొత్త దశ, దిశ ఎలా ఏర్పడుతుందో ఆయన నిరూపించారు.

ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే ఆయన దేశ పురోగతి కోసం ఎంత దూరదృష్టితో ఎన్నెన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారో అనిపిస్తుంది. ఇవాళ మహానగరాల మధ్య విశాలమైన రహదారులు చూసినా, వేలాది గ్రామాల ప్రజలు సులభంగా పట్టణాలకు వెళ్లేందుకు ఉపయోగపడుతున్న రోడ్లను చూసినా వాజపేయి మనకు గుర్తుకు వస్తారు. ఆయన హయాంలో చేపట్టిన స్వర్ణ చతుర్భుజి, గ్రామీణ సడక్ యోజన భారత దేశ అభివృద్ధి చరిత్రలో మైలు రాళ్లు అని చెప్పక తప్పదు.

మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను మరింత విస్తృతంగా దేశ ప్రయోజనం కోసం అమలు చేసిన రాజనీతిజ్ఞుడు వాజపేయి. దేశ అబివృద్ధి కోసం విదేశీ సంచార్ నిగంతో సహా అనే సంస్థలను ప్రైవేటీకరించేందుకు ఆయన వెనుకాడలేదు. ప్రత్యేక ఎగుమతి మండలాలు, పారిశ్రామిక పార్కులు, ఐటీ రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి దేశం రూపురేఖల్నే మార్చేందుకు ఆయన నడుం కట్టారు. విదేశాల్లో ఉన్న భారతీయుల దృష్టిని స్వదేశం మళ్లించి వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములు చేసేందుకు మొట్టమొదట సారి ప్రవాస భారతీయ దివస్ ప్రవేశపెట్టింది వాజపేయే. అదే సమయంలో ఆయన సామాన్య ప్రజల సంక్షేమం కోసం తపించారు. పేదలకు అనుకూలమైన విధానాలను అవలంబించారు. సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన, అంబేద్కర్ వాల్మీకి బస్తీ యోజన, జాతీయ పోషకాహార మిషన్ వంటి అనేక పథకాలను చేపట్టారు. వాజపేయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వశిక్షా అభియాన్ దేశంలో లక్షలాది మందిని నిరక్షరాస్యత నుంచి బయటపడేసింది.

ప్రధాని పదవి చేపట్టిన కొంత కాలానికే వాజపేయి భారత అణు పాటవాన్ని పోఖ్రాన్‌లో పరీక్షల ద్వారా ప్రపంచానికి రుజువుచేసి ఒక అణుశక్తి గల దేశంగా భారత్‌ను అంతర్జాతీయ దేశాల సరసన నిలబెట్టారు. ఆ తర్వాత అమెరికా, బ్రిటన్ కెనడా ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ భారత్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్లడం చూసి ఆ ఆంక్షల్ని సడలించక తప్పలేదు. ఆ తర్వాత ఆయన తనదైన శైలిలో విదేశీ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించి, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. చర్చల ద్వారా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించేందుకు పూనుకుంటూనే వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చైనాకు ఆయన స్నేహ హస్తం చాచారు. వాజపేయి రాకముందు దాదాపు 20 ఏళ్ల వరకు అమెరికాతో మనకు సంబంధాలు అంతంత మాత్రమే కొనసాగాయి. కానీ వాజపేయి హయాం నుంచి ఈ సంబంధాల్లో ఎంతో గుణాత్మకమైన మార్పు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ వచ్చిన దాదాపు 22 ఏళ్ల తర్వాత బిల్ క్లింటన్ భారత్లో అడుగుపెట్టారు. దీనితో అంతర్జాతీయంగా ప్రచ్ఛన్న యుద్ధ కాలం సమాప్తమై అమెరికాతో వర్తక సంబంధాలు, వ్యూహాత్మక అంశాలపై పరస్పర సహకారం ప్రారంభమైంది. ఉగ్రవాదంపై సమష్టి పోరు జరపాల్సిన అవసరాన్ని వాజపేయి ప్రపంచానికి స్పష్టం చేసిన తర్వాత ఎంతో కాలానికి 2011 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా గ్రహించి తాలిబాన్, అల్ ఖాయిదాలపై పోరుకు వ్యతిరేకంగా భారత్ నుంచి వ్యూహాత్మక సహకారాన్ని కోరింది.

పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పకొడుతూనే ఆదేశానికి స్నేహహస్తం చాచి, లాహోర్కు బస్సుయాత్రలో వెళ్ళిన శాంతి దూత వాజపేయి. వాజపేయి స్ఫూర్తితో భారత సైన్యాలు ఆపరేషన్ విజయ్ పేరుతో శత్రుసేనల్ని దునుమాడి కార్గిల్లో చొరబాటును తిప్పికొట్టాయి. మెరుగైన సైనిక ఇంటెలిజెన్స్‌ను దించేందుకు వాజపేయి ఒక సమర్థమైన రక్షణ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పరిచారు. పాక్ చొరబాటును తిప్పికొట్టిన తర్వాత కూడా వాజపేయి ఆగ్రాలో నాటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్తో చర్చలు జరిపారు. ఉపఖండంలో శాంతి నెలకొంటేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. ‘చర్చల్లో మాకు నిరంతర విశ్వాసం ఉంది. అదే సమయంలో భారత సరిహద్దు దాటి లోపలికి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తే కర్కశంగా అణిచివేస్తాం..’ అని ఆయన స్పష్టం చేశారు.

‘మనం 50 ఏళ్లుగా పోరాడుతున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఈ వైఖరి పాకిస్థాన్‌కు కానీ, భారత్కు కానీ ప్రయోజనం చేకూర్చదు. మన పరిమిత వనరులను అనవసరంగా మనం యుద్ధాల్లో వృథా చేస్తున్నాం. అసలు యుద్ధమే లేకపోతే ఈ మొత్తం మన దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉపయోగించవచ్చు.. యుద్ధం చేయాలంటే పేదరికంపై, నిరుద్యోగంపై, వ్యాధులపై, వెనుకబాటుతనంపై చేద్దాం..’ అని 2001 ఆగస్టు 15న 54వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై స్వాతంత్ర్య పతాకం ఎగురవేసిన తర్వాత ప్రసంగిస్తూ పాకిస్థాన్‌కు పిలుపిచ్చారు.

వాజపేయి మొదటి బలం ఆయన వాగ్ధాటి. స్వతహాగా కవి అయిన వాజపేయి మాట్లాడుతుంటూనే కవిత్వం పొంగి పొరలుతుంటుంది. ఆయన మాట్లాడే కవితా భాష, హావభావాలు, శైలి ఎవరినైనా ఆకర్షించక తప్పదు. శివుడి జటాజూటం నుంచి పరవళ్లు తొక్కే గంగా ప్రవాహం ఆయన ప్రసంగం. అదే ఆయనకు వరమై జనసంఘ్, బీజేపీల్లో నాయకత్వాన్ని అందించింది. 1957లో ఆయన మొట్టమొదటి సారి లోక్సభకు ఎన్నికైనప్పుడు చివరి బెంచిలో ఉన్నప్పటికీ ఆయన అనర్గళ ప్రసంగం అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దృష్టిని ఆకర్షించింది. నెహ్రూ వాజపేయిని ఆలింగనం చేసుకోవడమే కాక ఎప్పటికైనా దేశ ప్రధానమంత్రి అవుతావని చెప్పారు. దాదాపు నాలుగుదశాబ్దాల తర్వాత నెహ్రూ మాటలు నిజమయ్యాయి. వాజపేయి రెండో బలం అజాతశత్రుత్వం. ఆయన ఎవర్నీ ద్వేషించలేదు. సమస్యలపై పోరాడారు. ప్రతిపక్ష స్థానంలోఉన్నా, ప్రధానమంత్రి పదవిలో ఉన్నా అందరూ తనను ఆదరించగల వ్యక్తిత్వం వాజపేయిది.

‘ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చుకానీ, దేశంకంటే గొప్పవాడు కాదు. ఓ రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనదైనా కావచ్చుకానీ, ప్రజాస్వామ్యం కంటే శక్తివంతం కాజాలదు’ అన్న వాజపేయి తన రాజకీయ జీవితంలో విలువలకు, ప్రమాణాలకు ప్రతీకగా నిలిచారు. స్వాతంత్య్రానంతర భారత రాజకీయాలకు నూతన సంస్కారం నేర్పారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తన దక్షత, విజ్ఞత, బాధ్యతలను మేళవించి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లినందువల్లే అటల్‌ బిహారీ వాజపేయి పుట్టిన రోజును కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఒక సాధారణ బడిపంతులు కుమారుడుగా వాజపేయి ప్రధాని అయితే, స్టేషన్లో కంపార్ట్‌మెంట్ నుంచి కంపార్ట్మెంట్ తిరిగి చాయ్ అమ్మే ఒక చాయ్ వాలా నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. ఇది భారత దేశ ప్రజాస్వామ్య విశిష్టత. వాజపేయి తర్వాత ప్రధాని అయిన బీజేపీ నాయకుడు మోదీ. అందుకే ఆయన వాజపేయి అందించిన సుపరిపాలనను ధ్యేయంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పాలనను పటిష్టం చేయడంపైనే దృష్టి కేంద్రీకరించారు. తక్కువ ప్రభుత్వం, ఎక్కువ పాలన అవసరమని చెప్పిన మోదీ వాజపేయి సామాన్యుల సంక్షేమం కోసం ప్రారంభించిన ఎన్నో పథకాలను మరింత వేగంగా చేపట్టారు. పొరుగుదేశాలతో మైత్రి, విదేశాలతో సంబంధాలను విస్తరించడం, ప్రపంచ దేశాల సరసన భారత్ను నిలబెట్టడం, సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేయడం మొదలైన అనేక అంశాల విషయాల్లో మోదీ వాజపేయి ఆలోచనా విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నారనడంలో సందేహం లేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించిన వాజపేయితో పోలిస్తే పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ అవినీతిపై పోరాటం, నల్లధన నిర్మూలన విషయంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘అవినీతి నిరోధంలో ప్రజల ప్రమేయాన్ని పెంచాలి’ అన్న వాజపేయి మాటల్ని ఆయన అమలుచేస్తున్నారు.

సుపరిపాలన అంటే ప్రజలకు చట్టబద్ధంగా లభించాల్సిన అన్ని సేవలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించడం. తమ హక్కులు, సాధికారత కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, అవినీతి, వేధింపులు లేకుండా, ఆలస్యానికి, వివక్షకు తావు లేకుండా ప్రతి పనీ, ప్రతి ఒక్కరికీ జరగడం. ప్రజలు సుఖమైన జీవితం గడపడం కోసం ప్రభుత్వ వ్యవస్థలో తగిన మార్పులు తీసురావడం. నల్లధనం, అవినీతిపై కఠిన వైఖరి, కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్, పారదర్శకత, జవాబుదారీ విధానం మొదలైనవి సుపరిపాలనకు చెందినవే. ఆదాయపన్ను రిటర్న్స్‌లో పేర్కొన్న రీఫండ్ సకాలంలో చెల్లించకపోతే సంబంధిత అధికారిపై చర్యలు ప్రవేశపెట్టడం లాంటి చర్యలు ఇందుకు నిదర్శనం.

అంతేకాదు, ప్రజల జీవితాల్లో వెలుగు ప్రసరించడానికి, అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయడానికి ప్రధాని పలు చర్యలు తీసుకుంటున్నారు. జామ్ (జన్‌ధన్‌ యోజన, ఆధార్, మొబైల్), ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ, డిజిటల్ బదిలీ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు, నగదు రహిత వ్యవస్థ దిశగా ప్రజలను మళ్లించడం ఈ కోవలోవే. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజల లావాదేవీలు సౌకర్యవంతంగా, నిర్విఘ్నంగా జరిగేలా చూడడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. అనవసరమైన చట్టాలను, నిబంధనలను రద్దు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మోదీ ప్రభుత్వ ఉద్దేశం.

ఉదాహరణకు పింఛనుదారు ప్రతి ఏడాదీ తాను జీవించి ఉన్నానని సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన పద్ధతిని మోదీ సర్కార్ ఎత్తివేసింది. ప్రజల జీవితాలను మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వ ఆలోచనలను పంచుకుని వారి నుంచే సూచనలను స్వీకరించేందుకు మై గవర్నమెంట్, నరేంద్రమోదీ యాప్ల ద్వారా ప్రజలను నేరుగా సంప్రదించడం, తద్వారా నిర్ణయాల్లో వారిని భాగస్వాములు చేయడం మోదీ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో చెప్పుకోదగ్గ అంశం.

నాడు వాజపేయి వేసిన సుపరిపాలనా మార్గం మోదీ సారథ్యంలో మరింత విస్తరించి దేశ బంగారు భవిష్యత్తు కోసం సుస్థిరమైన బాటగా మారుతుందనడంలో సందేహం లేదు. హార్ నహీ మానుంగా (ఓటమిని అంగీకరించేది లేదు) అన్న వాజపేయి స్ఫూర్తితో ప్రధాని నరేంద్రమోదీ కూడా మడమ తిప్పని పోరాటం చేస్తూ జన హృదయాల్లో విజేతగా స్థానం సంపాదించుకున్నారు.

- ముప్పవరపు వెంకయ్యనాయుడు
కేంద్ర సమాచార, ప్రసార, పట్టణాభివృద్ది శాఖ మంత్రి
(నేడు వాజపేయి 92వ పుట్టిన రోజు, సుపరిపాలనా దినం)

Source: Andhra Jyothi (25-12-2016)

2 comments:

  1. ‘మలి అడుగు వేయాలా? లేక
    యుద్ధం నుంచి విరమించుకోవాలా?
    ఏదారి నేను పయనించాలి?
    ఒక కల జన్మించి మరణించింది.
    వసంత కాలంలో తోట ఎండిపోయింది.
    ఎండుటాకులను ఏరుతూ కూర్చోవాలా,
    కొత్త విశ్వాన్ని సృజించాలా..
    ఏ దారి నేను పయనించాలి?’

    ReplyDelete
  2. wonderful Post.Keep posting such informative latest telugu political news
    posts.Thanks

    ReplyDelete