Breaking News

యోగి అరవిందుని హృదయం నుండి వెలువడిన సూక్తులు



ఈ ఆశ్వయుజ మాసంలో ప్రతి భారతీయుడు అమ్మ ను ఆరాధిస్తే అంతులేని శక్తిని, జ్ఞానం, సంపదను పొందుతాడు. అంతర్గత, బాహ్య శత్రువులనుండి రక్షణ లభిస్తుంది. యోగి అరవిందుని హృదయం నుండి వెలువడిన ఈ క్రింది 13 శక్తి వంతమైన సూక్తులను నిత్యం చదవాలి.

ప్రపంచంలో ఎక్కడా , ఏ మతం లో లేని విధంగా స్త్రీ మూర్తి,ఆదిశక్తియై,పరాశక్తియై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా శక్తి ని ప్రసాదిస్తుంది అని మన పెద్దలు చెప్పారు.

1.
అమ్మా! దుర్గమ్మా! సింహవాహిని! అన్ని విధాల బలాన్ని ప్రసాదించు.తల్లీ!శివుడికి ప్రియమైన దానా! నీ శక్తికణాల నుండి మేము పుట్టాము.యువకులమైన మేము నీ మందిరములో కూర్చుని వున్నాము.వినవమ్మా!భువిపైకి దిగిరా..ఈ భారత భూమిలో సాక్షాత్కరించు తల్లీ!

2.
అమ్మా!దుర్గమ్మా!యుగ యుగాలుగా ,ప్రతి జీవితములో ఈ శరీర రూపములో వస్తున్నాము.నీ కార్యాన్ని నెరవేర్చి,మళ్ళీ తిరిగి అనంత జ్యోతిలోకి వెళ్ళిపోతాము.ఇప్పుడు మళ్ళీ పుట్టి,నీ కార్యానికి అంకితమయ్యాము.మాకు సహాయం చేయడానికి ఈ భువిపైకి దిగిరావమ్మా.

3.
అమ్మా! దుర్గా!సింహవాహిని!త్రిశూలధారిణీ!సుందర కవచ ధారిణీ!మాకు విజయాన్ని అందించవమ్మా!భారత దేశం నీ గొప్పనైన స్వరూపాన్ని చూడటానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నది.విను..ఓ తల్లీ!భూమికి దిగివచ్చి, భారత దేశములో సాక్షాత్కరించవమ్మా.

4.
తల్లీ దుర్గా! జ్ఞానాన్ని,ప్రేమను,శక్తిని అందించే తల్లీ!ఈ జీవిత సమరములో ,ఈ భారత యుద్ధములో మేము నీతో నియమించబడిన సైనికులము తల్లీ! ఓ అమ్మా!రాక్షసులకుండే బలాన్ని మా మనసులకు ఇవ్వు..అలాగే దేవతలకుండే ఆత్మ,బుద్ధిని,శీలాన్ని,జ్ఞానాన్ని ఇవ్వమ్మా!భయానకమైన తల్లీ!సుందర స్వరూపమున్న దానా!

5.
దుర్గా దేవీ! అమ్మా! ప్రపంచములోని దేశాల్లో వినయ పూర్వక,గౌరవనీయ దేశం భారత దేశం.కాని చీకటిలో మునిగిపొయింది.తూర్పు నుండి ఉదయిస్తున్న సూర్య తేజస్సు నీ దైవీ మహత్తుతో ఆ చీకటిని చేధించాలి.

6.
అమ్మా!దుర్గా! మేము నీ బిడ్డలమమ్మా! నీ దయతో,నీ ప్రభావంతో గొప్ప పనులు,గొప్ప ఆదర్శంగా చేయడానికి కావలసిన సమర్థులుగా మమ్మల్ని తీర్చిదిద్దమ్మా!తల్లీ మా చిన్నతనాన్ని,మా స్వార్థాన్ని,మా భయాన్ని పోగొట్టు తల్లీ.

అమ్మా! దుర్గమ్మా! సింహవాహిని! అన్ని విధాల బలాన్ని ప్రసాదించు.తల్లీ!శివుడికి ప్రియమైన దానా! నీ శక్తికణాల నుండి మేము పుట్టాము.యువకులమైన మేము నీ మందిరములో కూర్చుని వున్నాము.వినవమ్మా!భువిపైకి దిగిరా..ఈ భారత భూమిలో సాక్షాత్కరించు తల్లీ!

7.
అమ్మా! కనకదుర్గా! నీవు కాళీ స్వరూపంలో,దిగంబరధారియై, మానవ కపాలాలను మెడలో ధరించి, చేత ఖడ్గాన్ని పట్టుకుని,అసురులను వధిస్తావు.ఓ దేవీ! మాలో నివసిస్తున్న రాక్షసులను ఎలాంటి దయలేకుండా అంతమొందించవమ్మా!ఆ రాక్షసుల్లో ఏ ఒక్కరు కూడా మిగిలి వుండకూడదు.మమ్మల్ని మచ్చలేని,స్వచ్చమైన వారిగా తీర్చిదిద్దమని మా ప్రార్థన.అమ్మా! మాకు సాక్షాత్కరించమ్మా!

8.
తల్లీ! దుర్గమ్మా! భారత దేశం నేడు స్వార్థముతో,భయముతో నిండివున్నదనిపిస్తుంది.మమ్మల్ని గొప్పవారిని చేయి,మా ప్రయత్నాలు గొప్పవిగా వుండేటట్లు చేయమ్మా!మా హృదయాలను విశాలంగా తీర్చిదిద్దు.మమ్మల్ని సత్యవాదులుగా రూపొందించు.

ఎక్కువ కాలం శక్తి హీనులుగా ,సోమరిపొతులుగా,భయపడేవారిగామమ్మల్ని వుంచొద్దు.

9.
అమ్మా దుర్గా ! యోగ శక్తిని విస్తరింప చేయ్ ! మేము నీ ఆర్య పుత్రులం.మేము కోల్పోయిన విద్యను,శీలాన్ని,బుద్ధి బలాన్ని , సమర్పణ,విశ్వాసాన్ని,కాఠిన్య శక్తిని,పవిత్రతా బలాన్ని, సత్యమైన జ్ఞానాన్ని మళ్ళీ ప్రసాదించు. మానవ సహాయం కోసం అన్ని విధాలైన చెడుని తొలగించి నీవు అవతరించమ్మా !

10.
దుర్గమ్మా ! నాలో వుండి శత్రువును వధించు.బయట వున్న అడ్డంకులన్నింటినీ తొలగించు.గొప్పనైన,శక్తివంతమైన నేతృత్వ లక్షణం గల భారత జాతి, ప్రేమ మరియు సమైక్యత లో అగ్రస్థానమై,సత్యం, బలం,కళలు,అక్షర సాహిత్యం, శక్తి మరియు జ్ఞానం ఇవన్నీ ఈ జాతిలోని పవిత్ర భూములలో , సారవంతమైన పొలాల్లో , ఆకాశ హర్మ్యమై నిలిచిన శిఖరాల క్రింద, ప్రవహించే పుణ్య నదీనదాల తీరాల్లో శాశ్వతంగా వుండిపోయేటట్లు చూడమ్మా! నీ చరణాల ముందు ఇదే నా విన్నపం.

11.
దుర్గమ్మ తల్లీ! నీ యోగిక శక్తితో మా దేహాల్లోకి ప్రవేశించు.మేము నీ ఉపకరణాలం.నీ కరవాలం తో చెడుని ఖండించు.నీ దీప కాంతి తో మా అజ్ఞానాన్ని పారద్రోలు.నీ ఈ యువ కిశోరాలమైన మా ఆర్తిని,మా బెంగను, మా ఆతృతను గమనించు.ఓ తల్లీ నీ ఖడ్గం తో చెడుని వధించు.దీపాన్ని చేత పట్టుకుని జ్ఞాన ప్రకాశాన్ని అంతటా విస్తరింపచేయ్. మా కోసం అవతరించవమ్మా!

12.
తల్లీ దుర్గమ్మా! మేము ఒకసారి నిన్ను మా మదిలో స్వీకరించిన తర్వాత, ఇక మా నుండి నిన్ను దూరంగా ఎన్నటికీ తొలగించం.మా ప్రేమ మరియు సమర్పణా భావం తో నిన్ను బంధించివేస్తాం.రా తల్లీ! మా శరీరం లో, బుద్ధిలో,మనస్సులో నీవు అవతరించు

13.
రా అమ్మా రాజ మార్గమున బహిర్గతం కావమ్మా. మేము నిన్నెప్పుడూ దూరంగా వుంచలేము తల్లీ! మా సంపూర్ణ జీవితం ఎడతెగకుండా నీ ఆరాధనలో సాగిపోవాలి.మా చర్యలన్నీ తల్లీ సేవలో పూర్తి ప్రేమతో, శక్తితో కొనసాగాలి. ఇదే మా విన్నపం..ఓ తల్లీ! ఈ భూమిపై అవతరించు.అమ్మా నిన్ను నీవు ఈ పుణ్య భూమిలో సాక్షాత్కరించుకోవమ్మా.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. యోగి అరవిందుని హృదయం నుండి వెలువడిన సూక్తులు

    ReplyDelete