Breaking News

చేసిన మేలు వృథా కాదు


ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు. ఇంతలో దగ్గర్లో గల బావిలోంచి ”రక్షించండి, రక్షించండి” అంటూ కేకలు వినిపించాయి. వెళ్ళి చూస్తే ఒక బాలుడు ఆ బావిలో పడిపోయి కేకలు పెడుతున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతు బావిలోకి దూకి ఆ బాలుడిని పైకి తీసుకువచ్చి కాపాడాడు. తరువాత అతడికి ధైర్యం చెప్పి ఇంటికి పంపించాడు. మరునాడు ఆ రైతు ఇంటి ముందు ఒక ఖరీదైన గుర్రపు బండి వచ్చి ఆగింది. అందులోంచి ఖరీదైన దుస్తులు ధరించిన ఒక పెద్ద మనిషి దిగి రైతు వద్దకి వచ్చాడు.
”ఎవరు బాబూ మీరు? ఏం కావాలి?” అని అడిగాడు రైతు.
”నేను పక్క ఊళ్ళో ఉంటున్నాను. నిన్న మీరు రక్షించిన బాలుడి తండ్రిని. కృతజ్ఞతగా మీకే మిచ్చినా ఋణం తీరదు. అయినా ఇది తీసుకోండి” అంటూ ఒక ఇనప్పెట్టె నిండా ధనాన్ని ఆ రైతుకు ఇచ్చాడా పెద్దమనిషి.
”క్షమించండి. నేను ప్రతిఫలం ఆశించి ఈ పని చేయలేదు. ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నేను చెయ్యగలిగింది చేసాను. ఇది నా ధర్మం” అంటూ ఆ ధనాన్ని తిరస్కరించాడు రైతు.
ఇంతలో ఒక పిల్లవాడు అటుగా వచ్చి ఆ పెద్దమనిషికి నమస్కరించాడు.
”ఈ అబ్మాయి మీ పిల్లవాడా? ఏం చదువు తున్నాడు?” అని అడిగాడా పెద్దమనిషి.
”అవునండీ. మా పిల్లవాడే. వాడిని కొంత వరకే చదివించాను. ఇకపై చదివించే స్థోమత లేక నాతోనే పొలం పనులకు తీసుకువెళ్తున్నాను” అన్నాడు రైతు.
”అలాగా. అయితే నీ కొడుకును నాతో పంపించు. నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదివిస్తాను. అందుకయ్యే ఖర్చంతా భరిస్తాను. నా కొడుకుని నువ్వు కాపాడావు. నీ ఋణం కొంతైనా తీర్చుకోనివ్వు” అన్నాడా పెద్దమనిషి. ఆ మాటలను కాదనలేక రైతు తన కొడుకుని ఆ పెద్దమనిషితో పంపించాడు.
పెద్దమనిషి ఆ పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివించాడు. పిల్లలిద్దరూ చాలా గొప్పవాళ్ళయ్యారు.
కొంతకాలానికి ఆ పెద్దమనిషి కొడుక్కి అంతు తెలియని వ్యాధి సోకింది. వైద్యులందరూ అతణ్ణి పరీక్షించి చేతులెత్తేసారు. అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తాను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేసాడు.
ఇంతకీ ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా? పెన్సిలిన్‌ మందు కనిపెట్టిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. ఆ రెండో పిల్లవాడు ఎవరో తెలుసా? బ్రిటిష్‌ ప్రధానమంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌.
అందుకే అంటారు మనం ఒకరికి చేసిన మేలు ఊరికే పోదు అని.

1 comment: