Breaking News

నమామీ గంగా-Namami Gange


గంగ... ఈ పేరు వింటే ఓ ఆధ్యాత్మిక భావనతో మేని పులకిస్తుంది.


కానీ...గంగా తీరానికి వెళితే మన భావనలో ఉన్నంత పవిత్రత అక్కడ కన్పించదు. అక్కడి దృశ్యాలను చూస్తే హృదయం బరువెక్కిపోతుంది. హిమాలయ శిఖరాల్లోంచి బొట్టుబొట్టూ కలిసి...ప్రవాహమై..ఉత్తుంగ తురంగంలా ఉరకలెత్తుతూ భువికి వచ్చే గంగమ్మ వేలమైళ్లు పారాడి.. మన పాపాలతో కలుషితమై బంగాళాఖాతంలో నిర్జీవంగా కలసిపోతోంది. నది పుట్టినప్పుడున్న పవిత్రత మాయమై...ఆఖరి మజిలీకి వచ్చేసరికి విషతుల్యమైపోతోంది. గంగ అలా అయిపోవడానికి మనమే కారణం. మన పవిత్రులం అవ్వాలంటే గంగ బాగుపడాలి. మన జీవితాలు బాగుపడాలంటే గంగ బతికుండాలి. అది బతికుండాలంటే మనమే దానిని బాగుచేయాలి. ఆ పనినే ఇప్పుడు కేంద్రం చేపట్టింది. నమామి గంగే... అంటూ తొలి అడుగువేసింది. ఎన్నడూలేని భక్తితో..చిత్తశుద్ధితో..


జీవననాదం

భారతదేశంలో అత్యంత పవిత్రమైన, ప్రధానమైన నది గంగానది. దేశ ఆర్ధిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి, సామాజిక ప్రగతి దీనితో ముడిపడి ఉంది. భారతీయులకు, ముఖ్యంగా హిందువులకు ఈ నదిపై ఉన్న భక్తి, మమకారం వెలకట్టలేనిది. ఈ నదిలో ఓ సారి స్నానం చేస్తే చాలు పాపాలు అన్నీ పోతాయనేది విశ్వాసం. చల్లని గంగమ్మ ఒడిలో తడిసి స్వాంతన చెందుతారు. పవిత్రమైనట్లు భావిస్తారు ప్రతిఒక్కరూ. గంగానది పరిసరాలు, రమణీయత, సుందరమైన ఆకుపచ్చని వనాలు, దట్టమైన వృక్షాలతో కూడిన పర్వత సానువులు ఎవరినైనా మైమరిపిస్తాయి. ఇపుడు గంగానది చూసి అంత స్వాంతన పొందలేకపోతున్నారు, పవిత్రకాసారం కాస్తా మురికి కూపంగా మారిపోయింది. నదీతీరానికి వెళితే చాలు చల్లని గాలికి బదులు దుర్వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. గంగమ్మను దేవతగా నమ్మే భక్తులే నదీజలాలను చూసి ఉలిక్కిపడుతున్నారు. ఆ జలాల్లో స్నానం చేస్తే పాపాలు పోవడం దేవుడెరుగు, రోగాలు రాకపోతే చాలు అన్నట్టు భావించే పరిస్థితి ఏర్పడింది.

ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాల్లో గంగోత్రి అనే హిమానీనదంలో భాగీరధి నది ఉద్భవించింది. ప్రవాహమార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకనంద నది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని గంగ అంటారు. కొంత దూరం హిమాలయాల్లో ప్రవహించిన తర్వాత ఈ నది హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలో కలుస్తుంది. మైదానాల్లో పవహించే మార్గంలో గంగానదితో కోసి, గోమతి, శోణ వంటి ఉపనదులు కలుస్తాయి. అన్నింటికంటే పెద్దదైన యమునా నది అలహాబాద్ (ప్రయాగ) వద్ద గంగానదితో కలుస్తుంది. అలహాబాద్ తర్వాత మరెన్నో నదులతో కలిసి గంగానది మహాప్రవాహంగా మారుతుంది. పశ్చిమబెంగాల్ మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడి నుండి హుగ్లీ నది (గంగానది చీలిక) ప్రారంభమవుతుంది. విశాలమైన గంగ నది హుగ్లీ డెల్టా అక్కడే మొదలవుతుంది. పవిత్రమైన గంగానదిని మాల్దా తర్వాత పద్మ నది అని అంటారు. పద్మ నది బంగ్లాదేశ్‌లో ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్రా నది చీలిక అయిన జమునా నది పద్మ నదితో కలుస్తుంది. ఆ తర్వాత మేఘనా నది కూడా దీంతో కలుస్తుంది. బంగ్లాదేశ్ మైదానాల్లో ఇది మహాప్రవాహం. తర్వాత అనేకనేకంగా చీలి సుందర వనాలు గుండా ప్రవహించి తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం మీద గంగానది భారత్, బంగ్లాదేశ్ పరీవాహకంగా 2510కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. జన్మస్థలంలో గంగానది ఎత్తు 7756 మీటర్లు. పురాతన గ్రంథం రుగ్వేదంలోని నదీస్తుతిలో కూడా గంగానది ప్రస్తావన ఉంది. రుగ్వేదంలో జాహ్నవి ప్రస్తావన ఉందని, జాహ్నవి అంటే గంగానది గురించేనని చెబుతారు. ఆర్యయుగంలో సింధు, సరస్వతి నదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా, వేదకాలం నుండి మాత్రం గంగానదికి ప్రాధాన్యత పెరిగింది. గంగ గు రించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాధలు ఎన్నో ఉన్నాయి. భాగవతంలోనూ, బృహద్ధర్మ పురాణంలోనూ, దేవీ భాగవతంలోనూ గంగ గురించి అనేక గాధలున్నాయి.

గంగ, దాని ఉప నది యమున కలిసి భారత్‌లో అనేక రాష్ట్రాల్లో విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, చుట్టుపక్కల కాలుష్యాన్ని విడుదల చేసే అనేక పరిశ్రమలు ఉండటం వల్ల గంగానది జలాలు కలుషితమవుతున్నాయి. కాన్పూరు వంటి నగరాల్లో రసాయన పరిశ్రమలు, తోలు పరిశ్రమలు, ఇందుకు కారణం. అందుకు తోడు జనావాసాల నుండి వెలువడే మురుగునీరు అపరిమితంగా నదిలో కలుస్తోంది.

ప్రక్షాళనకు రాజీవ్ తొలి అడుగు
ముప్పై ఏళ్ల క్రితమే 1986లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ 426 కోట్ల వ్యయంతో గంగా కార్యాచరణ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుపై వివిధ ప్రభుత్వాలు ఇంతవరకూ దాదాపు 4వేల కోట్ల రూపాయిలు వెచ్చించాయి. గంగానది ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమ నిర్వహణ బృందాల సహకారంతో స్వచ్ఛ గంగకు సంబంధించిన జాతీయ మిషన్ అమలుచేస్తోంది. జాతీయ కమిషన్ కార్యకలాపాలు కుంటుపడ్డాయని, ఇంకో రెండు శతాబ్దాలు గడచినా పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదని, నదికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తీసుకునే చర్యలను దశలవారీ వివరిస్తూ సమగ్ర ప్రణాళిక నివేదించాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కనీసం ముందు తరాల వారైనా గంగానదికి అసలైన రూపంలో చూడగలిగేలా దయచేసి ప్రయత్నించండి, మనం అలా చూస్తామో లేదో తెలియదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూసపద్ధతిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వల్ల ప్రయోజనం ఉండదని కూడా పేర్కొంది.

సుప్రీంకోర్టు జోక్యంతో..
గంగా నది పవిత్రత, కీర్తిని పునరుద్ధరించడానికి, నీటిశుద్ధికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పటి కేంద్రప్రభుత్వం 2014లో కార్యాచరణకు పూనుకుంది. చిన్న, మధ్యతరహా దీర్ఘకాలిక చర్యలతో కూడిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. దశలవారీ ప్రణాళికను ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో 2014 ఆగస్టు 13న కేంద్రప్రభుత్వం ఒక అఫిడవిట్ రూపంలో ప్రభుత్వ ప్రణాళికను కోర్టు ముందుంచింది.

ఇదీ ప్రణాళిక..
గంగానది ప్రక్షాళనకు స్వల్పకాల వ్యవధి అంటే మూడేళ్లు, మధ్యకాల దశ అంటే ఐదేళ్లు, దీర్ఘకాలిక దశ అంటే పదేళ్లు ఆపై కాలంలో చేపట్టే, తీసుకోబోయే పనులను వివరించింది. కేంద్ర నీటి వనరులు, నది అభివృద్ధి గంగాప్రక్షాళన మంత్రిత్వశాఖలు ఘాట్లను అభివృద్ధి చేయాలని, కేదారనాథ్, హరిద్వార్, వారణాసి, కాన్పూరు, అలహాబాద్, పాట్నా, ఢిల్లీ ప్రాంతాల్లో ఏడు నదీతీరాలను గుర్తించి వాటిని శుద్ధి చేయడం, మధ్య కాలిక దశలో కేంద్రపట్టణాభివృద్ధి శాఖ 118 పట్టణ ఆవాసాలను గుర్తించి వాటికి మురుగు అవస్థాపన సౌకర్యాలను కలిగించడం, గంగా పరీవాహక ప్రాంతంలోని 1649 గ్రామాలలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించడం వంటి లక్ష్యాలను రూపొందించారు. అందుకోసం కేంద్రం 51 వేల కోట్ల రూపాయిలు ఖర్చవుతుందని అంచనా వేసింది. గంగానది భౌగోళిక, పర్యావరణ సమగ్రతను కాపాడేందుకు గంగానది బేసిన్ మేనేజిమెంట్ విభాగం ఏర్పాటైంది.

స్పష్టమైన లక్ష్యం...
గంగా కార్యాచరణ ప్రణాళిక ఆశించిన ఫలితాలను ఇవ్వని దృష్ట్యా, ప్రస్తుత ప్రాజెక్టులో మరిన్ని మార్పులు చేసింది. కనీసం పదేళ్ల పాటు ఆయా సంస్థలు ప్రాజెక్టు నిర్వహణకు బాధ్యత వహించేలా చేయాలని నిర్ణయించింది. నదిలోకి కాలుష్యం అధికంగా విడుదలయ్యే ప్రాంతాల వద్ద పిపిపి ఎస్‌పివి నమూనాల్లో పనులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. నాలుగు బెటాలియన్లతో గంగా పర్యావణ కార్యాచరణ దళాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవిత్ర గంగానదీ ప్రక్షాళన పథకం కోసం 20వేల కోట్ల రూపాయిలు కేటాయించారు. గంగానది ప్రక్షాళనకు మూడు దశాబ్దాలలో వ్యయం చేసిన మొత్తానికి దాదాపు నాలుగు రెట్ల నిధులను వచ్చే ఐదేళ్లలో ఖర్చు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.

కార్యాచరణలో తొలి అడుగు
గంగానది ప్రక్షాళన గురించి పదేపదే ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడటమే కాదు, గంగానది ప్రక్షాళనను వారణాసి నుండి ప్రధాని ప్రారంభించారు. గంగానది ప్రక్షాళనతో భారత్ మారుతుందని ప్రధాని మహాహారతి సందర్భంగా వ్యాఖ్యానించారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రం చేసుకోవడం భరతమాతకు సేవ చేసిన దానితో సమానమని, చిన్న చిన్న ప్రయత్నాలే గొప్ప అద్భుత ఫలితాలను ఇస్తాయని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు. కేవలం మాటలతో ఈ వ్యవహారాన్ని పరిమితం చేయకుండా వ్యర్ధ జలాల శుద్ధికి ‘నమామి గంగె’ పేరుతో మరో సమన్వయ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని హైబ్రిడ్ అన్యుటీ అథారిటీ, ప్రభుత్వ - ప్రజల భాగస్వామ్యం కింద చేపట్టడానికి వీలుగా చేసిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. పనివిధానాన్ని మెరుగుపరచడానికి, సమర్థతను పెంచడానికి, అది ఎంత మేరకు పనికొస్తుందో నిర్ధారించడానికి, సుస్థిరతను తీసుకురావడానికి ఈ మోడల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం అవసరమయ్యే మూలధనాన్ని పాక్షికంగా 40 శాతం వరకూ ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగతా నిధులను అన్యుటీ ద్వారా 20 సంవత్సరాల వరకూ ఉండే కాంట్రాక్టు సమయంలో సమకూర్చుకుంటారు. ఈ మోడల్‌కు ఉన్న ప్రత్యేక నవభావం కారణంగా దీనిని భవిష్యత్‌లో సుస్థిరమైన ప్రాతిపదిక మీద అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక సాధన వాహికను (స్పెషల్ పర్పజ్ వెహికల్) ఏర్పాటు చేసింది. గంగానది శుద్ధికి సంబంధించి జాతీయ కార్యక్రమం మార్గదర్శకత్వంలో ‘నమామి గంగె’ కార్యక్రమం రూపొందుతుంది. పిపిపి ప్రాజెక్టులను చేపట్టడం, నిర్మాణం, రాయితీలను పొందుతున్న సంస్థలను నిర్ధారించడం, కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించడం, శుద్ధి చేసిన వ్యర్ధ జలాలను మార్కెట్ చేయడం తదితర పనులు ప్రత్యేక సాధన వాహిక ద్వారా కొనసాగుతాయి. ఎస్‌పివిని భారతీయ కంపెనీల చట్టం 2013 ప్రకారం ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు చేపట్టడానికి , సంబంధిత రాష్ట్రాప్రభుత్వాలతో పట్టణ సంస్థలతో ఎస్‌పివి త్రైపాక్షిక ఒప్పందాలను చేసుకుంటుంది. తాగడానికే కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించే భూగర్భ జలాల వినియోగాన్ని కూడా పర్యవేక్షించవచ్చు. శుద్ధ చేసిన వ్యర్ధ జలాల పునర్వినియోగానికి తగిన మార్గదర్శకాలను ఎస్‌పివి తయారుచేస్తుంది. జలకాలుష్యాన్ని తగ్గించేందుకు ఆన్‌లైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లో 300 ప్రాజెక్టులను 300 ప్రాంతాల్లో చేపడతారు. గంగా ప్రవాహ రాష్ట్రాలు యుపి, ఉత్తరాఖండ్, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్‌లో ఈ ప్రాజెక్టులు చేపడతారు. ఢిల్లీ, హర్యానాలో యమునా నది ప్రక్షాళన కార్యక్రమం చేపడతారు. గంగానది ప్రక్షాళనలో హెచ్‌ఆర్‌డి, పర్యావరణ శాఖలను సైతం భాగస్వామ్యులను చేశారు. గంగా నది ప్రక్షాళనకు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు, జైకా సంస్థలు ముందుకు వచ్చాయి. గంగానది ప్రక్షాళనకు జర్మనీ సైతం భారత్‌తో చేతులు కలిపింది. జర్మనీలో నదుల శుద్ధికి ఉపయోగించే రివర్ బేసిన్ మేనేజిమెంట్ విధానాల ద్వారా గంగానది శుద్ధి చేసేందుకు సహాయం చేస్తామని జర్మనీ పేర్కొంది. మరో పక్క ఒకే ఒక్క రోజులో 250 కోట్ల రూపాయిలతో 43 ప్రాజెక్టులను కేంద్రం చేపట్టడం ద్వారా గంగాశుద్ధి కార్యక్రమానికి ఊపుతెచ్చింది.

కాలుష్యానికి కారణాలివీ...
ఇంత శాపగ్రస్తం కావడానికి కారణం ఎవరు? పవిత్ర గంగానది కలుషితానికి ప్రధమ ముద్దాయి మనమే. పారిశ్రామిక వ్యర్ధాలు, ఆవాసాల మురుగునీరు, అక్రమకట్టడాలు, మతవిశ్వాసాల పేరిట ఆచరించే చర్యలతో గంగానది అపవిత్రంగా మారింది. దేశంలో దాదాపు సగభాగం జీవితాలు ఈ నదిపైనే ఆధారపడి ఉన్నాయి. జీవనాధారమైన గంగానదికి ఎలాంటి ముప్పు ఉన్నా అది దేశ ప్రజల జీవితాలకే ముప్పు. గంగానదిని కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది. వేగంగా అడుగులు వేస్తామా...లేదా మన జీవితాలకే ముప్పు తెచ్చుకుంటామా అనేది తేల్చుకోవల్సింది మనమే. *


ఇలా ప్రక్షాళన

నదీతీరం రక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు, ఘాట్ల పునర్నిర్మాణం, నిర్వహణ, మురికి కాల్వల దారి మళ్లింపు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, రసాయనిక పరిశ్రమలకు హెచ్చరికలు, శవదహన వాటికల ఆధునీకరణ, వ్యర్థాల నిర్వహణ. ప్రజాచైతన్యం, నదీపరీవాహక ప్రాంతాల ప్రజల్లో చైతన్యం. భారీగా నిధులు. అత్యాధునిక, సాంకేతిక పరికరాల వినియోగంతో ప్రక్షాళన.
మూలం - ఆంధ్రభూమి.

2 comments:

  1. నమామీ గంగా-Namami Gange

    ReplyDelete
  2. హర హర గంగే కరుణా తరంగే నమామి గంగే

    ReplyDelete