ట్రిబ్యునల్... వన్స్‌మోర్
మండే ఎండల మే నెల. లాహోర్‌లోని పూంచ్ హౌస్‌లో 5వ తేదీన ప్రత్యేక ట్రిబ్యునల్ విచారణ మొదలయ్యే నాటికి ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారన్‌హీట్ దాటింది. కోర్టు హాల్‌లో బయటి జనం పలచగా ఉన్నారు. కారణం - ఎండ తీవ్రత కాదు... అటుకేసి వెళ్లిన వారినల్లా పోలీసులు సతాయిస్తారన్న భయం!
అప్పటికి చాలా రోజులుగా ఎవరిని పడితే వారిని అధికారులు పట్టుకుపోతున్నారు. విప్లవకారుల పట్ల సానుభూతి కలవారన్న అనుమానంతో 200 మందిని పోలీసులు నిర్బంధించారు. నగరంలో ఎక్కడ చూసినా తలపాగా ధరించిన పోలీసులు, తెల్లతోలు అధికారులు హడావిడి చేస్తున్నారు. పూంచ్ హౌస్ చిన్న సైజు కంటోనె్మంటులా ఉంది. సాయుధ పోలీసుల కాపలా చాలా గట్టిగా ఉంది. భగత్‌సింగ్‌ని విడిపించుకుపోవటానికి కుట్ర జరుగుతున్నదని గూఢచారి విభాగానికి ఉప్పందిందట. పాసులు ఉంటేగాని ఎవరినీ లోనికి పోనివ్వటంలేదు. ఆ పాసులు కూడా చాలా కొద్దిమందికి ఇస్తున్నారు.
కోర్టు హాలు ఆస్బెస్టాస్ రేకుల హైసీలింగుతో దీర్ఘ చతురస్రంలా ఉన్న పెద్ద గది. చెక్క ప్లాట్‌ఫాం మీద న్యాయమూర్తుల కోసం పెద్ద టేబిలు, మూడు ఎత్తు కుర్చీలు వేశారు. ఆ వెనుక జార్జి రాజు చిత్రపటాన్ని గోడకు వేలాడతీశారు. ముందుగా జస్టిస్ కోల్డ్‌స్ట్రీమ్, ఆయన వెనుక జస్టిస్ ఆగా హైదర్, జస్టిస్ జె.సి.హిల్టన్‌లు కోర్టు రూములో అడుగుపెట్టేసరికి 10 గంటల 2 నిమిషాలయింది. అప్పటికి హాల్‌లో 40 కుర్చీలు కూడా నిండలేదు. ఆడియన్సులో భగత్‌సింగ్ తండ్రి కిషన్ సింగ్ ఉన్నాడు. కొడుకు వద్దన్నా వినకుండా అతడు డిఫెన్సు కమిటీని ఏర్పరచాడు. అధికారుల ఆగ్రహాన్ని లక్ష్యపెట్టక కోర్టుకు హాజరైన వారి చేతుల్లో భగత్‌సింగ్ ఫోటో పెద్ద సైజుది ఉంది. ఉక్కపోతను తట్టుకోవడానికి దాంతో విసురుకుంటున్నారు.
న్యాయమూర్తులు వచ్చేసినా ఎవరూ వేదికకేసి చూడటంలేదు. అందరి కళ్లూ పక్క వాకిలి మీద ఉన్నాయి. భగత్‌సింగ్ బృందాన్ని అందులో నుంచే తీసుకువస్తారు. కాసేపటికి బయట కీచుమంటూ వ్యాన్లు ఆగిన శబ్దం. అడుగుల చప్పుడు. బిగ్గరగా నినాదాలు. జనాలు గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. వాళ్ల హీరోలు - మొత్తం 18 మంది - రానే వచ్చారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘గోరా జా జా’ (తెల్లవాడా పోపో) నినాదాలతో కోర్టు రూము దద్దరిల్లింది. భగత్ బృందం వచ్చీ రాగానే పాట ఎత్తుకున్నారు.
సర్ఫరోషి కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై
దేఖ్‌నా హై జోర్ కిత్‌నా బజువా -ఇ- కాతిల్ మే హై...
వక్త్ ఆనేదే బతా దేంగే తుఝే ఎహ్ ఆస్మాన్
హమ్ అభీ సే క్యా బతారుూఁ క్యా హమారే దిల్ మే హై...
జడ్జిలు రాతిబొమ్మల్లా కూర్చుండిపోగా... కోర్టులోని విజిటర్లు పాటకు లయగా కాళ్లు కదుపుతూ - చప్పట్లు కొట్టారు. విప్లవకారులు, ప్రజలు ఒక్కటై పోయినట్టుంది. అధ్యక్ష స్థానంలోని కోల్డ్‌స్ట్రీమ్‌కి ఒళ్లు మండింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ గోపాల్ లాల్‌ని కేకేశాడు. వాళ్లు పాడుతున్న పాటను ఇంగ్లిషులోకి అనువాదం చేసి తమ ముందు ఉంచమన్నాడు. జస్టిస్ ఆగా హైదర్ అనువాదం చేయబోయాడు. పాట హోరులో అతడి మాటలు పక్క వారికే వినిపించలేదు.
గీతాలాపన 8 నిమిషాలపాటు సాగింది. అది కాగానే రాజ్‌గురు కామ్రేడ్ల మధ్యలో నుంచి ఇవతలకు వచ్చి జడ్జిల ముందు నిలిచాడు. అసలు ఈ ట్రిబ్యునల్ ఏర్పాటే అక్రమం; చట్టవిరుద్ధం; నడుస్తున్న న్యాయ విధాన క్రమానికి కత్తెర వేసే అధికారం వైస్రాయికి లేదు; ఆర్డినెన్సు జారీకి 1915లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టు, నిర్దేశించిన పరిస్థితులేవీ ఇప్పుడు లేవు; శాంతిభద్రతలు భగ్నం కానూ లేదు; తిరుగుబాటు లేవలేదు; మరి అత్యవసర పరిస్థితి ఏమి ఆసన్నమైందో వైస్రాయి నిరూపించాలి; సామాన్య పరిస్థితుల్లో అసాధారణ అధికారాన్ని వినియోగించే అధికారం వైస్రాయికి ఉందా లేదా అన్నది మొట్టమొదట తేలాలి; అప్పటిదాకా విచారణ వాయిదా వేయాలి - అని రాజ్‌గురు తగులుకున్నాడు. తోటివారూ కొంతమంది అతడిని బలపరిచారు. తమ డిఫెన్సుకు ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా విచారణను పక్షం రోజులు వాయిదా వేయాలని ఐదుగురు డిమాండ్ చేశారు.
కోల్డ్‌స్ట్రీమ్ ఎవరి మాటనూ మన్నించలేదు. రాజ్‌గురు అభ్యంతరాన్ని కొట్టిపారేశాడు. విచారణ వాయిదా వేసే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పాడు. ఇంతకుముందు మేజిస్ట్రేటు కోర్టులో లాగే విచారణకు అడ్డం పడటానికి ఎత్తులు వేస్తున్నారు; మా దగ్గర మీ ఆటలు సాగవు అని హెచ్చరించాడు.
విప్లవకారులు మళ్లీ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలు అందుకున్నారు. రాజ్‌గురు బ్రిటిషు ప్రభుత్వ దుర్నీతిని తిట్టిపోస్తూ ఉర్దూలో మాట్లాడసాగాడు. నువ్వు ఏమంటున్నావో మాకు అర్థం కావటం లేదన్నాడు కోల్డ్‌స్ట్రీమ్. ‘మీ భాష నాకూ అర్థం కావటంలేదు. ముందు నాకో దుబాసిని ఇప్పించండి’ అన్నాడు రాజ్‌గురు. న్యాయమూర్తి ‘సరే’ అన్నాడు.
[Without Fear, Kuldip Nayar, pp.112-115]
ఉథయం 11 గంటల తరవాత విచారణ మొదలైంది. ప్రభుత్వ న్యాయవాది కార్డెన్ నోడ్ కేసులో వాస్తవాలు ఇవీ అంటూ ప్రాసిక్యూషన్ వాదాన్ని వినిపించాడు. ముద్దాయి భగత్‌సింగ్, అతడి సహచరులు కలిసి రాజుపై యుద్ధానికి కుట్రపన్నారు. హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు, బాంబులు, పేలుడు పదార్థాలు విరివిగా సమకూర్చుకున్నారు; విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో నిధులు సేకరించారు; తమ కార్యకలాపాలకు సొమ్ము నిమిత్తం బ్యాంకులపై పడ్డారు; ట్రెయిను దోపిడి చేశారు; ఈ కుట్రలో భాగంగానే సాండర్స్‌ను చంపారు- అంటూ పాత రికార్డునే మళ్లీ వినిపించాడు. నిందితుల పేర్లు, పరారీలో ఉన్నవారి పేర్లు చదివాక సాక్షుల విచారణ. అందులో ఆదిలోనే నగుబాటు!
మొదటి సాక్షి సీనియర్ పోలీస్ సూపర్నెంటు హామిల్టన్ హార్డింగ్. ‘ఈ కేసు వివరాలు నాకేమీ తెలియవండి. పంజాబ్ గవర్నమెంటు చీఫ్ సెక్రటరీగారు నన్ను ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చెయ్యమని ఆదేశించారు. నేను చేశాను. అంతకు మించి నేనేమీ ఎరుగను’ అన్నాడాయన.
కోర్టు వారు విస్తుపోయారు. ప్రభుత్వ పక్షం తెల్లమొగం వేసింది. కార్డెన్ నోడ్ లేచి పోలీసు అధికారి మాటల షాకు తీవ్రతను తగ్గించబోయాడు. ‘ఇంకా ఐదుగురు నిందితులు పట్టుబడకుండా బయటే ఉన్నారు కదాండి? వారివల్ల తన ప్రాణాలకు ముప్పు ఉన్నదన్న భయంతో ఎస్.పి.గారు ఇలా మాట్లాడి ఉండవచ్చు’ అని సర్ది చెప్పాడు. విన్న జనం ఫక్కున నవ్వారు. విప్లవకారులను చూసి సీనియర్ పోలీసు సూపర్నెంటే అంత గడగడలాడుతున్నాడని గవర్నమెంటే ఒప్పుకున్నది కదా?!
ఈ ప్రహసనం కాగానే నిందితుడు యతీంద్రనాథ్ సన్యాల్ లేచాడు. నిందితుల్లో ఐదుగురి తరఫున తానో ప్రకటన చేయదలిచానన్నాడు. భగత్‌సింగ్ తయారుచేసిన ప్రకటనను కోర్టు అనుమతి కోసం చూడకుండా చదవసాగాడు.
‘బ్రిటిషు వాళ్లు ఇప్పటిదాకా ఎన్ని మర్డర్లు చేశారంటే - వాటిలో ప్రతి ఒక్కదానికీ ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు ఒకవేళ అనుకున్నా అది సాధ్యమయ్యే విషయం కాదు. ప్రజలను అణచివెయ్యటం ప్రపంచంలోకెల్లా పెద్దనేరం. తెల్లవాళ్లు చేసిన పని అదే. మానవుడి జన్మహక్కు అయిన స్వాతంత్య్రాన్ని వాళ్లు పశుబలంతో తొక్కివేయాలనుకున్నారు. మేము నిందితులం కాము. భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్ఠను నిలబెట్టాలనుకుంటున్నవాళ్లం. మా దేశాన్ని అణచజూస్తున్న బ్రిటిషు రాజ్యమే అసలు ముద్దాయి... ...’
- అని సన్యాల్ గంభీర స్వరంతో బిగ్గరగా చదువుతూంటే వింటున్న విజిటర్లకు ఒళ్లు పులకరించింది. కోల్డ్‌స్ట్రీమ్‌కి కంపరం పుట్టింది. ‘ఇక చాలు. ఆపు’ అని అరిచాడు. ‘ఓపెన్ కోర్టులో అనుమతి లేకుండా ప్రకటన చదవడం పెద్ద తప్పు. ఇప్పటిదాకా చదివిన దానిలో ఈ కేసుకు సంబంధించిన ముక్క ఒక్కటీ లేదు. ఇది దేశద్రోహకరమైన ప్రాపగాండా’ అంటూ సన్యాల్‌ను అడ్డుకున్నాడు.
దాంతో కోర్టులో కలకలం లేచింది. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ ‘సామ్రాజ్యవాదం నశించాలి’ లాంటి నినాదాలతో కోర్టు హాలు మారుమోగింది. ఇంకా నిలబడే ఉన్న సన్యాల్ ‘ఈ విచారణ ఒక ఫార్సు. ఈ దొంగ నాటకంలో మేము పాలుపంచుకునేది లేదు’ అని గర్జించాడు. మిగతా నిందితులూ అతడి మాటను బలపరిచారు. కోర్టులో వాతావరణం వేడెక్కింది. విచారణ మరునాటికి వాయిదా పడింది.
భగత్‌సింగ్‌కి బ్రిటిషు న్యాయ విధానం మీద భ్రమలు ఏనాడూ లేవు. ప్రభుత్వం తమ మీద పగబట్టింది. తనలాంటి ముఖ్యులను ఉరికంబం ఎక్కించాలని నిశ్చయించుకుంది. పగవాళ్ల నుంచి న్యాయాన్ని ఆశించడం వృధా. ఆ సంగతి మేజిస్ట్రేటు కోర్టులోనే తేలిపోయింది. సెషన్సు కోర్టు తీర్పు మీద హైకోర్టుకు అపీలుకు శిక్షాస్మృతి ప్రకారం ప్రతి నిందితుడికీ ఉన్న హక్కును కూడా తమ విషయంలో లాగేశారు. ఆఖరికి మరణ శిక్షపై కూడా పై కోర్టుకు అపీలు అవకాశం నిరాకరిస్తూ, క్రిమినల్ జస్టిస్‌లో ఎక్కడా లేని అనౌచిత్యంతో పనిగట్టుకుని ఆర్డినెన్సు చేసి అడ్డగోలు ట్రిబ్యునల్‌ని తెచ్చిపెట్టినప్పుడే తెల్లవాళ్ల కుత్సితం బయటపడింది. అందుకే భగత్‌సింగ్ అసలు ట్రిబ్యునల్ విచారణకు తాము హాజరు కానే కూడదని మొదట అనుకున్నాడు. ఇంతకుముందు కోర్టుల్లోలాగే విప్లవ ప్రచారానికి, తమ ఆశయాలను ప్రజలకు వివరించడానికి ట్రిబ్యునల్‌నూ వేదికగా ఎందుకు ఉపయోగించుకోకూడదు - అని సహచరులు అన్నమీదట భగత్ సరే అన్నాడు. తాము ఏ నేరమూ చేయనప్పుడు తమను తాము ఎందుకు డిఫెండు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అతడు తండ్రికి కబురు చేశాడు. ‘నేను వద్దన్నా వినకుండా మమ్మల్ని కాపాడటానికి ఇప్పటిదాకా మీరు చేసింది చాలు. ఇకనైనా డిఫెన్సు కమిటీని కట్టెయ్యండి’ అని.
తమకు విధించబోయే శిక్షలు ఎలా ఉంటాయన్న విషయంలో విప్లవకారులకు సందేహం లేదు. విచారణ కేవలం ఫార్మాలిటీయే. కానీ అది సవ్యంగా జరిగినట్టు ప్రభుత్వం లోకానికి చూపెట్టుకోవాలి కదా? అది ఎలా సాధ్యం? తమ మీద మోపిన అభియోగాలకు చిన్నపాటి రుజువు లేదు. పిసరంత సాక్ష్యం లేదు. తాము చేశామంటున్న దోపిడీలు, హత్య తామే చేశామనడానికి ప్రత్యక్ష సాక్షి ఒక్కడూ లేడు. సాండర్స్ హత్య సమయాన సీన్‌లో ఉన్న బ్రిటిషు ఆఫీసరు ఇన్స్‌పెక్టర్ ఫెర్న్ కూడా జైలులో జరిగిన ఐడెంటిఫికేషన్ పెరేడ్‌లో భగత్‌సింగ్‌ని గుర్తుపట్టలేకపోయాడు.
ఐదుగురు అప్రూవర్లు అయితే ఉన్నారు. వారిలో జైగోపాల్, హన్స్‌రాజ్ వోరా, ఫణీంద్రనాథ్ ఘోష్‌లు తమతో చాలాకాలం పని చేశారు. కాని వారికి తెలిసింది తక్కువ. జైగోపాల్ చేసింది కేవలం మెసెంజరు పని. హన్స్‌రాజ్ ఎక్కువగా విద్యార్థుల ఉద్యమం చూసేవాడు. అలాగే ఫణీంద్రకూ రహస్య విప్లవ కార్యకలాపాలతో సంబంధం లేదు. తమకే తెలియని దాని గురించి వారు ఇచ్చే సాక్ష్యాలకు విలువేమిటి? ఒక తెలియనివాడు చెప్పిన దాన్ని ఇంకొక తెలియనివాడు బలపరిస్తే నేరం రుజువైనట్టు ఎలా అవుతుంది? రుజువు అయినట్టుగా తెల్లవాళ్లు ఏ మొగంతో చెప్పుకోగలరు?
అదీ చూద్దాం - అనుకున్నాడు భగత్‌సింగ్.
మరునాడు (1930 మే 6న) ట్రిబ్యునల్ కొలువు తీరగానే భగత్‌సింగ్ తనకో లీగల్ అడ్వయిజరు కావాలన్నాడు. తన తరఫున వాదించటానికి కాదు. ప్రొసీడింగ్సును గమనించి, అవసరమైనప్పుడు తనకు సలహా ఇవ్వటానికి మాత్రమే. ఆ న్యాయవాది సాక్షులను క్రాస్ ఎగ్జిమిన్ చెయ్యడు; కోర్టును ఉద్దేశించి పెదవి విప్పడు. వెనుక ఆకలి సమ్మె సమయాన తనకు సహాయకారిగా ఉన్న దునిచంద్‌ను భగత్‌సింగ్ అందుకోసం ఎంచుకున్నాడు. ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ‘మీరుగా డిఫెన్సు లాయరు ఎవరినీ పెట్టుకోదలచుకోకపోతే - ప్రభుత్వమే మీ తరఫున న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. ఒప్పుకుంటారా?’ అని న్యాయమూర్తి ప్రతి నిందితుడినీ అడిగాడు. తొమ్మిది మంది ‘అక్కర్లేదు’ అన్నారు. ఐదుగురు బదులే చెప్పలేదు. నలుగురు మాత్రం డిఫెన్సు కమిటీని అడిగి చెబుతాము అన్నారు.
కొద్ది రోజులపాటు విచారణ తతంగం ఒకే మూసలో నడిచింది. నిందితులు ఉదయం వస్తూనే బిగ్గరగా నినాదాలు చేసి, ‘కభీ వో దిన్ భీ ఆయేగా జబ్ హమ్ ఆజాద్ హోంగే...’ లాంటి విప్లవ గీతమేదో పాడేవారు. ఆ తరవాత జడ్జిలు ప్రవేశించేవారు. చివరిలో మళ్లీ నినాదాలు ఎత్తుకోవడానికి ముందే జడ్జిలు వెళ్లిపోయేవారు. ఇలా ఒక వారం నడిచింది.
మే 12న ఎందువల్లోగాని అందరికంటే ముందు కోల్డ్‌స్ట్రీమ్ కోర్టుకు వచ్చాడు. భగత్‌సింగూ అతడి సహచరులూ బోనులోకి అడుగుపెడుతూ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని మామూలు ప్రకారం గట్టిగా నినదించారు. కోల్డ్‌స్ట్రీమ్‌కి చిర్రెత్తింది. ‘ఆపండి’ అని అరిచాడు. వారు వినలేదు. ఇంకా బిగ్గరగా నినాదాలు చేయసాగారు. పెద్దజడ్జికి ఇంకా మండింది. ‘వీళ్లకి సంకెళ్లు వేసి ఇక్కణ్నుంచి తీసుకుపోండి’ అని పోలీసులకు పురమాయించాడు. పత్రికా విలేఖరులను కూడా వెళ్లిపొమ్మన్నాడు. విప్లవకారులు బెదరలేదు. చెవులు
బద్దలయేలా నినాదాలు చేస్తూనే ఉన్నారు. కోర్టులో ఉన్న మాకు సంకెళ్లు ఎలా వేస్తారని భగత్ అడిగాడు. వేయించే తీరుతానని చెప్పి కోల్డ్‌స్ట్రీమ్ అక్కడికక్కడ ఆర్డరు వేశాడు.
ఇక పోలీసులు ఆగుతారా? నిందితుల బాక్సులోకి పొలోమంటూ ఉరికారు. బెంచిల మీద కూచున్న వారి మీద పశువుల్లా పడ్డారు. లాఠీలతో కొట్టారు. ప్రతిఘటించిన వారిని మరీ చితకబాదారు. భగత్‌సింగ్‌కి, ఇంకా కొందరికీ బాగా దెబ్బలు తగిలాయి. రక్తం చాలా కారింది. పోలీసులు అందరినీ నేల మీద పడవేసి బలవంతంగా సంకెళ్లు వేశారు. కోల్డ్‌స్ట్రీమ్ ఇదంతా కసిగా చూస్తూ కూచున్నాడు. ‘ఇది దారుణం. అమానుషం. దీనికి నిరసనగా కోర్టు విచారణను ఈ క్షణమే బహిష్కరిస్తున్నాం. ఈ దుర్మార్గానికి కారకులైన జడ్జిలను మార్చేంతవరకూ మళ్లీ ఇక్కడ అడుగుపెట్టేది లేదు’ అని భగత్‌సింగు, మరి కొందరు అరుస్తూండగా పోలీసులు బరబర ఈడ్చుకువెళ్లి అందరినీ వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకుపోయారు.
ఆ రోజు జరిగింది ఎంతటి ఘాతుకమంటే - ట్రిబ్యునల్ జడ్జిల్లో ఏకైక భారతీయుడైన జస్టిస్ ఆగా హైదర్ తీవ్రంగా స్పందిస్తూ అప్పటికప్పుడు ఇలా ఆర్డరు ఇచ్చాడు:
ORDER
I was not a party to the order of removals of the accused from the court to the jail and I was not responsible for it anyway. I disassociate myself from all that took place in the consequence of that order.
12 May 1930. Agha Haider
ఆర్డరు
నింధితులను కోర్టు నుంచి తొలగించి జైలుకు పంపాలన్న ఆర్డరుకు నేను పార్టీని కాను. దానికి నేను ఏ విధంగానూ బాధ్యుడిని కాను. ఆ ఆర్డరు పర్యవసానంగా సంభవించిన పరిణామాలతో నాకు ప్రమేయం లేదు.
12 మే 1930 ఆగా హైదర్
ట్రిబ్యునల్... వన్స్‌మోర్
ReplyDelete