Breaking News

కోర్టు బదులు ట్రిబ్యునల్


‘పత్రికల్లో ఈ కేసు విచారణకు సంబంధించిన వార్తలను చదువుతూంటే నాకు కంపరం పుడుతున్నది. మేజిస్ట్రేటుకూ, నిందితులకూ నడుమ వాగ్వాదాల్లో పత్రికలు పూర్తిగా నిందితులనే సమర్థిస్తూ వార్తలు రాస్తున్నాయి. అవి చదివితే తప్పంతా మేజిస్ట్రేటుదే అయినట్టూ, నిందితులు అతణ్ని భలే బాగా నిలదీసినట్టు జనాలకు అభిప్రాయం కలుగుతుంది. దీనివల్ల ఆ మేజిస్ట్రేటు అన్నా, ఆయన నడిపించే కోర్టు అన్నా, అది నిలబెట్టే చట్టం అన్నా ఎవరికీ గౌరవం మిగలదు. విచారణ త్వరగా తెమిలేలా, అందరూ సవ్యంగా ప్రవర్తించేలా మనం ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ కేసు విచారణ ద్వారా, విప్లవ కార్యకలాపాలను అణచివెయ్యటం కాదు.. ఇంకా వృద్ధి చేసినవాళ్లం అవుతాం.’
ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టరు 1929 డిసెంబరు 24న ప్రభుత్వానికి పంపిన రహస్య నివేదిక ఇది. బ్రిటిషు గవర్నమెంటుకూ సరిగ్గా అలాంటి భయమే ఉంది. ఎందుకంటే లాహోర్ కుట్ర కేసు విచారణ ఇచ్చిన ప్రేరణతో విప్లవ కార్యక్రమాలు దేశమంతటా జోరైనట్టు రిపోర్టులొచ్చాయి. డిసెంబరు 23న దేశంలో సర్వాధికారి అయిన వైస్రాయ్ ప్రయాణించే రైలు బోగీనే విప్లవకారులు పేల్చివేయబోయారు. దానికి సూత్రధారి చంద్రశేఖర్ ఆజాద్. ప్రధాన పాత్రధారులు యశ్‌పాల్, భగవతీచరణ్ బోహ్రా. ఇంద్రపాల్ అనే కామ్రేడ్‌ని సాధువులా వేషం వేసి ఢిల్లీ సమీపాన రైల్వే లైనుకు కాపలాగా ఉంచారు. టి.ఎన్.టి.ని నింపిన మందుపాతరను ఒక రైలు స్లీపరు కింద అమర్చి, బాటరీ ద్వారా ఢిల్లీ సమీపాన పురానా కిలా వద్ద ఒక స్విచ్‌కి కనెక్షను ఇచ్చారు. వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలు కనుచూపు మేరలోకి రాగానే మిలటరీ యూనిఫారం ధరించిన యశ్‌పాల్ ఉదయం 7.40కి మందుపాతర పేల్చాడు. కాని కొద్దిలో గురి తప్పింది. వైస్రాయ్ ఉన్న బోగి క్షేమంగా దాటిపోయింది. వేరే బోగీ బాగా దెబ్బతిన్నది. ప్రాణనష్టం లేదు.
ఇండియాలో బ్రిటిషు సామ్రాజ్య రాజప్రతినిధి అయిన వైస్రాయ్ మీదికే విప్లవకారులు పంజా విసరటంతో ప్రభువులకు గుండె ఝల్లుమంది. దీనికి తెగించినవారు ఇంకెంతకైనా బరితెగించగలరన్న ఆందోళన కలిగింది. లాహోర్ జైళ్ల మీద దాడిచేసి, భగత్‌సింగ్‌నూ, మిగతా కామ్రేడ్సునూ బలవంతంగా విడిపించుకోవటానికీ సన్నాహాలు సాగుతున్నట్టు వేగులు అదే సమయాన ఉప్పందించారు.
అనుకొన్నదొకటి.. విప్లవకారుల బహిరంగ విచారణ వల్ల అయ్యింది వేరొకటి అన్న సంగతి ప్రభుత్వంలోని పెద్ద తలకాయలందరికీ అర్థమైంది. ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టరు నుంచి పైన ఉటంకించిన నివేదిక అందిన రోజునే హోం మెంబరు హెచ్.జి.హేగ్ తక్షణం చేయాల్సిందేమిటో గవర్నమెంటుకు ఇలా సూచించాడు:

‘వైస్రాయ్ గారి స్పెషల్ ట్రెయిన్ మీదనే బాంబు వేసేంతటి ఘాతుకానికి విప్లవకారులు ఒడిగట్టటాన్ని చూస్తే... లాహోర్ కేసును సాగదియ్యటం ఈ నేరగాళ్లకి ఎంతలా ఉపయోగపడుతున్నదీ అర్థమవుతుంది. ఈ బాంబు దురాగతం ఇండియాలో, ఇంగ్లండులో మరపున పడటానికి ముందే మనం ఏదో ఒకటి చెయ్యాలి. లాహోర్ కేసును త్వరగా ముగించేందుకు ఆర్డినెన్సు తేవాలి.’
వైస్రాయ్ ఇర్విన్‌కీ ఈ సలహా నచ్చింది. సహచరులతో, న్యాయ నిపుణులతో బాగా ఆలోచించి, ఇంగ్లండులోని పెద్దలనూ సంప్రదించి, చివరికి (వారి దృష్టిలో) తిరుగులేని తరణోపాయం కనుగొన్నారు. తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి, లాహోర్ కుట్ర కేసును విచారించటానికి కొత్తగా ఒక స్పెషల్ ట్రిబ్యునల్‌ని నియమిస్తూ 1930 మే 1న ఆర్డినెన్సు జారీ చేశాడు. అప్పటిదాకా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేటు కోర్టులో నడుస్తున్న విచారణ ఆగిపోతుంది. అక్కడ కమిటల్ ప్రొసీడింగ్సు ముగిసినట్టుగా భావిస్తారు. తదుపరి సాధారణంగా సెషన్స్ కోర్టులో జరగవలసిన విచారణను పంజాబ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే ముగ్గురు హైకోర్టు జడ్జిలతో కూడిన స్పెషల్ ట్రిబ్యునల్ చేపడుతుంది.
ఆ విచారణకు ఏళ్లూపూళ్లూ పట్టటానికి వీలులేదు. పుట్టిన ఆరు నెలలకల్లా ట్రిబ్యునల్ ఆయుస్సు తీరిపోతుంది. ఆలోపే విచారణ ముగించి తీర్పును ప్రకటించి తీరాలి. నిందితులు హాజరు కానంత మాత్రాన విచారణ వాయిదా వేయాల్సిన పనిలేదు. వారు రాదలచుకోకపోయినా, వచ్చే స్థితిలో లేకపోయినా, వారి హాజరీతో నిమిత్తం లేకుండా విచారణ సాగించే అధికారం ట్రిబ్యునల్‌కి ఉంటుంది. సాక్షులందరి విచారణకూ సమయం చాలదనుకుంటే ట్రిబ్యునల్ తనకు తోచిన నిర్ణయాలు చేయవచ్చు. ఏ సాక్షి ఎగ్జామినేషనునైనా క్రాస్ ఎగ్జామినేషనునైనా అవసరం లేదనుకుంటే ఎత్తెయ్యవచ్చు. నిందితులు విచారణను అడ్డుకోవాలని చూస్తే దానికి ఏమి చేయాలన్నది ట్రిబ్యునల్ ఇష్టానుసారం నిర్ణయించవచ్చు. నిందితులకు ఉరి సహా ఏ శిక్షనైనా విధించే అధికారం ట్రిబ్యునల్‌కు ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు మీద అపీలుకు అవకాశం ఉండదు. ట్రిబ్యునల్ సభ్యులను నియమించే హైకోర్టుకు కూడా ఆ సభ్యులు వెలువరించే తీర్పును పునః పరిశీలించే అధికారం ఉండదు. నిందితులు మొరపెట్టుకోదలిస్తే లండన్‌లోని ప్రివీ కౌన్సిల్‌ని ఆశ్రయించవలసిందే.
ఆర్డినెన్సును వెలువరించిన నాడే దానిని తెచ్చిపెట్టటానికి కారణాలనూ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటనలో వివరించాడు. మామూలు విచారణ విధి విధానాల ద్వారా ఈ కేసును తెమల్చడం అసాధ్యమైన విధంగా నిందితులు ప్రవర్తించడంవల్ల, అభియోగాల తీవ్రత దృష్ట్యా ట్రిబ్యునల్ అవసరమయిందని అందులో చెప్పుకొచ్చాడు. హంగర్ స్ట్రైకుల ద్వారా విచారణను అడ్డుకోవాలని నిందితులు చూస్తున్నారనీ వైస్రాయ్ ఆరోపించాడు.
అది అబద్ధం; అన్యాయపు ఆరోపణ - అని వెంటనే బదులిచ్చాడు భగత్‌సింగ్.

‘మేము ఆకలి సమ్మెకి దిగింది విచారణను సాగదియ్యటానికి కాదు. రాజకీయ ఖైదీల హక్కుల కోసం పోరాడటానికి. మా ఆందోళనను ఈ కేసుతో మేమెన్నడూ ముడిపెట్టలేదు. మీ విచారణ అన్నా మీరు వేసే శిక్షలన్నా మాకు ఎన్నడూ భయంలేదు. ఆర్డినెన్సు తెచ్చింది మా హంగర్ స్ట్రైకు వల్ల కాదు. దానికి కారణం ఇంకేదో ఉంది. దాన్ని తలచుకునే మీ గవర్నమెంటు బుర్రలు గందరగోళంలో పడ్డాయి. ఇలాంటి ఆర్డినెన్సులతో మీరు మా విప్లవ తత్వాన్ని అణచలేరు. మీరు వ్యక్తులను అణగదొక్కగలరే గాని ఈ జాతిని అణచిపెట్టలేరు. ఏమైనా. మామూలు విచారణ ద్వారా మమ్మల్ని మీరు శిక్షించలేరనీ, డిఫెన్సుకు మాకున్న హక్కుల్ని తొక్కివేస్తే తప్ప మమ్మల్ని ఏమీ చేయలేరని మీకు మీరే ఇప్పుడు బహిరంగంగా ఒప్పుకున్నారు. మీ నిజ స్వరూపం బయటపెట్టుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్! ఇది మాకు నైతిక విజయం’ అని నషాళానికి అంటేంత ఘాటుగా భగత్‌సింగ్ వైస్రాయ్‌కి ఉత్తరం రాశాడు.
భగత్ అన్నది నిజం. ఆర్డినెన్సు జారి ప్రభుత్వానికి ఓటమి. విప్లవకారులకు గొప్ప గెలుపు. ఆ సంగతి 1931-36 మధ్య ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టరుగా పని చేసిన సర్ హొరేస్ విలియమ్స్ అనంతర కాలాన బయటపెట్టాడు ఇలా:
Bhagat Singh made no mistake. The prisoners' dock became a political forum and the country side rang with his heroics. His photograph was on sale in every city and township and for a time rivalled in popularity even that of Mr.Gandhi himself. His antics and those of his confederates eventually succeeded in bringing the ordinary law to a stand still and in reducing the courts to a state of impotence and it became necessary in 1930 for the Governor General to promulgate special Ordinance, without which their trial might never have been brought to conclusion.
[India and Communism, Sir Horace Williamson, p.275]

(్భగత్‌సింగ్ తప్పు లేథు. కోర్టులో ఖైదీల బోను రాజకీయ వేదికగా మారిపోయింది. అక్కడ అతడి వెర్రిచేష్టలు దేశమంతటా మోతమోగాయి. ప్రతి నగరంలో, పట్నవాసాల్లో అతడి ఫోటోలు అమ్ముడయ్యాయి. ఒక దశలో అతడి పాప్యులారిటీ గాంధీని కూడా మించిపోయింది. అతడు, అతడి సహచరులు చేసిన చేష్టలు కడకు మామూలు శాసన విధానానే్న స్తంభింప జేయగలిగాయి. కోర్టులను నిర్వీర్యం కావించాయి. ఆ స్థితిలో గవర్నరు జనరల్ ప్రత్యేక ఆర్డినెన్సును తేవటం అవసరమైంది. అదే కనుక లేకపోతే కేసు విచారణ ఎప్పటికీ ఒక కొలిక్కి వచ్చేది కాదు.)
ఆర్డినెన్సు రావటంతో మేజిస్ట్రేటు కోర్టు విచారణ అర్థాంతరంగా ఆగిపోయింది. మే 3న కోర్టు కొట్టు కట్టేయడానికి ముందు పబ్లిక్ ప్రాసిక్యూటరు కార్డన్ నోడ్ మేజిస్ట్రేటు పండిట్ శ్రీకిషన్ చాలా బాగా పని చేశాడని తెగ మెచ్చుకున్నాడు. అందులో ఆశ్చర్యం లేదు. విశేషం ఏమిటంటే ఆ మేజిస్ట్రేటు వల్ల అనేక అన్యాయాలకు లోనై, కోర్టు లోపలా వెలుపలా దెబ్బలు కూడా తిన్న భగత్‌సింగ్ కించిత్తు కూడా కసి చూపించలేదు. అధికార వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నందున మిమ్మల్ని ఒక్కోసారి ధిక్కరించవలసి వచ్చినా మాకు మీ మీద కోపం లేదు. మీరు మా పట్ల మర్యాదగానే వ్యవహరించారు - అని మనస్ఫూర్తిగా మేజిస్ట్రేటును మెచ్చుకున్నాడు. భగత్‌సింగ్‌కి ఎవరన్నా భయంలేదు. ఎవరి మీదా ద్వేషమూ లేదు.
తాము పగబట్టిన వాళ్లను మట్టుపెట్టటం మామూలు కోర్టుల ద్వారా సాధ్యపడదనుకున్నప్పుడు స్పెషల్ ట్రిబ్యునల్ ద్వారా ఆ పని కానివ్వటం బ్రిటిషు సర్కారుకు అలవాటే. లోగడ గదర్ విప్లవకారులను అర్జంటుగా శిక్షించటానికీ 1915లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం కింద ముగ్గురు సెషన్స్ జడ్జిలతో ఇలాగే ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌ను నియమించారు. ఇష్టానుసారం విచారణ జరిపి, అది చేసే నిర్ణయం మీదా అపీలుకు వీల్లేదన్నారు. మొత్తం 154 మంది నిందితులను ఆగమేఘాల మీద విచారించి, ఆనాటి ట్రిబ్యునల్ 19 మందిని ఉరితీయించింది. 111 మందిని జైలుకు పంపించింది. 24 మందిని మాత్రం దయతలిచి విడిచిపెట్టింది.
1930లో వేసిన ట్రిబ్యునల్‌దీ అదే మూస. వెనకటి దానిలాగే ఈ ట్రిబ్యునల్‌లోనూ ముగ్గురు జడ్జిలు. వారిలోనూ ఇద్దరు తెల్లవాళ్లు. ఒకడు భారతీయుడు. తేడా అల్లా పాత ట్రిబ్యునల్‌లోని వారు సెషన్స్ జడ్జిలైతే ఇందులో పీటల మీద కూర్చునేది హైకోర్టు జడ్జిలు.
లాహోర్ కుట్ర కేసులో మొత్తం నిందితులు 25 మంది. వారి మీద నేరారోపణకు ప్రాసిక్యూషన్ పట్టుకొచ్చిన సాక్షులు ఏకంగా 607 మంది. తొమ్మిది నెలలు కిందా మీదా పడితే మేజిస్ట్రేటు కోర్టు వారిలో 230 మందిని మాత్రం విచారించగలిగింది. ఆయా సాక్ష్యాలు మొత్తం అన్నీ పరిశీలించి, అభియోగాల నిగ్గు తేల్చి తిరుగులేని తీర్పు ప్రకటించటానికి ట్రిబ్యునల్‌కి ఇచ్చిన గడువు కేవలం ఆరే నెలలు. నిందితులందరూ చక్కగా సహకరించినా, సెలవూ విరామం లేకుండా ఏకబిగిన పని చేసినా అంతటి కార్యభారాన్ని న్యాయప్రకారం చక్కబెట్టటం మానవమాత్రులకు సాధ్యంకాదు. బ్రిటిషు దొరతనానికి ప్రతిదీ న్యాయ ప్రకారం జరగాలన్న చాదస్తం ఏనాడూ లేదు. తాను అనుకున్నది జరిపించటమే దానికి ఎప్పుడైనా కావలసింది.
అసలు ట్రిబ్యునల్ పుట్టుకే ఒక అక్రమం. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, శాంతికి, సుపరిపాలనకు తప్పనిసరి అయినప్పుడు ఆరునెలల కాలపరిమితి మించకుండా ఆర్డినెన్సు జారీ చేయటానికి 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టులోని 72వ సెక్షను గవర్నర్ జనరల్‌కి అధికారమిచ్చింది. ఒక మామూలు కుట్ర కేసు విచారణకు, అందునా శాంతికి, పరిపాలనకు ఏ పుట్టీ మునగనప్పుడు ఆ విశేషాధికారాన్ని ఆవాహన చేయటం అక్రమం. (ఆ మాట తొలి రోజు విచారణలోనే రాజ్‌గురు ట్రిబ్యునల్ సభ్యుల మొగం మీదే అనేశాడు.)
ఆరు నెలలకు మించి ఒక్క రోజు కూడా ఆర్డినెన్సు అమలులో ఉండదు. కాబట్టి దాని ద్వారా పుట్టిన ట్రిబ్యునల్ ఆ గడువులోపే పని ముగించాలి. లేదా పని మధ్యలో ఉండగా అవతారం చాలించాలి. ఇలా ట్రిబ్యునల్ మనుగడకు భద్రత లేదు. దానిని నడిపించే జడ్జిల పనికీ భద్రత లేదు. జడ్జిల మెడ మీద కత్తి పెట్టి పని చేయమనటంతో ట్రిబ్యునల్ మీద ఎవరికీ గౌరవం, విశ్వాసం లేకుండా పోయింది. గడువులోగా అప్పగించిన పని పూర్తి చేయటానికి న్యాయమూర్తులు ఉరుకులు పరుగులు పెట్టటంతో అన్యాయ విచారణ సిగ్గుచేటు ప్రహసనమైంది. ‘న వకీల్, న దలీల్, న అపీల్’ (వకీలు గాని, వాదన గాని, అపీలుగాని ఉండనిది) అని ప్రజలు ఈ ట్రిబ్యునల్‌ని ఏవగించుకునేవాళ్లు.
ఆర్డినెన్సు వచ్చీ రాగానే పంజాబ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కదిలి, జస్టిస్ కోల్డ్ స్ట్రీమ్, జస్టిస్ జె.సి.హిల్టన్ అనే తెల్లవాళ్లను, జస్టిస్ ఆగా హైదర్ అనే భారతీయుడిని స్పెషల్ ట్రిబ్యునల్ సభ్యులుగా నియమించారు. జస్టిస్ కోల్డ్‌స్ట్రీమ్‌కు అగ్రాసనం ఇచ్చారు.
తనకు పక్కలో బల్లేల్లాంటి విప్లవకారులను వీలైనంత త్వరగా ఉక్కుపాదాలతో తొక్కివేయటమే బ్రిటిషు ప్రభుత్వ ఆంతర్యం అన్నది ప్రతి ఒక్కరికీ అర్థమైంది. ట్రిబ్యునల్ వేశారు అనగానే తమకు డెత్ వారంటు జారీ అయినట్టే అని భగత్‌సింగ్‌కి బోధపడింది. అతడికీ, అతడి సహచరులకీ చావు అంటే ఏనాడూ భయంలేదు. కొమ్ములు తిరిగిన బ్రిటిషు సామ్రాజ్యానికి గంగవెర్రులెత్తించి, తాము ఘన విజయం సాధించామనే వారు అనుకున్నారు. మేజిస్ట్రేటు కోర్టును విప్లవ ప్రాపగాండాకు, తమ ఆశయాల ప్రచారానికి చక్కగా వాడుకోగలిగామన్న తృప్తి వారికి ఉంది. మామూలు కోర్టులో వేసిన ఎత్తుగడలు, అనుసరించిన విధానాలు కర్కోటకపు ట్రిబ్యునల్‌లో పని చేయవని వారికి తెలుసు. మారిన పరిస్థితికి తగ్గట్టు వ్యూహాన్నీ మార్చుకోవాలి.
అది ఎలాగన్నది భగత్‌సింగ్ సీరియస్‌గా ఆలోచించసాగాడు.

1 comment:

  1. కోర్టు బదులు ట్రిబ్యునల్

    ReplyDelete