తారాపథంలో ఇస్రో రథం
రోదసి...
రహస్యాల పుట్టిల్లు....
అందులో ఏముందో తెలుసుకోవడం..ఓ సాహసం...ఓ శాస్త్రం..
దాని రహస్యాలు ఛేదించాలంటే ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. ఫలితాలు రాబడుతూనే ఉండాలి...ఆ పని ఇప్పటికే చాలామంది ప్రారంభించారు... ఎడ్లబళ్లపై ప్రయోగ సామాగ్రి తరలించిన దశ నుంచి అడుగులు వేసిన మనం..ఆంక్షలు, అడ్డంకులు, అంతరాయాలను దాటుకుని రోదసివైపు సగర్వంగా, సాధికారికంగా దూసుకుపోతున్నాం... ‘ఇస్రో’ సారథ్యంలో...
ఇప్పుడు ఏ పని చేసినా డబ్బుతోనే లెక్క. తక్కువ ఖర్చుతో, ఉత్తమ ఫలితం రాబడితే అది ఘనత. మంగళయాన్‌తో ఆ ఘనతను ఇప్పటికే సాధించిన భారత్ ఇప్పుడో మరో అరుదైన ప్రయోగంతో అంతరిక్ష వ్యవహారాలలో మూడో దిగ్గజ దేశంగా చరిత్ర సృష్టించింది. తారాపథంలో దూసుకుపోతున్న ‘ఇస్రో’ ఈ ఘనతను తెచ్చిపెట్టింది. వైఫల్యాలనుంచి పట్టుదలను, విజయాలనుంచి స్ఫూర్తిని...ఆంక్షలనుంచి స్వావలంబనను, పోటీనుంచి దీక్షను ఒంటబట్టించుకుని రోదసివైపు దూసుకుపోతున్నది భారత్...ఇస్రో సారథ్యంలో...
మున్ముందు చేయబోయే అద్భుతాలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వడివడిగా అడుగులు వేస్తోంది. మనదైన స్పేస్ షటిల్‌గా అందరూ అభివర్ణించే ‘పునర్వినియోగ వాహక నౌక’ (ఆర్‌ఎల్‌వి) తొలి ప్రయోగంతో తాజాగా ఇస్రో మరో ఘనవిజయం నమోదు చేసింది. దీంతో ప్రపంచం అంతా మరోసారి ఇస్రో వైపుదృష్టి సారించింది.
వరుసగా కనీవినీ ఎరుగని విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న ఇస్రో మరిన్ని పరిశోధనలకు సిద్ధం అవుతోంది. రాకెట్ ప్రయోగాల్లో విప్లవం సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సృష్టించిన ఆర్‌ఎల్‌వి ప్రయోగం తొలి అడుగులోనే విజయం సాధించింది. రోదసీ పరిశోధనల్లో భారత త్రివర్ణపతాకం మరో సారి రెపరెపలాడింది. స్పేస్ షటిల్ ప్రయోగాల్లో అమెరికా, రష్యా తరువాతి స్థానం భారత్‌దే. ఆర్‌ఎల్‌వి-టిడి (పునర్వినియోగ వాహక నౌక) ప్రయోగంతో అంతరిక్ష పరిశోధనలో తన స్థానాన్ని భారత్ పదిలపరచుకుంది. ఆర్‌ఎల్‌వి అనేది రెక్కలతో కూడుకున్న వాహక నౌక. ఇది భూమి నుండి రాకెట్‌లా గగనసీమలోకి దూసుకువెళ్లి, అనంతరం గ్లైడర్‌లా మారి తిరిగి భూవాతావరణంలోకి వచ్చేసి, చివరికి విమానంలా నేలపై దిగేలా రూపొందించారు. నిప్పులు చిమ్ముతూ నింగివైపు కదిలిన ఆర్‌ఎల్‌వి రోదసిలో 70 కిలోమీటర్లు పయనించి మళ్లీ భూ స్థిర కక్ష్యలోకి చేరింది. శ్రీహరికోటలోని ‘షార్’ కేంద్రం నుంచి ప్రయోగించిన ఆర్‌ఎల్‌వి భూమి నుండి 70 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లిన తర్వాత రాకెట్ తిరిగి అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ రన్‌వేపై నెమ్మదిగా దిగింది. భూమిపైకి ఎగిరిన అనంతరం ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ఇది దూసుకువెళ్లింది.
* * *
55 ఏళ్ల క్రితం బుడిబుడి అడుగులు వేసుకుంటూ మొదలైన భారత అంతరిక్ష పరిశోధన నేడు భారీ ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు క్రయోజనిక్ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ నేడు సొంతంగా తనే క్రయోజనిక్ తయారుచేసుకుంటోంది. తక్కువ ఖర్చుతో స్పేస్ షటిల్ ప్రయోగాలు చేసి విజయం సాధించడంతో అంతరిక్ష వ్యాపారంలో అగ్రరాజ్యాలతో పోటీపడే స్థాయికి చేరుకుంది. దీనివల్ల రాకెట్ ప్రయోగ ఖర్చు పదిరెట్లు తగ్గిపోతుంది. నేడు వాడుతున్న సంప్రదాయ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ఒక కిలో బరువును పంపడానికి 20వేల డాలర్లు ఖర్చవుతుంది. ఆర్‌ఎల్‌వి తరహా రాకెట్లలో ఒకసారి ఉపయోగించిన పరికరాలను మళ్లీ మళ్లీ వినియోగించుకునే వీలు కలుగుతుంది. వ్యోమగాములను సైతం అంతరిక్షంలోకి పంపించి మళ్లీ వారిని భూమి మీదకు క్షేమంగా తీసుకువచ్చే వీలుంది.
ప్రయోగం సాగిందిలా..
ఇస్రో ప్రయోగించిన పునర్వినియోగ వాహక నౌక ఒక నమూనా మాత్రమే. పూర్తిస్థాయిలో ఇలాంటి రాకెట్లు ప్రయోగించాలంటే నమూనా ప్రయోగాలు చాలా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చేపట్టింది
హైపర్‌సోనిక్ వేగానికి సంబంధించిన ప్రయోగం కనుక దీనిని ‘హెక్స్ 01’గా పిలుస్తున్నారు. ఈ నమూనా పూర్తి స్థాయి వాహక నౌకలో ఆరో వంతు మాత్రమే. పూర్తి స్థాయి ఆర్‌ఎల్‌వి పొడవు 40 మీటర్లు పైనే ఉంటుంది. ఆర్‌ఎల్‌వి పొడవు కేవలం 6.5 మీటర్లు. బరువు 1.75 టన్నులు. ఇది చూడటానికి అమెరికా స్పేస్ షటిల్ తరహాలో ఉంటుంది. డెల్టా ఆకారంలో రెక్కలు ఉంటాయి. దీనికి సొంత ఇంజన్ ఉండదు, పూర్తిస్థాయి వ్యోమగామ నౌకలో మాత్రం ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్లు, సంప్రదాయ రాకెట్ థ్రస్టర్లు ఉంటాయి. ఆర్‌ఎల్‌వి టిడిని 9 మీటర్లు పొడవు, 11 టన్నుల బరువున్న ఘన ఇంధన రాకెట్‌పై ఉంచారు. ఈ రాకెట్ నిర్దేశిత ఎత్తు వరకూ ఆర్‌ఎల్‌విని మోసుకెళ్లింది. భూమి నుండి 70మీటర్లు ఎత్తు వరకూ ఈ రాకెట్ చేరుకుంది. అక్కడి నుండి కిందకు దిగడం ప్రారంభించింది. భూ వాతావరణం లోకి తిరిగి ప్రవేశించింది. ఈ దశలో గాలి రాపిడి వల్ల 5వేల నుండి 7వేల డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు చెలరేగే ప్రమాదం ఉంది. దీనిని తట్టుకునేందుకు ప్రత్యేక సిలికా ఫలకాలను దీని ఉదర భాగానికి అతికించారు. ఇలా ప్రతి దశలో ఈ ప్రయోగానికి సంబంధించి అనేక జాగ్రత్తలు చేపట్టారు.
చరిత్రలో...
మొట్టమొదటిసారి బ్రిటిష్ సైన్యంపై టిప్పు సుల్తాన్ రాకెట్లను ప్రయోగించాడని చరిత్రకారులు చెబుతుంటారు. అది చూసిన బ్రిటిష్ శాస్తవ్రేత్తలు అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్ల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. 1947లో స్వాతంత్య్రం రాగానే రక్షణ రంగం అభివృద్ధికి అంతరిక్ష విజ్ఞానం అవసరమని గుర్తించిన భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పూనుకుంది. విక్రం సారాభాయ్‌ని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా చెప్పవచ్చు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు శాటిలైట్ వ్యవస్థ ఆవశ్యకతను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు వివరించి భారత అణుశక్తి వ్యవస్థకు ఆద్యుడైన హోమి బాబా పర్యవేక్షణలో ‘ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చి’ని ఏర్పాటు చేశారు. ఉపగ్రహాల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేసేందుకు త్రివేండ్రం (కేరళ) వద్ద ‘తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్’ను నెలకొల్పి, రష్యా, అమెరికాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ప్రయోగాలను మొదలుపెట్టారు. అనతికాలంలోనే భారత్ దేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారుచేసి ఉపరితల అధ్యయనంలో పురోగతి సాధించింది. భవిష్యత్‌లో ఉపగ్రహాలకు అవసరమైన పరికరాలను ఇతర దేశాలు సమకూర్చకపోవచ్చని ముందే గ్రహించిన విక్రం సారాభాయ్ పూర్తి స్వదేశీ సాంకేతికతో శాటిలైట్‌కు అవసరమైన విడిభాగాలు మనదేశంలోనే తయారుచేసేలా ‘ఇస్రో’ను ఏర్పాటుచేశారు. నాసాతో చర్చలు జరిపిన తర్వాత కేవలం శాటిలైట్లను తయారుచేయడమే గాక, వాటిని ప్రయోగించే సామర్ధ్యం కూడా మనకు ఉండాలని ఉపగ్రహాల లాంచింగ్ ప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ విఫలమైనా , రెండో ఉపగ్రహం రోహిణి విజయవంతమైంది. ఎస్‌ఎల్‌వి విజయంతో శాస్తవ్రేత్తలు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించేందుకు ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను నిర్మించారు. 1992లో ఎఎస్‌ఎల్‌వి ప్రయోగం విజయవంతమైనా తక్కువ బరువున్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగారు. 1993లో పిఎస్‌ఎల్‌వి ప్రయోగం విఫలమైంది. తిరిగి 1994లో మరోసారి ప్రయోగించి విజయం సాధించారు. భారత ఉపగ్రహాలకు పిఎస్‌ఎల్‌వి స్థిరమైన వేదికగా నిలిచి ప్రపంచంలోనే అతిపెద్ద ఉపగ్రహాల సమూహానికి మూలమైనదిగా , రక్షణ విద్యా వ్యవసాయ రంగాలకు అవసరమైన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది. 2001లో
మరింత శక్తిసామర్ధ్యాలున్న జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్‌ఎల్‌వి) రూపొందించారు. దీనివల్ల 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను కూడా భూమి ఉపరితల కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. ఇలా మన అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతూ- చంద్రుడిపైకి మనిషిని పంపే దిశగానూ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇన్సాట్ (ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టం’ అనేది కమ్యూనికేషన్లు, వాతావరణం, ప్రసారాలతో పాటు బహుళ ప్రయోజనం ఉన్న వ్యవస్థ. ఇదిఆసియా పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద ఉపగ్రహ వ్యవస్థగా అవతరించింది. ప్రస్తుతం 199 ట్రాన్స్‌పాండర్లతో భారతదేశంలోని అన్ని టెలివిజన్, రేడియోలకు మాధ్యమంగా ఉన్న ఈ ఉపగ్రహాలను కర్నాటకలోని హస్సన్, భోపాల్ నుండి అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు. ఇవి కాకుండా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌లు, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు మెట్‌శాట్‌లు ప్రయోగించారు.
తిరువనంతపురం సమీపంలో భూ అయస్కాంత రేఖకు దగ్గరలో తుంబాలో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. అప్పటి శాస్తవ్రేత్తల్లో దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం కూడా ఒకరు. తుంబా కేంద్రం కాలగతిలో రాకెట్లకు అవసరమైన ప్రొఫెలర్లు, ఇంజన్లు తయారుచేసి అమర్చగలిగి పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా ఎదిగింది.
భారత్‌లో ఉపగ్రహాల ప్రయోగాలకు అత్యంత అనువైన ప్రదేశం శ్రీహరికోట. ఇది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు దగ్గరలో ఉంది. ‘షార్’ (సతీష్ ధావన్ స్పేస్ సెంటర్)గా వ్యవహరించే ఈ కేంద్రం దేశంలో ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుండే పిఎస్‌ఎల్‌విలు, జిఎస్‌ఎల్‌విలు ప్రయోగించారు. ఇక్కడ రెండు లాంచింగ్ ప్యాడ్‌లు ఉండటం వల్ల ఏటా ఆరు శాటిలైట్లను ప్రయోగించే వీలుంది. బలేశ్వర్ (ఒడిశా)లోనూ రాకెట్లను ప్రయోగించేందుకు అనువైన అన్ని సౌకర్యాలూ ఉన్నాయి.
55 ఏళ్ల ప్రస్థానం
1962లో భారత అంతరిక్ష పరిశోధనా కమిటీ ఏర్పాటు కావడంతో దేశంలో అంతరిక్ష పరిశోధనలకు నాందీ ప్రస్తావన జరిగింది. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను, 1972లో అంతరిక్ష కమిషన్‌ను, అంతరిక్ష మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇస్రో అంతరిక్ష పరిశోధనకు ప్రధాన లక్ష్యాలు నిర్దేశించుకుంది. కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విస్తృత సమాచార, ప్రసార సౌకర్యాలను కల్పించడం, వాతావరణం అధ్యయనాలను నిర్వహించడం, విద్యాభివృద్ధి తోడ్పడటం తద్వారా ఆర్థికంగానూ, సామాజికంగానూ దేశాభివృద్ధికి కృషి చేయడం, రిమోట్ సెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశంలోని వనరుల సామర్ధ్యాన్ని అంచనా వేయడం, దేశీయంగా ఉపగ్రహాలు, వాటి ప్రయోగ వాహక నౌకలను తయారుచేయడంతో పాటు ఆ విజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్ష అంతర్జాతీయ మార్కెట్‌లలోకి ప్రవేశించి వాణిజ్య ప్రయోజనాలను పొందడం వంటి లక్ష్యాలతో ప్రపంచానికే పాఠాలు నేర్పేలా మనదేశం ముందు వరసలో నిలిచింది.
మైలురాళ్లు
భారత్‌లో 1962 నుండి అంతరిక్షపరిశోధనలు మొదలయ్యాయి. తొలుత దేశీయ అవసరాలకు ప్రయోగాలు మొదలైనా ఆ తర్వాత అనూహ్యమైన విజయాలను చవిచూసి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. నేడు అంతరిక్ష పరిశోధనలో అగ్రదేశాల సరసన చేరింది. చిన్న చిన్న దేశాలకే గాక, అగ్రదేశాల అంతరిక్ష పరిశోధనల్లో సైతం మన దేశం పాలుపంచుకుంటోంది. నేడు వారి ఉపగ్రహాలను మన దేశం నుండి ప్రయోగించే స్థాయిని దక్కించుకుంది. అంతరిక్ష విజ్ఞానంలో స్వయం సమృద్ధిని సాధించడానికి స్పేస్ సైన్స్ టెక్నాలజీ సెంటర్ 1965లో తుంబాలో ఆవిర్భవించింది. 1967లో అహ్మదాబాద్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ ఎర్త్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. 1969లో శాంతియుత ప్రయోజనాలను ఆశిస్తూ అంతరిక్ష పరిశోధనలకు ఇండియన్ స్పేస్ రిసెర్చి ఆర్గనైజేషన్ ఆవిర్భవించింది. 1975లో భారత్ మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం ఆర్యభట్టను ఏప్రిల్ 19వ తేదీన భైకనూరు నుండి కాస్మోస్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. 1979లో భారత్ రెండో ఉపగ్రహం, మొట్టమొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర-1ను భైకనూరు నుండి ప్రయోగించారు. 1979లో శ్రీహరికోట నుండి ఎస్‌ఎల్‌వి -3 ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. దేశపు మొట్టమొదటి స్వదేశీయ జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏపిల్‌ను ప్రయోగించారు. 1981లో భాస్కర -2ను ప్రయోగించారు. అక్కడి నుండి ప్రయోగాల విషయంలో వెనుదిరిగింది లేదు.
అభివృద్ధికి చేయూత..
వాతావరణం, అడవులు, నదీజలాల ప్రవాహం, జనాభా, కమ్యూనికేషన్లు, రక్షణ రంగంలో అనేక అవసరాలకు అంతరిక్ష పరిశోధనలు ఎంతో దోహదం చేస్తాయి. అణుశక్తి పరిశోధనలకు, రక్షణ, భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయడానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు, యుద్ధవిమానాల కదలిక, యుద్ధ ట్యాంకుల వినియోగం, క్షిపణి వ్యవస్థ కోసం నావికులకు, నావికాదళాల అవసరాలకు సైతం అంతరిక్ష పరిశోధనా ఫలితాలు ఉపయోగపడతాయి. రైల్వేవ్యవస్థకు, వైమానిక, జలరవాణాకు కూడా ఈ ఫలితాలు మేలు చేస్తున్నాయి.
వాహక నౌకలు
ఎస్‌ఎల్‌వి: ఎస్‌ఎల్‌వి అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ ఇది మొదటితరం ఉపగ్రహ వాహక నౌక. నాలుగు దశల్లో ఘన ఇంధనంతో పనిచేస్తుంది. 415 కిలోల బరువు కలిగిన రోహిణి ఉపగ్రహాన్ని ఎస్‌ఎల్‌వి -3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 450 కిలోమీటర్లు ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టారు. రోహిణి సిరీస్‌లో మొత్తం మూడు ఉపగ్రహాలు ఆర్‌ఎస్-1, ఆర్‌ఎన్‌డి 1, ఆర్‌ఎన్‌డి 2లకు వరుసగా 1980, 1983, 1983లలో ప్రయోగించారు.
ఎఎస్‌ఎల్‌వి: ఎఎస్‌ఎల్‌వి అంటే ఆగ్‌మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది రెండో తరం ఉపగ్రహప్రయోగ వాహక నౌక. ఎస్‌ఎల్‌వి ప్రయోగాల ద్వారా సాధించిన పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరిచి 150 కిలోల బరువున్న ఉపగ్రహాలను సమీప వృత్తాకార కక్ష్యలోప్రవేశపెట్టేందుకు వీలుగా ఇస్రో ఎఎస్‌ఎల్‌విలను అభివృద్ధి పరిచింది. ఎస్‌ఎల్‌విల కన్నా శక్తివంతం చేయడానికి వీటికి స్ట్రాప్ అనే బూస్టర్‌ను అమర్చారు. మొత్తం ఐదు దశల్లో ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్ధ్యం దీనికి ఉంది. ఎఎస్‌ఎల్‌వి 23.85 మీటర్లు పొడవు ఉండి, 43 టన్నుల లిఫ్ట్ ఆఫ్ బరువును కలిగి ఉంటుంది.
పిఎస్‌ఎల్‌వి: పిఎస్‌ఎల్‌వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది సోలార్ ఉపగ్రహ వాహక నౌక. ఇది మూడో తరం ఉపగ్రహ వాహక నౌక. వెయ్యి కిలోల బరువు ఉండే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను 900 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న సోలార్ సన్ సింక్రోనస్ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఈ రాకెట్లను అభివృద్ది చేశారు. 44 కిలోమీటర్లు పొడవు ఉండి నాలుగు దశల్లో పనిచేసే పిఎస్‌ఎల్‌వి అనేక విశిష్టతలతో రూపొందించారు. ఇందులో మొటి, మూడో దశల్లో ఘన ఇంధనాన్ని రెండు,నాలుగు దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో ద్రవ ఇంధనంతో పనిచేసే ఇంజన్లను వాడడం తొలిసారిగా పిఎస్‌ఎల్‌వితోనే ప్రారంభమైంది. ఆరు స్ట్రాప్ ఆన్ బూస్టర్లతో పాటు క్లోజ్‌డ్ గైడెన్స్ సిస్టం వంటి అనేక ఆధునాతన వ్యవస్థలు ఎన్నింటినో పిఎస్‌ఎల్‌విలో పొందుపరిచారు.
జిఎస్‌ఎల్‌వి: జిఎస్‌ఎల్‌వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇవి నాలుగో తరం ఉపగ్రహ వాహక నౌకలు. 2,500 కిలోల బరువు ఉండే ఇన్‌శాట్ ఉపగ్రహాలను 36వేల కిలోమీటర్లు ఎత్తులోని భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు వాహక నౌకలను చోదకశక్తి చాలా అధికంగా ఉండాలి. ఇది ‘క్రయోజనిక్ ఇంజన్’ ద్వారా సాధ్యమైంది. క్రయోజనిక్ ఇంజన్‌లో ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్‌లను ఇంధనాలుగా వాడతారు. ఈ ఇంధనాలను అతి శీతలంగా అంటే మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచుతారు. కనుక దీనికి క్రయోజనిక్ అనే పేరు వచ్చింది. జిఎస్‌ఎల్‌వి రాకెట్‌లో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. మొదటి మూడు దశల్లోని ఇంధనం, నాలుగో దశలో ప్రయోగించాల్సిన ఉపగ్రహం ఉంటాయి. మొదటి దశలోని ఘన ఇంధనం, రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో క్రయోజనిక్ ఇంధనం ఉంటాయి.
భారతదేశం తొలిసారి 2001 ఏప్రిల్ 1వ తేదీన శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుండి జిఎస్‌ఎల్‌వి-1ను విజయవంతంగా ప్రయోగించింది. 1,540 కిలోల బరువు ఉన్న జిశాట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇది విజయవంతంగా భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టింది. 2003 మే 8న జిఎస్‌ఎల్‌ఎ డి-2, 2004 సెప్టెంబర్ 20న జిఎస్‌ఎల్‌వి ఎఫ్-1, 2006 జూలై 10న జిఎస్‌ఎల్‌వి -ఎఫ్ 2, 2007 సెప్టెంబర్ 2న జిఎస్‌ఎల్‌వి ఎఫ్-04లను విజయ వంతంగా ప్రయోగించింది. ఆ తర్వాత కూడా చాలా ప్రయోగాలు జరిగాయి. 2016 ఏప్రిల్ 28న పిఎస్‌ఎల్‌వి ఎక్స్‌ఎల్‌ను పిఎస్‌ఎల్‌వి సి 33 వాహక నౌక ద్వారా ప్రయోగించింది.
**
మాధవన్ నాయర్
మాధవన్ నాయర్ 1943 అక్టోబర్ 31న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. 1966లో కేరళ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రానిక్స్ విభాగంలో పట్ట్భద్రుడైన తర్వాత ముంబయిలోని బాబా అటమిక్ రీసెర్చి సెంటర్ (బార్క్)లో శిక్షణ పొందారు. 1967లో తుంబాలో చేరి ఎస్‌ఎల్‌విల నిర్మాణంలో పనిచేశారు. తర్వాత పిఎస్‌ఎల్‌వి ప్రాజెక్టు డైరెక్టర్‌గా భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగ వాహక నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 1998లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు పొందారు. 2003లో మాధవన్ నాయర్ ఇస్రో చైర్మన్ పదవి చేపట్టారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాట్స్‌కు అధ్యక్షడిగా నియమితులయ్యారు. 1960లో స్థాపించిన ఈ సంస్థకు ప్రథమ భారతీయ అధ్యక్షుడు నాయర్.
**
చంద్రయాన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన మానవ రహిత చంద్రయాన కార్యక్రమమే ‘చంద్రయాన్’. ఈ మిషన్‌లో లూనార్ ఆర్బిటర్ , ఇంపాక్టర్ ఉన్నాయి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ దీనిని ప్రయోగించింది. రిమోట్‌తో నడిచే ఈ ఉపగ్రహం బరువు 1304 కిలోగ్రాములు. (1590 కిలోగ్రాములు ప్రారంభ బరువు, 504 కిలోగ్రాములు పొడి బరువు) సమీప పరారుణ , సాఫ్ట్ మరియు హార్డు ఎక్స్‌కిరణాల పౌన:పున్యాల వద్ద దృష్టికి గోచారమయ్యే హైరిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ పరికరాలను ఇది తీసుకువెళ్లింది. మైల్‌స్వామి అన్నిదురైను ఈ ప్రాజెక్టు అధిపతిగా ఇస్రో నియమించింది. తొలుత ఈ చంద్ర ఉపగ్రహాన్ని 2008 జూలైలో ప్రయోగించాలని నిర్ణయించినా కొన్ని కారణాల రీత్యా అదే ఏడాది అక్టోబర్ 24న ప్రయోగించారు. ఈ కార్యక్రమం కోసం ఇస్రో 300 కోట్లు ఖర్చు చేసింది. చంద్రుడి ఉపరితలాన్ని త్రీడీలో చిత్రీకరించడం, వాటి రసాయనిక స్పీసెస్‌లను వాటి రేడియో ధార్మికతను , న్యూక్లియడ్ల పంపకాలు, వాటి ప్రక్రియలను అధ్యయనం చేయడం, రిమోట్ సెన్సింగ్ పెల్లోడ్‌లను ఉపయోగించడం , ఈ డేటా సౌరమండలం రహస్యాలను చేధించడం లక్ష్యాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీని తర్వాత రెండో చంద్రయాన్ ప్రయోగాన్ని కూడా భారత్ విజయవంతంగా పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాదే చంద్రయాన్ -2 ప్రయోగం పూర్తయ్యే అవకాశం ఉంది.
**
విక్రం సారాభాయ్
విక్రం సారాభాయ్ 1919 ఆగస్టు 12న అహ్మదాబాద్‌లో సంపన్న కుటుంబంలో జన్మించారు.
మెట్రిక్యులేషన్ తర్వాత 1940లో కేంబ్రిడ్జి వెళ్లిన సారాభాయ్ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా భారత్‌కు తిరిగి వచ్చారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సర్ సివి రామన్ వద్ద రీసెర్చి స్కాలర్‌గా చేరి అనతి కాలంలోనే భౌతిక శాస్త్రాన్ని, విశ్వకిరణాలను అధ్యయనం చేసి తిరిగి 1945లో కేంబ్రిడ్జి వెళ్లి పిహెచ్‌డి పూర్తి చేసి 1947లో భారత్‌కు తిరిగి వచ్చారు. 1947లో అహ్మదాబాద్‌లో భౌతిక శాస్త్ర పరిశోధనాలయం ఏర్పాటుచేశారు. 1967లో ప్రపంచంలోనే మొట్టమొదటి శాటిలైట్ ‘స్పుత్నిక్’ గురించి తెలుసుకుని శాటిలైట్ల గురించి అధ్యయనం చేసి దేశంలో అంతరిక్ష పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలు సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. 1971 డిసెంబర్ 30న ఆయన కన్నుమూశారు. భారత ప్రభుత్వం ఆయనను 1966లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
తారాపథంలో ఇస్రో రథం
ReplyDelete