చెరగని ముద్ర
భగత్‌సింగ్ - 5
==========
పోరాటం కోసమే పుట్టినవాడికి ఒక మహా పోరాటాన్ని దగ్గరగా గమనించే అవకాశం ఏడేళ్ల వయసులోనే కలిగింది.
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిషు దొరతనానికి చెమటలు పట్టించిన గదర్ విప్లవం మొదలైంది సప్త సముద్రాల ఆవల అయినా దాని ప్రతిధ్వని పంజాబ్‌లో మొదటి నుంచీ మారుమోగుతూనే ఉంది. ఎందుకంటే ఆ తిరుగుబాటును నడిపించిన వారిలో ఎక్కువమంది దేశాంతరాల్లో స్థిరపడ్డ పంజాబీలే. వారిలో చాలామంది భగత్‌సింగ్ కుటుంబానికి తెలిసినవారే.
1857 ప్రథమ స్వాతంత్య్ర యుద్ధం తరవాత బ్రిటిషు మహాసామ్రాజ్యాన్ని మళ్లీ అంతలా గడగడలాడించింది గదర్ కదలిక! 1857 పోరాటమే దానికీ స్ఫూర్తి. ప్రణాళిక లోపంవల్ల, సరైన నాయకత్వం కొరవడినందుచేత, కాలం అనుకూలించక దానిలాగే ఇదీ విఫలమైతేనేమి? దేశాన్ని చెరబట్టిన విదేశీ రాకాసులను నపుంసక విధానాలతో, లొంగుబాటు రాజకీయాలతోగాక, క్షాత్రంతో ధైర్యంగా ఎదుర్కోవాలని తలచే దేశభక్తులకు 1857లాగే ఈ పోరాటమూ గొప్ప ఉత్తేజాన్నిచ్చింది. స్వాతంత్య్రమనబడేది వచ్చాక చరిత్రకు జరిగిన వెల్లవేతలూ వక్రీకరణల మూలంగా 1857 వలెనే 1914-15 సంఘర్షణా ఈ తరాలకు అంతగా తెలియకుండాపోయిందిగానీ జాతీయోద్యమ కాలంలో విప్లవకారులకు గదర్ గొప్ప ప్రేరణ. రెండో ప్రపంచ యుద్ధ సమయాన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగించిన ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటానికి ఒకరకంగా గదర్ మార్గదర్శి.
పొట్టచేత పట్టుకుని వేరే దేశాలకు వలసపోయిన వారు తమ బాగును, తమ కుటుంబ భవిష్యత్తును మాత్రమే కోరుకోక... తమ దేశాన్ని దాని కర్మాన్ని వదిలేయక... స్వదేశంలో రాజకీయ వికృతులకు, జాతీయోద్యమ బలహీనతలకు, ప్రతికూల పరిస్థితులకు అధైర్యపడక మాతృభూమి విముక్తికి సమరశంఖం పూరించి, సాయుధ యుద్ధానికి కదలి రావడమనే భావనే ఉదాత్తమైనది. సైనిక శిక్షణ, ఆయుధ పాటవం, ఆర్థిక వనరులు, కనీస హంగులు ఏమీ లేకున్నా సాధారణ ప్రవాస భారతీయులు దేశ విమోచనకు దండెత్తి రావటాన్ని తలచుకుంటేనే ప్రతి దేశభక్తుడికీ ఈనాటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది.
అమెరికా, కెనడాల్లోని ప్రవాస భారతీయులు 1913 ఏప్రిల్ 13న వైశాఖి పండుగ రోజు ఒరెగాన్‌లో కూడి సోహన్‌సింగ్ భోకియా, లాలా హర్‌దయాళ్, భాయి పరమానంద్ ప్రభృతుల నాయకత్వాన స్థాపించిన హిందూస్తాన్ అసోసియేషన్ ఆఫ్ పసిఫిక్ కోస్ట్ గదర్ ఉద్యమానికి నాంది. భారతదేశంలో బ్రిటిషు పాలనను అంతమొందించడానికి సాయుధ విప్లవమే మార్గమని మొట్టమొదటి సమావేశంలోనే నిశ్చయించారు. శాన్‌ఫ్రాన్సిస్కో వద్ద యుగంతర్ ఆశ్రమం కేంద్రంగా కార్యకలాపాలు మొదలయ్యాయి. తమ ఆశయాల ప్రచారానికి కొత్త సంస్థ మొదలెట్టిన ‘గదర్’ పత్రిక పేరే విప్లవ సంస్థకూ రూఢి అయింది. గదర్ అంటే సాయుధ తిరుగుబాటు.
‘మా పేరేమిటి? గదర్. మా పని ఏమిటి? గదర్! గదర్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో. కలాలు, సిరాల స్థానంలో రైఫిళ్లు, నెత్తురు నెలకొనే కాలం రానున్నది’ అంటూ గదర్ పార్టీ మేనిఫెస్టోను వెలువరించింది. లాలా హర్‌దయాళ్ సంపాదకత్వంలో ‘గదర్’ పత్రిక ఇంగ్లిషు, ఉర్దూ, హిందీ, పంజాబ్, మరాఠీ, బెంగాలీ భాషల్లో వెలువడి, లక్షల సర్క్యులేషనుతో దేశదేశాల్లోని భారతీయులను ఉత్తేజితులను చేసింది. తొలి పుటలో ‘గదర్’ అన్న పేరు కిందే Enemy of the British (బ్రిటిషు వారి శత్రువు) అని టాగ్‌లైను పెట్టి, తన వ్యూహాన్ని, విధానాన్ని అది వెరవకుండా విశ్వవ్యాప్తం చేసింది. ఇండియాకు రహస్యంగా చేరవేసిన పంజాబీ ‘గదర్’ను ఆరేళ్ల వయసులోనే భగత్‌సింగ్ శ్రద్ధగా చదివేవాడు. దానిలోని విషయాల గురించి తండ్రి సహచరులతో చర్చిస్తుంటే చెవులొగ్గి వినేవాడు. మాతృదేశం బానిస బంధనాలు తెగగొట్టటానికి విప్లవవీరులు తుపాకులు పట్టి ఓడల మీద రానున్నారన్న ఊహే అతడికి పరమానందం కలిగించేది. గదర్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని భగత్ వెయ్యి కళ్లతో ఎదురుచూసేవాడు.
గదర్ ఉద్యమం కొద్దికాలానికే ఖండాంతరాల్లోని భారతీయులను విశేషంగా ఆకట్టుకుంది. 1913 డిసెంబరు 30న కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో జరిగిన గదర్ మహాసభకు సిక్కులు, బెంగాలీలు, మద్రాసీలు, మరాఠీలు, ముస్లింలు వేలసంఖ్యలో హాజరయ్యారు. మనిలా, బ్రెజిల్ లాంటి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. అంత విస్తృత స్థాయిలో అనేక దేశాల ప్రవాస భారతీయులు రాజకీయ సమావేశం జరపడం చరిత్రలో అదే మొదలు. బ్రిటన్‌కి శత్రువులైన జర్మనీ, మెక్సికో, కాబూల్ ప్రభుత్వాలు కూడా గదర్ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. శాక్రమెంటో సభావేదిక మీద అమెరికాలోని జర్మన్ దౌత్యాధికారి కూచుని భారతీయుల పోరాటానికి జర్మనీ సకల విధాల సహాయం చేస్తుందని ప్రకటించాడు. చైనాలో సన్‌యట్‌సేన్ నేతృత్వంలోని విప్లవ పక్షం గదర్లకు బాసటగా నిలిచింది.
కేవలం సైనిక బలంతో ఇండియాను అణచిపెట్టిన ఇంగ్లండును దాని సైనిక శక్తి బలహీనపడి ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి. తప్పదనుకుంటున్న ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి తెల్లదొరతనం తన సైనిక బలగాలలో అత్యధిక భాగాన్ని దేశం వెలుపల యుద్ధ రంగాలకు తరలించవలసి వచ్చిన ఈ సమయమే దేశంలో దాని పీచమణచడానికి సరైన అదను. ఇప్పుడు కనుక మనం ఇండియాకు వెళ్లి అక్కడి విప్లవ సంస్థలను కలుపుకుని, గ్రామగ్రామానా ప్రజలను సమాయత్తపరిచి, సైనికులను తిరుగుబాటుకు పురికొల్పి, పెద్దఎత్తున ఆయుధాలు సేకరించి, రష్యాలో బోల్షివిక్కులు చేస్తున్నట్టుగా సాయుధ విప్లవాన్ని తీసుకురాగలిగితే విజయం ఖాయం. దేశ విముక్తి తథ్యం. దీనికోసం మాతృదేశానికి మరలి సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలి- అని గదర్ నాయకులు ప్రవాసులకు పిలుపిచ్చారు. ఆ ప్రకారమే అమెరికాలో బర్కిలీ యూనివర్సిటీ విద్యార్థి అయిన 18 ఏళ్ల కర్తార్‌సింగ్ సరభ, జపాన్ నుంచి గదర్ పార్టీ అధ్యక్షుడు సోహన్‌సింగ్ భఖ్నా, ఇంకా ఎందరో యోధానుయోధులు ఎన్నో దేశాల నుంచి స్వదేశానికి బయలుదేరారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఎస్.ఎస్. కొరియా నౌక వందల సంఖ్యలో ప్రజలను తీసుకుని 1914 ఆగస్టున హాంగ్‌కాంగ్‌కి బయలుదేరింది.
‘ఇండియాకి వెళ్లండి. మూలమూలనా తిరుగుబాటును కదిలించండి. ధనికులను దోచి, పేదలను ఆదరించి ప్రజల మెప్పు పొందండి. మీరు ఇండియా వెళ్లగానే మీకు ఆయుధాలు అందుతాయి. ఒకవేళ అందకపోతే పోలీసు స్టేషన్లపై దాడిచేసి రైఫిళ్లు తీసుకోండి. మీ నాయకుల ఆజ్ఞలు పాటించండి’ అని ఓడ బయలుదేరే ముందు నాయకులు ఉద్బోధించారు. దొరికిన ఓడనల్లా పట్టుకుని ఎక్కడెక్కడి భారతీయులూ అన్నిటికీ తెగించి, స్వదేశం దారి పట్టారు.
‘గదర్’ పత్రిక ద్వారా విప్లవ కార్యక్రమాలు భారతీయులకు తెలియటానికి ముందే గూఢచారి వర్గాల ద్వారా ఆంగ్లేయులకు ఉప్పందింది. కెనడా నుంచి కలకత్తా దాకా ఏ రేవులోనూ ప్రవాస భారతీయులున్న ఏ ఓడనూ లంగరు వేయటానికి అనుమతించకుండా అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించి కట్టుదిట్టాలు బాగానే చేశారు.
ఆ రోజుల్లోనే జరిగింది చరిత్రకెక్కిన ‘కొమగత మారు’ నౌకా దురంతం. బతుకుతెరువు కోసం దేశాంతరం పోదలచిన 372 మంది భారతీయులను తీసుకుని హాంగ్‌కాంగ్ నుంచి కెనడా బయలుదేరిన ‘కొమగత మారు’ నౌకను వాంకూవర్ రేవులో దిగడానికి కెనడా అధికారులు సమ్మతించలేదు. ఆహారపు నిల్వలు, మందులు, మంచినీరు హరించుకుపోయి ఆకలిదప్పులతో వందలాది ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నా కనికరించక రెండు నెలలపాటు అంతమందినీ సముద్రంలోనే ఆపేశారు. చివరికి - తుపాకులు ఎక్కుపెట్టి, సలసల కాగే నీటిని గొట్టాల ద్వారా ఓడలోని వారిపైకి చిమ్మించి, హడలగొట్టి ఓడను వచ్చిన దారి పట్టించారు. దారిలో ఏ రేవులోనూ దిగేందుకు అనుమతించకపోవటంతో ఎట్టకేలకు కలకత్తా చేరిన ఓడను బుజ్‌బుజ్ హార్బరులోకి దయతలిచి అనుమతించారు. వచ్చీరాగానే సాయుధ పోలీసులు పిశాచాల్లా పడి రెక్క పుచ్చుకుని, లాక్కుపోయి వాళ్లను జైళ్లలో కుక్కటానికి ఉపక్రమించారు. ప్రతిఘటించిన ప్రయాణికులను వందల సంఖ్యలో పిట్టల్లా కాల్చి చంపారు. History of the Freedom Movement in India, రెండో సంపుటం, 434 పేజీలో విఖ్యాత చరిత్రకారుడు ఆర్.సి.మజుందార్ అన్నట్టు జలియన్‌వాలాబాగ్ ఊచకోతతో పోల్చదగిన ఘాతుకమది. సాయుధ తిరుగుబాటుతో సంబంధం లేని సామాన్య ప్రజలనే అంత రాక్షసంగా చంపుకు తిన్నారంటే ఆ సమయాన బ్రిటిషు పాలకుల మనఃస్థితి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఎన్ని ఆంక్షలు పెట్టి, ఎన్ని దిగ్బంధాలు చేసినా వచ్చే విప్లవకారులు రానే వచ్చారు. ఎకాఎకి ఓడలో కాకుండా, మధ్యలో దిగి, హాంగ్‌కాంగ్, చైనా, జపాన్, బోర్నియో, ఫిలిప్పీన్స్‌ల నుంచి దొరికిన పడవనల్లా పట్టుకుని వేల సంఖ్యలో ఎవరి దారిన వారు పోలీసుల కళ్లుగప్పి దేశంలో చొరబడ్డారు. ఉత్తరాదిన నిఘా మరీ తీవ్రంగా ఉండటంతో దక్షిణ భారతం రేవుల ద్వారా చాలామంది దేశంలోకి వ్యాపించారు. సమర్థ నాయకత్వం తమకు కొరవడిన సంగతి గ్రహించి, గదర్ విప్లవకారులు అప్పట్లో వారణాసిలో రహస్య జీవితం గడుపుతున్న బెంగాలీ విప్లవకారుడు రాస్‌బిహారీ బోసును తమకు నాయకత్వం వహించమని అడిగి ఒప్పించారు.
తెల్లసర్కారు 1915 డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్టు తెచ్చి కర్కశపు ఆంక్షలతో ఎంతలా విరుచుకుపడ్డా రాస్‌బిహారీ పన్నిన ద్విముఖ వ్యూహం వారిని ముప్పుతిప్పలు పెట్టింది. విప్లవకారుల్లో ఒక విభాగం బ్రిటిష్ అధికారులను, వారి తొత్తులను హతమార్చి, బ్యాంకులు లూటీ చేసి పోలీసుస్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు లాక్కుని ప్రభుత్వాన్ని గడగడలాడించింది. రహస్యంగా బాంబు ఫ్యాక్టరీలను నడిపి వేల సంఖ్యలో బాంబులను తయారుచేసింది. అదే సమయంలో ఇంకో జట్టు గుట్టుచప్పుడు కాకుండా మిలిటరీ కంటోనె్మంట్లకు వ్యాపించి, అక్కడి సైనికుల్లో దేశభక్తిని ప్రబోధించి తిరుగుబాటుకు ఆయత్తం చేసింది. మీరట్, అలహాబాద్, లాహోర్, ఫిరోజ్‌పూర్, ఢిల్లీ వగైరా కంటోనె్మంట్లలో సైనిక తిరుగుబాటుకు అన్ని సన్నాహాలూ జరిగాయి. తొలి తిరుగుబాటు ఫలించి, ఇండియా రిపబ్లిక్‌ను ప్రకటించగానే కోహట్, దినాపూర్ వగైరా కంటోనె్మంట్లలో తిరుగుబాటు చేసి పెషావర్ నుంచి హాంగ్‌కాంగ్ దాకా బ్రిటిషు అధికారాన్ని మట్టుపెట్టేందుకు ప్రణాళికా రచన బాగానే జరిగింది. 1915 ఫిబ్రవరి 21న లాహోర్ కంటోనె్మంటులో 23వ ఆశ్విక దళం వారు తిరగబడి, బ్రిటిషు ఆఫీసర్లను చంపి, ఆయుధాగారాన్ని వశపరచుకోవటంతో సాయుధ తిరుగుబాటు మిగతా సైనిక స్థావరాలకూ వ్యాపించేట్టు చేయడానికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి.
ఇక తెల్లదొరతనానికి నూకలు చెల్లడమే తరువాయి అనుకుంటుండగా ఊహించనిది జరిగింది. కృపాల్‌సింగ్ అనే ద్రోహి ద్వారా తిరుగుబాటు గుట్టుమట్లు సర్కారుకు తెలిసిపోయాయి. ఆ సంగతి గ్రహించి తిరుగుబాటు తేదీని రెండు రోజులు వెనక్కి జరిపినా, మూలాసింగ్ అనే ఇంకొకడి ద్వారా ఆ రహస్యమూ రట్టు అయింది. బ్రిటిషు ప్రభుత్వం మెరపులా కదిలి తిరుగుబాటు పట్టిన సైనికులను ముందే బంధించి, వారి ఆయుధాలు లాగేసుకుంది. కోర్ట్‌మార్షల్ జరిపి ఎందరో సైనికులను కాల్చి చంపింది. వేల మందిని చెరలో వేసింది. ఆధికారిక గణాంకాల ప్రకారం 145 మంది గదర్ విప్లవకారులను ఉరితీశారు. 190 మంది సైనికులు సహా 306 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇంకా 2455 మందిని నిర్బంధించారు.
మొదటి లాహోర్ కుట్ర కేసుగా ప్రసిద్ధమైన దానిలో నిందితులైన ఆరుగురు విప్లవ వీరులను 1915 నవంబరు 17న ఉరి తీయటంతో భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో గదర్ అధ్యాయం ముగిసింది. వారి ఉరితీత యావద్దేశాన్ని, మరీ ముఖ్యంగా పంజాబ్‌ను పట్టి కుదిపింది. ఆరుగురిలోకీ చిన్నవాడైన 19 ఏళ్ల కర్తార్‌సింగ్ సరభ యావద్భారతానికీ జాతీయ వీరుడయ్యాడు.
అతడే భగత్‌సింగ్‌కూ ఫావరేట్ హీరో!
అమెరికాలో చదువును కట్టిపెట్టి దేశమాత బంధవిముక్తి కోసం చావుకు సిద్ధపడి భారత్‌కి తిరిగొచ్చాక పంజాబ్ కార్యక్షేత్రంలో జన సమీకరణకు, విప్లవ కార్యాచరణకు కర్తార్‌సింగ్ చురుకుగా పని చేశాడు. ఆ సందర్భంలో ఇతర గదర్ ప్రముఖుల్లాగే అతడూ లాహోర్‌లో భగత్ తండ్రి కర్తార్‌సింగ్ ఇంటికి ఆర్థిక సహాయం కోసం రహస్యంగా తరచూ వచ్చి వెళుతూండేవాడు. పేర్లు గోప్యంగా ఉంచుతారు కాబట్టి అప్పట్లో అతడి అసలు పేరు ఎవరికీ తెలియదు. (కిషన్‌సింగ్ ఆ రోజుల్లోనే గదర్ పార్టీకి వెయ్య రూపాయల విరాళం ఇచ్చాడు. అది ఇవాళ అనేక లక్షలతో సమానం.)
గదర్ వీరుల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉప్పొంగిన ప్రజా సానుభూతిని గమనించి, కొంతమందికి విధించిన ఉరిశిక్షను బ్రిటిషు సర్కారు తగ్గించి, యావజ్జీవ శిక్షగా మార్చింది. అదే క్రమంలో అందరికంటే చిన్నవాడైన కర్తార్‌సింగ్‌కూ ఉరి తప్పుతుందని ప్రజలు ఆశించారు. ఒక దశలో ప్రభుత్వం శిక్ష తగ్గిస్తామన్నా తనకు అక్కర్లేదని, జీవితాంతం చెరలో ఉండే కంటే దేశమాతను స్మరిస్తూ ఉరికంబమెక్కటమే తనకు గౌరవప్రదమని కర్తార్‌సింగ్ కరాఖండిగా నిరాకరించాడు. ‘నా ఏకైక కోరిక నా దేశాన్ని సర్వ స్వతంత్రంగా చూడాలన్నదే. స్వాతంత్య్రం ఒక్కటే నా స్వప్నం. నాకు ఎన్ని జన్మలు ఉంటే అన్నిటినీ నా దేశం కోసం త్యాగం చేయాలనే నా ఆకాంక్ష’ అని చివరి మాటగా చెప్పి అతడు బలిపీఠం ఎక్కాడు.
కర్తార్‌సింగ్ ధైర్యం, స్థైర్యం ఎనిమిదేళ్ల భగత్ మనసులో చెరగని ముద్ర వేశాయి. అతడి ఫోటోను ఎప్పుడూ జేబులో ఉంచుకునేవాడు. ఒకసారి అది గమనించిన తల్లి ‘అదేమిట్రా’ అని అడిగితే ‘నాకు అన్న, స్నేహితుడు, గురువు, ఆదర్శం అన్నీ అతడేనమ్మా’ అని చెప్పాడు భగత్. ఆఖరికి 1929 బాంబు ఘటనలో అరెస్టు అయినప్పుడు కూడా కర్తార్‌సింగ్ ఫోటో అతడి జేబులో ఉంది.
So much valour, such self confidence, such renunciation, such devotion, such dedication... all this is rare. Revolt flowed in every blood vessel in his body. This revolt was the sole ideal, the sole ambition and the sole hope of his life. He lived for it and, in the end, died for it
(అంతటి శౌర్యం, అంత ఆత్మవిశ్వాసం, అలాంటి త్యాగనిరతి, అంత అంకిత భావం... చాలా అరుదు. అతడి శరీరం నరనరానా తిరుగుబాటు ప్రవహించేది. తిరుగుబాటే అతడి ఏకైక ఆదర్శం, అతడి ఏకైక ఆకాంక్ష, అతడికున్న ఒకేఒక ఆశ. దాని కోసమే బతికాడు. చివరికి దాని కోసమే మరణించాడు) అని పెద్దయ్యాక భగత్ రాసుకున్నాడు. కర్తార్‌సింగ్ గురించి చెప్పిన పై లక్షణాలు అతడిలో జీర్ణించి, ఎంతగా ప్రభావితం చేశాయంటే - అవే పలుకులు సరిగ్గా భగత్‌సింగ్ జీవితానికీ అక్షరాలా వర్తిస్తాయి.
మూలం: ఆంధ్రభూమి
చెరగని ముద్ర
ReplyDelete