Breaking News

విప్లవ వీరుడు భగత్ సింగ్-Shaheed Bhagat Singh


ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో యువకులు ఆత్మత్యాగాలు, బలిదానాలు చేశారు. వారిలో అగ్రగణ్యుడు భగత్‌సింగ్‌. ఆయనతో పాటు రాజగురు, సుఖదేవ్‌లు చేసిన ప్రాణ త్యాగం ఎందరికో స్పూర్తినిచ్చింది. భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌... ఈ యువ కిషోరాలు ప్రాణత్యాగం చేసి 84ఏళ్లయ్యింది. 1931 మార్చి 23న అత్యంత ధైర్య సాహసాలతో ఉరితాళ్లను ముద్దాడిన ఈ వీరులను ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేదు. వీరితో పాటు అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్‌ ఆజాద్‌, కర్తార్‌సింగ్‌ శరభ ఇలా ఎందరో యువకులు ఈ దేశ ప్రజల స్వేచ్చ స్వాతంత్ర్యాల కోసం తమ ప్రాణాలను అర్పించారు. తమ సుఖ సంతోషాల కోసం, తమ సౌభాగ్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీరులను ఏ దేశ ప్రజలైనా ఎలా మరచిపోగలరు?

ఆత్మబలిదానాలు..ప్రాణ త్యాగాలు..
మన నవనాడులను పీల్చిపిప్పిచేస్తున్న బ్రిటీషోళ్లను ఈ దేశం నుంచి తరిమి వేసే మహా యజ్ఞంలో, మహా యుద్ధంలో ఎందరెందరో ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేశారు. సత్యాగ్రహాలు చేశారు. సహాయ నిరాకణోద్యమాలు నడిపారు. జైళ్లకు వెళ్లారు. లాఠీ దెబ్బలు తిన్నారు. దేశమాత విముక్తి కోసం తమ సర్వస్వం ధారపోశారు. ఇలా అసమాన త్యాగాలు చేసినవారందరిలోనూ భగత్‌ సింగ్‌ది ఓ విశిష్ట వ్యక్తిత్వం. స్వాతంత్ర్యానంతరం భారతదేశం ఎలా వుండాలన్న విషయంలో భగత్‌ సింగ్‌ కు వున్నంత స్పష్టత ఆకాలంలో మరెవ్వరికీ లేదని ఆయన సహచరులు చెబుతుండేవారు. భగత్‌సింగ్‌ వ్యక్తిత్వాన్నీ, ఆయనకున్న దూరదృష్టినీ, సమాజం పట్ల, మానవ సంబంధాల పట్ల వున్న ఆర్తిని ఆయన రచనలు కళ్లకు కడుతుంటాయి.

స్పూర్తిదాత..
బాల్యం నుంచీ దేశాన్ని ప్రేమించిన తీరు, విభిన్నాంశాలను అధ్యయనం చేసిన విధానం, విప్లవోద్యమ సహచరులతో ప్రవర్తించిన పద్ధతి, వారి సమస్యలు పరిష్కరించిన తీరు, బాంబులు, పిస్తోళ్లు లాంటి ఆయుధాల వినియోగం విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, కోర్టు కేసుల్లో వ్యవహరించినతీరు, అత్యంత కఠిన సమయాల్లో, భయంకర క్షణాల్లో ప్రదర్శించిన గుండె నిబ్బరం, చివరకు ఉరితీస్తున్న సమయంలోనూ చలించకపోవడం లాంటి అంశాలు భగత్‌ సింగ్‌ వ్యక్తిత్వానీ, నవ సమాజ నిర్మాణం పట్ల ఆయనకున్న ఆపేక్షను తేటతెల్లం చేస్తాయి. అందుకే భగత్‌ సింగ్‌ ఇన్నేళ్ల తర్వాత కూడా స్పూర్తిదాతగానే ప్రకాశిస్తున్నాడు. భగత్‌ సింగ్‌ రచనలను ఎక్కువగా అధ్యయనం చేయడం, ఆయనలోని మహోన్నత మానవీయ లక్షణాలను పుణికిపుచ్చుకోవడం, ఆయన ఆశించిన నవ సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించడమే నిజమైన నివాళి.

2 comments:

  1. విప్లవ వీరుడు భగత్ సింగ్-Shaheed Bhagat Singh

    ReplyDelete
  2. Today is 28th sept and 109th Birthday of Sardar Bhagat Singh. One of the Greatest Man ever born in India. Let's Salute the great soul.

    ReplyDelete