భయమెరుగని భారతీయుడు భగత్ సింగ్-Bhagat Singh
ఆ యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగులేశాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. అతనే విప్లవ యోదుడు భగత్‌సింగ్. తను ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో చిరునవ్వుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి ఈ పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.
1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్ జిల్లా బంగాలో ఆ విప్లవ వీరుడికి కిషన్ సింగ్, విద్యావతి దంపతులు జన్మనిచ్చారు. చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తిని ఇనుమడింపచేసుకున్నాడు భగత్ సింగ్. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ విప్లవవీరుడి త్యాగం ఇంకా సజీవంగానే ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది. కోట్లాదిమందిలో తెగువ నింపింది.
12 ఏళ్ల వయసులోనే..
ఉరకలేస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్ వాలాబాగ్ దారుణాలను చూసి భగత్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెతుక్కున్నాడు. 1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు.
ఇంక్విలాబ్ జిందాబాద్..
1928లో సైమన్ కమీషన్ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో.. లాలాలజపతిరాయ్ చనిపోవటంతో భగత్‌సింగ్ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్ వేశారు. విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు.
తన ఉరి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందనీ..
బ్రిటీష్ హై కమిషనర్ సాండర్స్‌ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్‌సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్‌సింగ్ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్‌సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్థాన్ పోలీస్ శాఖ లాహోర్ న్యాయస్థానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా... తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు.
నేటి తరానికి వెలుగుదారి..
చరిత్ర వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్‌సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి. త్యాగం, ఆదర్శానికి ఆయన నిదర్శనం. భగసింగ్ లోనే ఆ లక్షణాలే నేటి తరానికి వెలుగు దారి.
భయమెరుగని భారతీయుడు భగత్ సింగ్-Bhagat Singh
ReplyDelete