Breaking News

ఘనమైన గణతంత్రం-Republic Day


అధికారంలో ఉన్న నాయకుల మాటలు వింటే అబ్బో మన దేశం ఇంతగా అభివృద్ధి చెందిందా అని పిస్తుంది. అదే ప్రతిపక్షంలో ఉన్నవారి ప్రసంగాలు వింటే ఇంత అధోగతిలో ఉన్నామా అని దిగులేస్తుంది. ఈ రెండు వాదనలూ నిజం కాదు. నిజం అనేది వేరేది ఉంటున్నది. రాజకీయ నాయకుల మధ్య ఆ నిజం నలిగిపోతున్నది. మనకు కనిపించకుండా పోతున్నది. నిజానికి నిజాన్ని వెతకడం అంత పెద్ద కష్టం కూడా కాదు. మన బ్యాంకు బ్యాలెన్సు, తీర్చాల్సిన అప్పులు, చేస్తున్న ఉద్యోగంలో జీతం పెరుగుతున్నదా లేదా, ఆస్తులు ఏమైనా కొన్నామా లేదా అని మనకు మనం లెక్కేసుకుంటే చాలు, కచ్చితంగా దేశం పరిస్థితి కూడా అలానే ఉంటుంది. పై వాటన్నింటికి వ్యతిరేక సమాధానం వస్తే దేశం అభివృద్ధి చెందింది అని ఎవరైనా చెప్పినా అది వాస్తవం కానట్టు లెక్క. పైన చెప్పినవన్నీ సానుకూలంగా ఉంటే దేశం అభివృద్ధి చెందలేదు అని ఎవరైనా చెప్పినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా అభివృద్ధి సాధించిన వారికి దేశం అభివృద్ధి చెందేసినట్లుగా కనిపిస్తుంది. సరైన ఉద్యోగం కూడా లేకుండా జీవనోపాధికి అలమటిస్తున్న వారికి దేశం మరో రకంగా కనిపిసు్తంది. అంతే తేడా!

ఎక్కువ శాతం మంది ఎటువైపు ఉన్నారనేది లెక్కవేసుకుంటే స్థూలంగా దేశం అభివృద్ధి చెందిందా లేదా అని బేరీజు వేసుకోవచ్చునన్నమాట. ఒక విషయంలో మనం ఎంతో సంతోషించాల్సి ఉంటుంది. సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఇండియలో ఎక్కువ మందే ఉన్నారని ఒక సర్వేలో తేలింది. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో 75 శాతం మంది మాత్రమే ఆశావహజీవితం గడుపుతున్నట్లు మరొక సర్వేలో వెల్లడైంది. అంటే అంత అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా నూటికి 25 శాతం మంది నిరాసక్తంగానే జీవితం గడుపుతున్నారన్నమాట. సంతృప్తికరంగా జీవితాన్ని గడుపుతున్న వారిపై సర్వే చేసి అంతర్జాతీయ నివేదిక రూపొందించాలని ఇంగ్లాండ్‌లోని లీసిస్టెర్‌ యూనివర్సిటీకి చెందిన అడ్రిన్‌ జి వైట్‌ అనే ఒక సామాజిక మానసిక విశ్లేషకుడు భావించి ఒక జాబితా రూపొందించారు. అందులో 273.33 పాయింట్లతో డెన్మార్క్‌, స్విట్జర్‌లాండ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది సంతోషంగా, సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నట్లు చెప్పారు. 246.67 పాయింట్లతో అమెరికా 23వ స్థానంలో ఉంది. 180 పాయిం ట్లతో భారత్‌ 125వ స్థానంలో ఉన్నట్లు అడ్రిన్‌ జి వైట్‌ వెల్లడిం చారు. పాకిస్తాన్‌, రష్యా, సడాన్‌, ఉక్రేయిన్‌, జింబాబ్వే లాంటి దేశాలు సంతృప్తికరంగా జీవితం గడుపుతున్న వారి సంఖ్యలో అథమస్థానంలో ఉన్నాయి. సొంత ఇల్లు, స్థిరమైన సంపాదన లాంటి విషయాలను లెక్కించి ఈ సర్వే చేసినట్లు ఆయన చెప్పారు. తక్కువ చదువుతో ఆపిన వాళ్లు ఎక్కువ సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు కూడా ఇదే అధ్యయనంలో వెల్లడైంది.

మానవ అభివృద్ధి సూచికల్లో వేగంగా ప్రగతి సాధిస్తున్న దేశాల్లో భారత్‌ ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం 187 దేశాల ఆ జాబితాలో మనం ఇంకా 135వ స్థానంలోనే ఉన్నాం. దేశంలో వైద్యసౌకర్యంలేక పసిపిల్లలు మరణించడం, అక్షరాస్యత పెరుగుదలలో మాంద్యం, పౌష్ఠికాహారలోపం లాంటి కీలక అంశాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మానవాభివృద్ధి సూచికల్లో మనం అత్యంత వేగమైన పురోగతి సాధించడం ఖాయం. సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నామని ఎక్కువ మంది చెప్పడం, మానవాభివృద్ధి సూచికల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తుండటం మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనకు కల్పించిన సౌకర్యం. మన రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛ కారణంగానే మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలోని నాలుగు స్తంభాలలో ఏది బలహీనంగా ఉన్నా సరిదిద్దేందుకు మరో వ్యవస్థ బలోపేతం కావడమనేది కూడా దూరదృష్టిగల మన పెద్దలు చేసిన ఏర్పాటే. గత కొద్ది సంవత్సరాలుగా పాలనావ్యవస్థ దారుణమైన తప్పులు చేస్తుంటే న్యాయవ్యవస్థ క్రియా శీలంగా వ్యవహరించి ఆ తప్పులను సరిదిద్దేందుకు తీసుకున్న చర్యలు మనకు తెలిసిందే. రాజకీయ స్వేచ్ఛ, మత స్వేచ్ఛతో బాటు ప్రాధమిక హక్కుల పరి రక్షణకు ప్రజాస్వామ్య వ్యవస్థలు తీసుకుంటున్న చర్యలు కూడా మన వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు దోహదపడుతున్నాయి. అయితే ఇంకా పాలనా వ్యవస్థలోని కొన్ని అంగాలు జడత్వం వదలడం లేదు. పాలనా వ్యవస్థ మరింత పటిష్ఠంగా నడిస్తే మనం మరింత అభివృద్ధి సాధించి ఉండేవారం. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అచేతనంగా ఉన్న కొన్ని వ్యవస్థల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్ఠికి దోహద పడుతున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. ఆర్ధిక సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళే్ల సాహసాన్ని కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు. బహుశ మరో ఐదేళ్లలో ఇప్పటి వరకూ ఉన్న సూచీల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

దేశానికి స్వాతంత్య్రం రావడం ఎంతటి ప్రాధాన్యతగల విషయమో ఆ స్వాతంత్య్రాన్ని పదికాలాల పాటు పొదివి పట్టుకోవడానికి పౌరులకు హక్కులు, బాధ్యతలు నిర్దేశిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించుకున్న రోజు కూడా అంతే ప్రాధాన్యతగల అంశం. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అంతకు ముందే మన సొంత రాజ్యాంగాన్ని రూపొందిచుకోవడానికి ఉపక్ర మించాం. డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ డ్రాఫ్ట్‌ కమిటీ చైర్మన్‌గా రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ 1930 జనవరి 26న సంపూర్ణ స్వర్యాం పిలుపు ఇచ్చింది. అందువల్ల జనవరి 26వ తేదీని గుర్తుంచుకోవాలని యోచించి 1950 జనవరి 26నాడు రాజ్యాంగాన్ని అనుసరణ ప్రారంభించిన తేదీగా ప్రకటించారు. ఆనాటి నుంచి ఆసేతు హిమాచలం జాతీయ పండుగగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని తర తరాలుగా కొనసాగించేంతటి పటిష్ఠమైన వ్యవస్థ మన దేశంలో ఉండటానికి ఉపకరిస్తున్న భారత రాజ్యాంగమే మనకు పవిత్రగ్రంథం. రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 ఒక శలవు రోజుగా కాకుండా జాతీయ తాభావాన్ని మనసునిండా నింపుకునే పవిత్రదినంగా భావించాలి.
Source: Surya Daily

3 comments:

  1. ఘనమైన గణతంత్రం-Republic Day.

    ReplyDelete
  2. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

    ReplyDelete
  3. Happy Republic day to all

    ReplyDelete