Breaking News

భారత రత్నాలు (Bharat Ratna Award)


ఏదైనా ఘనత సాధించిన పిల్లల్ని చూస్తే ఏ తల్లి అయినా మురిసిపోతుంది. రత్నాల్లాంటి పిల్లలని గర్వపడుతుంది. ఇప్పుడు భరతమాత కూడా మురిసిపోతోంది. దేశ సేవలో వెన్నుచూపని రత్నాల్లాంటి వాజపేయి, మదన్‌మోహన్ మాలవ్యలకు భారతరత్న పురస్కారం ప్రకటించడంతో జాతి యావత్తు గర్వపడుతోంది. ‘రైట్ మేన్ ఇన్ రాంగ్ పార్టీ’గా ప్రతిపక్ష నేతల ప్రశంసలు పొందిన గొప్ప రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజపేయి. ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వహించిన కాలంలోనూ, సుదీర్ఘ రాజకీయ జీవితంలోనూ ఎలాంటి వివాదాలకు లోనుకాకుండా విజ్ఞతతో ఎదిగిన విలక్షణ నేత ఆయన. ప్రధానమంత్రిగా ఆయన పాలన దేశాన్ని సమూలంగా మార్చలేకపోయిందన్న వాదనల సంగతి పక్కన పెడితే- పాకిస్తాన్‌కు స్నేహహస్తం అందించడంలోనూ, జమ్ము కాశ్మీర్ విషయంలోనూ, అణ్వస్త్ర పరీక్షల సమయంలోనూ, కార్గిల్ యుద్ధం వేళ ఆయన తీసుకున్న నిర్ణయాలు సర్వజన ఆమోదాన్ని పొందాయన్నది కాదనలేని వాస్తవం. లౌకిక వాదం, ప్రజాస్వామ్యం పట్ల వాజపేయికి ఉన్న అచంచల విశ్వాసం, గౌరవం ఆయన కీర్తిని పెంచాయి. జనసంఘ్ పుట్టుక, జనతా పార్టీ ఆవిర్భావం- దాని వైఫల్యం, ఆ తర్వాత అది భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందడం వంటి పరిణామాలతో పాటే ఆయన రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదిగింది. సొంతపార్టీలో సహచర నాయకులను విభేదించిన సందర్భాలు లేకపోయినా, అవసరమైన సమయంలో ఆయన విభిన్నంగా వ్యవహరించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపు అర్ధ శతాబ్దం పాటు అత్యంత క్రియాశీలకంగా ఉండడం, సంకీర్ణ శకంలో ప్రధాని పదవిని అధిష్ఠించడం, అత్యున్నత పదవిలో అందరి మన్ననలు పొందడం ఆషామాషీ కాదు. ఆ అరుదైన ఘనతను పొందడం ఆయనకే సుసాధ్యమైంది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్నప్పటికీ ఆయనను ‘ఉదారవాది’గా అభిమానించి విపక్షాలు అక్కున చేర్చుకున్నాయి. సొంత పార్టీలో నిరసన సెగలు రాజుకుంటాయని తెలిసినా- ‘బాబ్రీ మసీదు కూల్చివేతను ఓ చీకటి ఘడియ’గా అభివర్ణించిన సాహసం ఆయనకే చెల్లింది. ‘సంఘ్ పరివార్’తో సన్నిహితంగా ఉంటూనే స్వతంత్రంగా వ్యవహరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను ఎవరూ తప్పుపట్టలేకపోయారు. లోక్‌సభలో వాజపేయి సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు విపక్ష నేతలంతా ప్రభుత్వ వైఫల్యాలపై దుమ్మెత్తిపోసినా- వ్యక్తిగతంగా ఆయనను కీర్తించక తప్పలేదు. బహుముఖ ప్రతిభ.. ఎన్నికలు, రాజకీయాలంటేనే ప్రజల్లో విరక్త్భివం కలిగిన సమయంలో వాజపేయి ఓ ఆదర్శనేతగా కనిపించారు. ప్రభుత్వాధినేతగా, పాలనాదక్షుడిగా, కవిగా, పాత్రికేయుడిగా, దౌత్యదూతగా, స్వయం సేవకుడిగా, దేశభక్తుడిగా.. ఇలా ఎనె్నన్ని పాత్రలు పోషించినా వాజపేయిది ఓ విభిన్న శైలి. విపక్షంలో ఉన్నా, అధికార పగ్గాలు చేపట్టినా పదవులకే వనె్న తెచ్చి, జాతి జనుల మనోఫలకాలపై బలమైన ముద్ర వేసుకోవడం ఆయనకే సాధ్యమైంది. సున్నిత సంస్కారం, మృదుభాషణ, విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం. మితవాదిగా ఉంటూ పార్టీలో సమన్వయ గళం వినిపించిన విజ్ఞుడు.. పొరుగు దేశాలతో స్నేహం కోసం పరితపించిన ఆత్మీయ మిత్రుడు.. ఇన్ని విశిష్టతలున్నందునే కాంగ్రెసేతర ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు దేశానికి సేవలందించిన నేతగా కీర్తి గడించారు. ‘స్వయం సేవకుడు..’ సువిశాల భారత దేశానికి పదకొండో ప్రధానిగా సేవలందించిన వాజపేయి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన కృష్ణ బిహారీ వాజపేయి, కృష్ణాదేవి దంపతులకు జన్మించారు. బ్రిటిష్ వలస పాలకుల నియంతృత్వ పోకడలను వ్యతిరేకించి కౌమార దశలోనే ఆయన జైలుశిక్ష అనుభవించారు. తొలుత కమ్యూనిజం పట్ల ఆసక్తి ఉన్నా, ఆ తర్వాత ఆయన ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆర్‌ఎస్‌ఎస్) పట్ల ఆకర్షితుడై ‘జనసంఘ్’ నేతగా ఎదిగారు. 1950 ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్ పత్రికలో పనిచేసేందుకు లా కాలేజీలో చదువుకు స్వస్తి పలికారు. దేశ స్వాతంత్య్రం కోసం 1942-45 మధ్య జరిగిన ‘క్విట్ ఇండియా’లో పాల్గొన్నారు. హిందూత్వ, హిందూ జాతీయత మాత్రమే రాజకీయాలకు సరైన వేదిక అని భావించి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. కాశ్మీర్‌ను సందర్శించే భారతీయ పౌరులు ప్రత్యేక అనుమతి పత్రాలు కలిగి ఉండాలంటూ అప్పటి పాలకులు విధించిన ఆంక్షలను నిరసిస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953లో చేసిన ఆమరణ దీక్షకు వాజపేయి బాసటగా నిలిచారు. ముఖర్జీ దీక్ష ఫలితంగా అనుమతి పత్రాల నిబంధన రద్దు కావడమే కాకుండా, కాశ్మీర్‌ను అఖండ భారత్‌లో కలిపేందుకు అప్పటి పాలకులు అంగీకరించక తప్పలేదు. నిరాహార దీక్ష ఫలితంగా ఆరోగ్యం క్షీణించి ముఖర్జీ మరణించడం యువనేత వాజపేయి మనసును తీవ్రంగా కలచివేసింది. ముఖర్జీ భావాలను, నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న వాజపేయి 1957లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009 వరకూ ఆయన ఎం.పీగా 11సార్లు గెలిచారు. మిత్రపక్షాల మద్దతుతో అయిదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన ఘనత ఆయనకే దక్కింది. నాలుగు దశాబ్దాల పాటు ప్రతిపక్షంలో కొనసాగి, 1996లో తొలిసారి ప్రధాని పదవిని చేపట్టారు. పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం లేనందున ఆయన 13 రోజులు మాత్రమే ( 1996 మే 16 నుంచి 31 వరకూ) ప్రధాని పదవిలో కొనసాగారు. 1998లో రెండోసారి ప్రధాని పదవి చేపట్టినా 13 నెలలు మాత్రమే అధికారంలో కొనసాగారు. అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన రెండోసారి ప్రధాని పదవిని కోల్పోయారు. 1999లో మూడోసారి ప్రధాని పదవిని చేపట్టి మిత్రపక్షాల మద్దతుతో అయిదేళ్ల పూర్తికాలాన్ని సునాయాసంగా పూర్తి చేశారు. ఎమర్జెన్సీ అనంతరం కేంద్రంలో జనతాపార్టీ అధికార పగ్గాలు చేపట్టాక మురార్జీ దేశాయ్ మంత్రివర్గంలో వాజపేయి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో హిందీలో ప్రసంగించిన తొలినేతగా రికార్డు సృష్టించారు. మన దేశంలో ప్రధాని పదవిని చేపట్టిన వారిలో చాలామంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమో లేదా ఆ పార్టీ మద్దతు తీసుకోవడం వల్లో అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించారు. అయితే, వాజపేయి మాత్రం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ కాంగ్రెస్‌లో చేరలేదు, ఆ పార్టీ మద్దతుతో అధికారం చేపట్టలేదు. అనేక ఏళ్ల పాటు విపక్ష నేతగా వ్యవహరించి ప్రధాని పదవిని చేపట్టిన నేతగా ఆయనది అరుదైన రికార్డు. ప్రధానిగా ఉన్న కాలంలో జాతీయ భద్రత, సామాజిక ఆర్థికాభివృద్ధి, విదేశాంగ విధానంలో ఆయనది విలక్షణమైన పంథా. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అంతటి రాజనీతిజ్ఞుడిగా దేశంలోనూ, విదేశాల్లోనూ కీర్తిప్రతిష్ఠలు సాధించిన నేత వాజపేయి మాత్రమే. అవివాహితుడైన ఆయన రాజకీయాలతో మమేకమై ఉంటూనే తీరిక వేళల్లో పుస్తక పఠనం, కవితలు రాయడంలో కాలాన్ని గడిపేవారు. నెహ్రూ ఏమన్నారంటే... జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం కాశ్మీర్ వ్యవహారంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వైఖరిని దునుమాడుతూ వాజపేయి దేశమంతటా పర్యటించి ప్రసంగాలు చేశారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధాని పదవులు ఉండరాదంటూ ముఖర్జీ సిద్ధాంతాన్ని విస్తృత ప్రచారం చేశారు. ఆ తరువాత లోక్‌సభకు ఎన్నికై తొలి ప్రసంగంతో యావత్తు పార్లమెంటును ఆకట్టుకున్నారు. నెహ్రూ అయితే వాజపేయి ప్రసంగానికి తన్మయత్వం చెందారు. ఆ సమయంలో వచ్చిన ఓ విదేశీ ప్రతినిధికి- ‘యువకుడైన వాజపేయి .. ఈ దేశానికి భవిష్యత్తులో కాబోయే ప్రధానమంత్రి’ అని పరిచయం చేశారు. అంటే వాజపేయిలోని నాయకత్వ లక్షణాలను 1957 నాటికే నెహ్రూ గుర్తించారన్నమాట. అప్పటి ఆయన మాట 1996లో నిజమైంది. భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన సమయంలో వాజపేయి తన అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పేవారు. నెహ్రూ అవలంబించిన కొన్ని విధానాలను ఆయన మెచ్చకపోయినా స్ఫూర్తిదాయక నేతగా ఆయనను గౌరవించేవారు. ఆ మాటే బయటకూ చెప్పేవారు. అంతెందుకు..? 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి నెగ్గిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ‘అపర దుర్గ’గా అభివర్ణిస్తూ పార్లమెంట్‌లో వాజపేయి చేసిన ప్రసంగం ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పింది. మహాత్ముడు మాలవ్య భారతరత్న పురస్కారంతో బహుముఖ ప్రతిభావంతుడు మదన్ మోహన్ మాలవ్య ఈ తరం వారికి మరోసారి స్ఫురణకు వచ్చారు. మాలవ్య, వాజపేయి డిసెంబర్ 25నే జన్మించడం, ఇద్దరికీ ఒకేసారి అవార్డులు ప్రకటించడం యాదృచ్ఛికమే అయినా విశేషం. మహా విద్వాంసుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నేత, పాత్రికేయుడు, న్యాయకోవిదుడు అయిన మదన్‌మోహన్ మాలవ్యను జాతిపిత గాంధీజీ ‘మహామన’ అని సంభోదించేవారు. అంతటి గౌరవం పొందిన వ్యక్తి మాలవ్య. హిందూమత వ్యాప్తికి ఆయన ఎంతో కృషి చేసినా కుల, ప్రాంతీయ అసమానతలు, అంటరానితనాన్ని వ్యతిరేకించి పోరాడారు. ఆయన తొలుత కాంగ్రెస్‌వాది. మధ్యప్రదేశ్‌లోని మాల్యా ప్రాంతం నుంచి అలహాబాద్‌కు వలస వచ్చిన కుటుంబం వారిది. అలహాబాద్‌లో ఆయన 1861 జన్మించారు. 1911లో మనదేశంలో ఉంటున్న విదేశీ పిల్లల కోసం ‘్భరత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’ (బిసిజి) సంస్థ ఉండేది. భారతీయులకూ ఆ సౌకర్యం కావాలని ఆయన గట్టిగా పోరాడి 1913లో సాధించారు. ఆయనకు లాలాలజపతి రాయ్, అనిబిసెంట్ వంటివారు తోడ్పాటును అందించారు. 1933 నాటికి పూర్తిగా భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభమైంది. అంటే మనదేశంలో బిఎస్‌జి వ్యవస్థాపకుల్లో ఆయనొకరన్నమాట. అందులో పిల్లలను చేర్పించేలా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సేవాసమితిని నడిపారు. 1915లో కళలు, సాహిత్యం, విద్య బోధించేందుకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని వారణాసి (కాశీ)లో స్థాపించారు. ప్రస్తుతం ఈ విద్యా సంస్థ ఆసియాలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం. ఇప్పుడక్కడ 30వేల మంది యువతీ యువకులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిలో 15వేలమంది వర్శిటీ హాస్టళ్లలోనే ఉంటున్నారు. కాశీలోని పవిత్ర గంగానదీ తీరంలో ఇప్పుడు అత్యంత ఆదరణ పొందుతున్న ‘హారతి’ ఆనవాయితీని హిందూ ధర్మంగా ప్రారంభించినది మాలవ్యే. గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఓ చిన్నదీవికి ‘మాలవ్య దీవి’గా పేరుందంటే ఆయనకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఊహించొచ్చు. హిందూధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా, ప్రాచుర్యం, వ్యాప్తికి తోడ్పడిన నేతగా చెప్పుకునే మదన్‌మోహన్ మాలవ్య కాంగ్రెస్‌లో పనిచేశారు. ఆ పార్టీకి నాలుగుసార్లు అధ్యక్షునిగా వ్యవహరించారు. మోతీలాల్ నెహ్రూ సహకారంతో లీడర్ అనే ఆంగ్లపత్రికను నడిపారు. అంతకుముందు సొంతంగా హిందీ పత్రికను నడిపారు. హిందూస్థాన్ టైమ్స్‌కు ఎడిటర్‌గా, అధిపతిగా వ్యవహరించారు. మర్యాద, హరిశ్చంద్ర చంద్రిక, మకరంత్, అభ్యుదయ వంటి పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. న్యాయవాదిగానూ ప్రాక్టీసు చేశారు. గాంధీజీ, లాలాలజపతి రాయ్, మోతీలాల్‌నెహ్రూ వంటి ప్రముఖులతో కలసి పనిచేశారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి కొన్ని నెలల ముందు 1946 నవంబర్ 12న 84 ఏళ్ల వయసులో ఆయన తనువు చాలించారు. వీరికెందుకు ఆలస్యం..? దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘్భరతరత్న’ను 1954లో ప్రవేశపెట్టాక- ఆ అవార్డులిస్తున్న తీరుపై వివాదాలు, విమర్శలకు అంతులేకుండా పోతోంది. ఇప్పటి వరకూ 45 మంది విశిష్ట వ్యక్తులకు ఆ గౌరవాన్ని ప్రకటించారు. అయితే, కేంద్రంలో అధికారం పగ్గాలు చేపట్టిన రాజకీయ పార్టీలు కొన్ని ప్రయోజనాలను ఆశించి ‘్భరతరత్న’ ఇవ్వడంలో వివక్ష చూపుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడంలో రాజకీయ కోణాలున్నాయన్న విమర్శలూ లేకపోలేదు. కారణాలు ఏమైనా 2002 నుంచి 2008 వరకూ ఈ అవార్డును ఎవరికీ ఇవ్వకపోవడం గమనార్హం. కొంతమంది నాయకులకు ఈ అవార్డు ప్రకటించకపోవడంతో వివిధ వర్గాల నుంచి ఇప్పటికీ నిరసన ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అరుదైన రికార్డు నెలకొల్పిన దివంగత నేత జ్యోతి బసు (పశ్చిమ బెంగాల్), సినీనటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు (ఆంధ్రప్రదేశ్), చరణ్ సింగ్, దళిత నేత కాన్షీరామ్, సంచలన హాకీ క్రీడాకారుడు, ఒలింపిక్స్ విజేత ధ్యాన్ చంద్, ప్రపంచ చెస్ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ వంటి ప్రముఖులకు ‘్భరతరత్న’ ప్రకటించకపోవడం పట్ల నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ అత్యున్నత అవార్డును ఇప్పటి వరకూ ఇద్దరు విదేశీయులకు ప్రకటించినా, సొంత గడ్డపై కీర్తిశిఖరాలకు చేరుకున్న కొందరిని అలక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 1987లో పాకిస్తాన్‌కు చెందిన ‘సరిహద్దు గాంధీ’ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు, 1990లో దక్షిణాఫ్రికా పోరాట యోధుడు డాక్టర్ నెల్సన్ మండేలాకు ఈ అవార్డులు దక్కాయి. రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సైతం ఈ అవార్డును కొందరికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంతమందికి మరణానంతరం ఈ అవార్డును ప్రకటించడంలో రాజకీయ కారణాలున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. తమిళనాడులో సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్‌కు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించగా, మరో నట దిగ్గజం, తెలుగువారి కీర్తిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఎన్‌టిఆర్‌కు ఇంతవరకూ ‘్భరతరత్న’ ప్రకటించక పోవడం వివాదాస్పదమైంది. అన్ని అర్హతలున్నప్పటికీ రాజకీయేతర రంగాలకు చెందిన కొందరు ప్రముఖులకు ఈ అవార్డు దక్కలేదన్న వాదనలు ఉన్నాయి. 1928, 1932, 1936 ఒలింపిక్ పోటీల్లో మన దేశానికి బంగారు పతకాలు సాధించిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌కు ఈ అవార్డు ఇంతవరకూ దక్కలేదు. గత ఏడాది ధ్యాన్‌చంద్‌కు అవార్డు ప్రకటిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ, సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాలను ఆశించి క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఆఖరి నిమిషంలో హడావిడిగా ఎంపిక చేయడంలో యుపిఎ ప్రభుత్వం అత్యుత్సాహం చూపిందన్న విమర్శలు చెలరేగాయి. హిందీ చలనచిత్ర సీమలో ఆరు దశాబ్దాల పాటు సేవలందించిన నటుడు దిలీప్‌కుమార్‌కు ఈ అవార్డు ప్రకటించకపోవడం సినీ అభిమానులను నిరాశకు గురి చేసింది. కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆ దేశంలోని అత్యున్నత అవార్డు ’నిషాన్ -ఇ- ఇంతియాజ్’తో దిలీప్‌కుమార్‌ను గతంలోనే సత్కరించింది. 2007 నుంచి 2013 వరకూ ప్రపంచ చెస్ చాంపియన్‌గా భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన విశ్వనాథన్ ఆనంద్‌కు, ప్రముఖ అంతరిక్ష శాస్తవ్రేత్త విక్రమ్ సారభాయ్‌కు, ఇరవై భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లో పాటలు పాడిన ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లేకు, క్షీర విప్లవం సాధించిన వర్గీస్ కురియన్‌కు, సామాజిక కార్యకర్త బాబా ఆమ్టేకు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్తవ్రేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు, సంస్కరణల పర్వంతో దేశ ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించిన దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ‘్భరతరత్న’ ప్రకటించాలన్న వాదనలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అవార్డు రద్దు.. ఒక్కసారే.. స్వాతంత్య్ర సమర యోధుడు, ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు ‘్భరతరత్న’ అవార్డు ఇస్తున్నట్లు 1992లో వచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది. పురస్కారాన్ని స్వీకరించేందుకు ఆయన కుటుంబ వారసులు తిరస్కరించారు. ఈ అవార్డుపై వివాదం సుప్రీం కోర్టుకు చేరగా, ప్రభుత్వం తన ప్రకటనను రద్దు చేసుకుంది. ఈ ఏడాది అవార్డు గ్రహీతల జాబితాలో వాజపేయి, మదన్‌మోహన్ మాలవ్యతో పాటు బోస్ పేరు కూడా చేర్చాలని ప్రయత్నించినా కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించారన్న కథనాలు వెలువడ్డాయి. 1945 ఆగస్టులో విమానంలో ప్రయాణిస్తుండగా విదేశాల్లో బోస్ ‘అదృశ్యం’ అయ్యారన్న ప్రచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ నమ్మడం లేదు. ఆ సంఘటన జరిగి 70 ఏళ్లు గడిచినా, బోస్ ఇంకా బతికే ఉన్నారని ఆయన వారసులు భావిస్తున్నారు. ఆయన మరణం గురించి ఎలాంటి స్పష్టత లేనందున ‘మరణానంతరం’ భారతరత్న అవార్డు ఎలా ఇస్తారని వారు వాదిస్తున్నారు. ఒకటి, రెండు సందర్భాల్లో వివాదాలు వచ్చినా మొత్తమీద భారతరత్న ఓ సమున్నత పురస్కారమే. పతకం విశిష్టత భారతరత్న పతకానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ఆదేశం మేరకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని తన మింట్‌లో తయారు చేయిస్తుంది. భారతదేశంలో ఇదే అత్యున్నత పౌర పురస్కారం. ఇది బిరుదు కాదు. ఓ గౌరవం మాత్రమే. అవార్డు గ్రహీతలు తమ పేరుకు ముందుగానీ, వెనుక గానీ ‘్భరతరత్న’ పదాన్ని వాడరాదు. ఈ పురస్కారాన్ని అందుకునేవారికి పతకం, రాష్టప్రతి ఇచ్చిన ధ్రువపత్రం అందజేస్తారు. ఎటువంటి నగదు బహుమతి లేదు. ఫలానా కాలానికి అంటూ ఏడాదికో, రెండేళ్లకో ఇవ్వాలనేం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవ్వవచ్చు. ఒక విడతకు ముగ్గురికి మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఉంది. 1954లో ఈ పతకం వృత్తాకారంలో 35 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో బంగారంతో తయారు చేసేవారు. పతకంపై ఓ వైపు మధ్యలో సూర్యుడు, కిరణాల వ్యాప్తి బొమ్మలా ఉంటుంది. దేవనాగరి లిపిలో సంస్కృతంలో రాసిన భారతరత్న అన్న అక్షరాలుండేవి. పతకం అంచున వెండిలైన్ ఉండేది. ఆ పతకానికి రెండోవైపు మధ్యలో ప్లాటినంతో చేసిన నాలుగు సింహాల చిహ్నం, దానికింద ‘సత్యమేవ జయతే’ వాక్యం ఉండేవి. ఏడాది తరువాత దానిని సమూలంగా మార్చారు. ప్రస్తుతం ఈ పతకాన్ని రావి ఆకు ఆకారంలో 59 మిల్లీమీటర్ల పొడవు, 48 మిల్లీమీటర్ల వెడల్పు, 3.2 మిల్లీమీటర్ల మందంతో పూర్తిగా ప్లాటినంతో తయారు చేస్తున్నారు. పతకం మధ్యలో ప్లాటినంతో చేసిన కిరణాలు ప్రసరించే సూర్యుని బొమ్మ ఉంటుంది. ఈ కిరణాలు పొడవు, 16, 13 మి.మీ. చొప్పున ఉంటాయి. దేవనాగరి లిపిలో సంస్కృతంలో ‘్భరతరత్న’ అన్న అక్షరాలు ముద్రించి ఉంటాయి. పతకం రెండోవైపు నాలుగు సింహాల గుర్తు, సత్యమేవ జయతే నినాదం కన్పిస్తాయి. ఈ పతకానికి 51 మిల్లీమీటర్ల పొడవున్న తెల్లటి రిబ్బన్ ఉంటుంది. మెడలో ధరించడం కోసం ఇది ఇస్తారు. 1957లో ఈ పతకంపై ఉండే వెండిలైనింగ్‌ను కాంస్యంతో చేయడం మొదలైంది.
Source: Andhrabhoomi.

2 comments: