Breaking News

బుడ్డా వెంగళరెడ్డి (Budda Vengala Reddy)


బుడ్డా వెంగళరెడ్డి (1840 - 1900) 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత.

వీరు కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో నల్లపురెడ్డి మరియు వెంకటమ్మ దంపతులను జన్మించాడు. ఇతడు పెద్దగా చదవకపోయినా తల్లినుండి దానగుణాన్ని దాని గొప్పదనాన్ని తెలుసుకున్నాడు.

1866 కాలంలో వీరి కీర్తి ప్రతిష్టలు విన్న పేద ప్రజలు బళ్ళారి, చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి తండోపతండాలుగా ఉయ్యాలవాడ చేరి రెడ్డిగారిని ఆశ్రయించారు. వారి దీనస్థితిని అర్ధంచేసుకున్న రెడ్డిగారి ఇంట్లో ఉన్న ఆరు పుట్ల ధాన్యాన్ని గంజి కాయించి వేలాది కుటుంబాల ఆకలిని తీర్చారు. పూటకు ఎనిమిది వేలకు తక్కువ కాకుండా తిండి పెట్టారని అంచనా. వంటమనిషి గంగన్న ఆకాలంలో చేసిన సేవలకు మెచ్చిన రెడ్డిగారు అతనికొక బంగారు కడియం తొడిగి సత్కరించారు. అనంతర కాలంలో స్వగ్రామంలో పాఠశాలను నెలకొల్పి శివరామశాస్త్రి అనే పండితుని కుటుంబాన్ని పోషిస్తూ విద్యాదానం చేశారు.

ఈయన సేవలను గుర్తించి అప్పటి మద్రాసు ప్రభుత్వం విక్టోరియా బంగారు పతకాన్ని బహూకరించింది. ప్రభుత్వం ఈయన్ను ప్రొవిన్సియల్ జ్యూరీ యొక్క సభ్యునిగానూ, మద్రాసు గవర్నరు కౌన్సిల్ యొక్క గౌరవ సభ్యునిగానూ చేసి గౌరవించింది. ఈ సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది. ఆ బంగారు పతకముపై క్రింది విధంగా చెక్కబడినది. "1866వ సంవత్సరంలో సంభవించిన క్షామకాలమందు, నిరాధారముగా నుండిన, తన స్వదేశస్థుల పట్ల జరిపించిన ఉత్కృష్ట ఔదార్యమునకు గాను, హర్ మైజెస్టి రాణిగారి వల్ల చేయబడిన శ్రేష్టమైన గణ్యతకు ఆనవాలుగా బుడ్డా వెంగళరెడ్డిగారికి బహుమానమివ్వబడినది."

రెడ్డిగారు ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు స్వగ్రామంలోని అగస్తేశ్వర దేవాలయంలో ఉత్సవాలు జరిపి, పండితులను సత్కరించి, అన్నదానాలు చేసేవారు.

మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి గారు డిసెంబరు 31 1900 తేదీన శివసాయుజ్యాన్ని పొందారు. ఆతని కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుంది. అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వివిధ జానపద కళలలో అతన్ని కీర్తిస్తుంటారు.

శ్రీవెంగళరెడ్డిగారి గురించిన ఐతిహ్యం

ఒక పేదబ్రాహ్మణుడు వెంగళరెడ్డిగారిని తన యింటిలో త్వరలో జరగనున్న శుభకార్యం నిమిత్తంగా ఏదైనా ద్రవ్యసహాయం చేయమని అర్థించాడు. రెడ్డిగారు అంగీలో చేయిపెట్టి ఒక నోటు తీసి ఇచ్చారు. అది చిన్నమొత్తం. ఆ బ్రాహ్మణుడు చిన్నబుచ్చుకున్నాడు. అది చూసి రెడ్డిగారు అర్థితో, "అయ్యా, మీ ప్రాప్తం అంతే ఉన్నది" అన్నారు. కాని బ్రాహ్మణుడికి నమ్మకం కలుగలేదు. అప్పుడు రెడ్డిగారు తన కోడలిని పిలచి ఒక చేటలో బియ్యమూ దానిలో గూడంగా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన నోటుతో పాటు మరొక వందనోటును కూడా ఉంచి తీసుకొని రమ్మన్నారు. అలా ఆవిడ తెచ్చిన పిదప, బ్రాహ్మణోత్తముడు స్వయంగా చేయిపెట్టి బియ్యపుచేటలోనుండి తీసుకొంటె మొదట రెడ్డిగారు ఇచ్చిన నోటే తిరిగి లభించింది. తదుపరి, రెడ్డిగారు రెండవనోటుని బియ్యపుచేటనుండి ఆ బ్రాహ్మణుడికి వెలికి తీసి చూపి, తన వాక్యం సత్యం అని ఋజువు చూపారట.
మూలం: వికీపిడియా


1 comment:

  1. 1866 నాటి కరువు నాడు పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి కి సన్మానసభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.

    ReplyDelete