స్వచ్ఛ భారత్ మార్పు మనతోనే...
స్వచ్ఛ భారత్...దేశం అంతా పరిశుభ్రంగా ఉండాలి. ఇదీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీనుండి ఎందరో పెద్దలు ఇచ్చిన పిలుపు. అంతటితో ఆగిపోకుండా ప్రజాచైతన్యం కోసం వారు ముందుకు ఉరికారు. ప్రజలపై ప్రభావం చూపగల ప్రముఖులు, సెలబ్రిటీలు కదనరంగంలోకి దూకారు. కానీ భారత్ ఒక్కసారిగా మారిపోతుందా...మన రోడ్లు, పల్లెలు, నగరాలు మురికి నుండి, చెత్తనుండి బయటపడతాయా...అంటే... అదేమీ అసాధ్యం కాదనే చెప్పాలి. దేశంలో పారిశుద్ధ్య లోపానికి కారకులెవరు. చెత్తవేస్తున్నదెవరు. రోడ్లపై మురికి పేరుకుపోవడానికి కారకులెవరు.. మనమే. మనం పరిశుభ్రంగా ఉండాలని అనుకున్నప్పుడు, మన ప్రాంతం బాగుండాలని బలంగా భావించినప్పుడు.. స్వచ్ఛ్భారత్ సాధ్యమే. అంటే మనలో మార్పు రావాలి. ఆ మార్పు ఇంట్లోనే మొదలవ్వాలి. ఎందుకంటే రోడ్లపై చెత్త, మురుగు, ఇతర పారిశుద్ధ్య సమస్యలు మొదలయ్యేది ఇంటినుంచే. అందుకే స్వచ్ఛ్భారత్‌కోసం తొలి అడుగు ఇంటివద్దే మొదలవ్వాలి. అంతకుముందే మనలో మార్పు రావాలి. పారిశుద్ధ్యలోపం అంటే కేవలం చెత్తాచెదారం, మురికి కాల్వల నిర్వహణ లేకపోవడమే కాదు. అపరిశుభ్రతకు, అనారోగ్యానికి, అభద్రతకు వాటికన్నా ఎక్కువ కీడు చేస్తున్నది ఇంట్లో మరుగుదొడ్లు లేకపోవడమే. అందుకే మనలో మార్పు ఇంటినుండి మొదలవ్వాలి. వీరిని చూసి నేర్చుకుందాం.. ‘మీ ఇంట్లో టాయిలెట్ కట్టించండి...అప్పుడొస్తా కాపురానికి..!’ అన్న కొత్త పెళ్లికూతురి షరతుకు అత్తింటివారికి ఒళ్లుమండిపోయింది. కానీ, ఆ కోడలుపిల్ల మెట్టుదిగలేదు. తన పంతం నెగ్గించుకునేలా దీక్ష చేపట్టింది. చివరకు టాయిలెట్ కట్టాకే ఆమె అత్తవారింట అడుగుపెట్టింది.. ఇది ఆ మధ్య మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌లో అనిత నర్రే అనే మహిళ సాధించిన విజయం... నిన్నటికి నిన్న మహారాష్టల్రో వషిమ్ ప్రాంతానికి చెందిన సంగీత అవాలే అనే ఓ ఇల్లాలు తన ఇంట్లో టాయిలెట్ కట్టించడానికి మంగళసూత్రాన్ని అమ్మేసింది. 12 ఏళ్లుగా బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడానికి పడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక ఆమె ఆ పనిచేసింది. బంగారు మంగళసూత్రం అమ్మగా వచ్చిన డబ్బుతో అత్తగారింట్లో టాయిలెట్ కట్టించింది. ఆ ఇద్దరు మహిళల పోరాటంలో రెండు విషయాలు గ్రహించాలి. కొత్తకాపురం కన్నా టాయిలెట్ ముఖ్యమా..? సౌభాగ్య చిహ్నం కన్నా మరుగుదొడ్డి ముఖ్యమా..? అని ప్రశ్నిస్తే ఆ మహిళలు ఔనంటున్నారు. ఆ ఇద్దరికి ఆయా ప్రభుత్వాలు నగదు బహుమతి ఇచ్చాయన్నది వేరే విషయం. నిజానికి టాయిలెట్ అన్నది ఎవరికైనా కనీస, అత్యవసర వౌలిక సౌకర్యం. ఇదిలేకపోతే ఎన్నో అవస్థలు. ఈ విషయం ఆడామగా, చిన్నాపెద్దా అందరికీ తెలుసు. కానీ చాలామంది నోరెత్తరు. పై ఇద్దరు మహిళల్లా పోరాడితే, తెగిస్తే ఇప్పటికి దేశం పారిశుద్ధ్యంతో ఆరోగ్యంగా ఉండేది. టాయిలెట్ లేకపోతే ఆరుబయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాలని, అది సిగ్గు, బిడియం, భయం, అభద్రత, అనారోగ్యంతో కూడుకున్న వ్యవహారమని తెలిసినా ఎవరూ స్పందించరు. మరోమార్గం లేకపోవడమూ వారి స్తబ్దతకు కారణం. ఆ స్తబ్దత ఎన్ని అనర్థాలకు కారణమవుతోందా తెలుసా? బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి. చీకటిపడేవరకు బిగపట్టుకుని, బయటకు చెప్పుకోలేక, సతమతమయ్యే మహిళలు ఆ తరువాత బహిరంగ ప్రాంతాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకునే దుస్థితిలో ఉన్నారు. అలా వెళ్లినవారిపై అత్యాచారాలు, ఆపై హత్యలు జరుగుతున్నాయి. యూపీలోని బడౌన్‌లో ఇద్దరు అక్కచెల్లెళ్లపై అదే జరిగింది. నిజానికి ఆ రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలు ఉన్న కుటుంబాలు ప్రత్యేక రక్షణతో ఆ అవసరాలు తీర్చుకునే దుస్థితిలో ఉన్నారంటే నమ్మాల్సిందే. మనదేశంలో దాదాపు 60శాతం ఇళ్లలో ఇప్పటికీ టాయిలెట్ సౌకర్యం లేదు. అందువల్ల ఆ కుటుంబాల వారు బహిర్భూమికి వెళ్లి మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తోంది. 2012లో ఓ అధ్యయనం నివేదికలను చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) భారత్‌లో పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. మరుగుదొడ్ల సౌకర్యం లేక దేశంలో 60 శాతానికిపైగా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు విసర్జిస్తున్నారని, అది ప్రజారోగ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని తేల్చింది. స్వచ్ఛ్భారత్ అభియాన్ జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం నాటికి అంటే 2019 నాటికి దేశంలో ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలని, దేశమంతా పారిశుద్ధ్య సమస్యలు లేకుండా ఉండాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పథకమే ‘స్వచ్ఛ్భారత్ అభియాన్’. రాబోయే ఐదేళ్లలో దేశంలో 11.11 కోట్ల టాయిలెట్లు నిర్మించాలని మోదీ లక్ష్యంగా నిర్దేశించారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఎర్రకోట పైనుంచి ఎంతో భావోద్వేగంతో మాట్లాడినపుడు రాజకీయ పక్షాలు గేలి చేశాయి. మనకు కావలసింది ఆలయం కాదని, శౌచాలయమని ఆయనంటారు. అపరిశుభ్రత ఎంత తీవ్రమైన సమస్యో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. స్వచ్ఛ్భారత్ కోసం ప్రధాని 30 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రజాచైతన్యం కోసం సెలబ్రిటీలను ఆహ్వానించారు. తానూ రోడ్డుపైకి వచ్చారు. పారిశుద్ధ్యం అంటే కేవలం చెత్తను తీసివేయడమే కాదు. మురుగునీటి పారుదల, టాయిలెట్లు, వాటి సక్రమ నిర్వహణ ఇందులో భాగం. గాంధీజీ బాట.. ‘మన ఇంటిని, మన ప్రాంతాన్ని మనమే బాగు చేసుకోవాలి.. పరిశుభ్రతతోనే ఆరోగ్యం, భాగ్యం దక్కుతాయి..’- అని ఎప్పుడో 67 ఏళ్లక్రితం గాంధీజీ పిలుపుఇవ్వడమే కాదు, స్వయంగా కార్యరంగంలోకి దిగారు. ఆయన పిలుపునకు జాతి యావత్తూ స్పందించింది. ఆ తరువాత ఆ స్ఫూర్తిని కొనసాగించేవారు లేకపోయారు. ఫలితంగా దేశంలో పారిశుద్ధ్యం నానాటికీ దిగజారిపోయింది. 1985 నుంచి ఇప్పటివరకు మనదేశంలో పారిశుద్ధ్యం కోసం 18వేల కోట్లు ఖర్చు చేశారు. ఏటా 4600 కోట్లు దీనికోసం ఖర్చు చేస్తున్నారు. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. ప్రపంచంలో అపరిశుభ్రంగా కనిపించే దేశాల జాబితాలో మనం అగ్రస్థానంలో ఉన్నాం. అసలు కారణాలు ఇవీ పారిశుద్ధ్య లోపం, ఆరుబయట మలమూత్రాల విసర్జన వల్ల కీడు తక్కువేం కాదు. సామాజిక, ఆర్థిక, మానసిక రుగ్మతలకు అది కారణమవుతోంది. బయటకు కన్పించని విపత్తులకు అది కారణం. ప్రాంతాల వారీగా, కాలనీల వారీగా టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు ఖర్చుపెడుతోంది. నిజానికి అవన్నీ కాగితాలపైనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వాటి నిర్మాణం జరగడం లేదు. పరిశుభ్రత విషయంలో ఆదర్శంగా నిలిచిన గ్రామాలకు ఇచ్చే ‘నిర్మల్ పురస్కార్’ను సాధించిన ఫతేపూర్ జిల్లా (యుపి)లోని చాలా గ్రామాల్లో అసలు టాయిలెట్లే కట్టలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. ‘రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఫర్ కంపాసినేట్ ఎకనామిక్స్’ (రైస్) చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టాయిలెట్లు లేని, ఆరుబయట మలమూత్ర విసర్జన చేసే ప్రజలు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల్లోని 3,250 చోట్ల ఆ సంస్థ సర్వే నిర్వహించింది. కొన్నిచోట్ల మరుగుదొడ్లను కట్టినా వాటి నిర్వహణ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థల ఉపేక్ష కూడా దానికి కారణం. ప్రజల్లో కూడా చైతన్యం లేకపోవడం మరో సమస్య. టాయిలెట్లను శుభ్రం చేసేందుకు నీళ్లు లేకపోవడం మరో శాపం. రాజస్థాన్, బీహార్, యుపి, ఒడిశాలలో తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చుకోవాలంటే కనీసం నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాల్సిన స్థితిలో టాయిలెట్ల శుభ్రతకు నీళ్లెక్కడ్నించి వస్తాయి? మరుగుదొడ్లు ఉన్నచోట వాటినుండి వ్యర్థాలు వెళ్లిపోయే డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో అదంతా ఆరుబయట ప్రాంతాల్లోకి చేరడం మరో సమస్య. ఇక టాయిలెట్లు ఉన్నా వాడనివారూ ఉన్నారు. హాయిగా అలా బయటకెళ్లి అవసరాలు తీర్చుకుందామన్న అలవాటే అపరిశుభ్రతకు కారణమవుతోందంటారు ప్రముఖ రాజకీయ నేత శశి ధరూర్. ‘మన స్థలం కాదులే..!’ అన్న భావనతో రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మలమూత్రాలను విసర్జించడం పరిపాటైపోయిందన్నది ఆయన అభిప్రాయం. అది నిజం కూడా. స్కూళ్లు, ఇళ్లు, కార్యాలయాల్లో సురక్షితమైన టాయిలెట్లు లేనందున ప్రధానంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలికలు చదువుకు దూరమవుతున్నారు. ఫలితంగా ఉజ్వల భవిష్యత్‌ను కోల్పోతున్నారు. మహిళలు ఉద్యోగాలు చేసేందుకు వెనకాడుతున్నారు. ఎదుగుదలపై ప్రభావం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలున్న దేశాలే ఆఫ్రికాలో ఎక్కువ. నిజానికి అక్కడి దేశాలన్నీ పేదరికంతో బాధపడేవే. కానీ ఓ విశేషం తెలుసా? వారికన్నా మెరుగైన, బలవర్థకమైన ఆహారం తీసుకుంటున్న భారతీయ సమాజంలోని పిల్లలు ఎదుగుదల విషయంలో వారికన్నా వెనుకబడే ఉన్నారు. మంచి ఎత్తు, దేహదారుఢ్యంతో కన్పించే ఆఫ్రికా దేశాల్లోని పిల్లలకు నిజానికి కడుపునిండా తిండే ఉండదు. మన దేశంలో పిల్లలకు అక్కడితో పోలిస్తే మెరుగైన ఆహారం లభిస్తున్నా వారికి దీటుగా ఎదగరు. వారికన్నా మనవాళ్లు పొట్టిగానే ఉండిపోతారు. ఆరుబయట మలమూత్ర విసర్జన అక్కడితో పోలిస్తే మన దేశంలో ఎక్కువ. బహిరంగ స్థలాల్లో ఆడుకునే పిల్లలు అంటువ్యాధులు, దీర్ఘరోగాల కారణంగా ఎదుగదలను కోల్పోతున్నారు. ఇది పుక్కిట పురాణం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలిన చేదు నిజం. ఆర్థిక ప్రభావం ఆరుబయట మలవిసర్జన వల్ల కలిగే మరో దుష్ప్రభావం ఆర్థికరంగంపై పడుతోంది. టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అయితే, వాటి నిర్వహణపై ఎవరూ ఆసక్తి చూపరు. అది లేకపోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు పెట్టే ఖర్చు అంతకు పదిరెట్లు అవుతోంది. అది వ్యక్తిగతంగానూ, దేశం మీదా భారంగా మారుతోంది. తక్కువనీటితో, పర్యావరణ అనుకూలంగా ఉండే అత్యాధునిక టాయిలెట్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. రావలసిన మార్పు ప్రజల స్వభావంలోను, ప్రవర్తనలోనూ మాత్రమే. స్వచ్ఛ్భారత్ విజయవంతం కావాలంటే ప్రజల్లో ఈ మార్పు తప్పనిసరిగా రావాల్సిందే. టాయిలెట్స్ డే.... ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ‘టాయిలెట్స్ డే’ నిర్వహిస్తోంది. టాయిలెట్స్ విషయంలోనూ ఐక్యరాజ్య సమితి అంతలా స్పందించాలా అంటే...ఔననాల్సిందే! ఎందుకంటే ఈ భూగోళంపై 60 శాతం మందికి ‘మరుగు’ సౌకర్యం లేదు మరి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాదుల విసర్జన వల్ల అంటురోగాలు, అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా శిశుమరణాలు, మహిళలపై అఘాయిత్యాలు అధికమైపోయాయి. ప్రజల్లో అవగాహన, నీటి సౌకర్యం లేనందున ఈ సమస్య ప్రపంచాన్ని పీడిస్తోంది. అందుకే 2030 నాటికి అందరికీ టాయిలెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన లేకుండా చూసేందుకు ‘వరల్డ్ టాయిలెట్ డే’గా నవంబర్ 19 తేదీని ప్రకటించింది. ‘అందరూ గౌరవప్రదంగా, సమానత్వంతో ముందుకు సాగడం’ - ఈ ఏడాది ‘టాయిలెట్ డే’ సందర్భంగా ఓ కొత్త నినాదాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చైతన్య కార్యక్రమాలను ఐరాస చేపడుతోంది. ఫోన్లపై శ్రద్ధ... మరుగుదొడ్లపై లేదు ఓ పల్లెటూరుకు.. లేదా ఓ చిన్న పట్టణానికి వెళ్లారనుకుందాం...అక్కడ ఎవరినైనా- ‘ఏమ్మా...మీ ఇంట్లో ఏ ఒక్కరికైనా మొబైల్ ఫోన్ ఉందా?’ అని అడిగిచూడండి. ‘ఓ.. ఉంద’నే సమాధానం దాదాపుగా 80 శాతం కుటుంబాల నుండి వస్తుంది. అదే వ్యక్తిని ‘మీ ఇంట్లో టాయిలెట్ సౌకర్యం ఉందా?’ అని ప్రశ్నిస్తే- దాదాపుగా 60 శాతం కుటుంబాలు ‘లేవంటూ’ తెల్లమొహం వేస్తాయి. ఇదే విషయాన్ని సింపుల్‌గా చెప్పుకుంటే- మనదేశంలో చాలామందికి ఫోన్లు ఉన్నాయి. కానీ వారిలో ఎక్కువమందికి టాయ్‌లెట్ సౌకర్యం మాత్రం లేదు. ఇది వారి ఆలోచనావిధానానికి మచ్చుతునక. అత్యవసర విషయాన్ని పట్టించుకోకుండా, విలాసానికి విలువ ఇవ్వడమంటే ఇదే. ఇళ్లనిర్మాణం, వౌలిక వసతుల కల్పనలో టాయిలెట్లు ఉండాలన్న తపన ప్రజల్లో వస్తేనే మార్పు సాధ్యమవుతుంది. యునిసెఫ్ అధ్యయనం ప్రకారం గడచిన దశాబ్దంలో మన దేశంలో ఆరుబయట అవసరాలు తీర్చుకునే వారి సంఖ్య కొంత మేరకు తగ్గింది. దాదాపు 13శాతం మంది మరుగుదొడ్లను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారన్నమాట. ఇది మంచి మార్పునకు దారితీస్తుందని భావించి, ఆ దిశగా అడుగులు వేసేందుకు అందరూ ప్రయత్నించాలి. ‘స్వచ్ఛ్భారత్’కు చేయూతనివ్వడం అందరి కనీస కర్తవ్యం. సింగపూర్‌లో టాయిలెట్ కాలేజీ ఉంది. దీనిని వరల్డ్ టాయిలెట్ ఆర్గనేజేషన్ అధినేత జాక్ సిమ్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పారిశుద్ధ్య, మరుగుదొడ్ల సమస్యపై ఆయన సదస్సులు నిర్వహిస్తూంటారు. ఐక్యరాజ్యసమితి కంటే ముందే ‘వరల్డ్ టాయిలెట్ డే’ను జాక్ సిమ్ 2001లోనే ప్రారంభించారు. ఆ తరువాత ఐరాస అధికారికంగా ప్రకటించింది. సింగపూర్ కేంద్రంగా ఆయన అనేక దేశాల్లో సేవలందిస్తున్నారు. మీకు తెలుసా..? * ఒక గ్రాము మలంలో పదికోట్ల వైరస్‌లు, కోటి బ్యాక్టీరియా, వెయ్యి పరాన్నజీవులు, వాటి గుడ్లు ఉంటాయి. ఆరుబయట పాదరక్షలు లేకుండా ఆడే చిన్నారుల పాదాలు, చేతుల ద్వారా అవి వారికి సంక్రమించి రోగాలపాలు చేస్తాయి. రోజూ ఈ వ్యాధుల వల్ల దేశవ్యాప్తంగా వెయ్యిమంది, ప్రపంచవ్యాప్తంగా 5వేలమంది ఐదేళ్ల లోపు చిన్నారులు మరణిస్తున్నారు. అంటే 40 సెకండ్లకు ఒకరన్నమాట. * పారిశుద్ధ్యం, నీటి సరఫరా ఏర్పాట్ల కోసం భారత్ తన జిడిపిలో 6 శాతం వెచ్చించాల్సి వస్తోంది. అంటే ఏటా 54 బిలియన్ డాలర్ల మొత్తం అన్నమాట. * ప్రపంచంలో 40 శాతం, మనదేశంలో 60 శాతం జనాభాకు సొంత లేదా కమ్యూనిటీ టాయిలెట్ల సౌకర్యం లేదు. అయితే, గత పదేళ్లలో వీరి సంఖ్య తగ్గుముఖం పట్టింది. పట్టణాల్లోని మురికివాడల్లో 90 శాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యం లేనేలేదు. * పారిశుద్ధ్య లోపం విషమించడంతో 2011లో ప్రపంచంలో 0.7 మిలియన్ల మంది చిన్నారులు మరణించారు. 25 లక్షల మంది స్కూళ్లకు వెళ్లలేకపోయారు. * న్యూఢిల్లీలోని మురికివాడల్లో ఈ ఏడాది ఆరుబయట మలవిసర్జనకు వెళ్లిన పది మంది మైనర్లపై అత్యాచారయత్నం జరిగింది. గత ఏడాది బీహార్‌లో ఇలా 400 మంది మహిళలు అత్యాచారాల బారి నుంచి తప్పించుకోగలిగారని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. * జాకిన్ అర్పుథమ్ ముంబైలోని ధర్వార మురికివాడలో పారిశుద్ధ్యం కోసం పనిచేస్తున్నారు. రామన్ మెగసెసే, పద్మశ్రీ అవార్డులు పొందిన ఆయన పారిశుద్ధ్య ఉద్యమంలో పాల్గొని ఇప్పటికి 50సార్లు అరెస్టయ్యారు. మొదట్లో ఆయనను చాలామంది అంటరానివారిగా పరిగణించేవారు. ఇప్పుడు ప్రపంచమే ఆయన చుట్టూ తిరుగుతోంది. కాన్పూర్‌లో తొలి టాయిలెట్ కట్టిన ఆయన ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా లక్ష మరుగుదొడ్లు నిర్మించారు. వాటిలో 20వేలు ఒక్క ముంబయిలోనే ఉన్నాయి. మహిళలకు కీలక బాధ్యతల్ని అప్పగిస్తేనే స్వచ్ఛ్భారత్ విజయవంతమవుతుందని ఆయన అంటారు. నాయకులు, సెలబ్రిటీల వల్ల అది సాధ్యం కాదని ఆయన అంటున్నారు. ‘ప్రధాని మోదీ స్వచ్ఛ్భారత్ నినాదం బాగుంది.. కానీ ఆ లక్ష్య సాధనకు ఐదేళ్లు ఆగాలా? యుద్ధప్రాతిపదికన, ఏడాదిలోగా ఆ పనిచేస్తేనే ఫలితం వస్తుంది. మహిళల వల్లే దేశం తళతళలాడుతుంది..’ అని అంటారాయన. ‘ది నేషనల్ స్లమ్ డ్వల్లర్స్ ఆర్గనైజేషన్’ ద్వారా ఆయన సేవలందిస్తున్నారు. బిందేశ్వర్ పాఠక్ సులభ్ ఇంటర్నేషనల్ పేరు చెబితే ఎవరికైనా బిందేశ్వర్ పాఠక్ గుర్తొస్తారు. మలమూత్ర విసర్జన కోసం అత్యాధునిక, తక్కువ రుసుముతో సేవలందించే సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన సంస్థకు ఆయన అధిపతి. ఇప్పటికి వందకు పైగా దేశాల్లో కోట్లాదిమందికి లక్షలాది టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చారు. మొదట్లో ఆయనను చాలామంది ఎగతాళి చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ అవార్డులెన్నో ఆయనను వరించాయి. దేశంలో 30వేలమందికి సరైన శిక్షణ ఇచ్చి, టాయిలెట్లను నిర్మిస్తే స్వచ్ఛ్భారత్ సాధ్యమేనంటారు ఆయన. వ్యర్థంతో వెలుగులు బీహార్‌లోని కొన్ని మురికివాడల్లో ‘హూమన్యూర్ ఎనర్జీ’ సంస్థ తరపున చర్యలు చేపట్టారు. కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించి, మానవులు విసర్జించిన మలంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ఆ విద్యుత్‌శక్తిని అదే కమ్యూనిటీలో ప్రజలు వినియోగించే పథకాన్ని అమలు చేశారు. ముందుగా ఆయన పాట్నాకు సమీపంలోని ఓ పల్లెలో 20 సామూహిక టాయిలెట్లు నిర్మించారు. ఆ మరుగుదొడ్ల ద్వారా వచ్చే మానవ వ్యర్థాలన్నీ ఓ ప్లాంట్‌కు చేరి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా 12 వోల్టుల బ్యాటరీలను ఛార్జ్ చేస్తారు. ఆ బ్యాటరీలను సాధారణ రుసుముపై అద్దెకు ఇస్తారు. కిరోసిన్ దీపాలకు బదులు వీటిని వాడి ఓ ఇంట్లో ఒ బల్బు ఆరుగంటల పాటు వెలిగేందుకు ఉపయోగపడుతుంది. సెల్‌ఫోన్ చార్జింగ్, చిన్నచిన్న విద్యుత్ అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. మున్ముందు వాటర్ ఫిల్టర్‌లను ఉపయోగించుకునే స్థాయిలో హ్యూమనూర్ పవర్ ప్రాజెక్టు పరిశోధనలు చేస్తోంది. ఈ సంస్థ అధిపతి అనూప్‌జైన్‌కు ఇటీవల గ్లోబల్ సిటిజన్ అవార్డు వచ్చింది. దాని తరపున లక్ష యుఎస్ డాలర్ల మొత్తం లభించింది. దానితోపాటు ఎన్నో రివార్డులు వచ్చాయి. టాయిలెట్ మ్యూజియం న్యూఢిల్లీలో దీనిని బిందేశ్వర్ పాఠక్ ఏర్పాటు చేశారు. 2500 ఏళ్ల నాటి టాయిలెట్ల నమూనాలను దేశవిదేశాల నుంచి సేకరించారు. పూరాణేతిహాసాల్లో మరుగుదొడ్ల ప్రస్తావలను ఉటంకించే అంశాలను భద్రపరిచారు. ఆధునిక భారతంలో టాయిలెట్ల రూపకల్పన, వాటి నిర్మాణశైలి, మార్పులకు సంబంధించి ఎన్నో ఎగ్జిబిట్లను అక్కడ ప్రదర్శనకు ఉంచారు. టాయ్‌లెట్.. బ్యాంకింగ్ ‘సమగ్ర’ అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి సామూహిక మరుగుదొడ్ల ను వాడుకునేలా స్పప్నిల్ చౌదరి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ప్రజల కోసం, ప్రజలచేత, ప్రజలే నడుపుకునేలా సమగ్ర వ్యవస్థను రూపొందించారు. అమెరికాలో బాగా సంపాదిస్తున్న ఆయన ఓసారి బెంగళూరు వచ్చినపుడు మహిళలు రోడ్డుపక్కన కాలకృత్యాలు తీర్చుకుంటున్న దృశ్యం చూసి చలించిపోయి భారత్‌లోనే ఉండిపోయారు. మురికివాడలు, బెంగళూరు బస్తీల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు సిద్ధపడ్డారు. స్థానికుల నుండి సహకారం లేకపోవడంతో అమెరికా తిరుగుముఖం పట్టారు. ఈలోగా కొందరు స్నేహితులు పూణెలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అక్కడి మున్సిపాల్టీకూడా ‘సై’ అంది. తక్కువ ఖర్చుతో సామూహిక టాయిలెట్లు నిర్మించిన ఆయన వాటిని వాడుకునేందుకు స్వల్ప మొత్తంలో రుసుము పెట్టారు. ఓ కుటుంబానికి నెలంతా టాయిలెట్ వాడకానికి 40 రూపాయలు వసూలు చేస్తారు. అలా వాడుకునేవారు కొన్ని బృందాలుగా ఏర్పడి మిగతావారిని చైతన్యపరిస్తే కొంత కమీషన్ ఇస్తారు. వసూలు చేసే రుసుముతో మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, శుభ్రం చేసే పరికరాలు, రసాయనాల కోసం ఖర్చు చేస్తారు. పైగా టాయిలెట్లను మాల్స్‌లా తీర్చిదిద్ది బ్యాంకింగ్, వస్తువుల క్రయవిక్రయాలూ నిర్వహిస్తారు. మహిళలతో కూడిన సంయోగిని బృందాలు వారం వారం సమావేశాలు పెట్టి మరుగుదొడ్ల వాడకంపై చర్చించి ప్రచారం చేస్తారు. ఇది విజయవంతం కావడతో ఇటీవలే స్వప్నిల్‌కు కూడా గ్లోబల్ సిటిజన్ అవార్డు దక్కింది.
- ఎస్.కె.రామానుజం
మూలం: ఆంధ్రభూమి-16/11/2014
స్వచ్ఛ భారత్ మార్పు మనతోనే...
ReplyDeleteYaah! What you said is 100% true..
ReplyDeleteLet's start to clean our home and street.
ReplyDelete