అశ్వని నాచప్ప
అశ్వనీ నాచప్ప (జననం: అక్టోబర్ 21, 1967), కర్ణాటక రాష్ట్ర కూర్గ్ ప్రాంతానికి చెందిన మాజీ భారతీయ క్రీడాకారిణి. ఈమె మహిళల పరుగుపందెములో 80వ దశకపు తొలినాళ్లలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకున్నది. ఈమెకు 1988లో అర్జున అవార్డు ప్రదానం చేయబడినది.
ఆటలకు అందాన్ని తెచ్చిన ఈమె క్రీడా రంగము నుండి విరమించిన తర్వాత 1994 అక్టోబర్ 2 న ఇండియన్ ఏయిర్‌లైన్స్ జట్టు హాకీ ఆటగాడు దత్త కరుంబయ్యను వివాహము చేసుకొని ఇద్దరి ఆడ పిల్లల (అనీషా, దీపాలీ) తల్లి అయినది.
1992లో అశ్వినీ, పి.టి.ఉషాను ఓడించిన సమయములో తెలుగు సినిమా నిర్మాత రామోజీరావు, దర్శకుడు చంద్రమౌళి క్రీడారంగ ప్రధానమున్న సినిమా తీయాలనే యోచనతో ఢిల్లీ లో ఉండగా వాళ్లు నెహ్రూ స్టేడియం లో అశ్వనీని కలిసి సినిమాలో నటించవలసిందిగా కోరారు. నటనా? తనా? అని మొహమాటపడిన ఈమెను ఒప్పించి అశ్వని పేరుమీద ఒక తెలుగు సినిమా తీశారు. తరువాత ఆదర్శం అనే మరో సినిమాలోనూ నటించింది.
పరుగుల రాణి పీటీ ఉషతో సమానంగా మెరిసిన భారతీయ క్రీడా ఆణిముత్యం.. అశ్వినీ నాచప్ప. అశ్విని, ఆదర్శం... వంటి సందేశాత్మక చిత్రాలతోనూ తెలుగు వారికి సుపరిచితురాలైన ఆమె ఇప్పుడేం చేస్తోందో తెలుసా? మెరికల్లాంటి సుశిక్షితులయిన క్రీడాకారులను తీర్చిదిద్దుతూనే... క్రీడా రంగంలో మహిళల వేధింపులకు... నానాటికీ పెచ్చుమీరుతోన్న అవినీతి పోకడలకు వ్యతిరేకంగా గళం విప్పింది. సీఎస్‌ఐ పేరుతో ఒక సంస్థను ఆరంభించి... ప్రముఖ క్రీడాకారులను కూడగట్టి ఉద్యమం బాట పట్టింది. మైదానంలో అశ్విని ఒక సంచలనం.. పరుగుల బరిలో, మెరుపు వేగంతో చిరుతపులిలా ఆమె లక్ష్యాన్ని అధిగమించే తీరు క్రీడాభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. చిరస్మరణీయమైన విజయాలు సాధించిన అశ్వని పదేళ్ల క్రితమే మైదానానికి స్వస్తి చెప్పింది. వివాహం చేసుకొని కర్ణాటక స్విట్జర్లాండ్‌గా పేరొందిన కొడగు జిల్లాలో స్థిరపడింది.
పంతులమ్మగా ఆటలు, పాఠాలు..
పంతులమ్మగా ఆటలు, పాఠాలు..
పల్లె సీమలు, ప్రకృతి రమణీయత అంటే ప్రాణం పెట్టే ఆమె పరుగుల పోటీలను వీడాక ఏం చేస్తోందీ అంటే 'సినిమాల్లో నటించమని, చిన్నతెరపై కనిపించమని చాలా అవకాశాలు వచ్చాయి. కోచ్‌గా పని చేయమంటూ కొన్ని క్రీడా సంస్థలు అడిగాయి. కానీ వాటిపైకి నా మనసు పోలేదు. నేను కొడగు జిల్లాలోని గోణికొప్ప అనే చిన్న గ్రామంలో పెరిగాను. అక్కడ విద్య, ఆరోగ్య వసతుల్లేవు. అక్కడ ఉంటూ పల్లె ప్రజలకు సేవ చేయాలనుకున్నా. అందుకే అక్కడ ఓ స్కూలు ఆరంభించా. పాఠాలతో పాటూ... ఆటల్లోనూ శిక్షణనిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. అశ్విని నిర్వహిస్తున్న పాఠశాలలో అరవై శాతం స్థానికులకే చదువుకునే అవకాశం. ప్రస్తుతం 560 మంది విద్యార్థులు అక్కడ చదువుకొంటున్నారు.
ఆటల దిశగా ప్రోత్సాహం...
క్రీడా రంగాన్ని వీడాక అశ్విని తనకంటూ ఒక సొంత ప్రపంచాన్ని ఏర్పర్చుకుంది. 'అవును, మా వారు వ్యాపార వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. మాకు ఇద్దరమ్మాయిలు. వారి ఆలనాపాలన, చదువులు, ఆసక్తులు నేను బాధ్యతగా చూస్తాను. అవికాక స్కూలు నిర్వహణ ఉండనే ఉంది. అయితే ఒకటి, చుట్టుపక్కల గ్రామాల్లో, పాఠశాలల్లో పిల్లల్ని క్రీడల దిశగా ప్రోత్సహించే ప్రతి కార్యక్రమంలో కచ్చితంగా పాల్గొనేదాన్ని' అంటూ వివరించారు.
అవినీతికి వ్యతిరేకంగా...
రాజకీయాల్లో మితిమీరుతోన్న అవినీతి, ఆశ్రిత పక్షపాతం గురించి విన్నప్పుడల్లా అశ్విని బాధపడేది. 'కేంద్ర క్రీడా శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ అధికారి బీపీవీ రావు, నేను క్రీడల్లో అవినీతి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ప్రతిసారీ సమస్యలు చర్చించడమే కానీ పరిష్కారం కోసం చిన్న ప్రయత్నం చేసిన వారు కనబడలేదు. నువ్వే అందుకు ముందుకు రావొచ్చు కదా అని ఆయన చాలాసార్లు అన్నారు. ఎంతో ఆలోచించిన మీదట అడుగు ముందుకేశాను. రెండు నెలల క్రితం క్లీన్‌స్పోర్ట్స్ ఇండియా (సీఎస్‌ఐ)ను ఆరంభించాను' అని తెలిపారు.
మట్టిలో మాణిక్యాల గుర్తింపు..
సాఫీగా కనిపించే ట్రాక్ మీద పరుగు తీసి, పతకాలు సంపాదించడం పేరు. క్రీడా సంఘాల్లోని మహామహుల్ని ఢీకొంటూ ముళ్లబాటలో నడుస్తూ, సంకల్ప సాధనకు కృషి చేయడం వేరు. 'నేను సాధించాలనుకున్న లక్ష్యాలపై స్పష్టత ఉంది. అందుకే నాలాంటి భావాలున్న హాకీ ఆటగాడు పర్గత్‌సింగ్, వందనారావు, రీతూ అబ్రహాం, పంకజ్ అద్వానీ వంటి క్రీడాకారుల మద్దతు కూడగట్టాను. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసి క్రీడా కుసుమాలను తయారుచేసేందుకు అశ్వినీ ఫౌండేషన్‌ను ఆరంభించాను. క్రీడల్లో అవినీతిని కడిగేస్తూ, మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరసిస్తూ, రాజకీయ ప్రమేయాన్ని నిలదీసేందుకు క్లీన్‌స్పోర్ట్స్ ఉద్యమాన్ని చేపట్టాను. మహిళలపై వేధింపులు, ప్రతిభావంతులైన వారిని పట్టించుకోకపోవడం వంటి సంఘటనలనూ మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం' అనే అశ్విని రాజకీయ నాయకుల ప్రమేయాన్ని తగ్గించి క్రీడా సంఘాల నాయకత్వ బాధ్యలని ఆటగాళ్లకు అప్పగించాలి అంటున్నారు. ఆ స్ఫూర్తిని పంచేందుకు ఈ నెలాఖరులో భారీ ఎత్తున మారథాన్‌ను నిర్వహిస్తున్నారు.
ఇద్దరమ్మాయిలు క్రీడాకారిణులే...
హంగూ ఆర్భాటాల కన్నా క్రీడాప్రమాణాల పెరుగుదలకు ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆమె ప్రస్తుతం 32 మంది అథ్లెట్లకు శిక్షణనిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహిస్తే ఆరోగ్యం, ఆనందం... బాగా రాణిస్తే పేరు, ఉద్యోగం వస్తాయనే ఆమె తన ఇద్దరమ్మాయిల క్రీడాసక్తుల్ని గమనించి భుజం తడుతున్నారు. పదో తరగతి చదువుతున్న పెద్దమ్మాయి అమీషా రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆరో తరగతి చదువుతున్న రెండో కుమార్తె దీపాలి గోల్ఫ్ సాధన చేస్తోంది. - ఆదినారాయణ, న్యూస్‌టుడే, బెంగళూరు.
భారతీయ క్రీడాకారిణి అశ్వని నాచప్ప.
ReplyDelete