Breaking News

దీనదయాళ్ ఉపాధ్యాయ

జననం : 25 సెప్టెంబరు 1916-నాగ్లా చంద్రభాన్(మథుర), ఉత్తరప్రదేశ్ 
మరణం  : ఫిబ్రవరి 11, 1968


దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త . పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్‌ లోని మధుర దగ్గర 'నగ్ల చంద్రభాన్' అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగారు.

1952లో భారతీయ జన సంఘ్ లొ చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1967లొ జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మరణంతరము పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపధంలో నడిపించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య మరియు లక్నొ దినపత్రిక 'స్వదేశ్'లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతా వాదం , శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు, హిందీలో 'చంద్రగుప్త మౌర్య' నాటకం, మరాఠీ నుండి ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు. 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందినాడు.

భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించాడు.

కొందరు మరణించేవరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందినవారు పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ. అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్‌ 25న జన్మించి అసమాన్య వ్యక్తిగా ఎదిగారు. చిన్నతనంలోనే తల్లి, తండ్రి మరణించిన దీనదయాళ్‌ జీ మేనమామ ఇంటిలో పెరిగారు. 1925 ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టిన దయాళ్‌ కాన్పూర్‌లో బి.ఎ, చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ తో పరిచయం ఏర్పడింది. అప్పటినుండి ఆయన జీవిత విధానం, గమ్యం మారిపోయింది. సంఘ్‌లో పనిచేస్తూనే బి.ఎ, డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ ఎంఎ, ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. సంఘ్‌ విస్తరణకు పూర్తి సమయం ఇచ్చేందుకు చదువుకు స్వస్తి పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని లభంపూర్‌ ప్రాంతానికి ప్రచారకులుగా నియుక్తులైన కొద్ది సంవత్సరాలలోనే ఆ ప్రాంతంలో సంఘ్‌ కార్యక్రమాలను వికసింపజేశారు. అది గమనించిన సంఘ్‌ పెద్దలు వారిని ఉత్తరప్రదేశ్‌ ప్రాంత సహ ప్రచారకులుగా నియమించారు. ఆయన అసమాన్యమైన ప్రతిభా పాటవాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంఘ్‌ కార్యక్రమాలు చూస్తూనే పత్రికారంగంపై దృష్టి సారించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్‌ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఆ ప్రకాశన్‌ ద్వారా రాష్ట్ర ధర్మ అనే ఒక మాస పత్రిక, పాంచజన్య అనే వారపత్రిక, స్వదేశ్‌ అనే దిన పత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలు దీనదయాళ్‌ జీ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి! గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని హిందూ మహాసభతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ పై కూడా మోపి ఆనాటి ప్రధాని నెహ్రూజీ సంఘ్‌ను నిషేధించారు. ఆ నిషేధాన్ని తొలగించాలంటూ జరిగిన ఉద్యమానికి ఉత్తరప్రదేశ్‌లో దీనదయాళ్‌ జీ నిర్వహించిన పాత్ర గణనీయమైంది. ఈ హత్యానేరంలో సంఘ్‌ పాత్ర లేదని దీనదయాళ్‌ జీ పాంచజన్యలో స్పష్టం చేస్తూ ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా రాసిన రాతలకు ఆనాటి ప్రభుత్వం పాంచజన్యను నిషేధించింది. దానికి బదులుగా హిమాలయ అనే మరో వార పత్రికను ప్రారంభించి తన కలంతో నాటి ప్రభుత్వానికి కలవరం పుట్టించారు. ఈలోగా గాంధీజీ హత్యానేరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేదని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. జాతి, జాతీయత, భారతీయ సంస్కృతి, ధర్మం మొదలైన విషయాలపై ఆయనలోని అభిప్రాయాలు, మౌలిక సిద్ధాంతాలు తదితరాలపై ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది. నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలు, భారతీయ తత్వజ్ఞాన సారాన్ని దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి సామ్రాట్‌, చంద్రగుప్త, జగద్గురు శంకరాచార్య అనే చారిత్రక నవలలను కూడా దయాళ్‌జీ రాశారు. 1951లో డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ప్రధాని నెహ్రూ జీ విధానాలకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చారు. ఆనాడు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ అనుసరిస్తున్న, ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను ఎదుర్కొనడానికి, భారతీయ సంస్కృతి సభ్యులతో, జాతీయ భావాలతోకూడుకున్న రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌ పరమ పూజనీయ గురూజీ సహాయాన్ని అర్థించారు. ఆయన కోరిక ప్రకారంగా పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ జీ, జగన్నాధరావు జీ, సుందర్‌ సింగ్‌ భాండారి లాంటి మరికొందరు యువకులను అప్పగించారు. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ 1951 అక్టోబర్‌ 21న ఏర్పాటు చేసిన జనసంఘ్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దీనదయాళ్‌ జీ ఎన్నికైనారు. పార్టీ స్థాపించిన మూడు మాసాలకే 1952లో జరిగిన జనరల్‌ ఎన్నికలలో పోటీ చేసిన నాలుగు జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటిగా జనసంఘ్‌ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు పొందింది. తన ఉనికిని సాధారణ ఎన్నికలలో రుజువు చేసుకోగలిగింది. దీనికి డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ నాయకత్వంతో పాటు దీనదయాళ్‌ జీ సమన్వయ కౌశలం కూడా తోడైంది. ఆ తర్వాత కాశ్మీర్‌లో సత్యాగ్రహం చేసిన డాక్టర్‌ ముఖర్జీ అనుమానాస్పద మరణం చెందటం జరిగింది. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మరణం తర్వాత జనసంఘ్‌ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ పార్టీని దేశవ్యాప్తంగా పటిష్టపరచిన ఘనత దీనదయాళ్‌జీకి ఆయన సహచరులకు దక్కుతుంది. భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించారు. భారతీయ జనసంఘ్‌ అఖిల భారత కార్యదర్శిగా ఎక్కువకాలం పనిచేసిన దీనదయాళ్‌జీ కార్యకర్తల మనోహృదయాలను మలిచి వారి మనస్సులలో అతి ప్రముఖ స్థానాన్ని చూరగొన్నారు. సుఖమంటే ఏమిటో తెలియక కష్టాలనే చవిచూస్తూ దేశ సేవ నిమగ్నమై దానినే జీవన కార్యంగా స్వీకరించారు. జనసంఘ్‌లో చేరినప్పటి నుంచి మహారథియై పార్టీకి సారధ్యం వహించి, దేశ రాజకీయాలలో జనసంఘ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో కృతకృత్యులై 1967లో పార్టీ అఖిల భారత అధ్యక్షులైనారు. కాలికట్‌లో జరిగిన అఖిల భారత జనసంఘ్‌ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపచేసి విశేష కీర్తి నార్జించారు. ఆ కీర్తియే జనసంఘ్‌ సిద్ధాంత వ్యతిరేకుల కినుకకు కారణమైంది. వారి దుష్ట రాజకీయాలకు మహాతపస్వి బలి అయినారు. ఉత్తరప్రదేశ్‌లోని మొగల్‌ సరాయి రైల్వే స్టేషన్‌లో 1968 ఫిబ్రవరి 11న రైలు పట్టాల వద్ద శవమై కనిపించారు. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మరణం మాదిరిగానే దీనదయాళ్‌జీ మరణం కూడా పలు అనుమానాలకు దారితీసింది. దీనదయాళ్‌జీ వంటి మహావ్యక్తి మరణంతో కార్యకర్తల హృదయాలు ఎంతో మనోవేదన చెందాయి.

2 comments:

  1. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ జననం sep 25.

    ReplyDelete
  2. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ

    ReplyDelete