ఆంధ్ర భోజ శ్రీ కృష్ణ దేవరాయలు
జననం: ఫిబ్రవరి 16, 1471
మరణం: 1529
సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో ఆయన సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆయన కవి, పండిత పోషకుడే కాదు స్వయంగా కవి. పేరు వినగానే మనకందరికి గుర్తుకువచ్చేది ఆముక్తమాల్యద గ్రంథం. ఆయన మరెవరో కాదు..
"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,
దేశ భాషలందు తెలుగు లెస్స"..
అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు,విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు.
శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధవిజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు.
ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి కూడా తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించేవాడు.కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.
రాజ్యం అధిష్ఠానం ఇతను రాజ్యం అధిష్ఠించునాటికి రాజ్యమంతా చాలా గందరగోళంగా ఉన్నది. దక్షిణాన సామంతులు స్వతంత్రులు అయినారు, తీరాంధ్ర ప్రాంతాన్ని గజపతులు ఆక్రమించుకొని తమ రాజ్యంలో కలుపుకొని, కొండవీడు, ఉదయగిరి వంటి పటిష్ఠమైన దుర్గములతో బ్రహ్మాండమైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. బహమనీ సుల్తానులు రాజ్యంలోనికి రోజురోజుకూ చొచ్చుకొని రాసాగినారు. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చినాడు.
దక్షిణ దేశ దండయాత్రఇతను 1509లో సింహాసనం అధిష్ఠించి, 1512 వరకూ మూడు సంవత్సరములు సైనిక సంపత్తిని పెంపొందించుకొని తొలిసారిగా దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు.కావేరీ నదీ తీరంలోని శివపట్టణ పాలకుడు, విజయనగర సామంతుడైన గంగరాజు, విజయనగర రాజుల అలసత్వాన్ని ఆధారంగా చేసుకొని కప్పం చెల్లించక స్వతంత్రముగా ఉండసాగినాడు. ఇతని శత్రువు శ్రీ రంగపట్టణ రాజు చిక్క రాయలు. చిక్క రాయలు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో చేరి గంగరాజుపై యుద్ధం చేసి గెలిచినాడు. గంగరాజు కావేరి నదిలో పడి ప్రాణాలు వదిలినాడు.తరువాత ఉమ్మత్తూరు, కర్ణాటక, మైసూరు ప్రాంతములను చేజిక్కించుకొని చిక్క రాయలును వాటికి సామంతుని గా చేసినాడు. తరువాత చిన్న చిన్న పాలెగాండ్లను జయించి ఆ ప్రాంతములకు కెంపెగౌడ, వీర గౌడలను పాలకులుగా నియమించినాడు. (ఈ కెంపేగౌడ, వీర గౌడలే బెంగళూరు నిర్మాతలు). తరువాత మలయాళ ప్రాంతములను జయించి, వారినుండి కప్పములను వసూలు చేసినాడు. విజయప్ప, వేంకటప్ప నాయకులను పాండ్యదేశమునకు, దాని పరిసరాలకూ సామంతులుగా నియమించినాడు. విజయప్పనాయుడు, వెంకటప్ప నాయుడుతో కలసి రాయలువారి ఆదేశముపై చిత్తూరు, జింజి, తొండ మండలము, మధుర, తిరునగరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతములను జయించినాడు. వీరందరి నుండి ఎంతో కప్పమును వసూలు చేసినాడు. ఒక్క జింజి నగరమునుండే సంవత్సరమునకు మూడు కోట్ల రూపాయల విలువైన కప్పం వచ్చేది. దీనితో దక్షిణ దేశమంతా రాయలు స్వాధీనమైనది.
పరిపాలనా సౌలభ్యం కోసం దీని మూడు భాగములుగా విభజించి నాడుజింజి కేంద్రముగా కృష్ణప్ప నాయకుడు అధిపతిగా నెల్లూరు మొదలగు ప్రాంతములు ఉండెను.తంజావూరు కేంద్రముగా విజయ రాఘవ నాయకుడు అధిపతిగా కావేరీ నదీ తీరప్రాంతములు రెండవ కేంద్రము.కొడగు కేంద్రముగా వెంకటప్ప నాయకుడు అధిపతిగా మళయాళ ప్రాంతము మూడవ భాగము.ఈ దక్షిణదేశ దండయాత్ర తరువాత రాయలు రాజధానికి తిరిగి వచ్చాడు.తూర్పు దిగ్విజయ యాత్రతిమ్మరుసు నాయకత్వంలో చక్కని సైన్యమును తూర్పు దిగ్విజయ యాత్రకు పంపించినాడు.
సైనిక విశేషములు
తిమ్మరుసు సైన్యమును చక్కగా వ్యూహాత్మకంగా విభజించినాడు. మొత్తం సైన్యాన్ని ఏడు భాగములుగా విభజించినాడు. ఒక్కొక్క విభాగములోను కింది దళాలు ఉన్నాయి:
• 30,000 కాల్బలము
• నాలుగు వేల అశ్విక దళము
• రెండువందల ఏనుగులు
ఈ విభాగాలకు అధ్యక్షులుగా కింది వారిని నియమించాడు.
1. రాయసము కొండమరుసు
2. పెమ్మసాని రామలింగ నాయుడు
3. గండికోట కుమార తిమ్మానాయుడు
4. వెలుగోడు గంగాధరరెడ్డి
5. అకినీడు ఇమ్మరాజు
6. ఆరవీటి నారపరాజు
7. ఆరవీటి శ్రీరంగరాజు
ఉదయగిరి విజయం..
ఈ తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా 1513లో ఉదయగిరి ని ముట్టడించినాడు. రాయసము కొండమరుసు విజయనగర సేనలకు ఆధిపత్యము వహించి సంవత్సరమున్నర పాటు తీవ్రమైన పోరాటము చేసి దుర్గమును స్వాధీనము చేసుకున్నాడు. తరువాత ఉదయగిరి ప్రాంత రాజప్రతినిధిగా అతడే నియమితుడయ్యాడు.
కొండవీడు విజయం..
1515లో రాయలు కొండవీడు ను ముట్టడించినాడు. కొండవీడు 1454నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు. తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల గోపన దుర్గాధిపతిగా నియమితుడయినాడు.
కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.
• అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు, నాగార్జున కొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.
• విజయవాడ సమీపాన ఉన్న కొండపల్లి దుర్గమును రెండునెలలు పోరాడి స్వాధీనం చేసుకున్నాడు.
• అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అరసవిల్లి, చిట్యాల, నల్లగొండ మొదలైన దుర్గాలను జయించాడు.
• కోనసీమ, జమ్మిలోయ, కోరాము, రాజమహేంద్రవరము లను జయించినాడు.
• మాడుగుల, వడ్డాది, సింహాచలములను స్వాధీనం చేసుకొని సింహాచల నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.
• కటకం పైకి దండెత్తి ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి అతని కుమార్తె తుక్కా దేవి ని వివాహమాడాడు.
ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516 లో రాజధానికి తిరిగి వచ్చాడు.
బీజాపూరు దండయాత్ర..
1520లో బీజాపూరు పైకి దండయాత్రకు సిద్ధమయినాడు. దీనికి రెండు కారణములు చూపుతారు. మద్గల్లు, రాయచూరు దుర్గములను సుల్తాను ఆక్రమించుట మరియు సయ్యద్ మరైకర్ అను వ్యాపారి రాయల వద్ద డబ్బులు తీసుకుని ఇస్తానన్న అరేబియా జాతి గుర్రాలను ఇవ్వకుండా బీజాపూరు సుల్తాను దగ్గర ఆశ్రయం పొందినాడు; తాకీదు పంపించినా ఈ వ్యాపారిని సుల్తాను రాయలకు అప్పజెప్పలేదు, రాయలు సొమ్ము ఇప్పించనూ లేదు.
సైనిక వివరములు..
న్యూనిజ్ అను పోర్చుగీసు యాత్రికుని ప్రకారం సైన్యం ఇలా ఉన్నది:
1. కామా నాయకుడు (పెమ్మసాని రామలింగ నాయుడు) : 30,000 కాల్బలము, వేయి అశ్వములు, పదహారు గజములు
2. త్రయంబకరావు: 50,000 కాల్బలము, రెండు వేల అశ్వములు, ఇరవై ఏనుగులు
3. తిమ్మప్ప నాయకుడు : 60,000కాల్బలము, 3,500 ఆశ్విక దళము, 30 ఏనుగులు
4. ఆదెప్ప నాయకుడు : లక్ష కాల్బలము, ఐదువేల ఆశ్విక దళము, 50 ఏనుగులు
5. కొండమ రెడ్డి 1 : 1,20,000 కాల్బలము, 6000 గుర్రాలు, 60 ఏనుగులు
6. కొండమ రెడ్డి 2 : 80,000 కాల్బలము, 2050 గుర్రాలు, 40 ఏనుగులు
7. సాళువ గోవింద రాజు : 30,000 కాల్బలము, 1000 గుర్రాలు, 10 ఏనుగులు
8. మధుర నాయకుడు : 15,000 కాల్బలము, 200 గుర్రములు
9. కుమార వీరయ్య : 8,000 కాల్బలము, నాలుగు వందల గుర్రములు
10. రాయలు : 44,000 కాల్బలము, 7,000 గుర్రములు, 315 ఏనుగులు
మొత్తం 5,37,000 కాల్బలము, 27,150 గుర్రములు, 1151 ఏనుగులు. పోరు భీకరముగా జరిగింది. ఇరువైపులా అనేక మంది నేలకూలారు. ఆదిల్ షా ఏనుగునెక్కి పారిపోయినాడు. సేనానులు దిక్కుతోచని వారైనారు. చివరకు ఎంతో ప్రాణ నష్టము తరువాత యుద్ధం 1520 మే 19న ముగిసింది. ఈ విజయం వలన రాయలుకు విశేషమైన డబ్బు, గుర్రాలు, ఏనుగులు లభించినాయి.
రాయచూరు యుద్ధము..
తరువాత రాయచూరు కోటను ముట్టడించి ఇరవై రోజులు యుద్ధం చేసి పోర్చుగీసు సైనికుల సహాయంతో విజయం సాధించాడు (రాయచూరి యుద్ధము). రాయలు రాజధానికి వెళ్ళినా, త్వరలోనే మరలా ముద్గల్లు, బీజాపూరు లను ముట్టడించి ధ్వంస పరచి కల్యాణి, గుల్బర్గా కోటలను స్వాధీనం చేసుకున్నాడు.
తరువాత రాయలు రాజధానికి వచ్చి నిశ్చింతగా కవితా గోష్టులను నిర్వహించినాడు.
• రాజ్య పాలన
240 కోట్ల వార్షికాదాయము కలదు.
సాహిత్య పోషకునిగా..
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
అష్టదిగ్గజములు..
1. అల్లసాని పెద్దన,
2. నంది తిమ్మన,
3. ధూర్జటి,
4. మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి),
5. అయ్యలరాజు రామభద్రుడు,
6. పింగళి సూరన,
7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి),
8. తెనాలి రామకృష్ణుడు
ఇతను మత సహనం కలవాడు. అనేక వైష్ణవ, శైవ దేవాలయములను నిర్మించినాడు; అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.
నిజానికి ఆయన తెలుగులో కన్నా సంస్కృతంలోనే ఎక్కువ గ్రంథాలు రాశాడు. ఆ మాట ఆయనే ఆముక్తమాల్యద గ్రంథంలో శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు మాటల ద్వారా చెప్పుకున్నాడు . భారీగా యుద్ధాలు చేసి అలసిపోయిన రాయలు తీర్థయాత్రలు చేశాడు. అపðడు ఆయన కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళానికి వచ్చాడు. అక్కడ ఆ రాత్రి విశ్రమించినపుడు ఆంధ్రదేవుడు కలలో కనిపించి ఆముక్తమాల్యద రాయమని ఆదేశించాడు. ఆ సందర్భంలో ఆంధ్రదేవుడు మాట్లాడుతూ
'పలికితుత్ప్రేక్షోపమలు జాతి పెంపెక్క రసికులౌనన 'మదాలస చరిత్ర'
భావధ్వని వ్యంగ్య సేవధికాగ చెప్పితివి 'సత్యావధూ ప్రీణనంబు'
శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి 'సకల కథాసార సంగ్రహంబు'
శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితి సూక్తినైపుణి 'జ్ఞానచింతామణి' కృతి
అంతేగాక 'రసమంజరీ' ముఖ్య మధుర కావ్య రచన మెప్పించికొంటి గీర్వాణ భాష
ఆంధ్ర భాష అసాధ్యంబె అందు ఒక్క కృతి వినిర్మిం పుమిక మాకు ప్రియము కాగఅంటాడు. ఈ పద్యం ప్రకారం రాయలు మదాలస చరిత్ర, సత్యావధూ ప్రీణనంబు, సకల కథాసార సంగ్రహం, జ్ఞానచిం తామణి, రసమంజరీగ్రంథాలను రచించాడు. అయితే కాలగతిలో అవన్నీ కనుమరుగైపోయి ఒక్క ఆముక్తమాల్యద మాత్రమే దక్కింది. ఇవికాక జాంబవతీ పరిణయం అనే నాటకం కూడా రాశాడని అంటారు. కానీ అది కూడా దొరకడంలేదు.
రామాయణం, మహాభారతం, మహాభా గవతం, హరివంశం వంటి గ్రంథాలు సంస్కృత మూల గ్రంథాలకు అను వాదాలు. మక్కీకి మక్కీ అను వాదాలు కాకపోయినా, వా టిలోనూ కొన్ని స్వ కపోల కల్పన లున్నా గాస టబీసట గాథలుగా జనపదాలలో వినిపించే ప్రఖ్యాత కథలు తెలుగు గ్రంథాలలో చోటు సంపా దించుకున్నా, వాటిలో తెలుగు ముద్ర కంఠదగ్నంగా ఉన్నా వాటిని స్వతంత్ర రచనలు అన డానికి ఆస్కారంలేదు. తన హయాంలోనూ మను చరిత్ర, వసుచరిత్ర, పాండురంగ మాహాత్మ్యం, కళాపూర్ణోదయం వంటి రచనలు వెలువడినా వాటికి మూలకథలు సంస్కృత ప్రఖ్యాత కథలే కావడం గమనార్హం. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాదిలో ఎంతో ప్రఖ్యాతమైన కథను ఎన్నుకుని దానికి ప్రబంధోచిత హంగులన్నీ అద్ది ఆండాళ్‌చరిత్రకు అక్షర రూపమిచ్చాడు. వైష్ణవులకే పరిమితమైన ఆమె కథను తెలుగు వారందరికీ తెలిసేలా చేశాడు. ద్రవిడ సాహిత్యం లో చిరకీర్తులున్న మహానుభావులెందరో ఉన్నా వారి ఇతిహాసాలను పుస్తకాలకెక్కించిన పెద్ద కవులు తెలుగులో దాదాపుగా లేరంటే అతిశయోక్తికాదు. స్వయంగా వైష్ణవమతానుయాయుడైన రాయలు ఆండాళ్‌తల్లి మీద అభిమానం, శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆదేశంపై ఆ దేవుడు గోదాదేవిని పరిణయమాడిన గాథను ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఆంధ్రదేవుడు ఆదేశం ప్రకారమే ఈ గ్రంథాన్ని తిరుపతి వేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. ఈ పుస్తకంలో కథాప్రణాళికను రూపొందించు కో డానికి గురు పరం పరా ప్రభావం, ప్రపన్నామృతం, దివ్యసూరి చరిత్ర వంటి వైష్ణవ మత గ్రంథాలనే స్వీ కరించాడు. ఈ గ్రంథా నికి గోదా దేవి పేరు నేరుగా పెట్టినా, ఆరు ఆశ్వాశాల గ్రంథంగా దీన్ని విస్తరించినా ఆండాళ్ చరిత్ర 5వ ఆశ్వాసంలోనే ఆరంభమవు తుంది. మొత్తం 872 పద్యాలు సంతరించినా ఆండాళ్‌కు దక్కినవి 140 పద్యాలు మాత్రమే! ఈ గ్రంథంలో 5 విడి కథలు కనబడ తాయి. విష్ణు చిత్తుడికథ, ఖాండిక్య కేశిధ్వజ వృత్తాంతం, యామునాచార్య వృత్తాం తం, గోదాదేవి వృత్తాంతం, చండాల, బ్రహ్మరాక్షసుల కథ ప్రధానంగా కనబడతాయి.
వారసులు..
• ఇతనికి ఇద్దరు భార్యలు, తిరుమల దేవి, చిన్నాదేవి .
• ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను రామ రాయలు కు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలు కు ఇచ్చి వివాహం చేసాడు.
• ఒక్కడే కొడుకు, తిరుమల దేవ రాయలు . ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయం పై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి అతనిని గుడ్డివానిగా చేసాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 26 మంది రాజుల్లో 1509 నుండి 1529 వరకు ఓటమి ఎరుగని చక్రవర్తిగా పాలన సాగించిన రాయలు తిమ్మరుసును గుడ్డివానిగా చేసాననే దిగులుతో మరణించారని చరిత్ర చెబుతోంది.
పై చిత్రంలో కనిపిస్తున్న శ్రీ కృష్ణదేవరాయల రూపును వెల్లడించే చిత్రపటం ఆచూకీ లభ్యమైంది. పోర్చుగీసు యాత్రీకుడు,చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో ఈ చిత్రాన్ని గీశారు. రాయలను చిత్రించడానికి పేస్ కు 15 వారాల సమయం పట్టిందట! పూనే నగరం లోని భారతీయ ఇతిహాస్ సంశోదన్ మండల్ లో ఉన్న ఈ చిత్రాన్ని హైదరాబాదుకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు డాక్టర్ క్రిష్ణారావు కేశవ్ ఫోటో తీసి వెలుగులోకి తెచ్చారు.
తన తనువృత్తి విజయ నగర సామ్రాజ్య సీమల రక్షణంగా, తన మనః ప్రవృత్తి సరస సంగీత సాహిత్య సాంస్కృతిక సీమల వీక్షణంగా,విలక్షణ సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కారణ జన్ముడు శ్రీ కృష్ణ దేవరాయలు..కర్నాట ఆంధ్ర సీమలను పాలించినా,తెలుగు భాషపై,సంస్కృతిపై,ప్రజలపై ఎక్కువ మక్కువ చూపించిన మహానుభావుడు శ్రీ కృష్ణ దేవరాయలు! సమర విజయలక్ష్మికి తన శరీరాన్ని,సాహిత్య విద్యా లక్ష్మికి మనసును ఆత్మను కూడా అంకితం చేసిన వాడు శ్రీ కృష్ణ దేవరాయలు! ఒక్క చేతితో ముసల్మానులను,ఫ్రెంచి వారిని,డచి వారిని, పోర్చుగీసులను నిలువరించి , కేవలం ఇరవై సంవత్సరాలే పాలన చేసినా, చరిత్ర నిలిచి ఉన్నంత కాలము నిలిచిపోయే మహాద్భుతాలను అటు సమర రంగంలోనూ, ఇటు సాహిత్య రంగంలోనూ సాధించి,సంపూర్ణభారత దేశ చరిత్ర లోనే కాదు,ప్రపంచ చరిత్ర లో కూడా, ఇలాంటి చక్రవర్తులు చాల కొద్దీ మందే వున్నారు అని ప్రశంసలు పొందిన మహానుభావుడు!తన జీవిత కాలంలో ఒక యుద్ధంలో కూడా ఓడి పోని, నిరంతరము యుద్ధ రంగంలోనే గడిపిన ఏకైకచక్రవర్తి, శ్రీ కృష్ణ దేవ రాయలు!
నిజానికి, శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలన అందించిన ఫలితాల కారణం గానే, ఈ నాడు ఆంధ్రభాషా, సాహిత్యం,సంప్రదాయం, కళలు మాత్రమే కాక భారతీయ ధర్మం, హైందవ ప్రదాయం,భారతీయ కళలు దక్షిణ భారత దేశంలో, విశేషించి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా నిలిచి వున్నాయి ఇతరమతాలకు, ధర్మాలకు, భాషలకు,దేశాలకు చెందిన వారిని అకారణంగాఏనాడూ ఇబ్బందులకు గురిచేయలేదు సరికదా,వేరే ధర్మాలకు చెందిన వారికి వారి మతాలకు సంబంధించిన ప్రార్ధనా కేంద్రాలను స్వయంగా కట్టించి ఇచ్చాడు, తను స్వయంగా వైష్ణవుడు ఐనా, శైవులను, మాధ్వులను, ఇతర శాఖలకు చెందిన వారిని ఆదరించాడు!ఆయన కాలంలో మరలా వైభవాన్ని పొందిన పౌరాణిక గాధలే ఈనాటికి ప్రబంధాలలో, కావ్యాలలో నిలిచి నేటి తరాలకు తరగనిఆధ్యాత్మిక,సాహిత్య,సాంస్కృతిక వారసత్వ సంపదను మిగిల్చాయి!
ఆంధ్ర సాహిత్యంలోని పంచ మహా కావ్యాలైన వాటిలో,ఆముక్తమాల్యదను ఆయన స్వయంగా రచిస్తే,మనుచరిత్రను ఆయన గురుతుల్యుడైన మిత్రుడు, ఆస్థాన కవి ఐన అల్లసాని పెద్దన రచించాడు, వసుచరిత్రనుఆయన కాలంలోని సాహిత్య ఉద్యమానికి ప్రేరితుడైన, పెద్దన శిష్యుడైన భట్టుమూర్తి అని పిలువబడిన రామరాజ భూషణుడు రచించాడు,పాండురంగ మహత్యమును అయన ఆస్థాన కవి ఐన తెనాలి రామకృష్ణుడు రచించాడు, ఒక శృంగార నైషధమును మాత్రము శ్రీనాధుడురచించాడు, కాని అది ఒక అనువాదం చేయబడిన గ్రంధం మాత్రమే కాని, ప్రధమంగా తెలుగులో రచించబడిన స్వతంత్ర కావ్యం కాదు!ఇది చాలు రాయల వారికీ ఆంధ్ర సాహిత్యానికీ ఉన్న సంబంధమును గురించి చెప్పడానికి!
కత్తి ఏదో ఒక నాడు లొంగి పోక దించక తప్పదు! కలం మాత్రం ఏనాడూ ఎవరికీ లొంగదు!నిరంతరమూతన ప్రభావాన్ని, ప్రతిభను వెలువరిస్తూనే వుంటుంది! రాజులు వెడలి పోతారు..కవి రాజులు నిలిచి పోతారు చరిత్రలో!రాజులూ రాళ్ళలో నిలిచి పోతారు కాని, కవి రాజులూ, కళాకారులు ప్రజల గుండెల్లో నిలిచి పోతారు..శ్రీ కృష్ణ దేవరాయలు మాత్రం రాజుగానే కాక, కవిరాజుగా, కళాకారునిగా,(ఆయన గొప్ప వీణా వాదకుడుట!) సంస్కర్తగా,ఆంధ్ర సారస్వత స్వర్ణ యుగ కర్తగా తెలుగుజాతి, భారత సంస్కృతి నిలిచి ఉన్నంత కాలమూ నిలిచి వుంటాడు!
జయహో శ్రీ కృష్ణ దేవ రాయ!
జయ నిత్య కీర్తి కాయా!
జయ కదన కవన రవి చంద్ర తేజ
జయ భువన విజయమున ఆంధ్ర భోజ ..
నీ తనువు కదన ఘన విజయలక్ష్మికి
నీ మనువు కవనమున విజయలక్ష్మికి
తను వృత్తి నీకు సామ్రాజ్య రక్షణం
నీ ప్రవృత్తి సాహిత్య వీక్షణం..
చిన రాణి తాను సామ్రాజ్య లక్ష్మీ
పెద్ద రాణి నీకు సాహిత్య లక్ష్మీ
చిన్నమ్మ తోడి చిరకాల చెలిమి
పెద రాణి తోడి కల కాల కలిమి..
నడి వీధిలోన రతనాలు రాశి
నడి రేయి దాక కవనాలు దూసి
పడి కరకు తురక తలచెండ్లు కోసి
కడలేని కీర్తిగనినావు వాసి...
గజపతుల కైన ఘన స్వప్న సింహమా!
మదవతులకైన శృంగార చిహ్నమా!
కవితా వధూటి సిగపువ్వు చంద్రమా!
తులలేని అలల సాహిత్య సంద్రమా!..
ఘన తెలుగు కవన ధారా విపంచి
పలికించి తేనెలొలికించి మించి
వలపించి చూడిక్కు డుత్త నాచ్చి
నేలించినావు రంగేశుకిచ్చి...
భువి రాజులెందు? శాసనములందు!
కవిరాజులెందు? ఉచ్చ్వాసమందు,
జన జీవనాడి నిశ్వాసమందు!
నిలిచుండురందు, నువు.. గుండెలందు!..
బ్రహ్మాండమందు శ్రీ వేంకటాద్రి,
దైవతములందు శ్రీ వేంకటేశుడు,
పలు దేశభాషలను తెలుగు లెస్సరా!
రాజులందు..రాయ!నువు లెస్సరా!...
ఆంధ్రభోజ శ్రీ కృష్ణ దేవ రాయల పై మంచి వివరాలతో అద్బుతమైన వ్యాసాన్ని అందించిన మీకు అభినందనలు, అభివాదములు.
ReplyDelete������
సూపర్
ReplyDeleteTelugu Panthulu in Bangalore
ReplyDeleteSuper post. one of the best clarifications for this blog. Are you looking in Bangalore for Pooja? purohits for pooja decision.